- వరుణ్ ని కాంగ్రెస్ లో చేర్చుకోవాలని ప్రియాంక వ్యూహం
- యూపీలో అక్కాతమ్ముడూ కలిసి పని చేస్తే కాంగ్రెస్ కు మేలు
- కొంతకాలంగా మేనక, వరుణ్ లపై మోదీ-షా నిర్లక్ష్యం
- బీజేపీకీ, యోగీకీ వ్యతిరేకంగా వరుస వ్యాఖ్యలు చేస్తున్న వరుణ్
ఉత్తరప్రదేశ్ రాజకీయాల సాక్షిగా సోనియా -మేనకాగాంధీలు ఒకటి కానున్నారా? అనే చర్చ మొదలైంది. వీరిద్దరూ ఇందిరాగాంధీ కోడళ్ళు అన్న సంగతి తెలిసిందే. అన్నదమ్ములు రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ కలిసి మెలిసి బాగానే జీవించారు. కానీ కోడళ్ళు ఇద్దరూ దాదాపుగా మొదటి నుంచీ ఎడమోహం -పెడమొహంగానే ఉన్నారు. పెద్దకోడలు సోనియాగాంధీ కాంగ్రెస్ పార్టీలో చక్రం తిప్పుతూ వుంటే, చిన్నకోడలు మేనక బిజెపి పంచన చేరారు. కేంద్ర మంత్రిగానూ పదవులు దక్కించుకున్నారు. రాజీవ్ గాంధీ కుటుంబానికి సమాంతరంగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు.
తల్లి బాటలోనే వరుణ్
కొడుకు వరుణ్ గాంధీ కూడా అమ్మచాటునే నడుస్తున్నాడు. ఉత్తరప్రదేశ్ నుంచి లోక్ సభ సభ్యుడుగా వ్యవహరిస్తున్నాడు. త్వరలో ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో, ఆ ప్రాంతమంతా రణకూటంగా మారిపోతోంది. అటు ప్రతిపక్ష కాంగ్రెస్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రియాంకాగాంధీ – ఇటు అధికారపక్షం బిజెపి నేత వరుణ్ గాంధీ ఇద్దరూ ఒక అంశంలో భావసారూప్యతతో నడుస్తున్నారు. యుపీ ప్రభుత్వంపై ప్రియాంక నిప్పులు చెరుగుతున్నారు. సొంత పార్టీపైనే వరుణ్ విమర్శలు ఎక్కుపెడుతున్నారు. వెరసి, అక్కతమ్ముళ్లిద్దరూ యోగి ఆదిత్యనాథ్ కు తలనొప్పిగా మారారు. మేనకాగాంధీ కుమారుడు వరుణ్ గాంధీ ఉత్తరప్రదేశ్ లోని పీలీభీత్ లోక్ సభ నియోజకవర్గం నుంచి బిజెపి తరుపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కొంతకాలం నుంచి ఆయన సొంత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, పార్టీ నిర్ణయాలను బాహటంగానే వ్యతిరేకిస్తూ, అసంతృప్తిని వెళ్ళగక్కుతున్నారు. ఆ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల కీలక బాధ్యురాలుగా ప్రియాంక కొన్నాళ్ల నుంచి అక్కడే కలయతిరుగుతున్నారు. వరుణ్ అసంతృప్తిని పసిగడుతున్న ప్రియాంక తమ్ముడిని తమ పార్టీలోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారనే వార్తలు జోరందుకుంటున్నాయి. మేనకాగాంధీని మొదట్లో కేంద్రమంత్రి పదవి నుంచి, ఆ తర్వాత జాతీయ కార్యవర్గం నుంచి బిజెపి అధిష్టానం తప్పించింది. వాజ్ పెయ్ సమయం వరకూ ఆమెకు పార్టీలో మంచి గౌరవమే లభించింది. నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చాక, క్రమంగా ఆమెను నిర్లక్ష్యం చేయడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో, తమ కుటుంబాన్ని బిజెపి చిన్నచూపు చూస్తోందనే భావన తల్లికొడుకులకు పెరుగుతూ వస్తోంది. ఈ పరిణామాలపై వరుణ్ మరింత గుర్రుగా ఉన్నారు. ఇటీవల దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన లఖింపూర్ ఖేరీ సంఘటనలో, కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా రాజీనామా చేయాలని, దుర్ఘటనలో కీలకవ్యక్తిగా భావించే మంత్రి కుమారుడుపై చర్యలు తీసుకోవాలని ప్రియాంకాగాంధీ డిమాండ్ చేశారు. ప్రతిపక్షనేతగా ఆమె డిమాండ్ చేయడం సహజం. అధికార పార్టీకి చెందిన వరుణ్ గాంధీ కూడా అదే డిమాండ్ చేయడం గమనార్హం. మంత్రి కుమారుడి వీరవిన్యాసాల వీడియోలను అక్కతమ్ముడు ఇద్దరూ తమ ట్విట్టర్ వేదికల ద్వారా పంచుకున్నారు.
Also read: హుజూరాబాద్ లో ఈటల విజయ పతాక
ఉద్యమ రైతులకు వరుణ్ మద్దతు
బిజెపి తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రైతు సంఘాలకు వరుణ్ మద్దతు కూడా ప్రకటించారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీరును ఆయన ప్రతిపక్షాలతో సమానంగా ఎండగడుతున్నారు. ఉదాహరణకు : చెరకు కనీస మద్దతు ధర 250 రూపాయల నుంచి 400 రూపాయలకు పెంచాలంటూ ప్రభుత్వానికి వరుణ్ లేఖాస్త్రం సంధించాడు. ప్రతిపక్షాలన్నీ వరుణ్ గాంధీని అనుసరిస్తూ, అదే ధరపై పట్టుబట్టాయి. ఇటువంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ ఇటు బిజెపికి – అటు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి చికాకుగా మారుతున్నాయి. వరుణ్ గాంధీ స్వపక్షంలోనే విపక్షంగా మారారు. ప్రియాంక -వరుణ్ మధ్య బంధాలు పెరుగుతున్నాయనీ, ఇద్దరూ తరచూ మాట్లాడుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. తమ్ముడిని ఎలాగైనా కాంగ్రెస్ లోకి రప్పించి, ఉభయలూ కలిసి మరింత శక్తివంతంగా బిజెపిపై యుద్ధం చేయాలనే వ్యూహంలో ప్రియాంక ఉన్నట్లు తెలుస్తోంది. పనిలో పనిగా పాత విషయాలన్నీ మరచిపోయి సోనియాగాంధీ, మేనకాగాంధీలను ఏకంచేయాలని ఆమె చూస్తున్నట్లు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. రెండు కుటుంబాలు కలిసిపోయి, ప్రచారం మొదలుబెడితే రేపటి ఎన్నికల్లో అటు బిజెపికి- ఇటు యోగి ఆదిత్యనాథ్ కు ఫలితాలు ఎంతోకొంత ప్రతికూలంగా మారే అవకాశాలు ఉన్నాయి. అవి ఏ మేరకు అన్నది వారి విధానం, శక్తి సామర్ధ్యలపైనే మీదే ఆధారపడి వుంటుంది. ప్రస్తుతానికి మేనకాగాంధీ, వరుణ్ గాంధీ అంత ప్రభావశీలమైన నాయకులేమీ కారు. ఆ రాష్ట్రంలో వారి ప్రభావం పరిమితమే. వరుణ్ గాంధీ ముందుగా తన లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేసి, కాంగ్రెస్ లో చేరాలి. ఉపఎన్నికల్లో నిల్చొని, ఆ పార్టీ నుంచి గెలిచి చూపించాలి. అక్కతమ్ముడూ అసెంబ్లీ ఎన్నికల వేళ శక్తివంతంగా తమ వాణిని వినిపించి, మంచి ఫలితాలు రాబట్టాలి. తదనంతరం, 2024లో రాబోయే సార్వత్రిక ఎన్నికల దాకా పోరాటపటిమతో, వ్యూహనైపుణితో ప్రచారభేరీ మోగించాలి. ఈ తీరులో సాగితే, కాంగ్రెస్ కు కొంత లాభం, బిజెపికి కొంత నష్టం కలుగుతాయి. కాంగ్రెస్ పార్టీకి జవజీవాలు పోసినవారవుతారు. గాంధీ కుటుంబాలు ఏకమైనట్లూ ఉంటుంది. ఇవన్నీ కాలపరీక్షలో తేలాల్సిన అంశాలే.
Also read: భూతాపం అధికమైతే విలయం అనివార్యం