గురువారంనాడు తుదిశ్వాస విడిచిన గోవర్ధనం సుందర వరదాచారి పత్రికారంగంలో పితామహుడిలాంటివారు. మా కంటే ముందు తరం వారిది. వరదాచారి మొదటి సంపాదకుడు అయిన కూచిమంచి సత్యసుబ్రహ్మణ్యం నాకూ తొలి సంపాదకులే. వరదాచారి గురించి అభినందన పూర్వకంగా సుబ్రహ్మణ్యం చెప్పేవారు – మంచి జర్నలిస్టు, భాషపైన పట్టున్నవాడు, విషయపరిజ్ఞానం సంపూర్ణంగా ఉన్నవాడు అని.
సత్యసుబ్రహ్మణ్యం ‘ఆంధ్రజనత’ దినపత్రికకు సంపాదకుడుగా ఉన్న రోజుల్లోనే వరదాచారి ఆ పత్రికలో ఉపసంపాదకుడుగా 1956లొ చేరి తన పాత్రికేయ జీవితానికి శ్రీకారం చుట్టారు. ఆయన తర్వాత అజంతా, పొత్తూరి వెంకటేశ్వరరావు, బుద్ధవరపు విశ్వేశ్వరరావు, తదితరులు చేరారు. అక్కడ అయిదేళ్ళు పని చేసిన తర్వాత ‘ఆంధ్రభూమి’లో చేరారు. రెండు దశాబ్దాలపాటు న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. న్యూస్ ఎడిటర్ అని పేరే కానీ మొత్తం పత్రిక నిర్మాణం యావత్తూ ఆయనే చూసుకునేవారు. సంపాదకులు గోరాశాస్త్రికి ఇంగ్లీషులోనూ, తెలుగులోనూ సంపాదకీయాలు రాయడంతో సరిపోయేది. ఆ తర్వాత ‘ఈనాడు’లో అసిస్టెంట్ ఎడిటర్ గా చేరారు. అయిదేళ్ళ తర్వాత 1988లో పత్రికారంగంలో ప్రత్యక్ష సేవకు విరామం ప్రకటించి జర్నలిజం అధ్యాపకుడుగా కొత్త అవతారం ఎత్తారు. పొట్టి శ్రీరాములు తెలుగువిశ్వవిద్యాలయంలో జర్నలిజం విభాగాన్ని ప్రారంభించే బాధ్యతను ఘనంగా నిర్వర్తించారు. దాదాపు రెండు దశాబ్దాలుగా జర్నలిజం బోధించి ఉద్యోగవిరమణ చేశారు. తెలుగు విశ్వవిద్యాలయం ఆయన సేవలను గుర్తించి గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది. 2010లో హెచ్ఎంటీవీలో తొలి తీర్పరి (ఆంబుడ్స్ మన్)గా చేరారు. 2014 వరకూ, నేను ఆ చానల్ కు చీఫ్ ఎడిటర్ గా ఉన్నంతవరకూ, ఆ పదవిలో ఉన్నారు. తర్వాత వయోధిక పాత్రికేయ సంఘం బాధ్యతలు నిర్వహించారు.
‘ఆంధ్రభూమి’లో న్యూస్ ఎడిటర్ గా పని చేస్తూనే సినిమా రంగం అధ్యయనం చేసేవారు. సినిమా సమీక్షలు చేసేవారు. సినిమా క్రిటిక్స్ అసోసియేషన్ కు ఉపాధ్యక్షుడుగా చాలాకాలం పని చేశారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ వ్యవస్థాపక సభ్యులుగా ఉన్నారు. ఖైరతాబాద్ లో ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి దోహదం చేసిన జర్నలిస్టులలో వరదాచారి ఒకరు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు అధ్యక్షుడుగా పని చేశారు. జర్నలిస్టుల ఉద్యమంలో చురుకుగా ఉండేవారు.
ప్రెస్అకాడెమీ వారు నిర్వహించే శిక్షణాతరగతులలో ‘ప్రెస్ లా’ వరదాచారి, రాఘవాచారి చెప్పేవారు. సారస్వత సభలలో అనర్గళంగా మాట్లాడేవారు. తెలుగుభాషపైన మమకారం, అధికారం ఉన్న పాత్రికేయుడు. తాను పని చేసే పత్రికలలోనూ, ఇతర తెలుగుదినపత్రికలలోనూ వస్తున్న భాషాదోషాలను ఎంచి యువజర్నలిస్టులను మందలిస్తున్నట్టుగా ‘ఇలాగేనా రాయడం?’ అంటూ ఒక పుస్తకం రాశారు. పొరబాట్లను ఎలా దిద్దుకోవాలో చెబుతూ ‘దిద్దుబాటు’ అనే ఉపయుక్తమైన గ్రంథం రచించారు. ‘మన పాత్రికేయ వెలుగులు’ అనే పేరుతో వరిష్ఠ పాత్రికేయుల గురించి పుస్తరం రాశారు. ఆత్మకథ రాశారు. పత్రికలలోనే కాకుండా ఎలక్ట్రానిక్ మీడియంలో కూడా తప్పొప్పులు దిద్దేబాధ్యత తీసుకున్నారు.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో 15 అక్టోబర్ 1932లో జన్మించిన వరదాచారి ఉస్మానియాలో చదివారు. ఎంఏ చదివి, ఎల్ఎల్ బీ చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం జర్నలిజం డిపార్ట్ మెంట్ ప్రారంభ దశలో జర్నలిజం డిప్లొమా చేశారు. ఆయన జర్నలిజం చదివినప్పుడు గోవిందరాజులు అని హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్ ఉండేవారు. అప్పుడు డిప్లొమానే ఉంది. ఆ తర్వాత మేము చదువుకున్న 1973 నాటికి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ వచ్చింది. బషీరుద్దీన్ శాఖాధిపతిగా వచ్చారు. ఆ తర్వాత ఎంఏ వచ్చింది. ఇప్పుడు పిహెచ్ డిలు కూడా చేస్తున్నారు.
నేను హెచ్ఎంటీవీలో పని చేసే రోజుల్లో ఆయన ఇంటికి వెళ్ళి ఆంబుడ్స్ మన్ గా పని చేయాలని అభ్యర్థించాను. ఆయన అంగీకరించారు. ఆంబుడ్స్ మన్ అని ఇంగ్లీషు మాటతో పిలిస్తే బాగుండదని ఇద్దరం చర్చించుకొని ‘తీర్పరి’ అని పేరుపెట్టాం. ప్రతివారం ఒక రోజు సాయంత్రం స్టుడియోలో నేనూ, ‘తీర్పరి’ వరదాచారి కూర్చొనేవారం. ఆ వారంలో చానల్ లో జరిగిన తప్పులను ఎత్తి చూపడం, వీక్షకులు రాసిన లేఖలకు సమాధానాలు చెప్పడం, అప్పుడు అమలు లో ఉన్న ధోరణుల గురించి మాట్లాడటం, కొత్త కోణాలు ఆవిష్కరించేందుకు ప్రయత్నించడం చేసేవాళ్ళం. టైమ్స్ ఆఫ్ ఇండియా, ద హిందూ మినహా ఆంబుడ్స్ మన్ వ్యవస్థను ఎవ్వరూ పెట్టలేదు. తెలుగులోనే కాదు భారత ఎలక్ట్రానిక్ మీడియాలోనే తొలి ఆంబుడ్స్ మన్ వరదాచారి.
ఆరడుగుల పైచిలుకు ఎత్తు, మంచి దేహదారుఢ్యం, కంచు కంఠం, సుబోధకంగా వివరిస్తూ అద్భుతంగా ఉపన్యాసాలు ఇవ్వగల నేర్పూ, చక్కటి, చిక్కటి తెలుగు వచనం, నిస్పాక్షికమైన సినిమా సమీక్షలు రాయడంలో నిష్ణాతుడు వరదాచారి. నైతికంగానే కాకుండా భౌతికంగా కూడా తొంభై ఏళ్ళు వచ్చినప్పటికీ ఏ మాత్రం వంగకుండా నిటారుగా నిలబడేవారు. ఆచార్యులుగా వందలమంది జర్నలిస్టులను తయారు చేశారు. తెలుగు జర్నలిజానికి ఎనలేని సేవచేశారు. ముక్కుసూటిగా మాట్లాడే తత్త్వం. ఒకరిని ఆశ్రయించడం, కార్యం సాధించడం, పైరవీలు చేయడం, రాజకీయనాయకుల చుట్టూ తిరగడం వంటి అవలక్షణాలు బొత్తిగా లేని స్వచ్ఛమైన, పరిశుభ్రమైన మనిషి. ఎన్నో పదవులకు ఆయన అర్హుడే అయినప్పటికీ ఏ పదవీ రాకపోవడం విశేషం. లౌక్యం తెలియకపోలేదు కానీ దాన్నిపదవులు సాధించేందుకు ప్రయోగించడం ఆయనకు బొత్తిగా ఇష్టం ఉండేది కాదు.
ఇద్దరు కుమారులూ, ఇద్దరు కుమార్తెలూ చదువుకొని పైకి వచ్చారు. కుమారులు హైదరాబాద్ లోనే ఉంటున్నారు. కుమార్తెలు ఇద్దరూ అమెరికాలో ఉంటున్నారు. అందరూ తమ జీవితాలలో ఎదుగుతున్నారు. జూబ్లీహిల్స్ లో మొదటి జర్నలిస్టు కాలనీలో ఇల్లు కట్టుకున్నారు. దుర్వ్యసనాలకు దూరంగా, అధ్యయనానికి దగ్గరగా, రచనావ్యాసంగంలో మమేకం అవుతూ, అధ్యాపకుడుగా రాణిస్తూ, సంతృప్తి చెందుతూ, విద్యార్థులను ప్రేమిస్తూ, వారిని భావిపాత్రికేయులుగా తయారు చేస్తూ హుందాగా, దర్జాగా, రాజీపడకుండా, ఎవరికీ తలవంచకుండా బతికారు. ఆయనది నిండు జీవితం. అనారోగ్యంతో తీసుకోకుండా ఆస్పత్రికి వెడుతూనే ఆఖరిశ్వాస విడిచారు. ధన్యజీవి. పత్రికారంగానికి పెద్దదిక్కు లేకుండా పోయిందనే విచారం. పాత్రికేయులకు ప్రాతఃస్మరణీయుడు వరదాచారి.
వరదాచారి అంత్యక్రియలు శుక్రవారం ఉదయం పంజగుట్ట స్మశానవాటికలో పూర్తయినాయి. బంజారాహిల్స్ నివాసానికి పత్రికాప్రపంచంలో ఆయనతో కలసి పని చేసిన వరిష్ఠపాత్రికేయులూ, ఇతర ప్రముఖులూ వెళ్ళి ఆయన భౌతిక కాయానికి పుష్పాంజలి ఘటించారు. సీనియర్ పాత్రికేయులు దాసు కేశవరావు, సీనియర్ జర్నలిస్టులు లక్ష్మణరావు, భండారు శ్రీనివాసరావు, నందిరాజు రాధాకృష్ణ తెలంగాణ ప్రెస్ అకాడెమీ అధ్యక్షుడు అల్లం నారాయణ, విశాలాంధ్ర సంపాదకులు ఆర్ వి రామారావు, ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె. శ్రీనివాస్, పమాచార కమిషనర్ కట్టాశేఖరరెడ్డి, రచన జర్నలిజం కళాశాల, సాక్షి జర్నలిజం స్కూలు మాజీ ప్రిన్సిపల్ గోవిందరాజు చక్రధర్, మరెంతో మంది సీినియర్ జర్నలిస్టులుూ, జర్నలిజం అధ్యాపకులూ, తెలుగు విశ్వవిద్యాలయం బాధ్యులూ శ్రద్దాంజలి ఘటించారు. నేను కూడా అంతిమ నమస్కారం చేసినవాళ్ళలో ఒకడిని.
Also read: అసాధారణ జర్నలిస్టు కెఎల్ రెడ్డికి అక్షరాంజలి