వోలేటి దివాకర్
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఏప్రిల్ 8 న ప్రారంభించిన సికింద్రాబాద్ – తిరుపతి – సికింద్రాబాద్ వందే భారత్ రైలుకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ రైల్లో సీట్లు దొరకడమే గగనం. సికింద్రాబాద్ – తిరుపతి వందే భారత్ ఎక్స్ప్రెస్ ఏప్రిల్లో 131శాతం, మే లో 135 శాతం, తిరుపతి – సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఏప్రిల్లో 136 శాతం, మేలో 138 శాతం ఆక్యుపెన్సితో నడిచాయి. ప్రయాణీకుల సంఖ్య పరంగా, 15 మే 2023 వరకు, మొత్తం 44,992 మంది ప్రయాణికులు రెండు దిశలలో వందే భారత్ రైలు సేవలను పొందారు. వందే భారత్ ఎక్స్ప్రెస్లో సికింద్రాబాద్ నుంచి తిరుపతికి 21,798 మంది ప్రయాణికులు రాగా, తిరుపతి నుంచి సికింద్రాబాద్కు మరో 23,194 మంది ప్రయాణించారు.
తిరుపతి వందేభారత్ రైలుకు లభిస్తున్న ఆదరణను, వేసవి సెలవులు దృష్టిలో ఉంచుకుని సీట్లను రెట్టింపు చేశారు. ప్రస్తుతం ఎనిమిది కోచ్లు, 530 మంది ప్రయాణీకుల సామర్థ్యంతో ప్రయాణించే ఈరైలును ఈనెల17వ తేదీ నుంచి కోచ్ ల సంఖ్యను 16కు పెంచి , 1128 ప్రయాణికుల సామర్థ్యం తో నడపనున్నారు. అలాగే రెండు దిశలలో ప్రయాణ సమయం కూడా 15 నిమిషాలు తగ్గించారు. తిరుపతి-సికింద్రాబాద్ మధ్య ప్రస్తుతం 8.30గంటల వ్యవధికి పడుతోంది. ఇకపై 8 గంటల 15 నిమిషాలలో ప్రయాణాన్ని పూర్తి చేస్తుంది.