భారత దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత 1952లో జరిగిన మొట్ట మొదటి సార్వత్రిక ఎన్నికలలో అప్పటి హైదరాబాద్ స్టేట్ అసెంబ్లీ ఎన్నికలలో ఎంతోమంది “స్టార్స్” గెలిచారు. అందులో “చుక్కల్లో చంద్రుడు” గా, అందరివాడు గా రాజకీయవర్గాలలో వి బి రాజు గా పిలవబడే చిరపరిచితుడు వల్లూరి బసవరాజు గారు కూడా ఉన్నారు.
కొరకరాని కొయ్య ఏడవ నిజాం
1947 ఆగస్టు 15 నాడు దేశంలోని బ్రిటిష్ వారు పాలిస్తున్న ప్రాంతాలన్నింటికీ స్వాతంత్ర్యం లభించింది. వాటితోపాటు చిన్నాచితకా 537 సంస్థానాలు భారతదేశంలో విలీనం అయిపోయాయి. ఇక మిగిలిన గుజరాత్ రాష్ట్రంలోని జునాగఢ్, ఉత్తరాన జమ్మూ-కాశ్మీర్ సంస్థానం, దక్షణాన ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పాలనలో ఉన్న హైదరాబాద్ సంస్థానం మాత్రం భారతదేశంలో విలీనం కాలేదు. అప్పుడు హైదరాబాద్ సంస్థానం లో నిజాం వ్యతిరేక స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న వారిలో వి బి రాజు ఒకరు. మొదట “జునాగడ్” సంస్థానం ఆ తర్వాత “జమ్ము కాశ్మీర్” సంస్థానం భారతదేశంలో వరుసగా విలీనమయ్యాయి. కానీ కొరకరాని కొయ్యగా మారిన ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మెడలు వంచడానికి అప్పటి దేశ హోంమంత్రి ఉక్కు మనిషిగా పేరొందిన సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో జరిగిన “పోలీస్ యాక్షన్” తర్వాత హైదరాబాద్ సంస్థానం కూడా 1948 సెప్టెంబర్ 17న భారతదేశంలో విలీనమైంది
వార్ హీరో వి.బి. రాజు
హైదరాబాద్ రాష్ట్రంలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న “వార్ హీరోస్” అనదగిన ఎంతోమంది నాయకులు 1952 లో హైదరాబాద్ రాష్ట్రానికి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంటు, అసెంబ్లీ సభ్యులుగా గెలిచారు. అందులో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు హైదరాబాద్ ఏడవ నిజాం రాజును ఎదిరించి హైదరాబాద్ విముక్తి పోరాటం లో వీరోచితంగా పోరాడిన వి బి రాజు ఒకరు. ఆయన 1952 మొదటి సార్వత్రిక ఎన్నికలలో సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత ఆవిర్భవించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెవెన్యూ మంత్రిగా పనిచేశారు. ఆర్టీసీ సంస్థలో ఆయన ప్రవేశపెట్టిన అనేక సంస్కరణలు ఆ తర్వాత ఆదర్శంగా మారి ఆర్టీసీని లాభాల్లోకి నెట్టాయి.
హెవీవెయిట్స్ లో ఒకరు
1952 ఎన్నికల్లో వి.బి.రాజు తో పాటు హైదరాబాద్ రాష్ట్రానికి మొదటి, చివరి ముఖ్యమంత్రి గా పనిచేసిన బూర్గుల రామకృష్ణారావు, షాద్ నగర్ నుండి, కొండా వెంకట రంగారెడ్డి ,షాబాద్, మర్రి చెన్నారెడ్డి,వికారాబాద్, గోపాలరావు ఎగ్బోటే, ముషీరాబాద్, సురవరం ప్రతాపరెడ్డి, వనపర్తి, కొండా లక్ష్మణ్ బాపూజీ, అసిఫాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల నుండి గెలిచారు, ఆ ఎన్నికలలోనే రావి నారాయణరెడ్డి నల్లగొండ పార్లమెంటు నియోజక వర్గంతో పాటు భువనగిరి అసెంబ్లీ స్థానాలలో పోటీ చేసి రెండు సీట్లలో గెలిచారు. అలాగే పెండ్యాల రాఘవరావు కూడా వరంగల్ జిల్లా వర్ధన్నపేట అసెంబ్లీ, వరంగల్ పార్లమెంటు సీట్లలో పోటీ చేసి రెండింటినీ గెలిచారు. బివి రాజు తో పాటు వీరందరినీ రాజకీయవర్గాలలో “హెవీ వెయిట్స్” గా కూడా పిలుస్తారు. అలా వీరందరితో కలసి పని చేసి అందరి తలలో నాలుకగా ఉన్న బి బి రాజు ఆ స్టార్స్ మధ్యలో చుక్కల్లో చంద్రుడు అనే చెప్పవచ్చు.
Please forward other information/profile with regard to STI. VB RAJU .