రామాయణమ్ – 104
‘‘ఇంకా నా వెనుకే వస్తున్నావెందుకు? ఆడువారినందరినీ తీసుకొని లోపలికి వెళ్ళు. నా మీద చూపిన భక్తి ఇక చాలు’’ అన్నాడు వాలి తారను చూసి.
‘‘నేను వెళ్ళి సుగ్రీవునితో యుద్ధము చేసి ప్రాణముతీయకుండా వాడికి బుద్ధి చెప్పి వస్తాను. ఇక రాముని సంగతంటావా? ఇక్ష్వాకులు ధర్మమార్గాన నడిచేవారు. రాముడు ఇక్ష్వాకుడు.’’
Also read: సుగ్రీవుడితో సంధి చేసుకోవాలంటూ వాలికి తార హితోక్తులు
తన హిత వచనాలు పెడచెవిన పెట్టి మృత్యుపరిష్వంగంలోకి జారుకోబోతున్న భర్తను చూసి నిట్టూర్చి ఆయనకు విజయము కలుగవలెనని మంత్రపఠనము చేసి ఆయనకు ప్రదక్షిణ యొనర్చి భర్తవైపే దిగులుగా చూస్తూ లోనికి నడిచింది తార!
రోషముతో బుసలుకొడుతూ నలుదెసలా పరీకించి చూసి బంగారములాగా పచ్చగా మెరిసిపోతున్న సుగ్రీవుని చూసి బట్టను గట్టిగా ఎగగట్టి తొడగొట్టి పిడికిలి బిగబట్టి ఇదిగో నీ పనిపట్టెదనంటూ సుగ్రీవుని పైకి దుమికినాడు వాలి. సుగ్రీవుడు కూడా అంతే వేగముగా కలియబడుటకు ఉత్సాహముగా ముందుకురికినాడు
హోరాహోరీ
బాహాబాహీ
ముష్టాముష్టీ!
వాలిసుగ్రీవులు ఒకరినొకరు పీడించుకుంటూ
తాడించుకుంటూ
కలియబడినారు.
Also read: ఏడు సాల వృక్షములనూ ఒకే బాణముతో పడగొట్టిన రాముడు
వాలి యొక్క ముష్టిఘాతములకు రక్తపు సెల ఏరు ప్రవహించే పర్వతమువలే కనిపించాడు సుగ్రీవుడు.
దెబ్బతిన్నప్పటికీ ఏమాత్రము తగ్గక ఒక మద్దివృక్షాన్ని సమూలంగా పెరికి వాలిని మోదాడు సుగ్రీవుడు. తుఫానుగాలికి నడిసంద్రములో ఊగులాడే నావలాగ అటుఇటు కదిలిపోయినాడు వాలి.
క్రమముగా సుగ్రీవుని బలము తగ్గుతూ వాలి బలము పెరగ సాగింది.
వాలి దెబ్బలకోర్వలేక అటుఇటు దిక్కులు చూడటము మొదలు పెట్టిన సుగ్రీవుని వాలకము గమనించిన శ్రీరాముడు ఒక తీక్షణమైన బాణాన్ని తీసి ధనుస్సుకు తొడిగి ఆకర్ణాంతము నారిసారించి విడిచిపెట్టగా అది లోకభీకరంగా వచ్చి వాలి వక్షస్థలాన్ని తాకింది. ఆ బాణ వేగానికి తట్టుకోలేక వాలి నేల కూలినాడు.
రక్తముతోటి చెమటతోటి తడిసిన వాలి శరీరము పుష్పించి నేలకూలిన మోదుగ చెట్టువలే, క్రిందికి తోయబడిన ఇంద్రధ్వజమువలే ఉండెను.
Also read: సుగ్రీవునికి రాజ్యబహిష్కారం, వాలికి రాజ్యాధికారం
…..
నరికివేసిన చెట్టు నేలమీద పడ్డట్టుగా అన్ని అవయవములు నేలకు ఆనుకొని పడిపోయినా వాలి తేజస్సును కోల్పోలేదు. ప్రాణము వీడలేదు. పరాక్రమము విడువలేదు.
దేవేంద్రుడిచ్చిన బంగారు మాల వాలి ప్రాణాన్ని,తేజస్సును,శోభను కోల్పోకుండా పట్టి వుంచింది.
వాలి శరీరాన్ని రామబాణము అమితముగా బాధిస్తున్నది.
దానికి సుగ్రీవుడి దెబ్బలుకూడా కలిసి బాధ అధికమయి స్పృహకోల్పోయీ కోల్పోనట్లుగా అలా నేల మీద పడిఉన్నాడు ఆ మహా వీరుడు.
Also read: వాలికీ, తనకూ మధ్య వైరం ఎట్లా వచ్చిందో వివరించిన సుగ్రీవుడు
రామలక్ష్మణులు గౌరవపురస్సరముగా వాలిని సమీపించారు. వారిని చూడగానే పరుషపదములతో వాలి నిందించసాగాడు. ‘‘నీ వైపు తిరిగిలేను. నీతోయుద్ధము చేయుటలేదు. ఇంకొకరితో యుద్ధము చేసే తొందరలో ఉన్నాను. అలాంటి నన్ను చంపి నీవు ఏమి సాధించినావు? నీ గురించి మా తార హెచ్చరిస్తే !….రాముడు సత్కులమున పుట్టినవాడు. బలశాలి. తేజస్సు కలవాడు. నియమవర్తనుడు కరుణామయుడు. ప్రజాహితము కోరువాడు. హృదయములో జాలినిండినవాడు. సమయాసమయములు తెలిసినవాడు. నియమము పాటించుటలో స్థిరమైనవాడు అని నీ గురించి తెలిపి నీ వలన భయములేదని చెప్పి వచ్చినాను. రామా ఏల ఈ కార్యమునకు ఒడిగట్టినావు?
‘‘యుధ్దరంగానికి వచ్చినప్పుడు నాకు నీవు కనబడలేదు. అప్పుడు నా మనస్సులో ఒకటే భావము మెదిలిందయ్యా రామా. ఇంకొకరితో యుద్ధము చేయునప్పుడు నీ వలన ప్రమాదము ఉండదు అని. అలాంటి నా నమ్మకము వమ్ము అయినదిగా రాఘవా! అప్పుడు తెలవదు నిదురించిన వానిని కాటేసే పామువు నీవని. గడ్డి కప్పిన నుయ్యివంటి వాడవని. ఇంత అధార్మికుడు దశరథ పుత్రుడెలా అవుతాడు?
‘‘రామా నీవు నరుడవు. నేనో అడవిలో కాయకసరులు తిను వానరుడను. ఎవరినైనా చంపటానికి వాని భూమి, బంగారము, సంపద కారణములు. నీకు నా భూమి అయిన అడవిమీద, నేను తినే ఫలములమీద ఆశ ఏమిటి? రామా, నా చర్మము నీవు ధరించ యోగ్యమయొనదికాదే? నా మాంసము నీవు భుజించదగినది కాదే. వానరమాంసము నిషిద్ధమే.
‘‘అయ్యో, అన్ని విషయములు తెలిసిన తార సత్యము హితము పలికినది. నేనే వాటిని పెడచెవిని బెట్టి యముడికి వశుడనైతిని. రాముడనే ఏనుగు సచ్చరిత్రము అనే నడుముకట్టిన తాడు తెగగొట్టి, ధర్మము అనే అంకుశమును దూరముచేసి, నన్ను చావగొట్టినది!
Also read: సీత జారవిడిచిన ఆభరణాలను గుర్తించిన రాముడు
వూటుకూరు జానకిరామారావు