కరోనా మూడో వేవ్ ముప్పు ఆగస్టులోనే వచ్చేట్టుందని పలు నివేదికలు చెబుతున్నాయి. డెల్టా ప్లస్ వేరియంట్ ప్రభావాన్ని,మూడో వేవ్ ముప్పును రెండింటినీ ఎదుర్కోడం మన ముందున్న పెద్ద సవాల్. దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమలులో లేదు. స్వేచ్ఛాయుత వాతావరణం ఇదివరకటి వలె మళ్ళీ కొంప ముంచుతుందనే భయం ముసురుకుంటోంది. ఆంధ్రప్రదేశ్ లో 8వ తేదీ నుంచి లాక్ డౌన్ సడలింపు వేళలు పెరుగుతున్నాయి. ముప్పుల నుంచి తప్పించుకోడానికి జాగ్రత్తలను పాటించడంతో పాటు వ్యాక్సినేషన్ వేగవంతం అవ్వాలి. రోజుకు 80 లక్షల నుంచి కోటిమందికి వ్యాక్సిన్లు అందిస్తే, మూడో వేవ్ ముప్పు తప్పుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Also read: విశాఖ ఉక్కు దక్కదా?
ప్రభుత్వాలు వేగంగా కదలాలి
ఈ దిశగా ప్రభుత్వాల గమనం మరింత వేగవంతమవ్వాలి. దేశ జనాభాలో కనీసం 60 శాతం మందికి రెండు డోసులు, బూస్టర్ డోసులు అందితే తప్ప సానుకూల వాతావరణం ఏర్పడదు. డిసెంబర్ కల్లా ఈ లక్ష్యాన్ని ఎట్లాగైనా అధిగమిస్తామనే విశ్వాసంతో కేంద్రం ఉంది. వ్యాక్సినేషన్ వైపు కదలిరండంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రజలకు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. ఫైజర్, ఆస్ట్రాజెనికా వంటి శక్తివంతమైన వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడం అత్యంత కీలకం. స్పుత్నిక్ లైట్ సింగల్ డోస్ వ్యాక్సిన్ వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు. దానికి ఇంకా అనుమతులు రాలేదు. సామూహిక రోగ నిరోధక శక్తి ( హెర్డ్ ఇమ్మ్యూనిటీ ) పెరగడం అత్యంత ముఖ్యం. ఇంతవరకూ కోవాక్జిన్, కోవీషీల్డ్ తీసుకున్నవారిలో యాంటీ బాడీస్ ఎంత వరకూ వృద్ధి చెందాయన్న విషయం తేలాల్సి వుంది. అది తెలియాలంటే యాంటీ బాడీస్ పరీక్షలు చేయించడం ముఖ్యం. రెండు డోసులు తీసుకున్న కొందరిలో యాంటీ బాడీస్ పెరగలేదని తెలుస్తోంది. ఇలా ఎందుకు జరిగిందో విశ్లేషణ జరగాలి. యాంటీ బాడీస్ పెరగకుండా, ఊరికే వ్యాక్సిన్లు వేయించుకోవడం వల్ల ప్రయోజనం ఏముంటుందని కొందరు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ప్రతి రోజూ సుమారు 40లక్షల డోసులు పంపిణీ అవుతున్నాయి. ఇదే తీరున సాగితే డిసెంబర్ కల్లా అనుకున్న లక్ష్యం ఎట్లా సాధిస్తారు? మెగా వ్యాక్సిన్ డ్రైవ్ పెట్టుకున్నా,ఇంకా కొన్ని రాష్ట్రాల్లో వ్యాక్సిన్ల కొరత ఉంది. వ్యాక్సిన్ల కొరత లేనేలేదని కేంద్రం మొదటి నుంచీ అంటోంది. క్షేత్ర వాస్తవికతపై కేంద్రం నజర్ వెయ్యాలి.
Also read: ‘మా’లో సమష్టితత్వం
అన్ని రాష్ట్రాల పట్ల సమభావం
రాజకీయాలకు అతీతంగా అన్ని రాష్ట్రాల పట్ల సమభావంతో ఉండడం కరోనా కష్టాల వేళల్లో చాలా ముఖ్యం.అది మానవీయ కోణం.వ్యాక్సిన్ ఉత్పత్తిలో గతంలో కంటే వేగం పెరిగినప్పటికీ,ఇంకా వేగం పుంజుకోవాల్సిన అవసరం ఉంది.మోడెర్నా వ్యాక్సిన్ కు ఇప్పటికే అనుమతి లభించింది.ఈ వ్యాక్సిన్ త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.దాని వల్ల మంచి ప్రయోజనాలు ఉన్నాయని నిపుణుల అభిప్రాయం. దేశంలో స్థానికంగా ఉత్పత్తి పెరగడం అత్యంత కీలకం.అన్ని డోసులు కలుపుకొని ఇప్పటి వరకూ 35 కోట్ల డోసులు పంపిణీ అయ్యాయి. దేశ జనాభా 139.5 కోట్లు. 60 శాతం మందికి రెండు డోసుల చొప్పున లెక్క చూస్తే 166 కోట్ల డోసులు కావాల్సి వస్తుంది. కోవాక్జిన్ మూడో డోస్ బూస్టర్ డోస్ గా వేసుకొంటే కానీ లాభం ఉండదని చెబుతున్నారు. కోవీషీల్డ్ విషయంలో డోసుల మధ్య కాల వ్యవధి చాలా ఎక్కువ ఉంది. వ్యాక్సిన్ల కొరత వల్లనే వ్యవధిని పెంచుతున్నారని విమర్శలు వస్తున్నాయి.శక్తివంతమైన విదేశీ వ్యాక్సిన్లను త్వరగా రప్పించుకోవడమే దీనికి ప్రత్యామ్నాయ మార్గం. రెండు డోసులకు సంబంధించి, వేరే వేరే కంపెనీల వ్యాక్సిన్లను తీసుకుంటే ఇంకా మంచిదనే కథనాలు వస్తున్నాయి. ఆ సిద్ధాంతం మనకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లకు వర్తించదని సమాచారం. మరికొన్ని సంస్థలు కూడా వ్యాక్సిన్ రూపకల్పనలో ఉన్నాయి. అవి రావడానికి ఇంకా కొన్ని నెలల సమయం పట్టేట్టు ఉంది.వచ్చే సంవత్సరంలో మరికొన్ని సంస్థల నుంచి మరిన్ని వ్యాక్సిన్లు రానున్నాయి. అత్యంత సమర్ధవంతమైన వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చేంత వరకూ ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్లతో కాలక్షేపం చేయడమే మనముందున్న కర్తవ్యం. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా కరోనా సోకే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. కాకపోతే, ప్రాణభయం ఉండదని అంటున్నారు. ఒకసారి వ్యాక్సిన్ వేసుకుంటే,జీవితాంతం కరోనా వైరస్ ను దరిచేరనివ్వని వ్యాక్సిన్లు వచ్చేంత వరకూ మనకు తిప్పలు తప్పవు. ఆంధ్రప్రదేశ్ లో లాక్ డౌన్ నిబంధనల సడలింపులు పెరిగిన నేపథ్యంలో, అత్యంత అప్రమత్తంగా ఉండడమే శ్రేయస్కరం. స్వీయ క్రమశిక్షణే శిరోధార్యం.
Also read: కొత్త టీకాలకు స్వాగతం