- డ్రైరన్ తో మెరుగైన సేవలు అందిస్తోన్న వైద్య సిబ్బంది
- పక్కాప్రణాళికతో వ్యాక్సినేషన్
కోవిద్ పై అంతిమ సమరం ఆరంభం అయింది. ప్రధాని నరేంద్రమోదీ శనివారం ఉదయం గం. 10.30కు దేశవ్యాప్తంగా టీకా కార్యక్రమాన్ని ప్రారంభించారు. టీకా కనిపెట్టడంతోనే కరోనాపైన యుద్ధం ఆరంభమైంది. ప్రపంచవ్యాప్తంగా పదికోట్ల మందిని కరోనా కాటేసింది. వారిలో 20 లక్షలమంది చనిపోయారు. కరోనా వైరస్ భారత దేశంలో ప్రవేశించింది నిరుడు మార్చి మాసంలో. అప్పుడే దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించి కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించింది. ఆ సందర్బంలో తగిన ముందస్తు హెచ్చరిక ఇవ్వకపోవడం వల్ల వలస కార్మికులు నరకం చూశారు. వందల మైళ్ళు పిల్లాజెల్లా వెంటరాగా, నిత్యావసర వస్తువులు నెత్తిన పెట్టుకొని నడిచారు. కొంతమంది మార్గమధ్యంలోనే చనిపోయారు.
ఇదీ చదవండి: కరోనా వ్యాక్సినేషన్ కు తెలుగు రాష్ట్రాలు సిద్ధం
మొత్తం మీద మాస్కు లు ధరించడం, భౌతిక దూరం పాటించడం మూలంగా ఈ మహమ్మారి ఇండియాలో సృష్టించిన విపత్తు ప్రమాణం తక్కువగానే ఉన్నదని అంతర్జాతీయ సర్వే సంస్థలు చెబుతున్నాయి. ప్రపంచంలోని అతి పెద్ద టీకా కార్యక్రమం భారత్ లో ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 3,006 టీకా కేంద్రాల అనుసంధానం జరిగింది. ఒక్కో కేంద్రంలో రోజుకు వందమందికి టీకా వేస్తారు.
గర్భిణులూ, పాలిచ్చే తల్లులకూ వద్దు:
గర్భిణులకూ, పాలిచ్చే తల్లులకూ టీకా మందు వేయరాదని వైద్యులు తెలియజేశారు. వారిపైన టీకా తయారు చేసే ముందు ప్రయోగాలు కూడా జరగలేదని అంటున్నారు. అదే విధంగా ఆహారానికీ, మందులకీ అలెర్జీ ఉన్నవారికి కూడా టీకా వద్దని చెబుతున్నారు. కోవిద్ టీకా ఇచ్చిన తర్వాత మరే ఇతర రకం టీకా ఇవ్వాలంటే కనీసం రెండు వారాల వ్యవధి ఉండాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు మార్గదర్శకాలు పంపింది. శనివారంనాడు 140 కేంద్రాలలో టీకా ఇవ్వడం ప్రారంభించారు.
ఇదీ చదవండి: టీకాల అనుమతిపై రాజకీయ వివాదం