ప్రపంచంలో కోవిడ్ క్రీడ ఇంకా ముగియలేదు. సూపర్ స్ప్రెడర్ల ప్రమాదం పొంచే వుంది. డెల్టా వేరియంట్ల ప్రభావం కొనసాగుతూనే ఉంది. దేశంలో ఇంకా చాలామందికి మొదటి డోసే అందలేదు. రెండవ డోస్, బూస్టర్ డోసు కూడా పూర్తవ్వాలి. బూస్టర్ డోసుల అవసరంపై ఇంకా తగినంత ఆధారాలు లేవని నిపుణులు చెబుతున్నారు. ప్రతి రోజూ 20 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతూ కేరళలో వైరస్ తాండవిస్తోంది. దిల్లీ మొదలు దేశంలోని అనేక ప్రాంతాల్లో చాపకింద నీరులా వ్యాప్తి సాగుతూనే ఉంది. ఈ తరుణంలో అత్యంత స్పృహలో ఉండకపోతే పెనుప్రమాదాలను తప్పించుకోలేమని శాస్త్రవేత్తలు చెబుతున్న మాటలు పెడచెవిన పెట్టరాదు. సూపర్ స్ప్రెడర్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
Also read: వ్యధాభరిత కథావిశ్వనాధుడు
గుంపులు మూగే వేడుకలు ఆపాలి
గుంపులు గుంపులు మూగే వేడుకలు ఆరంభమయ్యాయి. వీటిని నియంత్రించడం చాలా అవసరం. రాజకీయ సమావేశాలు,సాంస్కృతిక ఉత్సవాలు క్రీడలు, పెళ్లిళ్లు పేరంటాళ్లు మొదలైనవన్నీ సూపర్ స్పైడర్లే. సినిమా థియేటర్లు, పబ్బులు, రెస్టారెంట్లు కూడా తెరచుకున్నాయి. బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్టుల దగ్గర రద్దీ పెరుగుతోంది. ఎంతో అవసరమైతే తప్ప ప్రయాణాలు చెయ్యొద్దని నిపుణులు చేస్తున్న హెచ్చరికలను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. వీటన్నిటి ప్రభావం వెంటనే తెలియదు. మూడు వారాల తర్వాత మాత్రమే బయటపడుతుందని నిపుణుల భావన. దీనిని గ్రహించి కోవిడ్ నిబంధనలను పాటించడం శిరోధార్యం. ప్రపంచంలో అందరూ సురక్షితంగా ఉండేంత వరకూ వ్యక్తిగతంగా ఎవ్వరూ సురక్షితంగా లేరనే భావించాలి అని ఎయిమ్స్ అధిపతి డాక్టర్ రణదీప్ గులేరియా గుర్తు చేస్తున్నారు. కోవిడ్ ను తట్టుకోవాలంటే వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతమవ్వాలి. దేశంలోని ప్రతి ఒక్కరికీ అన్ని డోసుల వ్యాక్సిన్లు అందాలి. అప్పటి దాకా అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సిందే. ప్రస్తుతం కేసుల వ్యాప్తిలో, మరణాల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లోనే కొత్తగా నమోదైన కేసులు 40వేలు దాటిపోయాయి.
Also read: మోదీపై సై అంటున్న దీదీ
మళ్ళీ విజృంభిస్తోంది మహమ్మారి
అయిదు వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. రికవరీ కంటే కొత్త కేసులు ఎక్కువగా నమోదవ్వడం ఆందోళన కలిగించే అంశం. దేశంలోని 46 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 10 శాతానికి పైగా ఉంది. కరోనా వైరస్ ను నిర్ధారించడంలో లక్షణాలను పసిగట్టడమే అత్యంత కీలకం. ఇది ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. వయసుతో పాటు స్త్రీ, పురుషులలో వేర్వేరుగా ప్రభావం చూపిస్తున్నట్లు బ్రిటన్ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. వీటిని గుర్తెరిగి చికిత్స చేపట్టాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. వేగంగా వ్యాప్తి చెందే లక్షణాలున్న కొత్త వేరియంట్లు వెలుగు చూస్తోన్న నేపథ్యంలో, కోవిడ్ మార్గదర్శకాలను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వలాది,సంబంధిత విభాగాలదే. డెల్టా వేరియంట్లను అదుపు చేయడం తక్షణ కర్తవ్యం. వైరస్ ఇలాగే రూపాంతరం చెందుతూ వెళ్తే మరిన్ని ప్రమాదకరమైన వేరియంట్లు పుట్టుకొస్తాయని హెచ్చరికలు వినపడుతున్నాయి. వ్యాక్సినేషన్,కోవిడ్ నిబంధనలను పాటించడమే దీనికి విరుగుడని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ పంపిణీలో జరుగుతోన్న అసమానతలు తొలగనంతకాలం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిందే.ఇంతవరకూ,ఒక్క వ్యాక్సిన్ కూడా అందని దేశాలు చాలా ఉన్నాయి. పేద, మధ్యతరగతి దేశాల పట్ల సంపన్న దేశాలు మానవత్వం చాటుకోవాల్సిన తరుణం ఇదే. ప్రపంచంలోని ప్రతి మనిషీ బాగుంటేనే, మనం బాగుంటామన్నది కరోనా వైరస్ నేర్పే గుణపాఠం.మిశ్రమ డోసులు కూడా సురక్షితమేనని చెబుతున్నారు. ప్రస్తుతానికి వ్యాక్సినేషనే మంత్రదండం. నిబంధనలను పాటించడమే రక్షణ కవచం.
Also read: కర్ణాటక తెరపై కొత్త ముఖం