రామాయణమ్ – 105
‘‘నాతో ఎదురుపడి యుద్ధము చేసియుంటివేని ఈ పాటికి నీవు యమధర్మరాజును కలుసుకుని యుండెడివాడవు. సుగ్రీవునకు ప్రియము చేయదలచి ఏ కార్యము కొరకై నన్ను చంపినావో ఆ కార్యము నిమిత్తము నన్నే నీవు ముందే ప్రేరేపించి వుండవచ్చునుకదా. నీ భార్యను అపహరించిన రావణుని చంపకుండా మెడకు తాడుకట్టి లాగుకొని వచ్చి నీ ముందు పడవేసి వుండెడి వాడను. అది పాతాళమయినా, లేక సముద్రగర్భమైనా ఎచట దాచినా నీ సీతను కనుగొని తీసుకొని వచ్చి నీకు భద్రముగా అప్పచెప్పేడివాడను.
Also read: మోదుగువృక్షంలాగా నేలవాలిన వాలి
‘‘నా మరణానంతరము సుగ్రీవుడు రాజ్యము చేపట్టుట ధర్మమే. కానీ ఈవిధముగా నన్ను నీవు చంపుట మాత్రము ధర్మము కాదు.
నీవు చేసిన పని ఎట్లు ధర్మమగునో చెప్పగలవా?’’ అని ప్రశ్నించిన వాలిని దరహాస వదనముతో చూచి రామచంద్రుడు ఇలా అన్నాడు:
‘‘వాలీ, లోకమర్యాదను, ధర్మమును, తెలుసుకోకుండా అజ్ఞానముతో నన్నేల నిందించెదవు? ఈ భూమి అంతా ఇక్ష్వాకులకు చెందినది. ఈ భూమిని ఇప్పుడు పాలించే రాజు భరతుడు. ఆ భరతుడి ప్రతినిధులము మేము. ధర్మము అవిచ్ఛిన్నముగా ఉండునటుల చూచుటయే మా కర్తవ్యము. ధర్మము అతిక్రమించిన వారిని శిక్షించుట కూడా మా కర్తవ్యములో భాగమే.
Also read: సుగ్రీవుడితో సంధి చేసుకోవాలంటూ వాలికి తార హితోక్తులు
నీవు రాజధర్మమును అనుసరించ లేదు. హీనమైన నింద్యమైన కర్మ చేసినావు.
కామభోగాలకే ప్రాధాన్య మిచ్చినావు. అన్నగారు, కన్నతండ్రి, విద్యనేర్పిన గురువు వీరు ముగ్గురూ తండ్రులని కదా శాస్త్రము చెప్పుచున్నది. తమ్ముడు, కుమారుడు, శిష్యుడు వీరు మువ్వురూ కుమారులే.
వాలీ, ధర్మము చాలా సూక్ష్మమైనది. నేను నిన్ను ఎందుకు చంపినాను అనికదా నీ ప్రశ్న. రుమ సుగ్రీవుని భార్య. సుగ్రీవుడు నీకు తమ్ముడు. అనగా కొడుకుతో సమానము. అనగా రుమ నీకు కోడలివంటిది. అట్టి రుమను కామించి చెరపట్టి భోగించి ధర్మమును అతిక్రమించినావు.
Also read: ఏడు సాల వృక్షములనూ ఒకే బాణముతో పడగొట్టిన రాముడు
ఏ మానవుడు కామమోహితుడై కుమార్తెను గానీ, సోదరిని కానీ
సోదరుడి భార్యను కానీ పొందునో అతనికి శిక్ష మరణదండనే.
……
రాజ్యము ,భార్యా నిమిత్తమై సుగ్రీవునితో నాకు ఏర్పడిన సఖ్యము వలన అతడు నాకు లక్ష్మణసమానుడు. అతని మంత్రులైన వానరుల సమక్షములో నిన్ను వధించి అతనిని రాజ్యాభిషిక్తుని గావింతునని ప్రతిజ్ఞ చేసితిని. ఒనర్చిన ప్రతిజ్ఞను నెరవేర్చకుండుట ఎట్లు? నీవే అంటివి కదా మేము శాఖామృగములము అని!
క్రూర మృగములను వేటాడునప్పుడు వలలు పన్ని, ఉచ్చులు బిగించి చెట్టుచాటునుండి రహస్యముగా వేటాడుట ధర్మమేకదా.నీవు శాఖా మృగము కావున నీతో యుద్ధము చేయకుండ బాణముచేత నిహతుని గావించితిని.
నీవు యుద్ధము చేసినను చేయకున్ననూ శాఖా మృగమువే! వానరుడవే.
Also read: సుగ్రీవునికి రాజ్యబహిష్కారం, వాలికి రాజ్యాధికారం
కావున ఆ విధముగా కొట్టినాను.’’
రాముని మాటలు విని, వాలి రాముడు చేసిన పని ధర్మబద్ధమే అని గ్రహించి ఆయనలో దోషమేమీ లేదని తెలుసుకొని ఆయనకు అంజలి ఘటించి, ‘‘రామా, నీవు చెప్పినదంతా సత్యము. సందేహము లేదు’’ అని పలికాడు.
‘‘రామా, నేను ధర్మము నుండి దూరమైనాను. నాకు ఏ చింతా లేదు. కానీ నా కుమారుడు అంగదుని గూర్చే విచారము. నేను కనపడక పోయినట్లయితే అంగదుడు పూర్తిగా నీళ్ళు త్రాగి వేసిన చెరువు వలే ఎండిపోవును. తారాపుత్రుడైన అంగదుడు నా ఏకైక కుమారుడు. అతని రక్షణబాధ్యత నీవు వహించవలెను.
రామా, తారను సుగ్రీవుడు అవమానించకుండా యుండు నటుల నీవు చూడుము.
భార్యా పుత్రుల విషయమై బాధపడుతున్న వాలిని చూసి శ్రీరాముడు, “ఓ వాలీ నీవు తార అంగదుల విషయములో దుఃఖించవలదు. ధర్మానుసారముగా ఏది జరుగవలెనో అది జరుగగలదు” అని అభయమిచ్చాడు.
Also read: వాలికీ, తనకూ మధ్య వైరం ఎట్లా వచ్చిందో వివరించిన సుగ్రీవుడు
వూటుకూరు జానకిరామారావు