అన్ని ఏకాదశి తిథులకు విశిష్టత ఉంది. అలాంటిదే హరిహరులకు ప్రీతిపాత్రమైన కార్తిక శుక్ల ఏకాదశి. తొలి ఏకాదశి (ఆషాఢ శుద్ధ ఏకాదశి) నాడు యోగనిద్రలోకి వెళ్లిన శ్రీమహావిష్ణువు తిరిగి ఈ రోజు మేల్కొంటాడని ఐతిహ్యం. కనుకనే దీనిని ఉత్థాన ఏకాదశి అని కూడా అంటారు. మానవులలోని అశాంతిని తొలగించి ప్రశాంతను చేకూరుస్తుంది కాబట్టి ప్రబోధ ఏకాదశి అనీ అంటారు. అనాది నుంచి మనిషి ఏదో ఒక విషయంలో అశాంతికి లోనవుతూనే ఉన్నాడని, అలాంటి వాటి నుంచి బయట పడవేసి చైతన్యవంతులను చేస్తుందని చెబుతారు. శ్రీమహావిష్ణువు యోగనిద్రకు ఉపక్రమించే ముందు లోకపాలన మహాకర్తవ్యాన్ని సోదరి నారాయణికి అప్పగిస్తాడని అంటారు. యోగులు, ఆధ్యాత్మిక పురుషులు ఈ నాలుగు నెలల పాటు దీక్ష చేపడతారు. దీనినే చాతుర్మాస్య దీక్ష అంటారు.
ఈ ఏకాదశి గురించి అనేక గాథలు ఉన్నాయి. ఒక కథనం ప్రకారం, శ్రీహరి యోగనిద్రలోకి వెళ్లిన సమయంలో దేవతలు బలహీనంగా ఉంటారని, వారికి దైవబలం ఉండదన్న భావనతో అసురులు విజృంభించారు. దాంతో దేవగణం వైకుంఠానికి వెళ్లగా, వారి దయనీయతను గమనించిన దేవదేవుడి దివ్యదేహం నుంచి యోగమాయకు ప్రతిరూపమైన శక్తి ఉద్భవించి అసుర సంతతిని తరిమికొట్టింది. యోగనిద్ర నుంచి లేచిన భగవానుడు ఆ శక్తికి ఏకాదశి అని నామకరణం చేశాడట. మురాసురుడు అనే రాక్షుసుడితో పోరాడిన విష్ణువు అలసిపోయాడని, ఆ సమయంలో ఆయన శరీరం నుంచి జన్మించిన కన్య పేరు ఏకాదశి అని కూడా చెబుతారు.
బ్రహ్మదేవుడు నారదుడికి వివరించినట్లు చెబుతున్న కథనం ప్రకారం, ఉత్థాన ఏకాదశి వ్రతం ఆచరించిన వారికి సకల సంతోషాలు కలుగుతాయి. ఆ రోజు ఉపవాస దీక్ష పాటించిన వారు ఏ ఒక్కరికి అన్నదానం చేసినా వెయ్యి అశ్వమేధ, వంద రాజసూయ యాగాల ఫలితం దక్కుతుందని, ఆ రాత్రి శ్రీమహాలక్ష్మీ సమేత శ్రీమహావిష్ణువు చిత్రపటం ముందు అఖండ దీపారాధన చేసి స్వామి నామస్మరణతో జాగరణకు కూడా అదే ఫలితం సిద్ధిస్తుందని చెబుతారు. ఈ వ్రతం ఆచరణకు అవకాశం లేనివారు హరిని మనసున నిలిపి తులసీ కోటను అర్చించి, ఏడు ప్రదక్షిణలు చేసినా సరిపోతుందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు. ఈ తిథినాడు మేల్కొన్న స్వామి మరునాడు, అంటే ద్వాదశి తిథినాడు శ్రీమహాక్ష్మిని స్వీకరించి, సర్వలోకాలకు మంగళం చేకూర్చారని ఫలశ్రుతి.