ఉత్తరాఖండ్ థౌలీగంగా నది వరద విపత్తు సంఘటన మానవ తప్పిదాలకు పెద్ద చెంపపెట్టు. ప్రకృతిని విస్మరించినందుకు, ప్రకృతి పట్ల సృహను కోల్పోయినందుకు, సహజవనరులైన నదీనదాల పట్ల మనిషి దుర్మార్గంగా ప్రవర్తించినందుకు ప్రకృతి చూపించిన ఆగ్రహం. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మాట్లాడుకోవడం తప్ప, గుణపాఠాలను నేర్చుకోవడం జరగడం లేదు. ఈ విపత్తు సుమారు 13గ్రామాలపై ప్రభావం చూపించింది. ఇదే అజాగ్రత్తను పాటిస్తే, ఎన్నో గ్రామాలు దెబ్బతినడమేకాక ఎంతో నష్టాన్ని చవి చూడాల్సి వస్తుంది.
దేవభూమిలో అనూహ్యమైన నష్టం, కష్టం
దేవభూమిలో ఊహించని నష్టం, కష్టం చుట్టుముట్టాయి. విపత్తు ప్రతిస్పందన కింద బడ్జెట్ లో కేటాయించిన నిధుల్లో కొంతమొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ప్రస్తుతం నీటి ఉధృతి కొంత తగ్గినా, భవిష్య విపత్తులను దృష్టిలో పెట్టుకొని, నిధిమొత్తం గణనీయంగా పెంచడంతో పాటు, రక్షణా చర్యలు చేపట్టాలి. హిమాలయ పర్వత ప్రాంతంలో ఎన్నో నదులు, ఉపనదులు ఉన్నాయి. ఇవన్నీ చాలా సున్నితమైనవి. మహా ప్రవాహశీలత కలిగినవి. భారత దేశ భౌగోళిక వాతావరణంలో ఉన్న జల వనరులు, పర్వతాలతో ఉత్పన్నమయ్యే ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని, అప్రమత్తంగా ఉండడమే కాక, శాశ్వతమైన రక్షణ చర్యలు చేపట్టడంతో పాటు, ఈ అనంత సంపదను దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేసుకుంటే, ప్రకృతి కరుణ ఎప్పుడూ ఈ భరతభూమిపై ఉంటుంది.
Also Read : ఉత్తరాఖండ్ లో ప్రకృతి ప్రకోపం
చలికాలంలో మంచుకరగడం ఏమిటి?
గ్లోబల్ వార్మింగ్ పట్ల జాగ్రత్తగా ఉండాలని శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో చెబుతున్నా, వాటిని పెడచెవిన పెట్టడమే ఈ అనర్ధాలకు మూలకారణం. హటాత్తుగా మంచు చెరియాలు విరిగి పడలేదు. అలా పడవు కూడా. దీని వెనకాల అనేక కారణాలు వున్నాయి. భూతాపం ఒక కారణమైతే, వాతావరణంలో చోటు చేసుకున్న పరిణామాలు మరో కారణంగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చలికాలం సాగుతుండగానే మంచు కరగడం అనే అసాధారణమైన అంశంపై ఇంకా విస్తృతంగా పరిశోధన జరగాల్సిన అవసరం ఉంది. మంచు పర్వతాలపై నిర్మాణాలు చేపట్టకూడదని భూగర్భ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. హిమనీనదాన్ని, అక్కడ వున్న సరస్సులను ఇంతకాలం గుర్తించకపోవడం మన వైఫల్యమే. ఇంకా అనేక సరస్సులు కూడా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. భూతాపం ప్రభావం హిమపాతానికి దారితీసింది. దీనివల్లనే మంచు కరిగే పరిస్థితి వచ్చిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
Also Read : తమిళనాడు ఎన్నికలపై శశికళ ప్రభావం ఉంటుందా?
పర్యవరణం సమతుల్యతకు అవరోధాలు
మంచు కరగడమే కాక, హిమాలయ ప్రాంతాల్లోని జలరాశి కూడా తగ్గుముఖం పట్టిందనీ, ఈ ప్రభావంతో నదీనదాలకు మూలమైన నీటిశాతం తగ్గితే, భావికాలంలో నీటి ఎద్దడిని పెద్దఎత్తున ఎదుర్కోవాల్సి వస్తుందని వాతావరణ శాస్త్రవేత్తలు జోస్యం చెబుతున్నారు. భవిష్యత్తు అవసరాల కోసం జల విద్యుత్ ప్రాజెక్టులు, మౌలిక వసతుల ప్రాజెక్టులు ఇక్కడ నిర్మించుకుంటున్నారు. ఉత్తరాఖండ్ లో 70కి పైగా ప్రాజెక్టులు ఉన్నట్లు తెలుస్తోంది. కాంక్రీటును పెద్దస్థాయిలో ఉపయోగించడం వల్ల పర్యావరణ సమతుల్యతకు అవరోధాలు ఏర్పడుతున్నాయనేది పచ్చి నిజం.
Also Read : ఉద్యమాలకు ఊతం ఇచ్చే నిర్ణయాలు
కొత్తప్రాజెక్టులు ప్రమాదకరం
ఇక్కడి హైడల్ ప్రాజెక్టుల వల్ల కలిగే నష్టాలను అంచనా వేయడానికి గతంలో ఒక కమిటీని కూడా వేశారు. కొత్త ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టకూడదని మారిటోరియం కూడా విధించారు. కోర్టుల్లో ఈ అంశం పెండింగ్ లో ఉండగానే, ఆ రాష్ట్రానికి ఉండే విద్యుత్ కొరత నేపథ్యంలో, కొత్త పవర్ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వం కోరడం విడ్డూరమని, నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అడవులు తగ్గిపోవడంతోటే పర్యావరణానికి ముప్పు ఆరంభమైంది. దానికి తోడైన వివిధ రూపాల కాలుష్యం మిగిలిన ప్రాంతాలతో పాటు, హిమాలయ ప్రాంతాల్లో భూతాపం పెరగడానికి కారణమైందని గుర్తించాలి. హానికరమైన వాయువుల వల్ల వేడి ఉత్పన్నమై, మంచు కొండలు కరిగి, జలవిలయం ఆరంభమైంది.
ముప్పు ఉప్పెనై కమ్ముకుంటోంది
మంచు కరగడం వల్ల సరస్సులోని నీటి మట్టం వేగంగా పెరుగుతుంది. దీని వల్ల దిగువ ప్రాంతాలకు నీరు ప్రవహిస్తుంది. దీని వల్ల ముప్పు ఉప్పెన వలె పొంగి తీవ్రస్థాయిలో నష్టాన్ని మిగిలిస్తుంది. ఉత్తరాఖండ్ లో తాజాగా సంభవించిన జలవిలయం వల్ల ఎందరో ప్రాణాలు కోల్పోయారు. మరెందరో గల్లంతయ్యారు. ఋషిగంగ ప్రాజెక్టు పూర్తిగా కొట్టుకుపోయింది. మరో ప్రాజెక్టు పూర్తిగా దెబ్బతింది. ఆఫ్ఘనిస్థాన్ నుంచి మయన్మార్ వరకూ ఎనిమిది దేశాల్లో, 3500కిలోమీటర్లు విస్తరించిన హిందూకుష్ హిమాలయాలు ఎవరెస్టు మొదలు ప్రపంచంలోనే అతిపెద్ద పర్వతాలుగా చరిత్ర విదితం.
Also Read : విజ్ఞాన విరాడ్రూపం వేటూరి ప్రభాకరశాస్త్రి
మంచురూపంలో మంచినీరు
భారీగా మంచినీరు మంచురూపంలో ఇక్కడే ఉన్నాయి. తాగునీరు, సాగునీరు, విద్యుత్ అవసరాల దృష్ట్యా కోట్లాదిమందికి ఇవి ప్రాణాధారం. ఒక నివేదిక ప్రకారం 2000 సంవత్సరం నుంచి హిమాలయ ప్రాంతంలోని హిమనీనదాలు 20-47శాతం తగ్గిపోయాయి. ఇదే పరిస్థితి కొనసాగితే, ఈ శతాబ్దం అంతమయ్యే సరికి 50శాతం హిమనీనదాలు కరిగిపోతాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, మనం ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి పెట్టాలి. అడవుల విస్తీర్ణం పెంచుకోవాలి.
ప్రకృతిని మనం రక్షిస్తే, మనలను ప్రకృతి రక్షిస్తుంది
హిమాలయ ప్రాంతాల్లో గృహ నిర్మాణాల కోసం కలప, రాతి కట్టడాలకు బదులు రీ ఇన్ఫోర్స్డ్ కాంక్రీటు వాడమని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఇటువంటి విపత్తులను ముందుగానే గుర్తించే హెచ్చరిక వ్యవస్థను ఏర్పాటుచేసుకోవాలి. శాస్త్రవేత్తలు,నిపుణులు చేస్తున్న హెచ్చరికలను, సూచనలను పాటించడంలో ప్రభుత్వాలది మొదటి పాత్ర. దేశ పౌరులకూ ఈ బాధ్యత వర్తిస్తుంది. ప్రకృతిని, సహజ వనరులను మనం రక్షించుకుంటే, అవి మనల్ని రక్షిస్తాయి.
Also Read : విశాఖ ఉక్కు ప్రజల హక్కు కాదా?