Tuesday, January 21, 2025

యూపీ బీజేపీకి ఊపిరి

  • రాష్ట్రపతి ఎన్నికలో గెలవాలంటే యూపీలో బీజేపీ ఘనవిజయం సాధించాలి
  • యూపీలో మెజారిటీ తగ్గినా, ఓడినా బీజేపీకి కష్టాలు తప్పవు
  • ప్రాంతీయ పార్టీలు జాతీయ రాజకీయాలను ప్రభావితం చేస్తాయా?

పార్లమెంటు మాజీ సభ్యుడు, రైతు నాయకుడు యలమంచిలి శివాజీ రచించిన ‘పల్లెకు పట్టాభిషేకం’ పుస్తకాన్ని పోయిన ఆదివారం ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు హైదరాబాద్ లో ఆవిష్కరించారు. రాష్ట్రపతి పదవి స్వీకరించిన తర్వాత పుస్తకావిష్కరణలు చేయకూడదని తనకు నాటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ చెప్పారనీ, అందుకే ఉపరాష్ట్రపతిగా ఉండగానే కె.ఆర్. నారాయణన్ చేత పుస్తకావిష్కరణ చేయించాననీ, ఇప్పుడు కూడా కాస్త ఆలస్యం చేస్తే వెంకయ్యనాయుడు కూడా రాష్ట్రపతి అయిపోతే తన పుస్తకాన్ని ఆవిష్కరించే అవకాశం ఉండదు కనుక కోవిద్ భయం ఉన్నా పుస్తకావిష్కరణ సభ నిర్వహించామనీ శివాజీ చెప్పారు. ఆ సభలో అందరూ కాబోయే రాష్ట్రపతి వెంకయ్యనాయుడేనని భావించారు. వెంకయ్యనాయుడే రాష్ట్రపతి కావాలని అభిలషించారు.

Also read: భయంగొలుపుతున్న పెగాసస్ నిఘా సాఫ్ట్ వేర్

ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు పదవీ కాలం వచ్చే సంవత్సరం వేసవికి అయిపోతుంది. కచ్చితంగా చెప్పాలంటే 25 జులై 2022కి పూర్తవుతుంది. ఇస్తే మరో అవకాశం ఆయనకు ఇవ్వవచ్చు. లేదా మరొకరికి ఇవ్వాలని అనుకోవచ్చు. ఆ మరొకరు వెంకయ్యనాయుడు కావచ్చు. కాకపోవనూవచ్చు. ‘అది హిమగిరి. మంచుగుట్ట. కరిగిన కరుగును. కరగకున్న కరుగదయును..‘అంటూ ‘దిండుకిద పోకచక్క’ పేరుతో పురాణవైర గ్రంథమాలలోని ఒక నవలను కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ ప్రారంభించినట్టు నేను కూడా రాస్తున్నానని అనుకోవద్దు. రామనాథ్ కోవింద్ గెలుపొందినప్పటి పరిస్థితులకీ, ఇప్పటి పరిస్థితులకూ చాలా వ్యత్యాసం ఉంది. బీజేపీ నాయకత్వంలోని నేషనల్ డెమొక్రాటిక్ అలయెన్స్ (ఎన్ డీఏ) బలం తగ్గింది. తెలుగుదేశం పార్టీ, శివసేన, అకాలీదళ్ పార్టీలు అధికార కూటమి నుంచి నిష్క్రమించాయి. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు 2018లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందే బీజేపీపైన తిరుగుబాటు చేశారు. దిల్లీ వెళ్ళి నాటి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మెడలో కాంగ్రెస్ కండువా వేశారు. ఆయన లెక తప్పింది. 2019లో ఇనుమడించిన మెజారిటీతో బీజేపీ గెలుస్తుందని చంద్రబాబునాయుడు ఊహించలేదు. శివసేనకు బీజేపీ పరిష్వంగంలో ఉక్కబోసి స్వేచ్ఛకోరుకొని బయటబడి రాజనీతిజ్ఞుడు శరద్ పవార్ చొరవతో కొత్త కూటమి ఏర్పాటు చేసుకొని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలతో కలసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నది. ఆ పార్టీ నాయకుడు ఉద్ధవ్ ఠాక్రే కోవిద్ రెండో తరంగం సమయంలో నిబ్బరంగా వ్యవహరించి పరిపాలనా దక్షుడని పేరు తెచ్చుకున్నారు. రైతుల ఆందోళనను మోదీజీ పట్టించుకోవడం లేదని అలిగి అకాలీదళ్ ఎన్ డీఏ నుంచి నిష్క్రమించింది. కనుక వచ్చే సంవత్సరం మధ్యలో జరగబోయే రాష్ట్రపతి ఎన్నికలలో గెలుపు ‘అవశ్యమనంగరాద’ని బీజేపీ అధిష్ఠానవర్గంలోని నాయకద్వయమైన నరేంద్రమోదీకీ, అమిత్ షాకీ బాగా తెలుసు.

Also read: కోవిద్ రిపోర్టింగ్ లో అగ్రగామిగా ఉండిన దైనిక్ భాస్కర్ పై ఐటీ దాడులు

బీజేపీ పని నల్లేరుమీద బండి కాదు

చాలా రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉంది కదా, దానికి గెలుపు నల్లేరుమీద బండి కావాలికదా అనుకుంటాం. రాష్ట్రపతి ఎన్నికలలో అనుసరించే పద్ధతి వేరుగా ఉంటుంది. అందులో ఎలక్టోరల్ కొలేజీ ఉంటుంది. ప్రతి ఓటుకూ ఒక విలువ ఉంటుంది. లోక్ సభ, రాజ్యసభ సభ్యుల ఓట్లకు ఒకేరకమైన విలువ ఉన్నప్పటికీ ఎంఎల్ఏల ఓట్ల విలువ రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఉత్తర ప్రదేశ్ కి చెందినా, మణిపూర్ కి చెందిన ఎంపీ ఓటు విలువ ఒకటే (708 కొలీజియం  ఓట్లు)రాష్ట్రాలలో ఓట్లకు విలువ ఆయా రాష్ట్రాల జనాభా మీద ఆధారపడి ఉంటుంది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎంఎల్ఏకు అత్యధిక విలువ ఉంటే మణిపూర్ కు చెందిన ఎంఎల్ఏకి (7 ఓట్లు) విలువ అతి తక్కువ ఉంటుంది. 2017లో జరిగిన ఎన్నికలలో రాజస్థాన్ లోనూ, చత్తీస్ గఢ్ లోనూ మధ్యప్రదేశ్ లోనూ, పంజాబ్ లోనూ బీజేపీ మెజారిటీ సీట్లు గెలవలేకపోయింది. ఫిరాయింపులు ప్రోత్సహించి కర్ణాటక,మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో అధికారం చేజిక్కించుకున్నది. రాజస్థాన్ లో అదే ప్రయత్నం చేసి దెబ్బతిన్నది.  ఆ తర్వాత పశ్చిమబెంగాల్ లో విజయం సాధించలేకపోయింది. కేరళలో తిరిగి సీపీఎం నాయకత్వంలోని వామపక్ష సంఘటన అధికారంలో కొనసాగుతోంది. తమిళనాడులో మిత్రపక్షమైన ఏఐఏడిఎంకె అధికారం కల్పోయింది. అమిత్రపక్షమైన డిఎంకె అధికారంలోకి వచ్చింది. కనుక 2017లో రాష్ట్రపతి ఎన్నికలు జరిగినప్పటికీ, ఇప్పటికీ రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో అయిదు రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా రాష్ట్రాలలో మొదటి రెండు రాష్ట్రాలు ప్రస్తుతానికి బీజేపీ పాలనలో ఉన్నాయి. గోవా, మణిపూర్ లలో బీజేపీ నాయకత్వంలోని సంకీర్ణ ప్రభుత్వాలు ఉన్నాయి. పంజాబ్ లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. పంజాబ్ లో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవు. కాంగ్రెస్ కొనసాగుతుందా లేక అకాలీదళ్ గెలుస్తుందా లేక ఆమ్ ఆద్మీ పార్టీ ‘మై హూ నా’ అంటుందా తెలియదు. తెలిసింది ఏమిటంటే బీజేపీ మాత్రం రాదు. ఉత్తరాఖండ్ లోనూ, యూపీలోనూ కోవిడ్ రెండో దెబ్బ కొట్టినప్పుడు బీజేపీ ప్రభుత్వాలు విఫలమైనాయన్నది జనవాక్యం. ప్రధాని నరేంద్రమోదీ మాత్రం ఇటీవల యూపీ దౌరాకి వెళ్ళి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కోవిద్ పైన భయంకరంగా, అద్భుతంగా పోరాటం చేశారని కాతాబు ఇచ్చారు. అది  సత్యం కాదని ప్రజలకు తెలుసు. మోదీకీ తెలుసు. కానీ అనివార్యం. యోగిని పొగడవలసిన రాజకీయ అవసరం మోదీకి ఉంది. ఎందుకంటే రేపు యూపీలో ఓడిపోకపోయినా, మెజారిటీ తగ్గినా బీజేపీకి రాష్ట్రపతి ఎన్నికలో కష్టాలు తప్పవు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం స్థానాలు 403 ఉంటే అందులో 306 స్థానాలు బీజేపీవే. మిత్రపక్షమైన అప్నాదళ్ కు 11 స్థానాలు ఉన్నాయి. మరీ ముమ్మరం. 2017 గాలిలో పోగుపడిన స్థానాలు ఇప్పుడు అయిదేళ్ళ యోగి ఆదిత్యనాథ్ ఠాకూర్ పాలన తర్వాత బీజేపీకి దక్కుతాయా అన్నది ప్రధానమైన ప్రశ్న.

Also read: కాంగ్రెస్ కి రాహుల్-ప్రియాంక సారథ్యం

మోదీలాగానే యోగీ

యోగిది మోదీ లాగానే బలమైన వ్యక్తిత్వం. ఒకరి సలహాలు పాటించే అవసరం లేదనే అభిప్రాయం కలిగినవాడు. అంతా తాను అనుకున్నట్టే జరగాలని భావించే ‘ప్రజాస్వామ్య నియంత.’ పార్టీ నాయకులతో కానీ పార్టీకి చెందిన శాసనసభ్యులతో కానీ సయోధ్య లేదు. వారిని కలుసుకోవడం, కుశలప్రశ్నలు అడగడం అలవాటు లేదు. అందుకే ఇటీవల దిల్లీకి పిలిపించుకొని యోగీని మోదీ మందలించారు. తనకు సన్నిహితుడైన ఒక బ్రాహ్మణ అధికారిని లక్నోకు పంపించి పార్టీ ఉపాధ్యక్షుడిగా నియమింపజేశారు. ముఖ్యమంత్రిపట్ల పార్టీలోనూ, ప్రజలలోనూ అసంతృప్తి తీవ్రంగా ఉంది. కోవిద్ కాలంలో ప్రధానమంత్రి నిర్వాకం కూడా అంతంత మాత్రమే కనుక ఆయనపట్ల కూడా ప్రజలు కినుక వహించారనే సమాచారం. ఇటువంటి పరిస్థితిలో మోదీని యోగీ పొగిడినా, యోగీని మోదీ ఆకాశానికెత్తినా ప్రజలు తమ అనుభవం ప్రకారమే ఓటు వేస్తారు. అయిదేళ్ళ కాలంలో యోగీ పరిపాలన ధర్మంగా, జనరంజకంగా ఉన్నదని ప్రజలు భావిస్తే మళ్ళీ మూడు వందల పైచిలుకు సీట్లు కట్టిబెట్టవచ్చు.ఎన్నికల ఫలితాలు అనేక అంశాలపైన ఆధారపడి ఉంటాయి. ప్రతిపక్ష పార్టీలు ఐకమత్యంగా పోరాడే అవకాశాలు తక్కువ. బీఎస్పీ, ఎస్పీలు 2019లో కలిసి పోటీ చేసినందుకు ఇప్పటి వరకూ చింతించివగచి వేసారుతున్నాయి. 2017లో కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకొని వంద సీట్లు కేటాయించినందుకు ఎస్ పీ యువనాయకుడు,మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ బాధపడని క్షణం లేదంటారు. ప్రియాంక మాత్రం పొత్తులకు సిద్దమేననీ, ఆ విషయంలో ‘ఓపెన్ మైండ్’తో ఉన్నామనీ అంటున్నారు. ఎదుటివారికి అంత ‘ఓపెన్ మైండ్’ ఉన్నట్టు లేదు. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాలని ఎవ్వరూ తహతహలాడటం లేదు. ఆ పార్టీ అక్కడ లేనట్టే లెక్క (నహీ కే బరాబర్) అంటున్నారు. ఇదంతా బీజేపీకి కలసి వచ్చే వాతావరణమే. అయితే అయిదేళ్ళ యోగి పాలనలో ముఖ్యమంత్రి పట్ల యాంటీ  ఇంకంబెన్సీ అని అభివర్ణించే వ్యతిరేక భావం ప్రజలలో నెలకొంటే మోదీ కూడా చేయగలిగింది ఏమీ లేదు. ఏది ఏమైనా 2017 నాటి ఫలితాలు వచ్చే ఎన్నికలలో కూడా వస్తాయని బీజేపీ నాయకులు కూడా నమ్మడం లేదు. ఎంత తగ్గుతాయన్నదే ప్రశ్న.

Also read: రేవంత్ బాటలోనే సిద్ధూ నియామకం

యూపీపైన ఎందుకింత చర్చ

అయిదు రాష్ట్రాలు ఎన్నికలకు పోతుంటే యూపీ పైనే ఎందుకింత చర్చ అని ఎవరైనా అడగవచ్చు. అయిదు రాష్ట్రాల ఎంఎల్ఏల నుంచి పడే కొలీజియం ఓట్లలో దాదాపు 81 శాతం యూపీ శాసనసభ నుంచే. అందుకే అంత ప్రాధాన్యం. రాష్ట్రపతి ఎన్నికలలో పడే కొలీజియం ఓట్ల మొత్తం 10,87,683 – ఎంపీలూ, ఎంఎల్ఏలూ కలిపి. ఇప్పుడు బీజేపీ, మిత్రపక్షాల చేతిలో ఉన్న కొలీజియం ఓట్ల సంఖ్య 5,43,063. అంటే మొత్తంలో 49.99 శాతం. అయిదు రాష్ట్రాల శాసనసభలకు వచ్చే సంవత్సరం ప్రథమార్ధంలో ఎన్నికలు జరిగిన తర్వాతనే రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతాయి. వచ్చే ఎన్నికలలో యూపీలో దెబ్బ తింటే, బీజేపీ బలం 306 నుంచి 206కి తగ్గితే, అతి పెద్ద రాష్ట్రంలో అధికారంలో కొనసాగవచ్చును కానీ ఎన్ డీఏ కోరుకున్న రాష్ట్రపతి అభ్యర్థి ఎన్నిక కావడం అసాధ్యం. వైఎస్ఆర్ సీపీ, టీఆర్ఎస్, ఒడిశాలోని బీజూ జనతాదళ్ సహాయం కోరుకోవాలి. అదీ సరిపోకపోతే అకాలీదళ్ ను బుజ్జగించాలి. ప్రాంతీయ పార్టీలు మద్దతు ఇస్తాయి. కానీ ఖర్చవుతుంది. డబ్బు రూపంలో కాకపోవచ్చు. మోదీ తమ మీద ఆధారపడి ఉన్నారన్న అభిప్రాయమే ప్రాంతీయ పార్టీల నేతల కోరికలను గుర్రాలుగా మార్చుతుంది. గొంతెమ్మకోరికలు కోరమని ప్రోత్సహిస్తుంది. దాని ప్రభావం 2024 సార్వత్రిక ఎన్నికలపైన పడుతుంది.  యూపీలో పరాజయం కనుక ఎదురైతే రాష్ట్రపతి ఎన్నికలలో అధికారపార్టీ అభ్యర్థి విజయానికి మోదీ, అమిత్ షాలు అహరహం శ్రమించవలసి వస్తుంది. అహాన్ని దిగమింగవలసి వస్తుంది.

Also read: నదీజలాల నిర్వహణ కేంద్రం చేతుల్లోకి

ఎన్ని రాష్ట్రాలు బీజేపీ చేతుల్లో ఉన్నాయన్నది కాదు ప్రశ్న. ఆయా రాష్ట్రాలలో ఎంఎల్ఏల ఓటు విలువ ఎంత అన్నది ప్రధానం. ఈ విలువ ఆయా రాష్ట్రాల జనాభాని బట్టి ఉంటుంది. 1971లో జరిగిన జనభా లెక్కలలో తేల్చిన అంకెలు ఆధారంగా ఓటు విలువ నిర్థారిస్తారు. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి 151 మంది ఎంఎల్ఏలూ, 26మంది లోక్ సభ, రాజ్యసభకు చెందిన ఎంపీలు ఉన్నారు. వైసీపీ ఎంఎల్ఏలు అందరికీ కలిపి 24,000 ఓట్లు ఉంటే ఎంపీలకు 19,834 ఓట్లు ఉంటాయి. అంటే మొత్తం కొలీజియం ఓట్లలో నాలుగు శాతం ఆంధ్రప్రదేశ్ లోని అధికారపార్టీ చేతుల్లో ఉంటుంది. అదే విధంగా తెలంగాణలో అధికారపార్టీ టీఆర్ఎస్ కు 103 మంది ఎంఎల్ఏలు, 15 మంది లోక్ సభ, రాజ్యసభ ఎంపీలూ ఉన్నారు. ఎంఎల్ఏలకు 13,596 ఓట్లూ, ఎంపీలకు 11,328 ఓట్లూ ఉన్నాయి. వివిధ రాష్ట్రాల శాసనసభలకు విభిన్నమైన విలువలు ఉన్నాయి. మహారాష్ట్ర ఎంఎల్ఏ ఓటు విలువ 175, తమిళనాడు, జార్ఖండ్ రాష్ట్రాలలో ఎంఎల్ఏ ఓటు విలువ 176, పశ్చిమబెంగాల్ ఎంఎల్ఏ ఓటు విలువ 151. ఈ లెక్కన ప్రతిపక్షాల చేతిలో ఉన్న రాష్ట్రాలలో ఎంఎల్ఏల ఓటు విలువ ఎక్కువ. ఉత్తరప్రదేశ్ ఒక్కటే మినహాయింపు.

Also read: ఎన్ఎస్సీఎస్ ద్వారా మెగాసస్ కు వందల కోట్లు చెల్లింపు: ప్రశాంత్ భూషణ్

బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి ఎవరు?

రేపు ఉత్తరప్రదేశ్ లో బీజేపీ మెజారిటీ తగ్గితే, ప్రాంతీయ పార్టీలతో బేరాలు కుదరకపోతే బీజీపీకి కష్టాలే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ బీజేపీకి సుముఖంగానే ఉంటారు. అన్ని బిల్లులపైనా బీజేపీకి అనుకూలంగానే ఓటు వేస్తూ వచ్చారు. రాష్ట్రపతి ఎన్నికలో ఎవరు అభ్యర్థి అనే విషయంలో ప్రాంతీయపార్టీ నాయకులకు పట్టింపు ఉండవచ్చు. ముఖ్యంగా వెంకయ్యనాయుడు అభ్యర్థిత్వాన్ని జగన్ మోహన్ రెడ్డి బలపరిచే అవకాశం ఉన్నదా? లేదనే కారణం చూపించి ఉపరాష్ట్రపతికి అవకాశం ఇవ్వకుండా మరో అభ్యర్థిని రంగంలోకి దింపుతారా లేక కోవింద్ కే మరో అవకాశం ఇస్తారా అన్నది ఆసక్తికరమైన అంశం. ఒక వేళ వెంకయ్యనాయుడిని రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ నాయకత్వం నిర్ణయించినట్లయితే ప్రతిపక్షాలన్నీసంఘటితమై టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుని రంగంలో దింపినా ఆశ్చర్యపోనక్కరలేదు. అప్పుడు వైసీపీతో పాటు టీఆర్ఎస్ ఓట్లు కూడా అధికారపక్షం అభ్యర్థికి దక్కవు. రాజకీయాలలో సమీకరణాలు ఎంత వేగంగా, ఎంత అనూహ్యంగా మారుతాయో చెప్పలేం. ఏదైనా సంభవమే. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నికలలో అధికారపార్టీ విజయం సాధించేందుకూ, బీజేపీ వరుసగా మూడో సారి లోక్ సభ ఎన్నికలలో గెలుపొందడానికీ ఉత్తరప్రదేశ్ విధానసభ ఎన్నికలలో విజయం బీజేపీకి అత్యవసరం. ఘనవిజయం  ఆ పార్టీకి అభిలషణీయం. అదే జరిగితే వెంకయ్యనాయుడు రాష్ట్రపతి కావాడానికి అవకాశాలు ఉంటాయి.

Also read: కాంగ్రెస్ లో చేరనున్న ఎన్నికల మాంత్రికుడు పీకే?

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles