Thursday, November 21, 2024

కాంగ్రెస్ ను వీడుతున్నట్టు పుకార్లపై ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖండన

కాంగ్రెస్ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడూ, పీసీసీ మాజీ అధ్యక్షుడూ ఉత్తమకుమార్ రెడ్డి శనివారంనాడు ఒక ప్రకటన జారీ చేశారు. తాను కాంగ్రెస్ నుంచి రాజీనామా చేస్తున్నట్టు వస్తున్న పుకార్లను నిర్ద్వంద్వంగా ఖండించారు. ఆయన ప్రకటన పూర్తి పాఠం ఇది:

‘‘నేను కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు మీడియాలో/సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమైనవి, ఎలాంటి ఆధారం లేకుండా దుష్ప్రచారం చేస్తున్నారు.

‘‘కాంగ్రెస్ పార్టీలో కీలకమైన పదవిలో ఉన్న ఓ నాయకుడు పార్టీలో నా స్థానాన్ని దిగజార్చేందుకు, ప్రజల్లో నా ప్రతిష్టను దిగజార్చేందుకు ఇలాంటి దుష్ప్రచారం చేయడం దురదృష్టకరం.

‘‘సోషల్ మీడియా/మీడియాలో వస్తున్న ఈ పుకార్లను నేను ఖండిస్తున్నాను. అవి పూర్తిగా అవాస్తవం. 1994 తర్వాత ఎన్నికల్లో ఓడిపోకుండా, 30 ఏళ్లు నిరంతరంగా కాంగ్రెస్ పార్టీకి విధేయతతో పనిచేసి, వరుసగా 6 ఎన్నికల్లో గెలుపొందినందుకు నేను గర్విస్తున్నాను. నా భార్య శ్రీమతి పద్మావతి రెడ్డి కోదాడ నుంచి ఎమ్మెల్యేగా ఉండి, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం వంద ఓట్ల తేడాతో ఓడిపోయారు. కోదాడలో ఉంటూ పీసీసీ ఉపాధ్యక్షురాలిగా కాంగ్రెస్ పార్టీ తరపున తన శక్తి మేరకు అక్కడి ప్రజల కోసం పనిచేస్తున్నారు. మాకు పిల్లలు లేరు, మేము ప్రజలే మా కుటుంబంగా మా పిల్లలుగా భావిస్తూ నిబద్ధతతో కూడిన ప్రజా జీవితంలో నిరంతరం పని చేస్తున్నాం. మేము గత 2 సంవత్సరాలుగా మాపై పూర్తిగా తప్పుడు మరియు పరువు నష్టం కలిగించే కథనాలు ప్రచారం చేస్తున్నారు. ఇవి చాలా బాధాకరమైనవి. కాంగ్రెస్ పార్టీలో అనుచరులను అణగదొక్కడానికి, తొలగించడమే లక్ష్యంగా కూడా ఈ ప్రచారం జరుగుతుంది. నేను పార్టీలో కొన్ని సమస్యలు/పరిణామాల పట్ల అసంతృప్తిగా ఉండవచ్చు, కానీ జాతీయ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యానికి సంబంధించిన విధి విధానాలను అనుసరిస్తాను. దాని గురించి ప్రెస్ లేదా బయటి ఫోరమ్‌తో మాట్లాడను. సూటిగా చెప్పాలంటే, నేను 5 పర్యాయాలు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో లేదా రాజ్‌భవన్ స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో లేదా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సమస్యపై శ్రీ పి చిదంబరం అధికారిక సర్వ సభ్య సమావేశంలో తప్ప ఇప్పటి వరకు సీఎం కేసీఆర్‌ను కలవలేదు,  మాట్లాడలేదు. నాకు ఎలాంటి వ్యాపారం, కాంట్రాక్టులు లేదా భూమి లావాదేవీలు లేవు. నా ప్రాణాలను పణంగా పెట్టి దేశ రక్షణలో పని చేసినందుకు గర్వపదుతున్నాను.  చైనా, పాకిస్థాన్ సరిహద్దుల్లో భారత వైమానిక దళంలో ఫైటర్ పైలట్‌గా పనిచేసిన తర్వాత, రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి వెంకటరామన్ మరియు ప్రెసిడెంట్ SD శర్మ గారి  వద్ద సీనియర్ అధికారిగా పనిచేశాను.  నేను కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రజా జీవితంలో ఉండేందుకు ప్రతిష్టాత్మకమైన ప్రభుత్వ ఉద్యోగానికి స్వచ్ఛందంగా రాజీనామా చేశాను. వరుసగా 6 సార్లు, 5 సార్లు ఎమ్మెల్యేగా, 6వ సారి ఎంపీగా ఎన్నికవడం నా అదృష్టం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పని చేశాను. స్వాతంత్ర్యం తర్వాత భారతదేశంలో ఎన్నడూ లేని విధంగా అతి పెద్ద గృహ నిర్మాణ కార్యక్రమాన్ని పర్యవేక్షించాను. మేము మా జీవితంలో  మా సంపద, మా ఆరోగ్యం, మా కుటుంబ జీవితం, మా జీవితంలోని ప్రతి దాన్ని కాంగ్రెస్ పార్టీ సేవలో, సాధారణ ప్రజల కోసం అందించాము. నాకు ఏ ప్రభుత్వంతోనూ వ్యాపారం, ఒప్పందాలు, భూ ఒప్పందాలు లేవని మరోసారి పునరుద్ఘాటిస్తున్నాను. ఒక  నాయకుడితో సన్నిహితంగా ఉన్న యూ ట్యూబ్ ఛానెల్‌లు, మీడియా సంస్థలు నా గురించి, నా సతీమణి గురించి తప్పుడు, పరువు నష్టం కలిగించే కథనాలను ప్రచురించడం మాకు తీవ్ర బాధను, వేదనను కలిగించాయి. కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరుతున్నారనే నిరాధారమైన, తప్పుడు కథనాలను ఖండిస్తున్నాం.’’

ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ

పద్మావతి రెడ్డి, మాజీ ఎమ్మెల్యే

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles