Thursday, November 21, 2024

లంచం నిరోధించడానికి ఆర్టీఐ ఉపయోగించండి

మాడభూషి శ్రీధర్

లంచం లేని సమాజాన్ని ఇప్పుడు సామాన్యుడు ఊహించలేడు. ప్రభుత్వ అధికారాలు చలాయించే వ్యక్తి, ఆ అధికారాన్ని వినియోగించేందుకు తన జీతం కన్న మించి ఏదీ అడగకూడదు. అడిగితే చట్టవ్యతిరేక ప్రతిఫలం అవుతుంది. దాన్నే లంచం అని మనం సామాన్య పరిభాషలో అంటున్నాం.  లంచం అడగడం నేరం. అడిగే ప్రయత్నం చేయడం కూడా నేరమే. లంచం ఇవ్వజూపడం లేదా ఇవ్వడం కూడా నేరాలే.  అధికారాన్ని విచక్షణ ను దుర్వినియోగం చేయడం అందుకు ప్రతిఫలం ఆశించడం కూడా ఈ నేరం కిందికి వస్తాయి.

ప్రభుత్వ అధికారం చేతిలో ఉన్న వ్యక్తి దాన్ని తన స్వార్థం కోసం వినియోగించాలనుకునే ప్రయివేటు వ్యక్తి అవినీతి నేరం కింద నిందితులవుతారు. ఇందులో ఒక వివాదం కూడా ఉంది. విధిలేక లంచం ఇవ్వవలసిన పరిస్థితిలో ఉన్న వ్యక్తిని నేరస్తుడనడం న్యాయం కాదు. కావాలని లంచం ఇవ్వడం వేరు. లంచం ఇస్తేనే పని చేస్తానన్నప్పుడు, ఆ పని తప్పనిసరి అవసరం అయినప్పుడు లంచం ఇస్తే నేరం కాకూడదు. కొంత లంచం ఇచ్చిన తరువాత పనిచేస్తానన్న ప్రభుత్వ అధికారి మరికొంత లంచం అడిగినపుడు అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదు చేయడం, వారు ప్రచ్ఛన్నంగా దాడిచేసి  రంగు పూసిన నోట్ల లంచంగా ప్రవేశ పెట్టడం, తీసుకుంటున్నదశలో పట్టుకోవడం మనం చూస్తున్నాం. అటువంటి కేసుల్లో ఫిర్యాదు చేసిన వ్యక్తిని లంచం ఇవ్వజూపిన నిందితుడుగా పరిగణించబోరు. తానే చేసిన ఫిర్యాదు ఆధారంగా ఆవ్యక్తిని క్రిమినల్ ప్రాసిక్యూషన్ కు గురి చేయడం ప్రాధమిక హక్కులకు విరుద్ధం. ఆర్టికిల్ 20(1) కింద ఫిర్యాది దరఖాస్తు ద్వారా అతడినే నేరస్తుడిని చేయడానికి వీల్లేదు.  బలవంతపు లంచం నేరం లేదా వత్తిడికి లోనై లంచం ఇవ్వడం నేరం కావడానికి వీల్లేదు.  ఇచ్చే వాడు తీసుకునే వాడు కలిసి చేసే లంచగొండితనం నేరమవుతుంది. ఇవి ప్రస్తుతం సూత్రాల రూపంలో ఉన్నాయి. కాని స్పష్టమైన నియమాల రూపంలో లేవు. అవినీతి నిరోధక చట్టాన్ని సవరించి ప్రజలకు తెలిసే రీతిలో బలవంతపు లంచం నేరం కాదని, ఇద్దరు కలిసి అంగీకారంతో చేసే లంచగొండితనం నేరమని వివరించాలని పరిపాలనా సంస్కరణల సంఘం 2007 లో సిఫార్సు చేసింది.  కాని ఈ సిఫార్సును అమలు చేసే తీరిక కేంద్ర ప్రభుత్వానికి ఇంతవరకూ లేకపోయింది.

ప్రయివేటీకరణ ఆరంభమైన తరువాత ప్రయివేటు కార్పొరేషన్లు వ్యక్తులు కూడా ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి అధికారాలే నిర్వహిస్తున్నారు కూడా. ప్రయివేటు కార్పొరేట్ లలో కూడా లంచం గొండితనం విచ్చల విడిగా ఉన్న మాట తెలిసిందే. కాని ప్రయివేటు అవినీతిని అరికట్టే చట్టాలే ఇంతవరకూ లేవు. కార్పొరేట్ అవినీతిని శిక్షించే శాసనాలు చేయవలసిన అవసరం ఉంది.

కాని మరొక కొత్త సమస్య వచ్చి పడింది. ఆర్టీఐ కింద దరఖాస్తు చేసిన పౌరుడికి ఒక ప్రభుత్వాధికారి పదివేల రూపాయల లంచం ఇవ్వజూపడం నేరమా కాదా అనే సవాల్ కేంద్ర సమాచార కమిషనర్ ముందుకు వచ్చింది. న్యూడిల్లీలో పాలం శాసనసభ నియోజకవర్గంలో ప్రభుత్వం వారు 32 స్వాగత ద్వారాల వంటివి లక్షల రూపాయల ఖర్చుతో నిర్మించారు. ఏ అవసరాలకు ఉపయోగపడకుండా వీటిని కట్టారని, ఇవన్నీ దురుపయోగమవుతున్నాయని ఎస్ కె సక్సేనా ఆర్టీఐ కింద సమాచారాన్ని కోరారు. ఒక్కో గేట్ కు 8 నుంచి పది లక్షల రూపాయల దాకా వెచ్చించారని, రోడ్డుకు అడ్డంగా ట్రాఫిక్ ను నిరోధిస్తూ ఈ గేట్లు పోస్టర్లు అంటించుకోవడానికి మాత్రమే వినియోగపడుతున్నాయని విమర్శించారు. కనీసం ముందు నిర్ణయించిన ప్లాన్ కు అనుగుణంగా వీటిని కట్టలేదని ఆయన విమర్శించారు. అసలు ఈ అంశం మీద  సమాచారం అడగకూడదని, అందుకు పదివేల రూపాయల లంచం ఇస్తామని ఒక అధికారి తనకు ప్రతిపాదించాడని సక్సేనా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. అతని మాటలను రికార్డు చేసిన సిడిని కూడా కమిషన్ కు సమర్పించారు. లంచం ఇవ్వ జూపిన అధికారిపైన విచారణ జరిపిచర్యతీసుకోవాలని కూడా డిమాండ్ చేశాడు. 

ప్రభుత్వ అధికారికి లంచం ఇవ్వడం నేరం, అతను తీసుకోవడం నేరం. కాని ప్రభుత్వాధికారి ప్రజలలో ఒకరికి లంచం ఇవ్వజూపడం అనేది ఇదివరకెన్నడూ చరిత్ర ఎరుగని సంఘటన. కేవలం సమాచార హక్కు చట్టం ద్వారా మాత్రమే సాధ్యమైంది. అయితే ఒక అధికారి ఇవ్వజూపినది లంచమైనా కాకపోయినా నేరం అయినా కాకపోయినా, అది ఖచ్చితంగా సమాచారం ఇవ్వకుండా నిరోధించే ప్రయత్నమే. సెక్షన్ 20 ఆర్టీఐ చట్టం కింద అందుకు జరిమానా విధించేవీలుంది.

సమాచారం కోరుతూ అభ్యర్థి చేసుకున్న రెండు ఫిర్యాదులపై తీసుకున్న చర్యలు ఏమిటో వివరించాలని కేంద్ర సమాచార కమిషన్ ఆదేశించింది. ఆర్టీఐ కింద ప్రశ్నలడగకుండా ఉండేందుకు లంచం ఇవ్వజూపడం ద్వారా సమాచారం అందకుండా అడ్డుకోవడం సెక్షన్ 20 కింద చట్టఉల్లంఘన అవుతుందని, అందుకు జరిమానా ఎందుకు విధించకూడదో కారణం వివరించాలని నోటీసుజారీ చేశారు. సమాచారం ఇవ్వకుండా వేధించినందుకు పదివేల రూపాయల నష్టపరిహారం కూడా చెల్లించాలని నజఫ్ గర్ సబ్ డివిజినల్ మెజిస్ట్రేట్ ను మాజీ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ హోదాలో ఈ రచయిత (మాడభూషి శ్రీధర్)నవంబర్ 2015న ఆదేశించారు.

మాడభూషి శ్రీధర్

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles