Sunday, December 22, 2024

బైడెన్ స్నేహ గీతిక

  • విదేశాంగ విధానంపై బైడెన్ తీవ్ర కసరత్తు
  • మిత్రదేశాలతో చెడిన సంబంధాల పునరుద్ధరణకు చర్యలు
  • చైనాను దీటుగా ఎదుర్కొంటామని ధీమా
  • రష్యాకు కఠిన వైఖరి అవలంబించనున్న బైడెన్

విదేశాంగ విధానంపై అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్ మొట్టమొదటిసారిగా నోరు విప్పారు. డోనాల్డ్ ట్రంప్ పరిపాలనలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తామని ప్రకటించారు.అన్నింటినీ రిపేర్ చేసి,రథ చక్రాలను పరుగులు పెట్టిస్తామని గురువారం నాడు జరిగిన విదేశాంగ శాఖ అధికారుల సమావేశంలో స్పష్టం చేశారు. ముఖ్యంగా,ట్రంప్ తీసుకున్న అనాలోచిత, ఆవేశపూరిత నిర్ణయాలన్నీ రద్దు చేసే పనిలో పడినట్లుగా తెలుస్తోంది. హెచ్ -1బి వీసాల ఎంపిక ప్రక్రియలో ట్రంప్ తీసుకొచ్చిన కొత్త నిబంధనలను బైడెన్ ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ ఏడాది డిసెంబర్ 31వరకూ పాత లాటరీ విధానాన్నే కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. అమెరికాలో పనిచేయడానికి వీలుగా, భారతీయులుతోపాటు ఇతర దేశాల ఉద్యోగ,నిపుణులకు కేటాయించే ఈ విధానంపై గత కొంతకాలంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో, విదేశాలతో సత్ సంబంధాలను పునఃప్రతిష్ఠ చేయడానికి బైడెన్ చేస్తున్న ప్రయత్నాల్లో వీసా విధానం ఒకటి. చైనా,రష్యాతో అమెరికాకు బోలెడు తలనొప్పులు ఉన్నాయి. ట్రంప్ చైనాకు దూరమవుతూ, రష్యాకు దగ్గరయ్యారు. బైడెన్ దీనికి విరుద్ధంగా వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. దానికి ఆయన మాట్లాడిన మాటలే బలాన్నిస్తున్నాయి.

Also Read: శైలారోహణ– అమండా గోర్‌మన్

చైనా నుంచి ఎదురవుతున్న సవాళ్ళను నేరుగా ఎదుర్కుంటామని చెబుతున్నారు. అదే సమయంలో, అమెరికాకు ప్రయోజనం చేకూరుతుందంటే… చైనాతో కలిసి పనిచేయడానికి కూడా వెనుకాడబోమని బైడెన్ చేసిన వ్యాఖ్యలను జాగ్రత్తగా గమనించాలి. బైడెన్ అధికారంలోకి వస్తే, మళ్ళీ చైనా-అమెరికా మధ్య బంధాలు కొనసాగుతాయానే మాటలు గతంలో అనేకసార్లు వినపడ్డాయి. నేటి బైడెన్ వ్యాఖ్యలు వాటిని రుజువు చేస్తున్నాయి.అయితే, ట్రంప్ పరిపాలనా కాలంలో అమెరికా ఆర్ధికంగా, ఆరోగ్యపరంగా, సామాజిక శాంతి పరంగా చాలా దెబ్బతింది. పెద్దన్న స్థానానికి బీటలు వారే పరిస్థితి వచ్చింది. అగ్రరాజ్య హోదా ప్రశ్నార్ధకమైంది.ఇండియా వంటి కొన్ని దేశాలతో తప్ప, చాలా దేశాలతో సంబంధాలు పెద్దగా మెరుగుపడలేదు. మెరుగుపడకపోగా దెబ్బతిన్నాయి. అదే సమయంలో, ట్రంప్ శ్వేత జాతీయవాదాన్ని బలంగా ప్రచారం చేశారు.నల్లజాతీయులతో పాటు మిగిలిన వారిపట్ల ఎంతో వివక్ష చూపించారు. వీటన్నిటినీ ప్రపంచ దేశాలు గమనించాయి. సొంత శ్వేత జాతీయుల అభిమానాన్ని కాపాడుకుంటూ, మిగిలిన మైనారిటీ ప్రజల మనోభావాలకు గౌరవిస్తూ, అమెరికా అగ్రాసనాధిపత్యాన్ని నిలబెట్టడం బైడెన్ పై ఉన్న కీలకమైన బాధ్యతలు. విదేశీ విధానంతో పాటు, స్వదేశీ విధానంలో కూడా చాలా మార్పులు తేవాల్సి వుంది.కరోనా వల్ల అమెరికాకు జరిగిన నష్టం సామాన్యమైంది కాదు. ఆర్ధిక వ్యవస్థ మొత్తం గాడి తప్పింది. సామాజిక సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ కోపంతోనే అక్షరాస్యులు, నిరక్షరాస్యులు, సంపన్నులు, పేదవారు ఏకమై ట్రంప్ ప్రభుత్వాన్ని గద్దె దింపారు. “కరోనా” చైనా సృష్టించిన జీవఆయుధంగా అమెరికాతో సహా చాలా దేశాలు భావించాయి. దేశ ప్రయోజనాల కోసం మళ్ళీ చైనాతో బంధాలు ఏర్పరుచుకున్నా, అవి శృతి మించితే, అటు స్వదేశీయులు, ఇటు విదేశీయుల దగ్గర జో బైడెన్ విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదం వుంది. వీటన్నిటిని గుర్తెరిగి బైడెన్ నడుచుకోవాలి.

Also Read: ఊపిరి పీల్చుకున్న అమెరికా

మరోవైపు భారత్ -చైనా మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మిత్ర దేశమైన భారత్ మనోభావాలను, కీలకమైన అంశాలను దృష్టిలో పెట్టుకొనే, బైడెన్ ముందుకు సాగుతారని విశ్వసిద్దాం. రష్యాతో ఢీకొట్టడానికే బైడెన్ సిద్ధమవుతున్నారు. అమెరికా ప్రజాస్వామ్య విధానానికి భంగం కలిగేలా రష్యా కుట్రలు పన్నిందని బైడెన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందని బైడెన్ ఆరోపిస్తున్నారు.రష్యా తమ దేశంలోని ప్రతిపక్షం పట్ల చూపిస్తున్న వైఖరిని ఆయన తప్పుపడుతున్నారు. ప్రత్యర్థులపై చేస్తున్న విష ప్రయోగాలు, సైబర్ దాడులను నిరసిస్తున్నారు. ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్సీని జైలుకు పంపడం, ఆయనకు మద్దతుగా జరుగుతున్న నిరసనలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపడంపై బైడెన్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. రష్యా విషయంలో డోనాల్డ్ ట్రంప్ మెతక వైఖరి అవలంబించారని, తాను కఠినంగా ఉంటూ, రష్యా దూకుడును తగ్గిస్తానని బైడెన్ చెబుతున్నారు.

చైనా, రష్యా సంబంధాల్లో ట్రంప్ కు పూర్తి భిన్నంగా బైడెన్ విధానాలు ఉంటాయని, ఈ వ్యాఖ్యలు చెబుతున్నాయి.మిత్ర దేశాలతో వచ్చిన విభేదాలను, స్నేహపూర్వకంగా పరిష్కరించుకోవాలనే ఆలోచనలో బైడెన్ ఉన్నారు. అణ్వాయుధాలతో ఉన్న ముప్పును, కరోనా కల్పించిన ఉమ్మడి సవాళ్ళను, వాతావరణంలో వచ్చిన పెనుమార్పులను ఎదుర్కోవడంలో అన్నిదేశాలతో కలిసి పనిచేయడానికి అమెరికా కొత్త ప్రభుత్వం సిద్ధమవ్వడం మంచి పరిణామమే.అధికారంలోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే,బైడెన్ చాలా మంది మిత్ర దేశాల అధినేతలతో మాట్లాడినట్లు తెలుస్తోంది.

యెమన్ లో జరుగుతున్న యుద్ధానికి అమెరికా మద్దతును ఉపసంహరించుకుంది. సౌదీ అరేబియాపై జరుగుతున్న దాడుల విషయంలో, ఆ దేశానికి అండగా నిలుస్తామని బైడెన్ ప్రభుత్వం ప్రకటించడం హర్షదాయకం.ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఆమెరికాకు మిత్రదేశాలైన ఇండియా, తైవాన్, సింగపూర్, ఫిలిప్పీన్స్, ఇండోనేసియా, దక్షిణ కొరియా, జపాన్ పట్ల చైనా ప్రదర్శిస్తున్న దుందుడుకు వైఖరిని సహించేది లేదని బైడెన్ ఖరాఖండిగా చెప్పారు. ఇది అభినందనీయం. మొత్తం మీద, బైడెన్ విదేశాంగ విధానం డోనాల్డ్ ట్రంప్ కు పూర్తి భిన్నంగా ఉండబోతోందని అర్ధమవుతోంది. అదే సమయంలో, మనం అటు రష్యా- ఇటు చైనాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. బైడెన్ కు భారత్ పట్ల ప్రత్యేకమైన ప్రేమ, గౌరవం, అవసరం ఉన్నప్పటికీ,అమెరికాతో మనం ఉండాల్సిన జాగ్రత్తలో మనం ఉండడం చాలా అవసరం, కీలకం.

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles