రాజకీయానికి ఇప్పుడొక కొత్త ఆయుధం దొరికింది. అమెరికా నుంచి గుజరాత్ వరకూ ఇదే ట్రెండ్. ఆస్పత్రిలో ఉన్నప్పుడు నేను వ్యాక్సిన్ తీసుకున్నానని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అధ్యక్ష ఎన్నికల డిబేట్‌లో ఆయన చేసిన ఈ ప్రకటన యావత్ప్రపంచ దృష్టినీ ఆకర్షించింది. శుక్రవారం నిర్వహించిన చివరి చర్చలో డోనాల్డ్ ట్రంప్ ప్రత్యర్థి జో బిడెన్‌పై ఆధిక్యాన్ని ప్రదర్శించడానికి సర్వశక్తులనూ ఒడ్డారు. వ్యాక్సిన్, పన్నులు, వాతావరణం అంశాలపై జరిగిన ఈ చర్చలో వారు పరస్పరం ఆరోపణలు గుప్పించుకున్నారు. భారత పక్షపాతిగా ముద్రపడ్డ డోనాల్డ్ ఆ ముద్రను చెరుపుకునేందుకు ప్రయత్నించినట్లు కనిపించింది.
భారత్‌లో వాయు కాలుష్యం ఎక్కువని చేసిన వ్యాఖ్య దీనికి ఉదాహరణ. వ్యాక్సిన్ సిద్ధమైపోయిందని ప్రకటించి, అమెరికన్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. ప్రపంచంలో కరోనా కారణంగా ఎక్కువ దెబ్బ తిన్న దేశం ఏదైనా ఉందంటే అది అమెరికానే అని చెప్పక తప్పదు. భారత్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ అభివృద్ధి చెందిన దేశమది. పెద్దన్నగా కీర్తినందుకున్న కంట్రీ నేతగా కంత్రీగా మాట్లాడడం చాలా విడ్డూరం. ట్రంప్ వదరుబోతుతనానికి నిదర్శనం. ఒకప్పుడు అమెరికా ఎన్నికలలో అధ్యక్ష అభ్యర్థుల మధ్య చర్చలు చాలా హుందాగా సాగేవి. కిందటి ఎన్నికల దగ్గర్నుంచి అవి పెడదారి పట్టాయి. హిల్లరీ క్లింటన్‌తో ట్రంప్ చర్చలలో కూడా అనూహ్యమైన పరిణామాలు కనిపించాయి. ఆ ఎన్నికల్లో భారత మీడియా ప్రో ట్రంప్ యాంటీ ట్రంప్‌గా చీలిపోయింది. అధ్యక్ష పదవికి ఎన్నికయ్యేది హల్లరీయేనని అప్పటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించడమే కాకుండా..అనుకూలంగా ప్రచారాన్ని కూడా చేపట్టేలా చేశారు. అమెరికా అంటే భారత్‌కు ముఖ్యంగా ఏపీకి ఎంత ఆసక్తి ఉందో దీనికి అద్దం పడుతోంది. ఇప్పుడు అలాంటి ట్రెండ్ లేదు.
భారత పర్యావరణంపై ట్రంప్ అనుచిత ప్రకటన పట్ల భారత్‌లో ముఖ్యంగా సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తున్నాయి. వ్యాక్సిన్‌తో మొదలుపెట్టి, భారత్‌లో పర్యావరణంపై విమర్శలు గుప్పించడం ద్వారా అమెరికన్ల మనస్సులను దోచుకోవడం మాట అలా ఉంచితే, ట్రంప్‌పై ప్రస్తుతం నెటిజన్లు కారాలు మిరియాలు నూరుతున్నారు. ఇది అమెరికాలోని భారతీయులపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశంపైనే ట్రంప్ గెలుపోటములు ఆధార పడ్డాయని చెప్పచ్చు. కిందటి ఎన్నికల్లో అమెరికన్స్ ఫస్ట్ అనే నినాదంతో హిల్లరీని గెలుపును గల్లంతు చేసిన ట్రంప్‌కు ఇప్పుడు వాతావరణం అంత సానుకూలంగా లేదు. దీనిని దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాల్సింది పోయి తెంపరితనానికి పోతున్నారు ట్రంప్.
స్వదేశంలో గెలుపునకు భారత్‌పై విమర్శలు గుప్పించడం తెంపరితనం కాక ఇంకేమిటి? అమెరికాలోని భారతీయ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాని మోడీ టైమ్స్ స్క్వేర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మాటలను ఆయన గమనంలో ఉంచుకుంటే బాగుండేది. భారత్ జనాభా ప్రపంచంలోనే రెండో అతి పెద్దది అయినప్పటికీ అమెరికా మాదిరి కరోనాకు లొంగిపోలేదు. కారణం భారతీయులకు ఉన్న రోగ నిరోధక శక్తి. అమెరికన్లలో లోపించింది ఇదే. భారత పర్యావరణమే భారతీయుల రోగ నిరోధక శక్తికి కారణం. అదే చాలా మటుకు కరోనా నుంచి కాపాడింది. ట్రంప్ అనవసరంగా నోరు జారారా…కావాలనే భారత పర్యావరణంపై వ్యాఖ్యానించారా? ఎన్నికల ఫలితం తేలుస్తుంది.
పిచ్చి వాడి చేతిలె రాయి.. ఎవరి మీద విసురుతాడో ఎవిరికీ తెలియదు.. దూకుడుతనం.. అసహనం.. తో ట్రంప్ ఏం సాధిస్తాడో..