కాబూల్ విమానాశ్రయంపైన ఉగ్రవాదులు దాడిచేసే ప్రమాదం ఉన్నదని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ హెచ్చరించారు. కాబూల్ విమానాశ్రయం నుంచి ప్రజలను సురక్షితంగా బయటకు చేరవేసే క్రమంలో కనిపిస్తున్న గుండెలను పిండివేసే ప్రక్రియను సాధ్యమైనంత వరకూ ఈ నెలాఖరులోగా పూర్తి చేస్తామని ఆదివారంనాడు విలేఖరులతో మాట్లాడుతూ బైడెన్ చెప్పారు. క్షేత్రంలో పూర్తిగా ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ రోజురోజుకూ అమెరికా సేనలు రక్షించే వారి సంఖ్య పెరుగుతోందనీ, తాలిబాన్ తో అంగీకారం కుదుర్చుకున్న విధంగా ఆగస్టు 31వ తేదీ కల్లా అమెరికా పౌరులనూ, సైనికులనూ, అఫ్ఘానిస్తాన్ విడిచిపెట్టాలని కోరుకునే మిత్రదేశాల పౌరులనూ సురక్షిత ప్రాంతాలకు తరలించే కార్యక్రమం పూర్తవుతుందనే ఆశాభావాన్ని వెలిబుచ్చారు. అఫ్ఘానిస్తాన్ నుంచి నిష్క్రమించడానికి గడువును పొడిగించే అవసరం ఉండకపోవచ్చునని అమెరికా అధ్యక్షుడు అన్నారు.
ఎక్కువ గడువు కోరాలంటూ విదేశీ నాయకులు అడగడం గురించి విలేఖరులు ప్రశ్నించగా, ‘‘ఏమి చేయగలమో చూద్దాం’’అంటూ ముక్తసరిగా సమాధానం చెప్పారు. ఆగస్టు 15న తాలిబాన్ అప్ఘానిస్తాన్ ను పూర్తిగా కైవసం చేసుకున్న తర్వాత అమెరికా దౌత్యవేత్తలూ, సైనికులూ కలిసి మొత్తం 30,300 ప్రజలను కాబూల్ విమానాశ్రయం నుంచి బయటికి రవాణా చేశారని అమెరికా అధ్యక్ష భవనం ప్రకటించింది.
అఫ్ఘాన్ పౌరులు తెగించి కాబూల్ విమానాశ్రయానికి వచ్చి ఎట్లాగైనా దేశం నుంచి బయటపడాలని ప్రయత్నిస్తున్న సందర్భంలో కనిపించిన ఉద్విగ్న దృశ్యాల గురించి ప్రశ్నించగా, ఇది వాస్తవమేననీ, వాస్తవాలను అంగీకరించక తప్పదని బైడెన్ అన్నారు. ‘‘ఇంతమందిని కాబూల్ విమానాశ్రయం నుంచి ఖాళీ చేసే క్రమంలో మీరు చూస్తున్న హృదయవిదారక దృశ్యాలు అనివార్యమైనవి’’ అంటూ వ్యాఖ్యానించారు. సైనిక విమానాలతో పాటు పౌర విమానసంస్థలు కూడా శరణార్థులను రక్షించే ప్రక్రియలో పాల్గొనాలని బైడెన్ ఆదేశించారు. కాబూల్ విమానాశ్రయం మాత్రం ఇంతవరకూ అమెరికా, నాటో సైనికుల అధీనంలోనే ఉన్నది. కాబూల్ నుంచి కతార్, బహ్రేన్, యునైటెడ్ అరబ్ ఎమరేట్స్ లో అమెరికా స్థావరాలకు ప్రయాణికులను చేర్చుతున్నారు. అక్కడి నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులలో ఎక్కడికి వెళ్ళాలనుకున్నవారు అక్కడికి వెడుతున్నారు. కాబూల్ విమానాశ్రయంలో అమెరికన్లకూ, ఇతర దేశాలవారికీ రక్షణ కల్పించడం కోసం వేలాది అమెరికా సైనికులు అదనంగా అక్కడికి చేరుకున్నారు. తాలిబాన్ కాబూల్ విమానాశ్రయం మినహా తక్కిన ప్రాంతాలలో అజయాయిషీ చెలాయిస్తున్నారు.
తాలిబాన్ దళాలు అమెరికాకూ, మిత్రదేశాలకూ, అష్రాఫ్ ఘనీ నాయకత్వంలోని అమెరికా మిత్ర ప్రభుత్వానికీ ఊహకు అందని విధంగా అత్యంత వేగంగా పదిహేను రోజులలోనే కాబూల్ దాకా వచ్చి మొత్తం దేశాన్ని ఆక్రమించుకున్నాయి. ఈ సంగతిని పరిగణనలోకి తీసుకోకుండా గడువుపెట్టుకొని, ఆ గడువు ప్రకారం సేనలను ఉపసంహరించుకుంటున్నందుకు బైడెన్ తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్నారు. మాజీ అధ్యక్షుడు ట్రంప్ తో పాటు బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ కూడా నిశితంగా విమర్శించారు.
ఇంకా 15,000 మంది అమెరికా సైనికులు అఫ్ఘానిస్తాన్ లో ఉన్నారు. మరి 50 వేలమంది అమెరికా పౌరులనూ, మిత్రదేశాల పౌరులనూ అఫ్ఘానిస్తాన్ నుంచి రక్షించవలసిన అవసరం ఉన్నదని బైడెన్ చెప్పారు. కాబూల్ విమానాశ్రయానికి చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నవారిని తాలిబాన్ ఆపి, కొడుతున్నారంటూ వార్తలు వెలువడ్డాయి. అమెరికా పాస్ పోర్టు ఉన్నవారిని తాలిబాన్ ప్రశ్నించడం లేదనీ, ఆపడం లేదనీ, వారిపైన చేయి చేసుకోవడం లేదనీ అమెరికా రక్షణ కార్యదర్శి లాయిడ్ ఆస్టిన్ తెలియజేశారు.
ఆదివారంనాడు కాబూల్ విమానాశ్రయంలో జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు మరణించారని బ్రిటన్ ప్రకటించింది. 1990-91లో గల్ప్ యుద్ధం సమయంలోనూ, 2002-2003 ఇరాక్ పైన దాడి చేసిన సమయంలో మాత్రమే అమెరికా పౌరవిమానసంస్థల విమానాలను రంగంలోకి దింపింది.