- ట్రంప్, బైడెన్ లలో ఎవరు గెలిస్తే భారత్ కు మేలు?
- ఇండియన్ అమెరికన్స్ డెమాక్రాట్లవైపు మొగ్గు చూపుతున్నారు ఎందుకని?
- చైనా, పాకిస్తాన్ లతో తలపడాలంటే అమెరికా మద్దతు అవసరం కాదా?
నవంబర్ 3వ తేదీన జరిగే అమెరికా ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ప్రపంచ దేశాల ఆసక్తి ఎలా ఉన్నా, భారతదేశానికి ఈ ఫలితాల పట్ల ఉత్కంఠ కాస్త ఎక్కువే. మనవాళ్ళు చాలామంది అక్కడ నివసిస్తున్నారు. ఉపాధి పొందుతున్నారు, ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్నారు. అమెరికాకు వెళ్ళటానికి ఎందరో భారతీయులు ఊవ్విళ్లూరు తుంటారు. ఆ ఆకర్షణ అటువంటిది. అది సగటు భారతీయుడి ఆలోచన. మన ప్రభుత్వపరంగా చూసినా అమెరికాతో సత్ సంబంధాలు కలిగి ఉండడం, ఆ బంధాలు మరింత పెంచుకోవడం చాలా అవసరం. దౌత్యపరంగానూ, వాణిజ్య పరంగానూ అమెరికా-భారత్ బంధాలు చాలా కీలకమైనవి. సోవియట్ యూనియన్ గా ఉన్నప్పుడు రష్యా-భారత్ బంధాలు చాలా బాగా ఉండేవి.
రష్యాతో బంధం బలహీనపడుతోంది
క్రమంగా రష్యాతో భారత్ బంధాలు తగ్గిపోతున్నాయి. చైనా అధ్యక్షుడుగా జిన్ పింగ్ వచ్చినప్పటి నుండీ మరింత తగ్గుముఖం పడుతున్నాయి. ప్రత్యక్షంగా రెండు దేశాల మధ్య ఎటువంటి విభేదాలు లేవు కానీ, జిన్ పింగ్ సృష్టిస్తున్నాడు. అయినప్పటికీ భారత్ రష్యాతో సంబంధాలను పోగొట్టుకోకుండా, మెరుగుపరుచుకోడానికి ప్రయత్నం చేస్తూనే ఉంది. ముఖ్యంగా రక్షణ వ్యవస్థకు సంబంధించిన ఆయుధాలు మొదలైన అంశాల్లో భారత్ ఇంకా రష్యాపై ఆధారపడుతూనే ఉంది. కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్ -వి విషయంలోనూ రెండు దేశాల మధ్య సుహృద్భావమైన అంగీకారమే ఉంది. ఇక, చైనాతో బంధాలు బాగా దెబ్బతింటున్నాయి. నివురుగప్పిన నిప్పులా ఉన్న ఈ వాతావరణం ఎప్పుడు భగ్గుమంటుందో చెప్పలేం. సామ్రాజ్యవాదం, ఆధిపత్య పోరు, ఆర్ధిక, వాణిజ్య ప్రయోజనాల్లో భాగంగా చైనా అటు అమెరికాతో పాటు, ఇటు భారత్ ను కూడా శతృదేశంగానే భావిస్తోంది. పైకి శాంతి మంత్రాలు వల్లించినా, లోపల మనల్ని నిర్వీర్యం చేసి, తనకు దాసోహం చేసుకోవాలనే దాహంలో చైనా ఉంది.
పాకిస్తాన్ ని రెచ్చగొడుతోంది చైనా
పాకిస్తాన్ ను మనపై మరింతగా రెచ్చగొడుతోందన్న విషయం బహిరంగ రహస్యమే. ఇప్పటికే భారత్ చాలావరకూ, చైనాతో వాణిజ్య బంధాలను తెంచుకుంది. డిజిటల్ వ్యవస్థ బహిష్కరణతోనే వాణిజ్య యుద్ధం ఆరంభమైంది. కొన్ని నిర్మాణాల ఒప్పందాలు కూడా రద్దు చేసుకుంది. ఈ పరిణామాలు ఎటు తీసుకువెళ్తాయో సమీప భవిష్యత్తులో తెలుస్తాయి. ఈ తరుణంలో, గతంలో కంటే ఇప్పుడే అమెరికాతో భారత్ కు అవసరాలు ఎక్కువగా ఉన్నాయి. చైనా, పాకిస్తాన్ లతో యుద్ధం సంభవిస్తే, అమెరికా సహకారం తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది.వాణిజ్య ఒప్పందాలు పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రపంచ మార్కెట్ కు భారత్ మరింతగా విస్తరించాలి. ఇలా, అమెరికాతో భారత్ బహుళార్ధక ప్రయోజనాలతో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఈ పరిణామాలన్నీ ఊహించే, పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో అమెరికాతో బంధాలు దృఢపరిచారు. నేడు నరేంద్రమోదీ కాలంలో అవి మరింత పటిష్ఠమయ్యాయి. జవహర్ లాల్ నెహ్రూ పాలించిన కాలానికి -ఇప్పటికీ ప్రపంచ దేశాల్లో ఊహాతీతమైన మార్పులు వచ్చాయి. ఆ మార్పులకు అనుగుణంగా అటు చైనాతో సంబంధాలు తెగిపోకుండా చూసుకుంటూ , ఇటు అమెరికాతో బంధాలను గట్టి పరుచుకుంటున్నాం.
అమెరికా, చైనా అగ్రరాజ్యాలు
ప్రస్తుతం ప్రపంచంలో అమెరికా, చైనా రెండూ అగ్రరాజ్యాలు. సమీప భవిష్యత్తులో ప్రపంచ దేశాలు కూడా రెండు కూటములుగా విడిపోయే పరిణామాలే కనిపిస్తున్నాయి. భారత్ ఎటువైపు పూర్తిగా మొగ్గుతుందనేది త్వరలో పూర్తిగా తేలిపోతుంది. ఈ అంశాన్ని అమెరికా, చైనా మనతో నెరపే సంబంధ బాంధవ్యాలే నిర్ణయిస్తాయి. ఇప్పటికే క్వాడ్ కూటమిలోని (క్వాడ్రి లేటరల్ సెక్యూరిటీ డైలాగ్) నాలుగు దేశాల్లో మనం ఉన్నాం. అమెరికా, జపాన్ ఆస్ట్రేలియా,ఇండియా ఇందులో ఉన్నాయి. ఈ నాలుగు దేశాలూ చైనా విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. బహుముఖ వ్యూహంతో ముందుకు వెళ్తున్నాయి. ప్రస్తుత అమెరికా ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ -జో బైడెన్ మధ్య జరుగుతున్న అధ్యక్ష ఎన్నికల పోరులో ఇండియన్ అమెరికన్లు ఎటువైపు ఎక్కువగా ఉంటారనే అంశంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ప్రధాని నరేంద్రమోదీ సంపూర్ణంగా, బహిరంగంగా డోనాల్డ్ ట్రంప్ ను సమర్థిస్తున్నారు.
హౌడీమోదీ ఎన్నికల ప్రచారమే
గతంలో “హౌడీ మోదీ” సమావేశంలో భారత అమెరికన్లను ఉద్దేశిస్తూ ట్రంప్, మోదీ ప్రసంగించారు. ఇది ఎన్నికల ప్రచారం కిందే వస్తుంది. ట్రంప్ ను భారత్ ఆహ్వానించి పెద్ద సభ ఏర్పాటుచేసి ట్రంప్ ను సంతుష్టుడ్ని చేశారు. ట్రంప్ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి. అమెరికాలో ఉండే భారతీయులు రిపబ్లికన్ పార్టీ కంటే, ఎక్కువ శాతం డెమోక్రాటిక్ పార్టీకే ఓటు వేస్తారనే ప్రచారం ఉంది. ఇది కేవలం ప్రచారం కాదు. వాస్తవం కూడా. గత ఎన్నికల గణాంకాలు కూడా అదే చెబుతున్నాయి. చరిత్రలో మొట్టమొదటగా డెమోక్రాటిక్ పార్టీ తరపున ఉపాధ్యక్ష అభ్యర్థిగా భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ రేసులో ఉన్నారు. ఈ ఎంపిక పట్ల భారతీయులందరూ హర్షించారు. అమెరికాలో ఇప్పటి వరకూ జరిగిన సర్వేల ప్రకారం భారత అమెరికన్లు జోబైడెన్ -కమలా హ్యారిస్ ద్వయం వైపే ఎక్కువ శాతం మొగ్గు చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది. అదే విధంగా, డోనాల్డ్ ట్రంప్ వైఖరి పట్ల కూడా మనవాళ్లు ఎక్కువమంది విసుగ్గానే ఉన్నారని సమాచారం. అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటున్నవారు ట్రంప్ తీరుపై కోపంగానే వున్నారు.
వీసాసై ట్రంప్ వైఖరి పట్ల రుసరుస
అమెరికాకు వెళ్లాలనే ఆశావహులకు కూడా ట్రంప్ అనుసరిస్తున్న విధానాలు తలనొప్పిగా మారాయి. హెచ్ -1బి వీసా మొదలైన అంశాల్లో భారతీయులు కోపంగానే ఉన్నారు. భారత్ పట్ల ట్రంప్ అప్పుడప్పుడు చేసే వ్యాఖ్యలు కూడా అగ్గికి ఆజ్యంపోసేవి లాగానే ఉంటున్నాయి. జోబైడెన్ మొదటి నుండీ భారత్ విషయంలో ప్రోత్సాహకరంగా ఉన్నాడు. తను అధికారంలోకి వస్తే, భారతీయులకు స్వేచ్చా వాతావరణం మరింత పెరుగుతుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. వాణిజ్య బంధాలు, ఒప్పందాలు చాలా కీలకం. వీటి విషయంలో బైడెన్ వైఖరి ఎలా ఉంటుందో స్పష్టంగా తెలియాల్సివుంది. అదే సమయంలో ఇటు చైనాతో -అటు రష్యాతో బైడెన్ ఎలా ప్రవర్తిస్తారన్నది చాలా ముఖ్యమైన అంశం. భారత్ కు ఇవి కీలకం. జోబైడెన్ చైనాతో బంధాలు పెంచుకుంటే? ఒక రకంగా మనకు మంచిది. మనం ఇటు అమెరికా -అటు చైనాతోనూ సంబంధాలు మెరుగుపరచుకోడానికి మరో వాకిలి ఉంటుంది.
మోదీపట్ల బైడెన్ వైఖరి ఎట్లా ఉంటుంది?
బహిరంగంగా ట్రంప్ ను సమర్ధించిన నరేంద్రమోదీ నాయకత్వంవైపు జోబైడెన్ ఎలా ఉంటారో కాలంలోనే తెలుస్తుంది. అమెరికా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేంత ఓటర్ల సంఖ్యాబలం భారతీయ అమెరికన్లకు లేకపోయినా, అమెరికా రాజకీయ క్షేత్రంలో మనవారి పాత్ర గణనీయమైందే. డొనేషన్లు ఇవ్వడంలోనూ, వైట్ హౌస్ లోనూ మనవాళ్ళ స్థానం ప్రధాన స్రవంతిలోనే ఉంది. ఒబామా బృందంలో భారతీయులు ఎక్కువమంది ఉండేవారు. ట్రంప్ బృందంలో తక్కువగానే ఉన్నారు. రేపు జోబైడెన్ గెలిస్తే, ఆయన బృందంలో మనవాళ్ళ సంఖ్య గతంలో కంటే కూడా ఎక్కువగా ఉండవచ్చని కొందరు అంచనా వేస్తున్నారు.ట్రంప్ గెలిచినా, జోబైడెన్ గెలిచినా, అమెరికా-భారత్ బంధాలు దృఢంగానే వుంటాయని విశ్వసించవచ్చు.ఉండాలని అభిలషిద్దాం.అది మనకు అన్నిరకాలుగానూ ఎంతో అవసరం.
నెక్స్ట్ ప్రెసిడెంట్ ట్రంప్