Sunday, December 22, 2024

బంధన ఛేదిత – ఊర్వశి

Fugitive

By Rabindranath Tagore

English translation by Kumud Biswas (Google)

తెలుగు సేత: సి.బి. చంద్రమోహన్

ఓ  సౌందర్య రాశీ!

ఊర్వశీ!

సురలోకవాసీ!

నీవు తల్లివీ కావు

తనూజవూ కావు

ఆవనిలో సామాన్య గృహిణివీ కావు!

పచ్చని మైదానాలపై

జలతారు ముసుగు కప్పుతూ

సాయంసంధ్య కమ్ముకుంటే –

ఇంటిమూల ఒక దివ్వె

నైనా వెలిగించవు!

వణికే గుండెలతో

బెదిరే కళ్ళతో (భీతనయనాలతో)

సిగ్గుతో తడబడే నడకతో,

ప్రథమ సమాగమానికి

విభుని చెంతకు చేరే

మామూలు పడతివి కావు నీవు!

అరుణ కిరణంలా

అడ్డుతెరలు ఆపలేవు నిన్ను!

సిగ్గు, సంకోచాలు

బహుదూరం నీకు!

పరిపూర్ణ వికసితా!

తొడిమలేని పువ్వా

నీకు నువ్వే ఎప్పుడు విచ్చుకొన్నావో చెప్పవా!

దక్షిణ హస్తంలో మధుభాండం

వామహస్తంలో విషకుంభం

తో

ఆడి వసంతంలో

సాగరమథనంలో

ఉవ్వెత్తున పైకి లేచావు!

సముద్రపుటలలు నాట్యమాడే

నాగకన్యల్లా ఉన్నాయా!

వేలాది పడగల్ని నీ పాదాక్రాంతుల్ని చేశాయా!!

అకళంక ధవళ పుష్పంలా

మెరిసే

నీ అనాచ్ఛాదిత మోహన రూపానికి

ఆ దేవదేవుడు ఇంద్రదేవుడే

విధేయుడైనాడా!

హారతి పట్టాడా!!

విచ్చుకోని మొగ్గలా

నీవు ఎప్పుడూ పసిదానివి కావు

ఓ ఊర్వశీ!

ఏ నాటికీ నీవు యవ్వనవతివే!

నీ బాల్యాన్ని ఎక్కడ గడిపావు ఊర్వశీ!?

ముత్యాలు, రతనాలతో

ఆటలాడుకుంటూ

పగడాల పరుపులపై

శయనిస్తూ

ఏ తెలియని సాగర అగాథాల్లో

సేద తీరావో!

ఉద్భవించిన క్షణాన్నే

సంపూర్ణ యవ్వనవతివై

వికసించావు కదా!

ఓహో ఊర్వశీ!

అనురాగరాశీ!

అనాదిగా

ఈ విశ్వానికి

కాంక్షాధిదేవతవు నీవే!

ఓహో ప్రేయసీ! ఓ ఊర్వశీ

సురలోకవాసీ!

నీకు నీవే సాటి!

మహారుషులు తమ సంపూర్ణ తపోఫలాన్ని

నీ పాదలకర్పించారు

ప్రేరేపించే నీ దృక్కులతో

లోకమంతా

యవ్వనశక్తితో

చేతన సంతరించుకొంటుంది!

తేనె నాస్వాదించి మత్తెక్కి ఉన్న

మథుపాల్లా

పవనదూతలు మైమరపించే

నీ దేహసుగంధాన్ని

వెదజల్లుతాయి!

కవులు

ఉత్సాహపూరిత గీతాల్ని

గానం చేస్తారు!

నీ పాదాల

మంజీర నాదాలతో

వారి నుండి

మెల్లగా మెత్తగా

కదలిపోతావు

ఒక మెరుపులా!!

అద్భుత చరణాల ఊర్వశీ!

దివి

దర్బారులో

అపర పారవశ్యంగా

నువ్వు నాట్యమాడితే

సాగరాలు అలలతో

సహనాట్యమాడుతాయి!

ఊయలలూగే

పంటచేలతో

పుడమి పులకరిస్తుంది

నీ నృత్యభంగిమలకు

కంఠహారపు రతనాలు

వక్షోజాలనుంచి రాలిపడినట్లు

ఆకసాన

నక్షత్రాలు కురుస్తాయి!

నాట్యలీనవై నువ్వు వస్త్రరహితవైతే

భూమ్యాకాశాలను

కలిపే గీతలు

నగ్నంగా పరుచుకొంటాయి!

స్వర్గానికి తూరుపు కొండల్లో

అరుణోదయం చూస్తే

ఆశ్చర్యానుభూతి కలిగినట్లు

నిన్ను చూసి లోకం అవాక్కవుతుందిగా!

లోకపు బాష్పాంజలులతో

నీ నాజూకైన సుందరదేహం

అభిషేకింపబడుతుంది

ఓ నగ్న సుందరీ!

ఈ లోకం నీ పాదాలకు

రక్తాభిషేకం చేస్తుంది!

ఈ అవనిమోహం కమలమైతే

నీ చరణాలు సుతిమెత్తగా

దానిపై నుంచుతావు

ఈ విశ్వపు మదిలో

నువ్వే కలల రాణివి!

నీకోసం లోకమంతా విలపిస్తోంది!

వింటున్నావా

ఊర్వశీ!

నీవు బధిరురాలివి

కఠినాత్మురాలివి కాదు గదా!

నీవు ఆవిర్భవించిన రోజు

మళ్ళీ తిరిగి వస్తుందా!

సాగర అగాధాల నుండి

ఒక శుభోదయాన

నీ వినూత్న రూపాన్ని –

దర్శిస్తే

కామదృక్కులతో

చూసే

మా కళ్ళతో

నీ దేహమంతా

తూట్లుపడి

రోదిస్తుంది

విరుచుకుపడే అలలతో

కల్లోలసాగరాలు

నిన్ను కీర్తిస్తూ

గానం చేస్తాయా?!

లేదు ఊర్వశీ లేదు

ఆ రోజు మరలా తిరిగి రాదు!

అస్తమించే

భానుడిలా

నువ్వు శాశ్వతంగా దూరమయ్యావు!

వసంత కాలపు

ఆనంద క్షణాలు కూడా

నీ శాశ్వత ఎడబాటుతో

నిట్టూర్పులౌతాయి!

పౌర్ణమి రోజున

సంతుష్ట సమయాల్లో కూడ

ఎప్పుడో మరచిన సంగతులు

మదిలో జ్ఞాపకాల

పొంగులై

ఒక వషాదగీతాన్ని

ఆలపించి

మా  మనసులు కలచి వేస్తాయి!

కానీ

ఎక్కడో

మనసులో ఓ మూల

ఒక నిరాధారమైన ఆశ –

మా విషాదంలో

మా తీవ్రకాంక్షలో

బంధాలు ఛేదించిన

నీకోసం –

మిగిలిపోతుంది.

(కవి ప్రేమించి అనువదించిన టాగూర్ గీతం)

Rabindranath Tagore
Dr. C. B. Chandra Mohan
Dr. C. B. Chandra Mohan
మనుషుల్నీ, జీవితాల్నీ, సాహిత్యాన్నీ ప్రేమించేవాళ్ళు మంచి రచయితలు కాగలుగుతారు. ఇన్నిమంచి లక్షణాలూ పుష్కలంగా ఉన్న అరుదైన రచయిత డాక్టర్ సీబీ చంద్రమోహన్. మొబైల్ 9440108149

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles