అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న అయిదు రాష్ట్రాల ఫలితాలు మనకు మార్చి 10 కల్లా తెలుస్తాయి. నేను నవంబర్ లో పంజాబ్ లో పర్యటించిన తర్వాత అక్కడ ఎన్నికల వాతావరణం ఎట్లా ఉన్నదో మీకు వివరించాను. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ కూడా డిసెంబర్ లో వెళ్ళాలని అనుకున్నాను. కానీ కోవిడ్ కేసులు పెరగడం, అది ఎటువంటి రూపం, మార్గం తీసుకుంటుందనే విషయంలో స్పష్టత లేకపోవడం కారణంగా నేను ఆ ప్రయాణం మానుకున్నాను. అయితే, ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాలలో పరిస్థితులను నేను చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉన్నాను. వార్తలు చదవడంతో పాటు ఆ రాష్ట్రాలలో చాలాకాలంగా రాజకీయాలను పరిశీలిస్తున్నవారితో మాట్లాడాను. ఉత్తరప్రదేశ్ లో ఎన్నికల రంగం ఏ విధంగా ఉన్నదనే విషయం మీతో ఈ రోజు పంచుకోదలచాను.
ఇండియాలో ఉత్తరప్రదేశ్ చాలా ఆధిక్యం కలిగిన భౌగోళిక ప్రాంతం. అంకెలను గుర్తు చేసుకుంటే విషయం స్పష్టంగా అర్థం అవుతుంది, అక్కడి ప్రజల రాజకీయ నిర్ణయం ఎంత మహత్తరమైన ప్రాముఖ్యం గలదో తెలుస్తుంది. కొండప్రాంతాలను విభజించి కొత్తగా ఉత్తరాఖండ్ ను ఏర్పాటు చేసిన తర్వాత సైతం కేవలం అంకెల కారణంగానైనా ఉత్తర ప్రదేశ్ తన అగ్రతాంబూలం నిలుపుకుంటుంది. లోక్ సభలో మొత్తం ఉన్న 543 మంది ఎంపీలలో 80 మందిని ఆ రాష్ట్రం పంపుతుంది. అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు కలిసి ఎంతమందిని పంపుతాయో అంతమంది ఎంపీలను ఉత్తర ప్రదేశ్ ఒక్కటే పంపుతుంది. లేదా తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలు కలిసి పంపించే సభ్యుల కంటే ఏడుగురు మాత్రం తక్కువ. రాజ్యసభలో మొత్తం 245 మంది సభ్యులుంటే వారిలో 31 మంది యూపీ పంపేవారే. అంటే కేరళ, కర్ణాటక, తెలంగాణ కలిసి పంపించే రాజ్యసభ సభ్యులకంటే ముగ్గురే అదనం. లేదా ఏపీ, తెలంగాణ, కర్ణాటక కలిసి ఎగువసభకు పంపే సభ్యుల సంఖ్య కంటే ఒక్కటే ఎక్కువ. వచ్చేనెల పోలింగ్ జరగనున్న అయిదు రాష్ట్రాలూ కలిపి లోక్ సభకు 102 మందిని పంపుతాయి. వీటిలో యూపీ పంపించేవారి సంఖ్య 80.
Also read: రైతులు, ఆర్థికప్రవీణులూ, ప్రజాస్వామ్యం
బీజేపీకి మూడు వరుస విజయాలు
ఎన్నికలు జరగబోయే అసెంబ్లీ సీట్ల విషయం పరిశీలిద్దాం. అయిదు రాష్ట్రాలలో కలిపి మొత్తం 690 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. తక్కిన నాలుగు రాష్ట్రాలలోని అసెంబ్లీ సీట్లు కలిపితే వచ్చే మొత్తం కంటే ఒక్క యూపీలోనే116 సీట్లు అధికం. ప్రజాస్వామ్య తక్కెడలో యూపీ బరువు ఎంత ముఖ్యమైనదో మీకు గుర్తు చేయడానికే ఈ అంకెలు చెప్పాను. ఆ రాష్ట్రం విలుల అంకెలలో ఉంది. రాబోయే జులైలో రాష్ట్రపతి ఎన్నిక జరగవలసి ఉన్నదనే విషయం గమనిస్తే ఉత్తర ప్రదేశ్ లో ఎన్నికల ఫలితాల ప్రాముఖ్యం అవగతం అవుతుంది. ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్నపార్టీ రెండోసారి అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిన సందర్భం గత రెండున్నర దశాబ్దాలలో లేదు. బీజేపీ గెలవాలంటే ఈ ధోరణిని తప్పించుకునే కష్టతరమైన ఘనకార్యం సాధించాలి. అయితే, అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల ఫలితాలను మరో దృక్కోణం నుంచి పోల్చి చూస్తే ఆ ధోరణిని బీజేపీ ఇప్పటికే తప్పించుకున్నదని చెప్పుకోవాలి. 2014 లోక్ సభ ఎన్నికలలోనూ, 2017 అసెంబ్లీ ఎన్నికలలోనూ, 2019 లోక్ సభ ఎన్నికలలోనూ వరుసగా ఘనవిజయాలు సాధించింది. బీజేపీకి రాజకీయంగా శక్తి ఉడిగిపోయిందనీ, మత, సాంస్కృతిక రాజకీయాలు పరిమితికి చేరుకున్నాయనీ చాలా మంది అనువజ్ఞులైన రాజకీయ పరిశీలకులూ, పండితులూ 2014 లోక్ సభ ఎన్నికల ముందు తీర్మానించారు. కానీ ఆ అంచనా తప్పని తేలిపోయింది. బీజీపీ ఆధిపత్యం నిరవధికంగా కొనసాగడానికి దోహదం చేసే రాజకీయ పరిణామాలు 2012 అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి యూపీలో ఏమి జరిగాయో అర్థం చేసుకోవడం ముఖ్యం. ప్రస్తుత ఎన్నికలలో పార్టీ ఎదుర్కొంటున్న సవాల్ బలం ఎంతో, లోతు ఎంతో తెలుసుకోవడానికి ఈ అధ్యయనం అవసరం.
Also read: నవభారతం: మతి పోకుండా ఉండటం ఎట్లా?
మతవాద వేదిక
ప్రస్తుత ఎన్నికలలో బీజేపీ ప్రధానంగా మతపరమైన వాదాలకే వేదికగా ఉంది. ఇందులో రహస్యం కానీ దాపరికం కానీ ఏమీ లేదు. 2014లో పరిస్థితి ఇందుకు భిన్నం. బహిరంగంగా మతపరమైన హిందూ ఎజెండాను భుజానికి ఎత్తుకోవడానికి పార్టీ అప్పట్లో సంకోచించింది. హిందువులూ, ముస్లింలూ పరస్పరం శత్రువులు కారనీ, వారు సమష్టిగా పేదరికం, నిరుద్యోగం అనే ఉమ్మడి శత్రువులను ఎదుర్కొంటున్నారనీ నాటి బీజేపీ ప్రధాని అభ్యర్థి అభిభాషించారు. ఈ శత్రువులను ఎదిరించి పోరాటడానికి వారు ఐకమత్యంగా ఉండాలని కోరారు. క్షేత్రంలో మాత్రం మతపరమైన ప్రచారం అంతర్లీనంగా సాగింది. లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలలో ఒక్క ముస్లిం అభ్యర్ధిని సైతం పార్టీ తరఫున పోటీ పెట్టకపోవడం ఓటర్లకు పార్టీ తన మతపరమైన ఉద్దేశాన్ని సూచన ప్రాయంగా స్పష్టం చేసినట్లే అయింది. నసుగుతూ మతం గురించి మాట్లాడే వేదిక క్రమంగా బహిరంగంగా అవధులు లేని, శషభిషలు లేని, సమాజాన్ని విభజించే హిందూత్వ అజెండాను నెత్తికెత్తుకున్న పార్టీగా క్రమంగా అవతరించింది. ముఖ్యమంత్రి, ఆ రాష్ట్రంలో ఆ పార్టీ పతక సదృశమైన వ్యక్తి ‘అబ్బాజాన్’ అంటూ వ్యాఖ్యానం చేయడం, జనాబా నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వ చట్టం చేయడం, ఉపా (యూఏపీఏ) చట్టం కింద దేశద్రోహం ఆరోపణలతో కేసులు పెట్టడం, ఉద్యమించిన రైతులను ఉగ్రవాదులనీ, దేశద్రోహులనీ తూలనాడటం, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సీఏఏ-ఎన్ఆర్ సీ (సిటిజన్ షిప్ అమెండ్ మెంట్ యాక్ట్, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్) అజెండా, అయోధ్యలో రామమందిరానికి ప్రదానమంత్రి శంకుస్థాపన చేయడం, కాశీవిశ్వనాథ్ నడవా ప్రారంభోత్సవం నేత్రపర్వంగా జరగడం, ఔరంగజేబునూ, శివాజీని ప్రస్తావిస్తూ ఆ సందర్భంగా రాజకీయ లక్ష్యంతో ప్రధాని ప్రసంగించడం, పొరుగున ఉన్న ఉత్తరాఖండ్ లో కేదార్ నాథ్ ఆలయాన్ని ప్రచారార్భటి మధ్య ప్రధాని సందర్శించడం, మథురలో కూడా దేవాలయ నిర్మాణం జరగాలంటూ పిలుపు ఇవ్వడం – ఇవన్నీ కూడా పార్టీ వెనక హిందువులు సంఘటితమై నిలవాలన్న తలంపుతో జాగ్రత్తగా, ప్రణాళికాబద్ధంగా ఆలోచించి చేసిన పనులే. హరిద్వార్ ధర్మసంసద్ లో ముస్లింలనూ ఏరివేయాలంటూ సాగిన ప్రసంగాలూ, వాటి విషయంలో ప్రధాని, ఇతర కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులూ, జాతీయ స్థాయి పార్టీ నాయకులూ, రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వాల, అధికారపార్టీ నాయకులూ పూర్తిగా మౌనం వహించడం బీజేపీ హిందూత్వ ఉక్కు పిడికిని దాపరికం లేకుండా బాహాటంగా ప్రదర్శించింది. ఈ ఎన్నికలు 80 శాతం హిందువులకూ, 20 శాతం ముస్లింలకూ మధ్య జరుగుతున్న పోరాటం – ప్రసిద్ధమైన 80-20 సూత్రం- అంటూ యూపీ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యానం పార్టీ అభివ్యక్తిలో కలికితురాయి. ఇంతవరకూ బీజేపీకి మూడు విజయాలు సాధించిపెట్టిన బలమైన వాదమిది.
Also read: మోదీ నవభారతం, నెరవేరని ప్రజాభిమతం
అసలు సమస్యలు మరిచేందుకు మతావేశం
ఉద్యోగాల కల్పన, నిరుద్యోగం పెరుగుదల, థరలను అదుపులో ఉంచడంలో వైఫల్యం, పెరుగుతున్న ఇంధనం ధరలను అరికట్టలేకపోవడం, అంతటా కనిపిస్తున్న ఆర్థిక ఇబ్బందులు, గ్రామీణ సంక్షోభం, రైతుల ఆగ్రహం, కోవిద్ రెండో కెరటంలో అపసవ్యంగా వ్యవహరించినందువల్ల పెద్ద ఎత్తున మరణాలు సంభవించడం, కోవిడ్ వల్ల మరణించినవారి శవాలు పవిత్ర గంగానదిలో తేలియాడుతూ ప్రయాణించడం, టీకాల వ్యవహారంలో దారుణమైన రచ్చ వంటి సమస్యలపైన ప్రభుత్వ నిర్వాకాన్ని ఓటర్ల మస్తిష్కాలలో హిందూత్వ అస్థిత్వ అజెండా ఎక్కించడం ద్వారా పూర్వపక్షం చేయవచ్చునని బీజేపీ భావిస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ అజెండా జయప్రదంగా లక్ష్యం నెరవేరుస్తుందనడానికి 2017 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే నిదర్శనం. మతిలేని, నిష్ఫలమైన ‘పెద్దనోట్ల రద్దు’ అనే డిమానిటైజేషన్ విధానం అమలు కలిగించిన దిగ్భ్రాంతినీ, ఆవేదననూ అవలీలగా అధిగమించడంలో పార్టీకి ఈ వాదన దోహదం చేయగలదనే విశ్వాసం ఉంది.
రాష్ట్రంలో ఈ సవాలును ఎదుర్కోడానికి బలమైన వాదం, స్థిరమైన వేదిక ఇంకా సిద్ధం కాలేదు. కాంగ్రెస్ పతనం ఆగిపోయి అది తిరిగి బతికి బట్టకట్టే సూచనలు కనిపించడం లేదు. ప్రియాంకాగాంధీ నిర్విరామంగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కాంగ్రెస్ కు అనాదిగా మద్దతు ఇచ్చిన వర్గాలు తిరిగి ఇంకా దగ్గరికి రాలేదు. కాంగ్రెస్ కు అండగా ఉండిన ముస్లింలూ, అగ్రవర్ణాలూ,దళితులను వరుసగా సమాజ్ వాదీ పార్టీ, బీజేపీ, బహుజన సమాజ్ పార్టీ కాజేసుకొని పోయాయి. కాంగ్రెస్ కు 1989 నాటి పూర్వస్థితికి చేరుకోవాలంటే ఇంకా చాలా దూరం ప్రయాణం చేయవలసి ఉంటుంది.
Also read: పంజాబ్ లో కాంగ్రెస్, ఆప్ మధ్యనే నువ్వా-నేనా?
పోరాడే స్థితిలో బీఎస్ పీ లేదు
రాష్ట్రంలో అధికారం కోల్పోయి పదేళ్ళు గడిచినా బీఎస్ పీ పోయిన ప్రాబల్యాన్ని తిరిగి సాధించడానికి చేసిన ప్రయత్నాలు సత్ఫలితాలు ఇచ్చిన దాఖలా లేదు. దళితులలో ఉన్న 65 ఉపకులాలలో జాతవేతర ఉపకులాలు చాలా వరకూ బీఎస్ పీని వీడి వెళ్ళాయి. వాటిని బీజేపీ విజయవంతంగా తనలో కలుపుకున్నది. హిందూత్వవాదాన్ని అయినా, బీజేపీ సామాజికతంత్రాన్ని అయినా సవాలు చేసే స్థితిలో బీఎస్ పీ లేదు. మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ నాయకత్వంలోని సమాజ్ వాదీ పార్టీ (ఎస్ పీ) బీజేపీకి వ్యతిరేకంగా చిన్నాచితకా పార్టీలను కూడగట్టుకొని ఒక కూటమిని తయారు చేసింది. బీజేపీలో అసంతృప్తితో దహించుకొని పోతున్న నేతలకు ప్రత్యామ్నాయ వేదికగా ఎస్ పీ కనిపిస్తోంది. సుమారు 79 వెనుకబడినవర్గాలలోని ఉపకులాలు ఎస్ పీ వైపు మొగ్గు చూపుతున్నట్టు కనిపిస్తున్నాయి. ఇటీవలనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపైన విజయం చవిచూసిన రైతులు అఖిలేష్-జయంత్ చౌధురి కూటమికి అనుకూలంగా ఉన్నారు. అన్నట్టు, జయంత్ చౌధురి అజిత్ సింగ్ కుమారుడు, చరణ్ సింగ్ మనుమడు. జాట్ల ఆధిక్యం ఉన్న పశ్చిమయూపీలో జయంత్ పార్టీకి ప్రాబల్యం ఉంది. కడచిన మూడు ఎన్నికలలోనూ ఆ ప్రాంతం బీజేపీ అభ్యర్థులను చాలా అధికంగా గెలిపించింది. ఈ సారి ఇక్కడ నష్టం జరిగితే అది బీజేపీకి శరాఘాతమే అవుతుంది.
అన్ని విషయాలనూ ఆచరణాత్మకంగా పరిశీలించి చూస్తే యూపీలో బీజేపీ, ఎస్ పీ మధ్య నేరుగా, తీవ్రంగా పోటీ జరగబోతున్నట్టు కనిపిస్తోంది. తనకూ, బీజేపీకి మధ్య ఉన్న అంతరాన్ని ఎస్ పీ వేగంగా పూడ్చివేస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఎస్ పీ ఎదుట ప్రధానంగా రెండు సవాళ్ళు ఉన్నాయి. ఒకటి, ఎస్ పీ నుంచి కాంగ్రెస్, బీఎస్ పీ, ఏఐఎంఐఎం చీల్చుకునే ఓట్ల వల్ల బీజేపీకి ఎంత ప్రయోజనం చేకూరుతుంది? ఈ ఓట్ల చీలిక ఫలితంగా ఎన్ని నియోజకవర్గాలలో ఎస్ పీ ఓడిపోయే ప్రమాదం ఉంది? రెండు, అఖిలేష్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ముస్లిం, యాదవ్ గూండాలదే రాజ్యం అనేవాదనను సమర్థంగా తిప్పికొట్టగలుగుతుందా?
Also read: 5 రాష్ట్రాలలో ఎన్నికల రంగం – వివిధ పార్టీల బలాబలాలు
రెండు మాసాల కిందటే ఈ మాట చెప్పాను
రెండు మాసాల కిందట రాబోయే యూపీ అసెంబ్లీ ఎన్నికలపైన నా ఆలోచనలను మీతో పంచుకున్నాను. అప్పటి కథనాన్ని ఈ కింది వాక్యాలతో ముగించాను:
‘‘ప్రస్తుత పరిస్థితి గమనిస్తే ఆర్థికపరమైన, పరిపాలనాసంబంధమైన సమస్యలను హిందూ అస్థిత్వవాదంతోనూ, ధార్మిక గర్వంతోనూ అధిగమించే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. ఈ ఆటలో ప్రస్తుతానికి అది ఆగ్రగామిగా ఉంది. పరిపాలనా సమస్యలనూ, ఆర్థిక కష్టనష్టాలనూ, సహనంతో కూడిన అందరినీ కలుపుకొని వెళ్ళే ఉదారమైన భావనలు కలిగిన ఇండియాకు ఎదురవుతున్న ప్రమాదాన్నీ ప్రజల దృష్టికి ప్రముఖంగా తీసుకొని వెళ్ళడం ప్రతిపక్షం ఎదుట ఉన్న సవాలు. మోదీ-షా నాయకత్వంలో బీజేపీ ఎన్నికల రథం శక్తిని ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలు సమైక్యం కావడం అత్యవసరం. కానీ ఇది జరిగే అవకాశాలు ప్రస్తుతానికి పూజ్యం. అన్నీ సమంగా ఉంటే మరి కొన్ని మాసాలలో యూపీలో జరగబోయే పోటీ ఫలితం ఒక భవిష్యత్ ముద్ర వేస్తుంది. ఒక సమాజంగా, రాజకీయ వ్యవస్థగా ఇండియా ఎట్లా ఉండబోతోందో ఈ ఎన్నికల ఫలితాలు నిర్ణయిస్తాయి.’’
ప్రస్తుతం ఎన్నికలబరిలో బలాబలాలను పరిశీలిస్తే బీజేపీకి ఇంకా ఎంతోకొంత సానుకూలత ఉన్నట్టు కనిపిస్తోంది. దానికి అపారమైన ఆర్థికవనరులు ఉన్నాయి. దాని అదుపులో రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి దర్యాప్తు, అమలు (ఎన్ ఫోర్స్ మెంట్) సంస్థలు ఉన్నాయి. అన్నిటికీ మించి హిందూత్వవాదం పూర్తిగా బీజేపీ గుప్పెటలో ఉంది. ఎన్నికల రథాన్ని తమ భుజాలపై పెట్టుకొని మోయడానికి ధర్మసంసద్ వంటి అనేక స్వయంచోదక బృందాలూ, సంస్థలూ, వేదికలూ సిద్ధంగా ఉన్నాయి. అటువంటి బలమైన సహాయక వ్యవస్థ ఈ రోజు దేశంలో మరే ఇతర రాజకీయ పార్టీకీ లేదు. పైగా బీజేపీ ప్రత్యర్థుల మధ్య శత్రుత్వాన్ని తలపించే విభేదాలు కొనసాగడం బీజేపీకి రక్ష.
Also read: పెగసస్ పై సుప్రీంకోర్టు, ప్రభుత్వం మధ్య ఘర్షణ అనివార్యం
ఇది పార్టీ గెలుపు కాబోదు, భావజాల విజయం
యూపీలో బీజేపీ విజయం ఒక రాజకీయ పార్టీ గెలుపు కిందికి రాబోదు. భారత గణతంత్ర వ్యవస్థాపక సూత్రాలకు విరుద్ధమైన భావజాలానికి లభించిన విజయం. అదే విధంగా బీజేపీపైన ఎస్ పీ కానీ, మరే ఇతర పార్టీ కానీ సాధించే విజయం ఆ పార్టీకి మాత్రమే చెందిన గెలుపు కాదు. ఉదారవాద, బహుళత్వ, సహనంతో కూడిన, లౌకికవాద, ప్రజాస్వామ్య ఇండియాకు దక్కిన విజయం. ఆ వెలుగులోనే దాన్ని చూడాలి. ఈ పోరాటంలో పరాజయం చాలా ప్రమాదభూయిష్టమైనది. విచ్ఛిన్నకరమైన హిందూత్వవాదాన్ని వ్యతిరేకించే వేదికలు ఒకదానికొకటి సహకరించుకోవాలి, కలసి సమష్టిగా పని చేయాలి.
నేను చెప్పేదాన్ని మరింత విపులంగా విశదీకరించేందుకు సంస్కృతంలో ‘న్యాయ’ ను ఇక్కడ ఉటంకిస్తాను. నష్టాశ్వ దగ్థరథ న్యాయం. ఇద్దరు ప్రయాణికులు తమ రథాలలో ప్రయాణం ప్రారంభించారు. రోజంతా ప్రయాణం చేసి చీటకి పడిన తర్వాత ప్రయాణం ఆపుచేసి ఒక సత్రంలో దిగారు. వారు మర్నాడు ఉదయం తిరిగి ప్రయాణం ప్రారంభించేందుకు బయటికి వచ్చారు. ఒక ప్రయాణికుడి గుర్రాలు ఉడాయించాయి. రెండో ప్రయాణికుడి రథం కాలిపోయింది. ఒకరికి రథం ఉన్నది. గుర్రాలు లేవు. రెండో అతనికి గుర్రాలు ఉన్నాయి. రథం లేదు. వారిద్దరిలో ఏ ఒక్కరూ స్వయంగా ప్రయాణం చేయలేరు. రథం కోల్పోయిన వ్యక్తి గుర్రాలను గుర్రాలు లేని వ్యక్తి రథానికి కట్టారు. వారిద్దరూ కలిసి తమ గమ్యం వైపు ప్రయాణం కొనసాగించారు. ఇదే నష్టాశ్వ దగ్థరథ న్యాయం. ఉడాయించిన గుర్రాల, దగ్థమైన రథం న్యాయమన్నమాట. రాజకీయ పార్టీలు, ముఖ్యంగా యూపీలోని పార్టీలు, ఈ న్యాయాన్ని మనసులో పెట్టుకొని విజ్ఞతతొ వ్యవహరించాలని కోరుకునేవారు ఈ దేశంలో ఉన్నారు.
Also read: ఆర్ఎస్ఎస్ బలం పెరిగింది, దృష్టి మందగించింది
మిడ్ వీక్ మ్యాటర్స్ (MwM) – 42కి స్వేచ్ఛానువాదం