Saturday, November 23, 2024

జనాభా విధానం ఎన్నికల హెచ్చరికా? ఎన్నికల వాగ్దానమా?

(దేశంలో స్వతంత్ర పరిశోధన సంస్థగా పీఎంఎస్ (సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ )ముప్పయ్ సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక వ్యాసం)

అస్సాం ప్రయోగశాలలో 2021లో సాధించిన ఎన్నికల ఫలితం తర్వాత ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ అనూహ్యమైన పేటికను తెరిచే ప్రయత్నం జరుగుతున్నట్టు కనిపిస్తున్నది. ఏదో జనాభా బాంబు పేలడానికి సిద్ధంగా ఉన్నట్టు అనిపిస్తున్నది. మరి కొందరు నాయకులు అదే విధానాన్ని ప్రతిధ్వనిస్తున్నారు. పార్లమెంటులో సైతం అదే విధమైన వాణి బలంగా వినిపిస్తున్నారు. ఇప్పుడు ముందుకు తెస్తున్న బిల్లును గతంతో సంబంధం లేకుండా ఒక్క యూపీనే దృష్టిలో పెట్టుకొని చూడగలమా?

యూపీ బిల్లు ముసాయిదాను విడుదల చేయడానికి పక్షం రోజుల కిందట అస్సాం ముఖ్యమంత్రి జనభా నియంత్రణకోసం ఒక ‘సైన్యాన్ని’ నెలకొల్పబోతున్నామనీ, రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో ఈ సైన్యం గర్భనిరోధక సామగ్రిని (కండోమ్ లు) పంచిపెడుతుందనీ అన్నారు. జనాభా పెరుగుదలని అరికట్టగలిగితే అత్యధికులు పెద్ద పెద్ద ఇళ్ళలో నివసించవచ్చుననీ, వాహనాలు కొనుగోలు చేయవచ్చుననీ, పిల్లలను ఇంజనీర్లుగా, డాక్టర్లుగా తయారు చేయవచ్చుననీ అస్సాం ముఖ్యమంత్రి చెప్పారు. జనాభా నియంత్రణ సమర్థకులు ఈ వాదనను వినిపించడం కొత్త కాదు. యూపీ ముసాయిదా బిల్లు నికరమైన అభివృద్ది సాధించి, ప్రగతి ఫలాలను సమానంగా పంచిపెట్టడానికి జనాభా నియంత్రణ, స్థిరీకరణ, సంక్షేమం దోహదం చేస్తాయని ఈ బిల్లు అంటోంది.

ప్రధాని 2019లో ఇచ్చిన స్వాతంత్ర్య దినోత్సవ సందేశంలో జనాభా నియంత్రణను ప్రస్తావించారు. ఈ నియంత్రణకు చర్యలు ఎప్పుడు తీసుకోవాలో, ఎట్లా తీసుకోవాలో రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించుకోవాలని సూచించారు. సుదూరమైన జాతీయ ప్రయోజనాలనూ, పరిణామాలనూ దృష్టింలో పెట్టుకొని కాకుండా గతంలో అస్సాంలో కానీ ఇప్పుడు యూపీలో కానీ రాజకీయ కోణం నుంచి అధికారపార్టీ చూస్తున్నదని అనిపిస్తున్నది.

ఎర్ర త్రికోణం- కుటుంబ నియంత్రణ తొలి నినాదం

జనాభా నియంత్రణ కొత్తకాదు

ఆధునిక భారతంలో జనాభా నియంత్రణ ఆలోచన వందేళ్ళ కింది నుంచీ ఉన్నదే. రాజకీయ స్థాయిలో సుభాష్ చంద్ర బోస్ దీన్ని ఉద్యమసదృశంగా స్వీకరించారు. ‘‘ రోగభూయిష్టమైన, పోషకాహారం లేని సమాజం కంటే తక్కువ జనాభా ఉంటే ఇండియా మెరుగైన స్థితిలో ఉంటుంది,’’ అని జవహర్ లాల్ నెహ్రూ తన పుస్తకం ‘డిస్కవరీ ఆఫ్ ఇండియా’లో రాశారు. ఈ ప్రకారమే 70 ఏళ్ళ కిందట జనాభా నియంత్రణ గురించి ఆలోచిన అగ్రగామిగా భారత్ ఉండేది.  తమ కుటుంబాలను సంబాళించుకోవడానికి ప్రజలకు అవసరమైన అవగాహన కలిగించేందుకు ఈ  పథకాలు పనికి వచ్చేవి. ఆరోగ్య, విద్యా అవకాశాల విస్తరణ, మహిళా-శిశు  సంక్షేమం, మహిళలను శక్తిమంతం చేయడం లక్ష్యాలుగా కలిగిన పథకాల ద్వారా ప్రజలలో అవగాహన పెంపొందించే ప్రయత్నం జరిగింది. కానీ ఈ పథకాలు అమలు జరిగినా ఆశించినంతగా  జనాభా నియంత్రిణ జరగలేదు. ప్రజల సామాజిక ఆర్థిక ప్రమాణాలూ పెరగలేదు. గ్లాసు సగం ఖాళీ అన్నట్టుగానే ఉంది పరిస్థితి.

భారత దేశంలో కుటుంట నియంత్రణ కార్యాక్రమాలలో నా ప్రమేయం, వాటితో నా సంబంధం యాభై ఏళ్ళనాటిది. కేంద్రమంత్రిత్వశాఖలో సమాచార వ్యూహకర్తగా (కమ్యూనికేషన్ స్ట్రాటజిస్ట్) 1970-72లో పని చేశాను. ఎర్ర త్రికోణం, దో యా తీన్ (ఇద్దరు లేదా ముగ్గురు) నినాదాల ప్రచారం రూపకల్పనలో నేను పాల్గొన్నాను.  ఆ నినాదాన్ని ‘హమ్ దో హమారే దో (మేం ఇద్దరం, మాకిద్దరు)’ అని మార్చారు. గర్భనిరోధక ఉపకరణాలను (కండోమ్ లను) సమాజంలో పంపిణీ చేయడం ఎట్లాగో నిర్ణయించాం. హుగ్లీలో, లక్నోలోని ప్రధాన వ్యాపార కూడళ్ళలో సర్వే చేయడం ద్వారా దీనికి వ్యూహాన్నిరూపొందించాం.  ఆ తర్వాత నేను చేసిన ముఖ్యమైన పని దేశంలోని అగ్రగామి పరిశోదనా సంస్థ ఓఆర్ జీతో కలసి మంత్రిత్వ శాఖ పనపున దేశంలోని మొట్టమొదటి జాతీయ కుటుంబ నియంత్రణ (కెఏపీ) సర్వే 1971-73లొ నిర్వహించాం.  దేశంలో కుంటుంబ నియంత్రణ విధానాన్ని మార్చివేసిన నివేదికను నేనూ, డీవీఎన్ శర్మ కలసి తయారు చేశాం. విద్య, వైద్య సదుపాయాలు, వృత్తి లేదా ఉద్యోగం ఉన్నదా లేదా, భార్యకు ఉద్యోగం ఉన్నదా, లేదా అనే అంశాలు కుటుంబ నియంత్రణ పాటించడంలో కీలకమైన అంశాలని ఆ నివేదికలో చెప్పాం. ఒక్కొక్క కుటుంబానికి ఏది వీలవుతుందో అది చేసే ‘కేఫెటీరియా విధానం’ అనుసరించాలని నివేదిక సూచించింది. అదే సమయంలో భారత కుటుంబ నియంత్రణ సంస్థ (దానిని తర్వాత జేఆర్ డీ ఆధ్వర్యంలో జనాభా సంస్థ (పాపులేషన్ ఫౌండేషన్ గా మార్చారు) స్థాపనలో దుర్గాబాయ్ దేశ్ ముఖ్ తో కలసి పని చేశాను.

మేమిద్దరం, మాకిద్దరు

మంత్రిత్వశాఖ పేరు మార్పు

మంత్రిత్వశాఖ పేరును ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం (నియంత్రణ బదులు) అని మార్చారు. ప్రశూతి సమయంలో మహిళల ఆరోగ్యం మెరుగుదల, శిశు మరణాలను తగ్గించడం వంటి అక్ష్యాలతో అనేక పథకాలు అమలు చేసి ఆరోగ్య సర్వీసులను పెంపొందించారు. గ్రామీణ ఆరోగ్య వ్యవస్థను తిరిగి పరిశీలించి ఆయాలనూ, ఏఎన్ఎంలనూ నియమించారు. అంగన్ వాడీలను ఏర్పాటు చేశారు. ఆరోగ్య విస్తరణ వ్యవస్థను పటిష్టం చేసి ఆస్పత్రులలోనే ప్రసవాలు కావాలనే గట్టి విధానాన్ని అమలు చేసే ప్రయత్నం జరిగింది. అత్త, మంగలి, దర్జీ, ఉపాధ్యాయులు, స్థానిక ప్రజాప్రతినిధుల వంటి సామాజిక కార్యకర్తలకు అవగాహన పెంపొందించే కార్యక్రమాలు ముమ్మరంగా అమలు చేశారు. అందుబాటులోకి రాని, చేరుకోలేని దంపతులను పట్టుకొని వారికి కుటుంబ నియంత్రణ ప్రాముఖ్యాన్ని వివరించే కార్యక్రమానికి ప్రాధాన్యం ఇచ్చారు. ప్రోత్సాహకాలు ఇవ్వాలనే ఆలోచన జేఆర్ డీ టాటా, అవాబాయ్ వాడియాలూ ఒక శిశువు అదనంగా జన్మిస్తే దేశంపైన ఎంత భారం పడుతుందో లెక్కలు వేసి ఎంత ప్రోత్సహకం సమంజసమో  నిర్ణయించారు. జనాభా పెరుగుదల వల్ల ప్రగతి ఫలాలు ఆశించిన స్థాయిలో ప్రజల అనుభవంలోకి రాలేదనే రాజకీయ నాయకుల ఊకదంపుడు ఉపన్యాసాలు ఉండనే ఉన్నాయి. ఆ వాదనను పూర్తిగా తోసిపుచ్చడానికి వీలు లేకపోయినప్పటికీ రాజకీయ ప్రతినిధుల ప్రమాణాలు సవ్యంగా లేని కారణంగానూ, వివిధ ప్రభుత్వాల ప్రాధ్యమ్యాలలో లోపం వల్లనూ, ఈ విషయానికి తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడం వల్లనూ ఆశించిన ఫలితాలు దక్కలేదు. గతించిన సంవత్సరాల డేటాను పరిశీలిస్తే కుటుంబ పరిమానం తగ్గినట్టు గమనించవచ్చు. ఇందుకు కారణం అభివృద్ధి విస్తరణ, విద్య, ఆరోగ్య వ్యవస్థలు బలోపేతం కావడం, లింగ వివక్ష తగ్గడం, సంక్షేమం జీవన మంత్రం కావడం, రవాణాలో పెరిగిన సౌలభ్యం. మొదటి సర్వేని ఓఆర్ జీ జరిపిన తర్వాత పదేళ్ళ కిందట రెండో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే) జరిగింది. ప్రజల వైఖరిలో వచ్చిన మార్పును ఈ సర్వే పట్టి ఇచ్చింది. ఈ మార్పు ప్రతి దశాబ్దానికి ఒక సారి నిర్వహించే జనాభా లెక్కలలో కూడా ప్రతిబింబిస్తుంది. రాజకీయ నాయకుల ఇష్టాయిష్టాల ప్రకారం సర్వేల డేటాకు భాష్యం చెబుతారనుకోండి. డేటా అనుకూలంగా లేకపోతే దానిని బదనాం చేస్తారు. మూలనపెడతారు.       నేను ఇటీవలనే ప్రచురించిన ప్రభుత్వం ‘మూడో కన్ను (‘ది థర్డ్ ఐ ఆఫ్ గవర్నమెంట్’-స్పీకింగ్ టైగర్ పబ్లికేషన్)’ అనే గ్రంథం ఈ విషయాన్ని సోదాహరణంగా వివరిస్తుంది.

కుటుంబ పరిమాణం, ఉత్పత్తి రేటు తగ్గుదల

డెబ్బయ్ ఏళ్ళ కిందట దేశంలో సగటు కుటుంబంలో ఐదుగురు సభ్యుల కేంటే ఎక్కువ  ఉండేవారు. ఇప్పుడు అది మూడింటికంటే తగ్గింది.  ఉత్పాదక రేటు 1950లో 5.9 శాతం ఉంటే ఇప్పుడు 2.5 శాతం. బీమారూ (బిహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్) రాష్ట్రాలలో కూడా జనాభా పెరుగుదల రేటు తగ్గింది. ఈ మార్పు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒడిశాలలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. యూపీలో అయిదేళ్ళ కిందట ఉత్పాదక రేటు 3.1 ఉంటే అది ఇప్పుడు 2.7కి తగ్గింది. దీన్ని వచ్చే దశాబ్దంలో 2.1 కి తేవాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఈ పరిణామం ఈ బిల్లుతో నిమిత్తం లేకుండానే జరిగిపోతుంది. జనాభా ఉత్పాదక రేటు తగ్గిన కాలంలో కుటుంబ నియంత్రణ పాటించినవారికి ప్రోత్సహకాలు లేవు. శిక్షాత్మకమైన చర్యలూ లేవు. ప్రస్తుతం కనిపిస్తున్న పరిస్థితులకు కారణాలు తెలుసుకోవడానికి చాలా కొద్ది మంది శాస్త్రీయంగా అధ్యయనం చేశారు. రాజ్ దీప్ సర్దేశాయ్, పరకాల ప్రభాకర్ డేడా ద్వారా కొంత పరిశోధన చేశారు.  కానీ రాజకీయ ఊకదంపుడికి అలవాటుపడినవారికి ఈ శాస్త్రీయ అద్యయనాలు పట్టవు.

జనాభా నియంత్రణ వంటి చాలా ముఖ్యమైన అంశాలపైన క్లిష్టమైన విధాన రూపకల్పన చేసే సమయంలో ఆయా రంగాలలో ప్రవీణులతో సంప్రతించాలి. పౌరసమాజాన్ని విధాన రూపకల్పన ప్రక్రియలో భాగస్వామిని చేయాలి. అది జరగని పక్షంలో 1975-77 లో జరిగినట్టు వంది మాగధుల స్తోత్రాలతో, వారి ప్రాబల్యంతో బండి గాడి తప్పుతుంది. జనాభా విధానంపైన పార్లమెంటులో విధాన ప్రకటన చేసే ముందు 1977లో నాటి ప్రధాని మొరార్జీదేశాయ్ సీపీఆర్ కి  చెందిన వి. పాయ్ పనందీకర్ ను సంప్రదించారు. ఇద్దరు పిల్లలు చాలు అనే విధానాన్ని రూపొందించండి అంటూ పాయ్ సిఫార్సు చేశారు. ఎవరినీ బలవంతం చేయడం కానీ, ఎవరిపైన అయినా ఒత్తిడి తేవడం కానీ జరగదని హామీ ఇచ్చారు. ‘‘మా విధానం కేవలం అవగాహన పెంచడం, ఐచ్ఛికంగా ముందుకు వచ్చేవారిని ప్రోత్సహించడం… అంతే,’’ అన్నారు మొరార్జీ.  మా ప్రయత్నాలను మాత్రం ఆపుచేయబోము అన్నది వారి తీర్మానం.

జనాభాపైన ఉన్నత స్థాయి జాతీయ కమిటీని 1994లో పీవీ నరసింహారావు నియమించారు. దీనికి ఎంఎస్ స్వామినాథన్ ను అధ్యక్షులుగా నియమించారు. నేను కూడా అందులో సభ్యుడినే. నాతో పాటు డాక్టర్ ఆషిశ్ బోస్ (బీమారూ ప్రసిద్ధి), డాక్టర్ దేవకీ జైన్, టీ.వీ. ఆంథోనీ. డాక్టర్ పాఠక్, డాక్టర్ పి. రాయ్ ఉన్నారు. అందరం ప్రభుత్వ వ్యవస్థ వెలుపలివారమే. సామాజికాభివృద్ధి, ప్రజాస్వామ్య పద్ధతి, స్థానిక సంస్థల ప్రమేయంతో ఇందుకు తగిన వాతావరణ పరిస్థితులను కల్పించి సామాజికాభివృద్దికి దోహదం చేయాలని ఈ కమిటీ సూచించింది. జననాల రేటును నియంత్రించడం రాజ్యం తీసుకోవలసిన కార్యక్రమం కాదనే వాదన ఉన్నప్పటికీ ఈ కమిటీ అభిప్రాయం ప్రకారం ప్రభుత్వానికి అటువంటి బాధ్యత ఉన్నది. అయితే, ప్రభుత్వం పక్కా డేటా ఆధారంగా, సమాజంలోని ప్రవీణుల, పెద్దలతో సమాలోచనలు జరిపి ముందుకు సాగాలని కమిటీ సూచించింది. బలవంతం చేయడం, ఒత్తిడి చేయడం వల్ల ఆశించిన ఫలితాలు రాకపోగా ప్రయత్నం బెడిసికొట్టే ప్రమాదం ఉన్నదని మన స్వీయానుభవం చెబుతోంది. ఇతర దేశాలలోజరిపిన సర్వేలు కూడా అదే సూచిస్తున్నాయి.

యూపీ బిల్లు

‘‘నియంత్రణ, స్థిరీకరణ, సంక్షేమం’’ అనే మూడు లక్ష్యాలతో విడుదలైన ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ బిల్లు ముసాయిదా ఆసక్తికరంగా, అనూహ్యంగా ఉంది. చెప్పినట్టు చేస్తే ప్రోత్సాహకం, చెప్పినట్టువనికపోతే శిక్షాత్మకం అనే విధంగా ప్రభుత్వ విధానం ఉంటుంది. తనిఖీలు, సర్దుబాట్ల వ్యవస్థ (చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ సిస్టం) ఉండటంతో ఈ బిల్లు వల్ల ప్రతికూల మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి.  కానీ జనసంక్షేమంలో కానీ, నికరమైన అభివృద్ధి సాధనలో కానీ, ప్రగతి ఫలాలను సమానంగా అందరికీ పంచే విషయంలో కానీ ఈ బిల్లు వల్ల ఒరిగేది ఏమీ ఉండదు. ఇద్దరు పిల్లలనే కనాలనే విధానాన్ని ఉల్లంఘించినవారిపైన శిక్షాత్మకమైన చర్యలు తీసుకోవడం ఈ బిల్లు వల్ల తేలిక అవుతుంది. ఎన్నికల సమయంలో చేసే బెదిరింపులూ, ఇచ్చే హామీలూ ఈ బిల్లులో ఉన్నాయని లక్నోకు చెందిన ఒక మిత్రుడు వ్యాఖ్యానించారు. శిక్షాత్మక చర్యలు అనివార్యంగా కనిపిస్తున్నాయి. ప్రోత్సహకాల విషయంలో కొంత అస్పష్టత ఉన్నది. శిక్షాత్మక చర్యలు మాత్రం ఎప్పుడు పడితే అప్పుడు ఎవరు పడితే వారు స్థానికంగానే అమలు చేయవచ్చు. ఈ బిల్లు రెండు సమాంతర వ్యవస్థలకు అవకాశం కల్పిస్తుంది. రెండు వ్యవస్థలలోనూ విధాన నిర్ణయాలను అమలు పరచడం కష్టతరం అవుతుంది. ఇద్దరు లేక అంతకంటే తక్కువ మంది పిల్లలు ఉన్న కుటుంబాలు ఒక వైపూ, ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారు మరో వైపూ ఉంటారు. ఈ బిల్లు భర్తను కేంద్ర బిందువుగా చేస్తుంది. పేదల ప్రాథమిక హక్కులకు పూచీ ఉండదు. పిల్లలు లేనివారి గురించి బిల్లులో ఏమీ లేదు. అసలు పిల్లలే లేనివారికిచ్చే ప్రోత్సాహకం సంగతి ఏమిటి?

శిక్షాత్మక చర్యలు కఠినతరం

కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకొని ఇద్దరు పిల్లల విధానం అవలంబించే వారికి రకరకాల ప్రోత్సాహకాలు ఉంటాయని బిల్లు పేర్కొన్నది. ఉద్యోగం చేస్తున్నవారికి ఇంక్రిమెంట్లు, సబ్సిడీలు, తేలికపాటి రుణాలు, రిబేట్లు, ప్రమోషన్లు, మొదలైనవి ఉంటాయి. ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నట్లయితే ప్రభుత్వ పథకాలు వారికి వర్తించవు. స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేసేందుకు వారు అనర్హులు. ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వీలు కూడా వారికి ఉండదు. ప్రమోషన్ ఇవ్వరు. ప్రభుత్వం ఇచ్చే ఏ రకమైన సబ్సిడీ కూడా దొరకదు. నలుగురికి మాత్రమే రేషన్ లభిస్తుంది. ఆశ్చర్యకరంగా ఒకే సంతానం ఉన్నవారికి అదనపు సదుపాయాలు ఉంటాయి. వారికి రెండు ఇంక్రిమెంట్లు, గ్రాడ్యుయేషన్ వరకూ ఫీజు లేకుండా కళాశాలలో ప్రవేశం ఉంటుంది. వారి సంతానానికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడంలో ప్రాధాన్యం లభిస్తుంది. దారిద్ర్యరేఖ దిగువన ఉన్న కుటుంబాలలో ఒకే కుమార్తె ఉంటే ఒక సారి లక్ష రూపాలయల ప్రోత్సాహకం ఉంటుంది. కుమారుడు కలిగితే రూ. 80 వేల ప్రోత్సాహకం ఉంటుంది. ఇవన్నీ బిల్లు చట్టం అయిన వెంటనే అమలులోకి వస్తాయి. అన్నిటికంటే ముఖ్యమైన అంశం ఏమంటే ఇది ‘సర్కారీ’ తరహా బిల్లు.

పేదరికం జనాభా పెరుగుదలకు దారి తీస్తుందనేది జగమెరిగిన సత్యం. అదే విధంగా భద్రత, సమానావకాశాలూ, రక్షణ చిన్న కుటుంబాలకు దారితీస్తాయనే విషయం కూడా అందరికీ తెలిసిందే. ఈ ప్రాథమిక అంశాలను గమనంలో పెట్టుకోకుండా అడ్డదారులు తొక్కడం ద్వారా శాంతి, సౌభాగ్యం, ప్రగతి సాధ్యం అవుతాయా? ఐకమత్యాన్నీ, ప్రశాంతనూ చెల్లాచెదురు చేసే శక్తి జనాభా నియంత్రణ విధానాలకు ఉన్నది. ఈ అంశాల పట్ల ప్రభుత్వాలు అవగాహన లేకుండా వ్యవహరించజాలవు. తగినంత పరిశోధన, నిజమైన డేటా మీద ఆధారపడటం, సంప్రతింపులు జరపడం ఒక్కటే మార్గం. జనాభా స్థిరీకరణ సాధించాలంటే ఏమేమి చేయాలో 1994-95 నాటి జాతీయ జనాభా కమిటీ ఇచ్చిన నివేదిక స్పష్టంగా, సమగ్రంగా చెప్పింది. మన విధానాలను మెరుగుపరచుకునేందుకు ఇప్పుడు మన దగ్గర ఆధారపడదగిన డేటా ఉన్నది.

(డాక్టర్ భాస్కరరావు దిల్లీలో యాభై ఏళ్ళుగా ప్రభుత్వ విధానాల విశ్లేషకుడిగా పని చేస్తున్నారు. కుటుంబ నియంత్రణ పూనికలలో, అధ్యయనంలో  ఆయన దశాబ్దాలుగా పాల్గొంటూ వచ్చారు. 1994లో నియమించిన జాతీయ జనాభా కమిటీలో సభ్యులు. కుటుంబ నియంత్రణ ప్రోత్సాహకాల విషయంలో 1987లో జేఆర్ డీ టాటా జరిపిన సంప్రదింపులలో భాగస్వామిగా వ్యవహరించారు)  

Dr. N. Bhaskara Rao
Dr. N. Bhaskara Rao
డాక్టర్ ఎన్. భాస్కరరావు దిల్లీలోని సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ చైర్మన్. అయిదు దశాబ్దాలకు పైగా ప్రజాసంబంధమైన విషయాలపైన అధ్యయనం చేస్తూ, సర్వేలు జరిపిస్తూ, నివేదికలు వెల్లడిస్తూ, పుస్తకాలు రచిస్తూ, ప్రభుత్వాలకు సలహాలు ఇస్తూ ప్రజామేధావిగా సమాజానికి శక్తివంచనలేకుండా సేవచేస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles