Wednesday, January 22, 2025

రామానుజ విగ్రహ ప్రతిష్ఠాపన ఒక రియాల్టీ షో!

చిన జీయర్ స్వామి

ఎంటర్ టైన్ మెంట్ టీవీ చానళ్ళలో ప్రేక్షకులు రియాల్టీ షోలు చూస్తుంటారు. వాటి రూపకర్తలు, దర్శక నిర్మాతలు తెరమీద కనబడరు. అందులో పాల్గొంటున్న నటీనటు మాత్రమే ప్రేక్షకులకు కనిపిస్తుంటారు. ఆ కార్యక్రమాల్ని ఎవరో స్పాన్సర్ చేస్తుంటారు. మరెవరో ప్రమోట్ చేస్తుంటారు. ప్రేక్షకుల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా అవి టి.వి. తెరమీద కనిపిస్తుంటాయి. సెలబ్రిటీలని తమకు తామే చెప్పుకునే స్థాయిలేని కొందరు మనుషులు వెకిలి నవ్వులు నవ్వుతూ, పిచ్చి జోకులేస్తూ, అసభ్య నృత్యాలు చేస్తుంటారు. దానికి కామెడి అని పేరు పెడతారు. ఇష్టం లేని వాళ్ళు ఛానల్ మార్చుకోవాల్సిందే. పోనీ, దేశంలో ఏం జరుగుతుందోనని న్యూస్ ఛానల్ కి మారిపోయినా లాభం ఉండదు. అక్కడా ఈ రియాల్టీ షోకు సంబంధించిన ప్రకటనలు వస్తుంటాయి. అదెంతో ఇబ్బందికరమైన పరిస్థితి. పార్లమెంట్ లో మోదీ ప్రసంగం తప్పించుకుందామని ప్రేక్షకులు అటూ ఇటూ ఏ ఛానల్ కు మారినా ఆ ప్రసంగాన్ని తప్పించుకోలేరు. అలాంటప్పుడే ప్రేక్షకులకు జ్ఞానోదయమౌతుంది. ఈ దేశాన్ని ముర్ఖత్వంలో మంచేవారు ముంచుతూ ఉంటే, వివేకవంతులంతా ఏం చేస్తున్నారని అనిపిస్తుంది. ఎంత చిన్న ప్రయత్నమైనా చేస్తూ ఉండాలి కదా? అని అనిపిస్తుంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చినజియ్యర్ నేతృత్వంలో కొనసాగిన రామానుజ విగ్రహ ప్రతిష్ఠాపన కూడా ఒక రియాల్టీ షోకు ఏ మాత్రం తీసిపోదు. దానికి దిల్లీ నుంచి ఇద్దరు ముఖ్యమైన ఆర్టిస్టులు కూడా వచ్చి పెద్ద నామాలు పెట్టుకుని వేషం కట్టారు. బెల్లం ఎక్కడ ఉంటే అక్కడ చీమలు చేరినట్టే, హిందూమతం ఎక్కడుంటే వీళ్ళు అక్కడికి చేరి కామెడీ పండిస్తారు. వారి తర్వాత వారి జానియర్ ఆర్టిస్టులు కూడా వచ్చి ‘తగ్గేదేలే’- అన్నారు.

Also read: నిత్య జీవితంలో వైజ్ఞానిక స్పృహ

ఎన్ని వందల ఎకరాలు కావాలి?

చిన జీయర్ స్వామి, రామేశ్వరరావుతో కె చంద్రశేఖరరావు

ఒక మతాచార్యుడి విగ్రహ స్థాపనకు ఎన్ని వందల ఎకరాలు కావల్సివచ్చాయి? విగ్రహంలో ఉన్న బంగారమెంత? దాని ఎత్తెంత?వంటి వివరాలన్నీ జనానికి తెలిసిపోయ్యాయి. వాటి గురించి చెప్పుకోవడం అనవసరం. ప్రభుత్వాలు, కార్పోరేట్లు, మతగురువులు అందరూ కలిసి సామాన్యుణ్ణి మతం ఉచ్చులో ఎలా పడేస్తున్నారో ప్రత్యక్ష ప్రసారంలో చూశాం. సమతామూర్తి రామానుజుడి విగ్రహస్థాపన అని గొప్పగా చెప్పుకునే ముందు వెయ్యేళ్ళ క్రితం నాటి ఓ మత ప్రచారకుడిని ఇప్పుడు మళ్ళీ జనంమీద రుద్దడం వెనక ఉన్న రాజకీయాలేమిటీ? రియల్ ఎస్టేట్ వ్యవహారాలేమిటీ? ఎవరు ఎవరికి బినామీ? అని సామాన్యులు ఆరా తీస్తున్నారు. అన్నీ పసిగడుతున్నారు. నిజాలు తెలుసుకుంటున్నారు. అది ఎవరో ప్రయివేటు వ్యక్తులు చేస్తున్న కార్యక్రమమనే అనుకుందాం. కానీ, దాని ప్రభావం ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ సమాజంపై పడుతుంది గనుక, తప్పుడు విషయాలతో జనాన్ని తప్పుద్రోవ పట్టిస్తున్నారు గనక, ప్రగతిశీల భావాలు గల వాళ్ళంతా వ్యతిరేకిస్తారు. సమతామూర్తి పేరుతో అక్కడ జరగబోయేది వ్యాపారమని స్పష్టంగా అర్థమవుతూ ఉంది. రామానుజుడి గురించి  నిజాయితీగా వీళ్ళేమైనా జనానికి వాస్తవాలు చెపుతున్నారా? చెపితే కొంత వరకూ ఇబ్బంది ఉండకపోయేది.

Also read: భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నది ఎవరు?

వైష్ణవమతం స్వీకరించమని ఒత్తిడి

పంగనామం ధరించిన హోంమంత్రి అమిత్ షా

రామానుజాచార్యుడు ఏమైనా కులనిర్మూలన కోసం పాటుపడ్డాడా?మనుషులంతా ఒక్కటే అని గానీ, అందరూ సమానులే అనిగానీ అన్నాడా? అనలేదే – మోక్ష సాధన కోసం తను, తన వర్గం వారు ఎలాగైతే శ్రీమన్నారాయణుడిని పూజిస్తున్నారో, ఇతర కులాలవారు కూడా ఆ జగన్నాటక సూత్రధారిని ఆరాధిస్తూ మోక్షం సాధించుకోవాలని అన్నాడు. అంటే ఇతర కులాలవారిని కూడా తన శ్రీవైష్ణవమతం స్వీకరించమని ఒత్తిడి చేశాడు. అంతేగాని కులాలకు అతీతంగా వ్యవహరించాడని కాదు. మొన్నమొన్నటి వరకు శ్రీవైష్ణవ గురువులు ఊళ్ళు తిరుగుతూ ఇతరక లాలవారి భుజాలమీద శంఖుచక్రాలు ముద్రించి (సవశ్రీనాలు) వారిని నారాయణమూర్తి భక్తుల జాబితాలో చేర్చుకుంటూ పోయారు. ఇది ఎవరో చెప్పిన విషయం కాదు. 1960లలో నా చిన్నతనంలో నేనే గమనించాను – అంతేగాని, ఇతర కులస్థుల ఆర్థిక స్థోమత పెంచడానికి గానీ, వారి జీవనప్రమాణాలు పెంచడానికి గానీ  ఆ గురువులు ఏ మాత్రం పని చేయలేదు. రామానుజుడిది భక్తి ఉద్యమం. సామాజిక ఉద్యమం కాదు. లేని దేవుణ్ణి నిలబెట్టడానికి చేసిన వృథాప్రయాస. అలాంటివాడికి విగ్రహం పెట్టి ఏం సాధించాలనుకుంటున్నారూ?

Also read: పారా సైకాలజీ – సూడో సైన్స్ అని తేల్చిన శాస్త్రజ్ఞులు

ఫూలే, అంబేడ్కర్, పెరియార్ ఎందుకు?

నిజంగా రామానుజుడు దళితులకోసం కృషి చేసి ఉంటే, ఈ దేశంలో పెరియార్, అంబేడ్కర్, ఫూలే దంపతులకు పని ఉండేదే కాదు. నిమ్న కులస్థులంతా మెడకో ముంత, నడుముకో చీపురు కట్టుకుని జంతువుల కన్నా హీనంగా బతకాల్సి వచ్చేది కాదు. కేరళలో ‘నంగిలి’ అనే నిమ్న జాతి మహిళ రొమ్ము పన్ను చెల్లించలేక కొడవలితో  తన రెండు రొమ్ములూ కోసి తెచ్చి – సుంకం వసూలు చేసే అధికారి చేతిలో పెట్టేది కాదు. సరే – పాత సంగతులు వదిలేద్దాం. సమకాలీనంలో ఏం జరుగుతూ ఉంది? ప్రముఖ సంగీత విద్వాంసుడు కె.జె. జేసుదాసును ఆలయంలోకి రానివ్వకపోతే, ఆయన ఆలయం బయట కీర్తన పాడి వెళ్ళిపోయాడు కదా? ఈ దేశపు ప్రథమ పౌరుడు, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దంపతులకు ఆలయ ప్రవేశం లేదంటే గుడి బయటే పూజులు నిర్వహించుకుని తిరిగి వెళ్ళిపోయారు కదా? రామానుజుడు వెయ్యేళ్ళ క్రతమే సమత సాధించినవాడయితే, ఇప్పటికీ నిమ్న వర్గాల మీద అఘాయిత్యాలు ఎందుకు జరుగుతున్నాయి? ఓ దళిత యువతిని పెత్తందార్లు రేప్ చేస్తే వారిని రక్షించడానికి పోలీసులు అర్దరాత్రి ఆ అమ్యాయికి అంత్యక్రయలెందుకు చేశారూ? అమ్మాయి కుటుంబ సభ్యులకు కూడా తెలియకుండా అలా చేయడం అంటే – ఈ దేశభక్తులు శాంతిభద్రతలు కాపాడుతున్నట్టా? ఈ దేశంలో ఏ సమత ఉందని మతప్రచారకులు, రాజకీయనాయకులు, కార్పొరేట్లూ కొన్ని టీవీ చానల్ వాళ్ళూ మాట్లాతున్నారూ? అసలు వీళ్ళకు రామానుజాచర్యుడు ఎవరో తెలుసా? ఆయన ఏం బోధించాడో తెలుసా? మోదీ-షాలతో సహా టి.వి. ఏంకర్ల దాకా వేషాలు వేస్కుని జనాన్ని ఊదరగొట్టడం తప్ప, అసలు విషయమేమైనా మాట్లాడారా? సనాతన ధర్మం చాటి చెప్పి జనాన్ని జాగృతం  చెయ్యాలన్నారు. చాటి చెప్తారు సరే – ప్రాథమిక అవగాహన కూడా లేని ఆ సనాతన ధర్మంతో సమాజాన్ని ఎలా జాగృతం చేస్తారో చెప్పాలి కదా? దేశదేశాల నుండి సాధు, సన్యాసుల్ని, సంత్ లను ఆహ్వానించామన్నారు. ఏ దేశంవాడైతేనేమిటి? విషయమేమీ లేనప్పుడు సన్నాసి  సన్నాసి రాసుకుంటే రాలేది బూడిదే కదా?

Also read: మకరజ్యోతి మనిషి మహత్మ్యం

వైెఎస్ జగన్ మోహన్ రెడ్డితో చిన జీయర్ స్వామి

కులాలకు అతీతంగా ఏమి చేశారు?

కులాలకు అతీతంగా రామానుజుడు చేసిన పనులేమిటి? ఆయన కృషి ఫలితం సమాజం మీద ఎలా ఫడింది? చర్చించారా? ‘స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ’ అని పేరు పెట్టగానే సరిపోదు కదా? సమానత్వ స్థాపనకు ఆయన చేసిన పనులేమిటి? చెప్పాలి కదా? తను ఓ విశ్వాసంలో ఉండి,ఓ దేవుణ్ణి ప్రార్థించి మోక్షం సాధించానుకున్నాడు. అదే పని ఇతర కులాలవారినీ చెయ్యమన్నాడు. అంతేకదా? దైవభావనతో-మోక్షప్రాప్తితో సమాజం ఏ కాలంలోనైనా ముందుకు నడిచిందా? ఈ తరం వారు విశ్లేషించుకోవాలి! వెయ్యేళ్ళ క్రితం దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? గుప్తరాజుల పాలన అంతమైంది. ఉత్తర భారతదేశం మీద గజనీ మహ్మదు దండయాత్రలు (1001-1027 సీ.ఈ) సాగుతున్నాయి. దక్షిణ భారత దేశంలో పల్లవులు, చోళులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు పరిపాలిస్తున్నారు. ఎవరి రాజ్యం వారు కాపాడుకోవడంతోనే సతమతమయ్యేవారు. హేతుబద్ధంగా ఆలోచించడం తర్వాతి మాట-కనీసం అప్పటికి ప్రచారంలో ఉన్న చార్వాక దర్శనం – బుద్ధుడి బోధనలు వారి చెవికెక్కలేదు. మెల్లమెల్లగా వైదిక ప్రచారకుల ప్రభావానికి లోనై, జైనమందిరాల్ని బౌద్ధారామాల్ని దౌర్జన్యంగా ఆలయాలుగా మార్చుకుని, కొత్త దేవుళ్ళను సృష్టించుకుని, తమజన్మలు ధన్యమయ్యాయని మురిసిపోయారు. చివరికి బుద్ధుణ్ణి దశావతారాలలో చేర్చుకుని, బౌద్ధుల ఆలోచనా ధోరణిని నాశనం చేశారు.

Also read: ఫేక్ న్యూస్ గాళ్ళు లార్డ్ మెకాలేను కూడా వదలరా?

దేవుడికీ, జీవుడికీ మధ్య గురువు!

దేవుడికీ, జీవుడికీ మధ్య గురువును ప్రవేశపెట్టి ప్రమోట్ చేసింది – రామానుజాచార్యులే. ఆ గురుస్థానంతో తన వర్గమంతా రాగల కాలాలలో ఆధ్యాత్మిక ఆధిపత్యం కొనసాగించవచ్చని వ్యూహాత్మకంగా ఒక పన్నాగం పన్నిన మహానుభావుడు ఆయనే! ఆ శ్రీమన్నారాయణుడిని నేరుగా మీకు మీరే ప్రార్థిస్తే లాభం ఉండదు. అది ఒక గురువు ద్వారా ‘సమ్యక్ జ్ఞానం’ పొందాలన్నాడు – రామానుజుడు! అందువల్లనే బ్రాహ్మణ పూజారి వర్గమంతా శతాబ్దాలుగా పౌరోహిత్యంతో సునాయాసంగా బతికేస్తున్నారు. అదే బహుజనులు, ఈ దేశ మూలవాసులు విద్యలేక, ఎంత కష్టపడ్డా ఆర్థికంగా నిలదొక్కుకోలేక, నానా యాతనా పడ్డారు. సమాజంలో ప్రతి చిన్నా పెద్దా కార్యక్రమాలకు పూజారుల –పురోహితుల – మత గురువుల అవసరం తప్పని సరి అన్నట్లు రామానుజుడు జనాన్ని ప్రభావితం చేశాడు. వెయ్యేళ్ళనాటి ఆయన నిర్ణయం ఇప్పటికీ సమాజంలో కనిపిస్తోంది. అదే సంప్రదాయం/సంస్కృతిగా మారింది. తమ వైదిక మతంలోని మరోశాఖకు చెందిన వీరశైవులతో హోరాహోరిగా కొట్లాడిన వీరు – అంటే, ఈ ‘వీరవైష్ణవులు,’ సమత గురించి ఏమి చేశారని ఇప్పుడీ విగ్రహాలు? ఒక శ్రీవైష్ణవుడు చందాలు పోగు చేసి, తన కులస్థుడైన మరో శ్రీవైష్ణవుడి విగ్రహం స్థాపించినట్లే ఉంది గానీ, అంతకు మించి ఏమీ లేదు. అందుకే చారిత్రక సత్యాల్ని అర్థం చేసుకోవాల్సి  ఉంది!

Also read: మాస్ హిస్టీరియాకు గురిచేస్తున్న తెలుగు ఛానళ్ళు!

‘కులాలు ఉండాలండీ’

రామానుజుడు కులాలకు అతీతంగా జ్ఞానబోధ చేసి ఉంటే – ఆయన విగ్రహ ప్రతిష్ఠాపన చేయించిన చిన జీయర్ – ‘‘కులాలు ఉండాల’’ని ఎందుకు చెబుతున్నారు? ఆ మాటల వెనక మతలబు ఏమిటీ? ఇందులో మానవోద్ధరణ ఏముంది? సమత ఎక్కడుందీ? సర్వమానవ సౌభ్రాతృత్వం, లోకకళ్యాణం ఎక్కడుందీ? పైగా కోడిమాంసం తింటే కోడైపోతారు. మేకమాంసం తింటే మేకబుద్ధులొస్తాయి. పందిమాంసం తినేవాడు పందైపోతాడు – అని చెపితేఎలా? ప్రపంచంలో అధికశాతం జనాభా మాంసాహారులై ఉన్నారు. శాకాహారం తింటూ ఎదుటివారిని మనుషులుగా గుర్తించక వారిని కాల్చుకుతీనే అమానవీయ ప్రవృత్తిని ఏమందాం? అలాంటి అమానవీయ సంస్కృతిని ఈ దేశంలో శతాబ్దాలుగా సాగిస్తున్నదెవరూ? ఇకనైనా సరిదిద్దుకోరా? ‘‘కులాలుండాలండీ. ఎవరి పనులు వారు చేయాలండీ ’’అని టెన్త్ ఫెయిల్ అయి, పెద్ద జీయర్ దగ్గర టైపిస్టుగా బతికినవాడు చెపితే – మనమంతా ఒప్పేసుకోవాలన్నమాట! ‘‘రెండు కోట్ల సంవత్సరాల క్రితం భూమి చతురస్రంగా ఉండేది. చుట్టూ సముద్రముండేది’’ – అని చెపితే ఆ చెప్పినవాణ్ణి విజ్ఞానఖనిగా భావించాలన్నమాట! సరే, కాసేపు ఒప్పుకుందాం – కానీ వరాహావతారం గుండ్రటి భూమిని తన ముఖంతో పైకెత్తినట్టు చెపుతున్నారే. సనాతన ధర్మం ప్రకారం భూమి బల్లపరుపుగా ఉందా? గుండ్రంగా ఉందా? ముందు అది తేల్చుకోండి! పందిని తింటే పంది బుద్ధులు వస్తాయనే గురువుకు విషయం తెలిసినట్టు లేదు. పందీ, మనిషీ రెండూ క్షేరదాలే – అంటే పాలిచ్చే జంతువులే – అవునన్నా కాదన్నా అవయవాల పనితీరులో పోలికలుంటాయి. ఇటీవల పంది గుండెను చనిపోయే దశలో ఉన్న ఒక మనిషికి అమర్చి- అతనిప్రాణం కాపాడారు డాక్టర్లు! సైన్సు అందించిన మైకు పట్టుకొని,  కరోనాభయంతో ‘ఫేస్ షీల్డ్’ పెట్టుకొని – అనాగరికంగా, అర్ధనగ్నంగా పచార్లు చేస్తూ – పిచ్చి మాటలు చెప్పేవాడిని జ్ఞాని అనీ, అసిస్టెంట్ సమతామూర్తి అని…అందామా? సమాజాన్ని సహస్రాబ్దికాలంపాటు వెనక్కి నెట్టడానికి చేస్తున్న ఉత్సవాలను హర్షిద్దామా? మతంతో జనాన్ని విభజిస్తున్నదుకు నిరసిద్దామా? తుది నిర్ణయం ప్రజలదే! ప్రజల విశ్వాసాలమీద కాదు, వారి వివేకంమీద నాకు విశ్వాసం ఉంది!

Also read: విద్యావంతులు సరే, వివేకవంతులు ఎక్కడా?

Dr. Devaraju Maharaju
Dr. Devaraju Maharaju
సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

Related Articles

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles