Sunday, December 22, 2024

మరిచిపోలేని మహా స్పందన: మహాపండిత్ రాహుల్జీ సమాలోచన

(ఏప్రిల్ 9 న జరిగిన సమావేశం విశేషాలు)

అక్షరాలకి సరిహద్దులుండవు. అభిమానానికి కొలమానాలుండవు.  ఆశ్చర్యానికి అవధు లుండవు. అనుభూతులకి  వ్యాఖ్యా నాలుండవు. మహాపండిత్ రాహుల్ సాంకృత్యాయన్ జీవితం – కృషి గురించి మొన్న శనివారం కాకినాడ లో జరిగిన సభకి సంబంధించిన రిపోర్టు ఇంకా రాయలేదేమని మిత్రులు అడిగారు. ఆ ప్రజా సమూహాల అకళంకిత ప్రేమ నుండి తేరుకుని మళ్ళీ మామూలుగా మారడానికి కాస్త సమయం పడుతుందని చెప్పాను. అలాంటి నిర్మాణాత్మక సమావేశాన్ని నేనైతే ఈమధ్య కాలంలో కచ్చితంగా చూడలేదు. అంతటి జనసంద్రం ఎక్కడా కనబడలేదు. స్వచ్చందంగా స్పందించిన అశేష ప్రజల హుందాతనపు కదలికల్ని కళ్ళలో ఎప్పటికీ దాచుకోగలిగితే బాగుంటుందని అనిపించిన అద్భుతమైన సమావేశం. విశ్వనరుడై ఉండి విస్మరణకు లోనైన రాహుల్జీకి విశేషంగా తెలుగు సమాజం సగర్వంగా సమర్పించిన గౌరవం ఈ సమాలోచన కార్యక్రమం!

వందా నూటేబై మందొస్తే ఏదో విజయవంతం అయిందనిపిద్దామనే ఆలోచనతో ఉన్న నేను దాదాపు రెండొందల డెబ్భై మంది  పైచిలుకుగా వచ్చిన జనసంద్రాన్ని చూసి అవాక్కైపోయాను. నాలాగే నిశ్చేష్టులైన నిర్వాహకులు తేరుకునే లోపే నేనా  ప్రజా ప్రేమ కి పూర్తిగా ఫిదా అయిపోయాను. సరిపోని భోజనాలు, మంచి నీటి క్యానులకి కూడా మూడ్నాలుగు సార్లు బయటకి తిరగవలసి రావడం, సుమారు ఐదారు బుక్ స్టాళ్ళు విశాలాంధ్ర, ప్రత్యామ్నాయ ప్రస్థాన కేంద్రం, బహుజన బుక్ స్టాల్, బౌద్ద సాహిత్యం, ప్రగతిశీల సమాఖ్య, ఇవి కాక వీక్షణం , హేతువాది సాహిత్యం, అంబేద్కర్, ఫూలే, పెరియార్ ల ఫొటోలు పెట్టినప్పటికీ అమ్ముడుపోయిన రాహుల్జీ సాహిత్యం కోసం ఇంకా అనేకమంది అడుగుతూండటం ఆశ్చర్యం కలిగించింది. అది కాదు అసలు విషయం. ఒక పక్క ఒంటి పూట స్కూళ్ళు కనుక టీచర్లు, జిల్లాల పునర్విభజన కనుక ఉద్యోగులు, పరీక్షల సీజనని విద్యార్థులు అనుకున్న సంఖ్యలో రాలేకపోయారు. మరోపక్క అదే రోజున కోనసీమ జిల్లా మొత్తం బంద్ ప్రకటించారు. కొద్ది మంది ఇతరేతర ప్రాంతాల సమావేశాలకని ముందే నిర్ణయించుకుని వెళ్ళిపోయారు. ముందు రోజు వరకూ వస్తామని ఉదయాన్నే అనివార్య కారణాల వల్ల రాలేకపోతు న్నామని పక్క ఊరివాళ్ళే ఫోన్ చేసిన వారు దాదాపు పదిమంది కి పైగా ఉన్నారు.  ఇన్ని ఉన్నా సరే స్వచ్ఛందంగా  అంతమంది జనం ఎక్కడ నుండి తరలి వచ్చారోనని వచ్చిన వారంతా విభ్రాంతి చెందారు !

దేవి

నెల రోజుల ముందు నుండి అనుకుంటున్న సమావేశం. ప్రకటించాక ఇంట్లో జరిగిన విషాదం. రకరకాల ఒత్తిళ్ళు. వాయిదా వేయలేని ప్రయాణాలు. ఆర్థికంగా, హార్దికంగా, సామాజికంగా ఉన్న పరిమితులు.  ఇన్ని అవాంతరాల మధ్య నన్ను సంభ్రమా శ్చర్యాల్లో ముంచెత్తిన ప్రజాభిమాన ప్రవాహం  ఈ సమావేశం. మన గొప్ప కాదు, రాహుల్జీ వ్యక్తిత్వంలోని గొప్పతనం అది. మన శ్రమ కాదు, మనదనుకుని రాత్రీ పగలూ సభ కోసం కష్టపడి పని చేసిన అనేకమంది మిత్రుల అవిశ్రాంత కృషి ఇది. వచ్చినవారూ, వారు రాలేకపోయినా సామాజిక మాధ్యమాలలో కార్యక్రమం గురించి విస్తారంగా ప్రచారం చేసి ఇతోధికంగా సహకరించిన వారు ఎందరో  శ్రేయోభి లాషులు. అందరకీ శిరస్సు వంచి నమ్రతగా అభివాదాలు చేస్తున్నాను !

తెలంగాణ మహబూబ్ నగర్ నుండి వచ్చిన మిత్రులు వేణుగోపాల్ వర్మ, వెంకట్ రెడ్డి గార్లు, హైదరాబాదు నుండి వచ్చిన వై. జానకిరాం గారు, శ్రీకాకుళం నుండి వచ్చిన బెందాళం కృష్ణారావు గారు, భద్రాచలం నుంచి శీను, ఖమ్మం నుండి వచ్చిన రాధాకృష్ణ మూర్తి గారు, గుంటూరు నుండి వచ్చిన హరికృష్ణ, విజయ వాడ నుండి సత్యనారాయణ, ఏలూరు నుండి వచ్చిన రామకృష్ణ, విశాఖపట్నం నుండి వచ్చిన త్రిమూర్తులు గారు, రాధారాణి గారు, వర్మ గారు, ఈ సభ కోసం బెంగుళూరు నుండి నెల్లూరు మీదుగా ఎంతో శ్రమకోర్చి ఆత్మీయంగా వచ్చిన పెద్దలు మురళీధర్ గారు ..ఇంకా వారు హాజరు కాకున్నా సోషల్ మీడియా లో అందర్నీ ఏక్టివ్ చేసిన బాలాజి (కోల్కతా), జయప్రకాష్ (సిమ్లా) శాంతారావు (పెడన), రవికాంత్ (కోరుకొండ), రాజేంద్రన్ (రావులపాలెం) ఇలా  చెప్పుకుంటూ పోతే ఎందరో. అందరకీ ఉద్యమాభినందనలు !

వక్తలు

ఇక జిల్లా లో కార్యక్రమం కోసం పాటుపడ్డ కట్టా కృష్ణారావు గారు, స్టాలిన్ గారు, సాంకేతిక విషయాల్లో సోషల్ మీడియా మొత్తాన్ని సభ కోసం అప్రమత్తం చేసిన  పెద్దింశెట్టి రామకృష్ణ, కార్యక్రమం మొత్తాన్ని డాక్యుమెంట్ చేసే బాధ్యత తీసుకున్న మిత్రుడు లెనిన్ బాబు , ఏర్పాట్లన్ని దగ్గరుండి పర్యవేక్షించిన  సాహితీ స్రవంతి మిత్రులు  మార్ని జానకిరాం గారు, విజ్ఞాన వేదిక మిత్రులు, డా. చల్లా రవికుమార్ (మండపేట),  డా. జి. సి. పట్టాభిరామయ్య (దుళ్ళ),  కొండ (జగన్నా ధగిరి) సిద్దూ (వెదురుపాక) నానిబాబు (గొల్లప్రోలు) వి. యస్ (పిఠాపురం), సత్య నారాయణ (అన్నవరం) రామచంద్రాపురం నుండి ఈశ్వర్, రఘురాం, రాము, ప్రేమానందం తదితరులు రాజమండ్రి నుండి డా. చైతన్య శేఖర్, తాతారావు, పసల భీమన్న దంపతులు, ప్రజాపత్రిక సుదర్శన్, దాడి గంగాధరరావు, ప్రసాద్, లక్ష్మణరావు ప్రభృతులు , ఇక పెద్దాపురం మిత్రులు శివ ఇతరులు, కళా బృందం,  కాకినాడ లోని అంబేద్కర్ సంఘ సభ్యులు, జె.వి గారు, గ. నా. రా. గారు, మేకా సుబ్బారావు  గారు, సామర్లకోట నుండి రామకృష్ణ గారు, దివిలి నుండి చందర్రావు మాష్టారు  చేబ్రోలు, తుని, జగ్గంపేట, ఉప్పాడ నుండి నా మీద ప్రేమతో  వచ్చిన మిత్రులు, కళాభిమానులు, సాహిత్య కారులు, సామాజికవేత్తలు, సాంస్కృతిక రంగ కార్యకర్తలు, ప్రత్యామ్నాయ ఉద్యమకారులు, కవులు, రచయితలు, నాటక పరిషత్తు బాధ్యులు అందరకీ పేరుపేరునా సలామ్ లు!

సభాధ్యక్షులు డా. భారతలక్ష్మి గారు, డా. జ్యోస్యుల కృష్ణబాబు గారు,  అద్దేపల్లి ప్రభు గారు, కె.ఎమ్మార్ ప్రసాద్, డా. కాళ్ళకూరి శైలజ గారు..వక్తలు తెలుగు వారి కి రాహుల్జీ కృషిని అందించడం కోసం జీవితాంతం తపించిన రాహుల్జీ సాహిత్య సదన్ వ్యవస్థాపకులు ఆలూరి భుజంగరావు గారి కుమార్తె ఆలూరి కవిని గారు, శతాధిక గ్రంథకర్త, బౌద్ధ తాత్వికులు బొర్రా గోవర్దన్ గారు, వీక్షణం సంపాదకులు ఎన్. వేణుగోపాల్ గారు, సాంస్కృతిక కార్యకర్త దేవి గారు ఎవరికి వారే దీటైన ప్రసంగాలతో మళ్ళీ శ్రోతలందర్నీ రాహుల్జీ తో ప్రేమలో పడేసారు. వచ్చినవారు  నెళ్ళాళ్ళ ముందు తెచ్చిన కరపత్రాన్ని కూడా ఎంత అపురూపంగా దాచుకున్నారంటే, వారి దగ్గరున్నవి అయిపోతే వాట్ని జిరాక్స్ ప్రతులు తీసి మరీ పంచారని తెలిసి విస్మయం చెందాను. అడిగితే నా దగ్గర ఉన్నవి పంపుదును కదండీ అంటే “అవి మరెవరైనా ఉపయోగపడుతాయి. సమా వేశానికి వస్తారో రారో తర్వాత సంగతి. అసలు కరపత్రం చదివితే చాలనే ఉద్దేశంతోనే అలా పంచామండీ.” అన్నారు.  ఏం మాట్లాడ గలను ఆ అనురాగానికి, ఆత్మీయంగా గుండెల్లో పెట్టుకోవడం తప్పా!

వేణుగొపాల్

రాహుల్జీ వంటి నిబద్ధత గల త్యాగశీలుల జీవితానికి కులమత లింగ ప్రాంత వర్గాలకు అతీతంగా తెలుగు నేల చాలా సంవత్సరాల తరువాత ప్రకటించిన అద్భుతమైన నివాళి ఈ సమావేశమనేది నా అభిప్రాయం. అదే వేదికపై బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జోతిబా ఫూలే, ఉస్మానియా లో ముష్కరుల చేతిలో హత్యకు గురైన హైద్రాబాద్ చేగువేరా జార్జిరెడ్డి 50 వ వర్దంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ జైళ్ళలో అక్రమంగా మగ్గిపోతున్న రచయితలు సాయిబాబా, వరవరరావు ఇతర దళిత బహుజన ఆదివాసీ లని విడుదల చేయాలని , అక్షరాలెప్పుడూ ప్రజాపక్షమే వహించాలనీ, వహిస్తామనీ రాహుల్జీ సాంస్కృతిక సమాఖ్య స్పష్టంగా ప్రకటించింది. వచ్చిన వారందరికీ రాహుల్జీ గురించిన పాతిక వ్యాసాలతో ప్రచురించిన విశిష్ట వ్యాస సంకలన గ్రంథం, ‘ఒకే వ్యక్తి – అనేక జీవితాలు: రాహుల్ సాంకృత్యా యన్” అందజేయడం జరిగింది. పుస్తకానికి అందమైన ముఖచిత్రం వేసి పంపిన కవితకి, వ్యాసకర్తలు, అనువాదకులకి, అలాగే టైప్ చేసిన వి.యస్. గ్రాఫిక్స్ కి, చాలా తక్కువ సమయంలో అందంగా ముద్రించి ఇచ్చిన శ్రీశ్రీ ప్రింటర్స్ కి కూడా ధన్యవాదాలు. తెలుగు లో నాకు తెలిసీ రాహుల్జీ జీవితం పై  విభిన్నమైన రీతిలో వచ్చిన మొదటి అరుదైన వ్యాస సంకలనం ఇది !

సభికులు

చివరగా,అనూహ్య ప్రజానీకం వచ్చినందువల్ల చేసిన ఏర్పాట్లలో లోటుపాట్లు ఉంటే దయచేసి క్షమించమని మనవి. అలాగే సమయాభావం వల్ల అనేకమంది మిత్రుల్ని ప్రస్తావించలేదు. ఎవరినైనా అలా మర్చిపోతే అది ఉద్దేశ పూర్వకంగా కాదని దయచేసి మన్నించమని కోరుకుంటున్నాను. అలాగే ఎంతోమంది కి మాట్లాడే అవకాశం లేకపోయింది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం చేయడానికి ఎంతగా ప్రయత్నించినా  సాధ్యం కాకపోయింది. ప్రకటించిన చర్చలకి అసలు సమయమే చాలలేదు.  నన్నూ, ఇతర నిర్వాహకుల్నీ ఆశ్చర్యానికి గురిచేస్తూ దేశంలో సంక్షోభ పరిస్థితులు నెలకొన్న ఈ కాలంలో ఎంతో దూరాల్నుంచి భారమనుకోకుండా అనూహ్యమైన స్థాయిలో ఇంతమంది స్వచ్ఛందంగా  వచ్చి పూర్తిగా సమావేశంలో పాల్గొన్నారు. కొద్దిమంది వారి విలువైన భావాలు సైతం పంచుకున్నారు. రెండ్రోజుల నుండి అలసట వల్ల స్పందించడం అవలేదు. కానీ ప్రస్తుతం వ్యవస్థ లో నెలకొన్న పరిస్థితుల రీత్యా ఈ సమావేశం ఎంత ముఖ్యమో మాకు తెలుసు.  ఇప్పట్లో మళ్ళీ ఇంతటి కార్యక్రమం కుదరకపోవచ్చు. కానీ ఇంతి సంతోషానికి కారణమైన వారందరికీ  పేరుపేరునా హృదయ పూర్వక ప్రేమలు, అలాగే కార్యక్రమం మొదట్నుంచి చివరిదాకా సహకరించిన టెక్నీషియన్స్ మొదలుకుని ,  సోదర పారిశుధ్య కార్మికుల వరకూ తెర వెనుక ఉండిపోయిన పేరు తెలియని కార్యకర్తలందరకీ కూడా జోహార్లు తెలుపుతూ ఇక  ఇక్కడికిలా ఆపుతున్నాను, సెలవు!

(ఇది తక్షణ స్పందనే కానీ కార్యక్రమం పూర్తి రిపోర్టు కాదు. FB లో ఈసరికే కొద్దిమంది మిత్రులు వారి అనుభూతుల్ని, ఫొటోల్ని షేర్ చేసినందుకు ధన్యవాదాలు. త్వరలోనే పూర్తి రిపోర్టు, డాక్యుమెంటెషన్  ,కార్యక్రమం పూర్తి వీడియో మిత్రుల సహకారంతో పూర్తి చేసి బయటకి తెస్తామని మనవి. ఇక  రాహుల్జీ గురించిన వ్యాస సంకలనం సాఫ్ట్ కాపీ లేదు. హార్డ్ కాపీ కావాల్సిన మిత్రులు కాల్ చేస్తే ఎక్కడ  దొరుకుతుందో వివరాలు తెలపగలను. ధన్యవాదాలు.)

 గౌరవ్

 రాహుల్జీ సాంస్కృతిక సమాఖ్య

Gourav
Gourav
గౌరవ్, సామాజిక కార్యకర్త, రామచంద్రాపురం, డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles