తీస్తా సెతల్వాడ్
- తీస్తా సెతల్వాడ్, శ్రీకుమార్ పై కేసులను ఖండించిన అంతర్జాతీయ మేధావులు
- ప్రకటనపై సంతకం చేసిన నోమ్ చోమ్స్ కీ, తదితరులు
జాకియా జాఫ్రీ కేసులోనూ, ఇతర కేసులలోనూ భారత సర్వోన్నత న్యాయస్థానం ఇటీవల ఇస్తున్న తీర్పులు భారత దేశంలో పౌరస్వేచ్ఛ, మానవ హక్కుల భవిష్యత్తును ప్రభావితం చేసే విధంగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని అంతర్జాతీయ విద్యావేత్తలూ, హక్కుల పరిరక్షకులూ, మేధావులూ ఒక ప్రకటనలో తెలియజేశారు.
‘‘జాకియా కేసులో తీర్పు మూడు ప్రశ్నలను లేవనెత్తింది. ఒకటి, గోధ్రా విషాదం అనంతరం జరిగిన గుజరాత్ అల్లర్లపైన ప్రత్యేక దర్యాప్తు బృందం (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ – సిట్) గుజరాత్ ప్రభుత్వాన్ని నిర్దోషిగా తేల్చుతూ సమర్పించిన నివేదిక సంతృప్తికరంగా లేదనీ, సుప్రీంకోర్టు మళ్ళీ స్వతంత్ర దర్యాప్తు నిర్వహించేందుకు ఒక సంఘాన్ని నియమించాలనీ పిటిషనర్లు కోరారు. ఏ నివేదికనైతే తప్పుపట్టారో అదే నివేదికను ఆధారం చేసుకొని అప్పీలును కొట్టివేయడం అన్యాయం. రెండు, ఈ పిటిషన్ ను కొట్టివేస్తూ న్యాయస్థానం పిటిషనర్ లకు దురుద్దేశాలు ఆపాదిస్తూ అన్యాయంగా వ్యాఖ్యానాలు చేసింది. దీనివల్ల ప్రభుత్వం పిటిషనర్ తీస్తా సెతల్వాడ్ నూ, సాక్షి ఆర్ బి శ్రీకుమార్ నూ అరెస్టు చేసింది. వారికి బెయిలు మంజూరు చేయడం లేదు. చాలా సహనంతో సుదీర్ఘమైన, శాంతియుతమైన, న్యాయబద్ధమైన పోరాటం చేయడాన్ని ‘కీపింగ్ ద పాట్ బాయిలింగ్’ (విషయాన్ని అదేపనిగా ప్రస్తావిస్తూ వెలుగులో ఉంచడం)గా అభివర్ణించడం పిటిషనర్ల మనోభావాలను గాయపరచడమే కాకుండా ప్రభుత్వ అత్యాచారాలనూ, నిర్లక్ష్యాన్నీ ప్రశ్నించడానికి భవిష్యత్తులో ఎవ్వరూ సాహసించకుండా నిరోధిస్తుంది. మూడు, ఈ వ్యాఖ్యలు ఎవరిపైన అయితే చేశారో వారికి తమ వాదన వినిపించే అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంగా, అన్యాయంగా కోర్టు వ్యవహరించింది.
‘‘ఆత్యయిక పరిస్థితి అమలులో ఉన్న రెండు సంవత్సరాలు మినహా దేశ ప్రజాస్వామ్య వ్యవస్థనూ, నిబద్ధతనూ పరిరక్షించే కార్యక్రమంలో సుప్రీంకోర్టు గౌరవప్రదమైన పాత్ర పోషించింది. అందుకే ఇటీవల జాకియా జాఫ్రీ కేసులో సుప్రీంకోర్టు తీర్పు మాకు దిగ్భ్రాంతి కలిగించింది. ఈ కేసులో తీర్పు వల్ల ఉత్పన్నమైన పరిణామాల విషయంలో సూమోటోగా చర్యలు తీసుకోవాలనీ, తీర్పు చెబుతూ న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలను తొలగించాలనీ, ఆ వ్యాఖ్యలపైన ఆధారపడి అరెస్టు చేయడంకోసం పెట్టిన కేసులను వెంటనే కొట్టివేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం’’ అని ప్రకటన తెలిపింది.
ఈ ప్రకటనపైన భికూ పరేఖ్ (హౌస్ ఆఫ్ లార్డ్స్ , లండన్, యూకే), నోమ్ చామ్స్ కీ (ప్రొఫెసర్ ఎమిరిటస్, మసాచ్యూసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ప్రొఫెసర్, యూనివర్సిటీ ఆఫ్ అరిజోనా, అమెరికా), అర్జున్ అప్పాదురై (ప్రొఫెసర్, మాక్స్ ప్లాంక్ ఇన్ స్టిట్యూట్, జర్మనీ), వెండీ బ్రౌన్ (ప్రొఫెసర్, ఇన్ స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్, ప్రిన్స్ టన్, యూఎస్ఏ), షిల్డన్ పొల్లొక్ (ప్రొఫెసర్ ఎమిరిటస్, కొలంబియా యూనివర్సిటీ, యూఎస్ఏ), కరోల్ రోవేన్ (ప్రొఫెసర్, కొలంబియా యూనివర్సిటీ, యూఎస్ఏ), చార్లెస్ టేలర్ (ప్రొఫెసర్ ఎమిరిటస్, మాక్ గిల్ యూనివర్సిటీ, కెనడా), మార్తా నస్స్ బామ్ (ప్రొఫెసర్, యూనివర్సిటీ ఆఫ్ చికాగో, యూఎస్ఏ), రాబర్ట్ పోలిన్ (ప్రొఫెసర్, యూనివర్సిటీ ఆఫ్ మసాచ్యూసెట్స్, ఆమ్రెహెస్ట, యూఎస్ఏ), అకీల్ బిల్గ్రామీ (ప్రొఫెసర్, కొలంబియా యూనివర్సిటీ, యూఎస్ఏ), గెరాల్డ్ ఎప్స్టీన్, యూనివర్సిటీ ఆఫ్ మెసాచ్యూసెట్స్, యూఎస్ఏ)లు ఈ ప్రకటనపైన సంతకాలు చేశారు.