- చరంజిత్ చన్నీకి అవకాశం
- పదవి స్వీకరించేందుకు అంబికా సోనీ నిరాకరణ
- సిక్కు, హిందూ మతాల నుంచి ఇద్దరు ఉపముఖ్యమంత్రులు
దిల్లీ : కెప్టెన్ అమరీందర్ సింగ్ మంత్రివర్గంలో సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా ఉన్న దళిత సిక్కు రాజకీయ నాయకుడు చరంజిత్ సింగ్ చన్నీ పంజాబ్ కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారు. అమరీందర్ సింగ్ రాజీనామా సమర్పించిన తర్వాత మూడు రోజులకు కాంగ్రెస్ అధిష్ఠానవర్గం ఈ నిర్ణయం ప్రకటించింది. 58 సంవత్సరాల చన్నీ మూడు విడదల అసెంబ్లీకి గెలిచారు. రూప్ నగర్ చామ్ కౌర్ సాహిబ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న చన్నీ పంజాబ్ కు తొలి దళిత ముఖ్యమంత్రి. పంజాబ్ జనాభాలో 31 శాతం మంది దళితులు. వచ్చే సంవత్సరం లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న కారణంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తీసుకున్న ఈ నిర్ణయం కీలకమైనది. దళిత ప్రతినిధిగా ముఖ్యమంత్రి ఉంటారు కనుక ఇద్దరు ఉపముఖ్యమంత్రులను సిక్కు, హిందూ మతానికి చెందినవారిని నియమించే అవకాశం ఉంది. దళిత ఓట్లు చీల్చే ఉద్దేశంతో అకాలీదళ్ మాయావతి నాయకత్వంలోని బహుజన సమాజ్ పార్టీతో పొత్తు పెట్టుకున్నది. ఈ ఎత్తుకు పైఎత్తుగా కాంగ్రెస్ దళిత నాయకుడినే ముఖ్యమంత్రిగా ప్రకటించింది.
ఒక మహిళా ఐఏఎస్ అధికారి చన్నీపైన లైంగికంగా వేధించారనే ఆరోపణలు చేశారు. 2018లో చన్నీ ఏదో అభ్యంతరకరమైన, అసభ్యకరమైన సందేశం పంపినట్టు ఆరోపణ. ఆ అధికారి ఫిర్యాదు చేయలేదు. కానీ ప్రభుత్వం స్పందన కోరుతూ రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసు పంపడంతో ఈ విషయం మే నెలలో తెరమీదికి వచ్చింది. కెప్టెన్ మంత్రివర్గంలో మరో సభ్యుడు సుఖ్ జీందర్ సింగ్ రంధవా పేరు ఆదివారం మద్యాహ్నం వరకూ వినిపించింది. పార్టీ అధిష్ఠానవర్గం నిర్ణయం పట్ల రంధవా సంతోషం వెలిబుచ్చారు. రాజీనామా చేసిన కెప్టెన్ అమరీందర్ సింగ్ కొత్త ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. సరిహద్దు రాష్ట్రమైన పంజాబ్ ను భద్రంగా ఉంచగలుగుతారనీ, ప్రజలను క్షేమంగా చూసుకుంటారనీ ఆశిస్తున్నానంటూ కెప్టెన్ నర్మగర్భంగా సందేశం ఇచ్చారు. పీసీసీ అధ్యక్షుడు నవజోత్ సిద్ధూతో నెలల తరబడి విభేదాలూ, వివాదాల తర్వాత తాను అవమానాలను ఇక ఏమాత్రం సహించలేనంటూ కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా చేశారు. అంతకు ముందు మొత్తం 80 మంది కాంగ్రెస్ ఎంఎల్ఏలలోనూ 50 మంది కెప్టెన్ ను తొలగించాలని కోరుతూ సోనియాగాంధీకి లేఖ రాశారు. ‘అవమానాలు ఇక చాలు’ అంటూ సోనియాగాంధీకి కెప్టెన్ ఫోన్ చేసి తాను రాజీనామా చేయబోతున్నట్టు తెలియజేశారు. సోనియా సరేనన్నారు. కాంగ్రెస్ ముఖంగా సిద్ధూను తాను అంగీకరించే సమస్య లేదని కెప్టెన్ కుండబద్దలు కొట్టనట్టు చెప్పారు. ఇది జాతీయ భద్రతకు సంబంధించిన విషయమంటూ నొక్కి చెప్పారు.
ఈ రోజు పంజాబ్ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం జరిగింది. అంబికా సోనినీ ముఖ్యమంత్రి పదవిని స్వీకరించమని కోరారు. ఆమె అందుకు నిరాకరించారు. సిక్కుమతస్థులే ముఖ్యమంత్రిగా ఉండాలనే అభిప్రాయాన్ని ఆమె వెలిబుచ్చారు. ఆ తర్వాత చన్నీని ఖరారు చేశారు.