కొత్త బడ్జెట్ ప్రవేశపెట్టే వేళ అందరూ గంపెడు ఆశలు పెట్టుకున్నారు. కడచిన సంవత్సరాల్లో బడ్జెట్స్ ఎట్లా ఉన్నా, కరోనా కష్టకాలంలో రూపొందించిన బడ్జెట్ ఎలా ఉండబోతుందో అనే ఉత్సుకత, ఉత్సాహంతో భారతీయులందరూ ఎదురుచూస్తున్నారు. వేతన జీవులు, మధ్యతరగతి ప్రజలు పెంచుకొనే ఆశలు ఇంతవరకూ ఎప్పుడూ పెద్దగా నెరవేరలేదు. ముందుగానే మీడియాలో రకరకాల కథనాలు రావడం సర్వ సాధారణం. తీరా బడ్జెట్ వెల్లడయిన తర్వాత చల్లబడిపోవడం కూడా సాధారణమే.
ఎవరికి తోచిన వ్యాఖ్యానం వారు చేస్తారు
అధికార పక్షాలు అద్భుతం అంటారు. ప్రతిపక్షాలు పెదవి విరుస్తారు. విశ్లేషకులు ఎవరికి తోచినట్లు వారు వ్యాఖ్యానం చేస్తారు. ఇది ప్రతిసారీ జరిగే తంతు. కానీ, ప్రస్తుతం లోకం, దేశం ఏమీ బాగాలేవు. కోవిడ్ కొట్టిన దెబ్బ అంతాఇంత కాదు. పూర్తిగా ఎప్పుడు కోలుకుంటామో ఇప్పుడే చెప్పలేం. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రవేశపెడుతున్న బడ్జెట్ విలక్షణంగా ఉంటేనే దేశానికి ప్రయోజనం. అంకెలగారడీ, ఊకదంపుడు ఉపన్యాసాలతో వనకూరేది ఏమీ ఉండదు.
ఆశలు రేకెత్తిస్తున్న ఆర్థికమంత్రి
ఇవన్నీ ఇలా ఉండగా ” ఎన్నడూ చూడనటువంటి బడ్జెట్ ” అంటూ ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బోలెడు ఆశలు రేకెత్తిస్తున్నారు.ఆమె కూడా మధ్య తరగతి కుటుంబం నుంచే వచ్చి, మంత్రి దాకా ఎదిగారు. ఆ తరగతివారి సాధకబాధకాలు ఆమెకు అనుభవమే. ప్రధానమంత్రి నరేంద్రమోదీ దిగువ మధ్య తరగతి కుటుంబాల నుంచి వచ్చారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి నేపథ్యం కూడా అటువంటిదే. బడ్జెట్ రూపకల్పనలో వారి అనుభవాలను రంగరించాలి. సామాన్యుడికి మేలు జరగాలి. దేశానికి కొత్త ఉత్తేజం కావాలి. పన్నుల మినహాయింపు, శ్లాబుల్లో మార్పులు, ఇన్సూరెన్స్, రుణాల్లో రాయితీలు తక్షణం అవసరం.
Also Read : మహాత్ముడి పట్ల మహాపచారం
ప్రతి రాయితీ సంజీవని
కరోనా ప్రభావంతో చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. చాలామంది వేతనాల్లో కోతలు ఎదుర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చే ప్రతి రాయితీ వీరికి సంజీవని అవుతుంది. గత బడ్జెట్ లో కొన్ని మార్పులు తెచ్చినప్పటికీ, అవి పెద్దగా ఊరటను ఇవ్వలేదు. ఆదాయాన్ని బట్టి సెక్షన్ 80సీ పరిధిని సవరించాలి. భీమాలో టరమ్ ప్లాన్ తీసుకోవడాన్ని ప్రోత్సహించేలా ఈ సెక్షన్ లో మార్పులు తేవాలి. ఇళ్ల కొనుగోళ్లలో రాయితీ పెరిగితే అటు ప్రజలకు – ఇటు రియల్ ఎస్టేట్ రంగానికి కలిసివస్తుంది.
గృహరుణాలలో రాయితీ పెంచాలి
ప్రస్తుతం గృహరుణాలపై మూలమొత్తం చెల్లింపుల్లో 1.5 లక్షలకు వరకే రాయితీ ఉంది. దీన్ని కనీసం 2.5లక్షలకు పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు. సెక్షన్-బి కింది పన్ను పరిధిలోని ఆదాయం తగ్గింపు రూ. 5 లక్షలకు పెంచితే ఎక్కువమందికి ప్రయోజనం కలుగుతుంది. ఈక్విటీ పెట్టుబడులపై ప్రస్తుతం ఉన్న పన్నులను తగ్గిస్తే రిటైల్ ఇన్వెస్టర్లకు ఎక్కువ లబ్ధి చేకూరుతుంది. కరోనా దుష్ప్రభావం చిన్న, మధ్య తరగతి పరిశ్రమలపై ఎక్కువగా పడింది.
లాక్ డౌన్ నష్టాలు గమనించాలి
అర్ధాంతర లాక్ డౌన్, కార్మికుల వలస వల్ల ఫ్యాక్టరీలు నిర్వహించలేకపోయారు. ఈ రంగాలకు ప్రభుత్వ ఊతం అందించడం అత్యవసరం.ప్రభుత్వం గతంలో పి ఎల్ ఐ స్కీమ్ (ప్రొడక్షన్ లింక్ ఇన్సెంటివ్ స్కీమ్ ) ను ప్రవేశపెట్టింది. దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించడం దీని లక్ష్యం. ఈ పథకం కొన్ని రంగాలకే పరిమితం చేశారు. దీని విస్తృతిని పెంచితే అటు ఉత్పత్తి, ఇటు పెట్టుబడులు గణనీయంగా పెరుగుతాయని ఉత్పత్తి రంగ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read : చైనాతో వేగడం ఎలా?
పన్నుల విధానం సరళతరం
ప్రత్యక్ష పరోక్ష పన్నుల్లో ఉన్న సంక్లిష్ట విధానాలను తొలగించి సరళతరం చెయ్యాలి. భారత్ లో ఉన్న ఈ సంక్లిష్టతల వల్ల టెస్లా వంటి కంపెనీలు అడుగుపెట్టడానికి వెనకాడాయని చెబుతారు. అంతర్జాతీయ ప్రమాణాలు పాటించకపోతే అంతర్జాతీయ న్యాయస్థానాలలో ఇబ్బందులు వస్తాయని గతం చెబుతోంది. ప్రపంచంలోనే అత్యధిక పన్నురేటు వున్న దేశాలలో భారతదేశం ఉండడం గమనార్హం. విదేశీ పెట్టుబడులకే కాక, దేశీయంగానూ నిర్వాహకులకు భారమవుతుందని ఆర్ధికరంగ నిపుణులు విమర్శిస్తున్నారు.
కొనుగోలు శక్తి పెంచాలి
ప్రజల కొనుగోలు శక్తి పెరగడం ప్రభుత్వానికి ముఖ్యం. దీని ద్వారా పన్నుల రూపంలో ఆదాయం పెరుగుతుంది. మార్కెట్ కూడా ఊపందుకుంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని పన్ను శ్లాబుల్లో మార్పులు, స్టాండర్డ్ డిడక్షన్ లో వెసులుబాటు కల్పించాలి. ఈ దిశగా ప్రభుత్వం ఇప్పడికే కొంత అలోచించినట్లు తెలుస్తోంది. ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి పలు సంస్కరణలు కూడా అత్యంత అవసరం. పెట్టుబడులకు ప్రాధాన్యం ఇవ్వాలి. అదే సమయంలో వినియోగాన్ని పెంచాలి. చిన్న, మధ్య తరగతి సంస్థలకు నగదు లభ్యత పెరిగేలా ప్రతిపాదనలు ఉండాలి.
Also Read : రైతు ఉద్యమంలో దేశద్రోహులు
రైల్వేల ఆధునికీకరణకు చర్యలు
బిజెపి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైల్వే బడ్జెట్ ను కూడా ఇందులోనే కలిపారు. రైల్వే వ్యవస్థల్లో చాలా మార్పులు తేవడానికి, ఆధునికతను మరింతగా అందిపుచ్చుకోడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కేంద్ర బడ్జెట్ వల్ల ఆంధ్రప్రదేశ్ కు ఎటువంటి ప్రయోజనాలు వనకూరుతాయో తేలాల్సివుంది. విభజన సమయంలో ఇచ్చిన హామీలనైనా నెరవేరుస్తారా? అని వేయికళ్ళతో ఆంధ్ర ప్రజ ఎదురుచూస్తోంది. విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ అమలు, ప్రత్యేకహోదా మొదలైన అంశాల్లో ఏదైనా ప్రగతి వుంటుందా? అనే చర్చలు రాష్ట్రంలో జరుగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ కి పరిశ్రమలు తరలి రావాలి
రాష్ట్రంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు రావాల్సి వుంది. కేంద్ర ప్రభుత్వ రంగ పరిశ్రమలు, ప్రైవేట్ రంగ పరిశ్రమలు వచ్చేలా కేంద్రం చొరవ తీసుకోవాలి. రాష్ట్రంలో ఉపాధి పెరగాలి.రెవిన్యూ లోటును భర్తీ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం కోరిన మొత్తం నిధులను మంజూరు చేయాలి.గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుపై స్పష్టత కూడా రావాల్సి వుంది. పోలవరం ప్రాజెక్టుకు సంపూర్ణమైన సహకారం అందించాలి.రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో మంజూరైన ప్రాజెక్టులు పూర్తి కావాలి.
Also Read : యోగ్యులను వరించిన పద్మపురస్కారాలు
అందరికీ గంపెడాశలు
రైల్వే ప్రాజెక్టులు సంపూర్ణమవ్వడానికి రాష్ట్రానికి రావాల్సిన నిధులను విడుదల చేయాలి. సామాన్యుడి నుంచి పారిశ్రామక వేత్తల వరకూ, వ్యాపారుల నుంచి రాష్ట్ర ప్రభుత్వాల వరకూ కొత్త బడ్జెట్ పై గంపెడు ఆశలు పెట్టుకొని ఉన్నారు. కరోనా కాలాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని కొత్త బడ్జెట్ నిర్మాణం ఉండాలి.దేశాన్ని, ప్రజలను విజయాలబాటలో నడిపిస్తారా? ఊసురోమనిపిస్తారా? త్వరలోనే తేలిపోతుంది. నిర్మలమ్మ మాట నిలబెట్టుకుంటారని విశ్వసిద్దాం.
Also Read : రామోజీరావు – ఉన్నది ఉన్నట్టు