కాంగ్రెస్ ‘పహ్లీ నౌక్రి పక్కి శిక్షణ’ వాగ్దానం ఊపునివ్వగలదా?
రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేల ఉద్యోగ హామీ వాగ్దానం బీజేపీ గొంతులో పచ్చివెలక్కాయ అయింది. దానికి దీటైన వాగ్దానం కోసం అదిప్పుడు వెతుకులాడక తప్పదు. గెలుపు ఎవరిదైనా సరే, ఇది మంచి రాజకీయం.
ఎట్టకేలకు రాజకీయాలు నిరుద్యోగసమస్య వైపు మళ్ళాయి. ఇదెంతో శుభవార్త. వీథిపోరాటాలనుంచి విధానాలవైపు, నిరుద్యోగుల హాహాకారాలనుంచి ఉద్యోగాల సృష్టికి సంబంధించిన ఆలోచనలవైపు, ఏ వైపునా ఆశాలేశం కూడా లేని స్థితిలో ఓ చిన్నపాటి ఆశాకిరణంవైపు రాజకీయాలు జరగడాన్ని ఇది సంకేతిస్తోంది. తను అధికారంలోకి వస్తే ‘యువ న్యాయ్ హామీ’ పేరుతో అమలు చేస్తామని చెబుతూ కాంగ్రెస్ విధానపరమైన అయిదు ప్రతిపాదనలను ముందుకుతేవడం దీనికి నాంది. భారత్ జోడో యాత్రలో భాగంగా రాజస్థాన్ లోని బాన్శ్వాడాలో జరిగిన ర్యాలీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ చేసిన ఉద్యోగ హామీ వాగ్దానం బీజేపీ జోరును అడ్డుకునేలా కనిపించి, దానితో పోటీపడగల వాగ్దానం కోసం ఆ పార్టీ వెతుకులాడాల్సిన పరిస్థితిని కల్పించింది. గెలుపు ఎవరిదైనా సరే, ఇది మాత్రం మంచి రాజకీయం.
రైతులకు కనీస మద్దతుధర అందేలా చూస్తామన్న హామీ తర్వాత కాంగ్రెస్ ఇచ్చిన రెండవ హామీ ఇది. ఇందులో రాజకీయవిజ్ఞతా, విధానపరమైన ఆలోచనల అసాధారణసమ్మేళనం ఉట్టిపడుతోంది. అసలు సమస్యనంటూ మొదట గుర్తిస్తే పరిష్కారం దిశగా తొలి అడుగు వేయగలుగుతాం. రాహుల్ గాంధీ చేపట్టిన రెండో విడత భారత్ జోడో యాత్రలో ప్రతిచోటా ప్రముఖంగా ముందుకొచ్చిన సమస్య నిరుద్యోగమే. దేశం ఎదుర్కొంటున్న ప్రధానసమస్యగా ప్రతి జనాభిప్రాయసేకరణ పట్టికల్లోనూ ప్రథమస్థానాన్ని ఆక్రమించుకున్నది ఈ సమస్యే. కాంగ్రెస్ చేసిన ఈ ప్రకటన ద్వారా సమస్య తీవ్రతను రాజకీయంగా గుర్తించినట్లయింది. గుర్తింపు తర్వాత చేయవలసింది బాధితుల గోడు వినిపించుకోవడం. నిరసనమార్గం పట్టిన యువత లేవనెత్తిన అంశాలకు హామీ ప్రకటన అద్దంపట్టడంలో అది స్పష్టంగా కనిపించింది. నిరుద్యోగయువత ఆకాంక్షలు, డిమాండ్లలో కొన్ని కాంగ్రెస్ ప్రతిపాదనల్లో చోటుచేసుకున్నాయి. అయితే, యువ న్యాయ్ హామీ కేవలం రాజకీయంగా అనుకూలించేమేరకు చేసిన ఉద్యమకారుల డిమాండ్ల పునరుద్ఘాటన కాదు. కాంగ్రెస్ పార్టీ మేధోబృందం కొన్ని ఊకదంపుడు ఉపాయాలనో, మాంత్రిక చిట్కాలనో కాకుండా బాధ్యతా, సృజనశీలం కలిగిన పరిష్కారాలను ముందుకు తేవడానికి ప్రయత్నించింది.
ముప్పై లక్షల ప్రభుత్వోద్యోగాల కల్పనకు ఉద్దేశించిన “భర్తీ భరోసా” హామీ అత్యధికంగా ఆకర్షిస్తుందనడంలో సందేహంలేదు. ఎక్కడెక్కడ ఉద్యోగాలు సృష్టించగలరో, అందుకు అవసరమైన వనరులు ఎక్కడినుంచి వస్తాయో గుర్తించగలిగితే నిజంగా అది మహత్తరమైన హామీయే. మనదేశం ఎదుర్కొంటున్న అసలు సమస్య- ప్రభుత్వోద్యోగవ్యవస్థ విపరీతంగా ఉబ్బిపోవడమో, ఉద్యోగాల ఖాళీలు లేకపోవడమో కాదు. పరిమాణంలో మనంతే ఉన్న ఇతర ఆర్థికతలతో పోలిస్తే, మనదేశంలో ప్రభుత్వోద్యోగుల సంఖ్య తలసరిన తక్కువే. కేంద్రప్రభుత్వంలోనే దాదాపు 10 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. కేంద్రప్రభుత్వం మద్దతుతో అమలు జరిగే అంగన్ వాడీ, ఆశా వర్కర్లలాంటి పథకాల్లో; కేంద్రప్రభుత్వ విద్యా, ఆరోగ్య సంస్థలు సహా విద్యా, ఆరోగ్యరంగాల్లో మరో 3లక్షల ఉద్యోగాలను కల్పించడానికి ఎంతైనా అవకాశముంది. ఇటీవలి సంవత్సరాలలో ప్రభుత్వరంగసంస్థల్లో అమలు చేస్తున్న ఉద్యోగుల తగ్గింపు చర్యలను విరమించడం ద్వారా అదనంగా మరో 2లక్షల ఉద్యోగాలను దీనికి జోడించవచ్చు. ఆ విధంగా ప్రస్తుతమున్న ఏర్పాటు పరిధిలోనే కనీసం 15లక్షల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఎంతైనా అవకాశముంది. విద్యావంత నిరుద్యోగుల ఆకాంక్షలను నెరవేర్చడానికి ఇదొక మంచి ప్రారంభమవుతుంది.
విద్యావంత నిరుద్యోగులకు ఉద్యోగాలు
15లక్షల అదనపు ఉద్యోగాల లెక్కింపు ఎంతో జాగ్రత్తగా ప్రణాళికాబద్ధంగా జరగడం అవసరం. కేవలం ఉద్యోగాలు కల్పించడం కోసమే సర్కారీ ఉద్యోగాలను సృష్టించడం తెలివైన విధానమూ కాదు; స్థిరతకు సాయపడేదీ కాదు. కొత్త ఉద్యోగాలు కొత్త అవసరాలను, లేదా వాయిదాపడిన అవసరాలను తీర్చగల విధంగా ఉండాలి. సామర్థ్యాలను, జీవనప్రమాణాలను పెంచడం లక్ష్యంగా, కేంద్రప్రభుత్వం మద్దతుతో అమలు జరిగే పథకాల ద్వారా ప్రభుత్వపు పెట్టుబడులను మానవ వనరులరంగానికి భారీ ఎత్తున విస్తరింపజేయడం ఉత్తమమార్గంగా కనిపిస్తోంది. శిశుసంరక్షణ, విద్య, ప్రాథమిక, ప్రాథమికోత్తర ఆరోగ్యసంరక్షణవ్యవస్థను విస్తరింపజేయడం, బలోపేతం చేయడం, వృద్ధుల సంరక్షణ, పర్యావరణ పునరుత్పాదకతా రంగంలో ‘హరిత ఉద్యోగాలు’ లక్ష్యంగా రాష్ట్రాలలోనూ, స్థానికసంస్థల్లోనూ అదనపు ఉద్యోగనియామకాలు ఇందులో భాగమవుతాయి. రాబోయే రోజుల్లో చాలావరకు ఈ దిశగా విధానప్రకటన రాగలదని ఆశిద్దాం. అలాగే, ఇలాంటి విస్తరణకు అవసరమైన అదనపు వనరులను ఎలా సమీకరిస్తారో తెలియజేయడం, దానిపై చర్చ జరగడం కూడా అవసరం. 7వ వేతనసంఘం సిఫార్సుల మేరకు ఈ అదనపు ఉద్యోగులకు జీతాలు చెల్లించవలసివచినప్పుడు కేంద్ర బడ్జెట్ లో వేతనాలకు కేటాయించే మొత్తం ఏమేరకు ఉంటుందన్న ప్రశ్న కూడా ఎదురవుతుంది.
“పెహ్లీ నౌక్రి పక్కి” అనే రెండో ప్రతిపాదన మరింత ఆకర్షణీయంగా ఉంది. ఇది మౌలికంగా ‘ఉద్యోగశిక్షణ హక్కు’ను కల్పించే పథకం. పాతికేళ్ళ లోపు వయసున్న ప్రతి పట్టభద్రుడూ, డిప్లొమా అర్హత ఉన్నవారూ ఉద్యోగశిక్షణ కింద ఏడాదికి లక్షరూపాయలు పొందేందుకు ఇది చట్టబద్ధమైన హామీని కల్పిస్తుంది. నిజానికి ఇది పక్కా నౌకరీ, అంటే శాశ్వత ఉద్యోగకల్పనేమీ కాదు. అలాగే, ఈ చట్టపరమైన హక్కును సాంఘికప్రజాస్వామ్యవాదులు కలలు కనే పని హక్కుగానూ భావించలేం. కాకపోతే, “ప్రతి చేతికీ పని కల్పించండి”(హర్ హాత్ కొ కామ్ దో)అనే జనబాహుళ్యంలో ఉన్న డిమాండ్ కు ద్రవ్యపరంగా వెసులుబాటు, ఆర్థికంగా అర్థవంతత కలిగిన ఆచరణరూపం. కనుక ఈ పథకం గురించిన పూర్తి వివరాలపై ఓ కన్నేసి ఉంచాల్సి ఉంటుంది. నిరుద్యోగభృతి ఇవ్వడం కన్నా, నిరుద్యోగయువతకు ప్రభుత్వ, లేదా ప్రైవేట్ రంగంలో ఉద్యోగం కల్పించడం ఎంతో మెరుగైన విధానం అనడంలో సందేహంలేదు. కాకపోతే, ఈ పరిమితకాలపు శిక్షణదశ తమ నైపుణ్యాలను పెంచుకోవడానికీ, తద్వారా తమ ఉద్యోగార్హతను పెంపొందించుకోవడానికీ సాయపడుతుంది. ఆయా నైపుణ్యాలలో శిక్షణ పొందినవారు అతి తక్కువ ఖర్చుతో లభిస్తారు కనుక ఇది ప్రైవేట్ వ్యాపారాలను కూడా విశేషంగా ఆకర్షించగలుగుతుంది. శిక్షణపొందినవారు అందుబాటులో ఉంటారు కనుక ఆమేరకు ప్రైవేట్ వ్యాపారాలలో ఉన్నవారికి ఒక రాయితీ లభిస్తుంది. ఈ శిక్షణపొందినవారిలో మరింత మెరుగైన నైపుణ్యం ఉన్నవారిని కంపెనీలో శాశ్వతప్రాతిపదికపై నియమించుకునే అవకాశమూ ఉంటుంది.
ఇక్కడ కూడా గణాంకాలపై లోతుగా దృష్టి పెట్టి చర్చించాల్సిన అవసరం ఉంది. డిప్లమో, లేదా పట్టభద్రత, లేదా అంతకన్నా ఉన్నత అర్హతను పొందే యువత ఏటా దాదాపు 95లక్షలమంది ఉంటారు. వీరిలో 75లక్షలమంది ఉద్యోగాల వేటలో పడతారు. వీరిలో సగం మందికి తాము కోరుకున్న ఉద్యోగం రాలేదనుకుంటే, ఉద్యోగశిక్షణపథకానికి అర్హులైనవారి సంఖ్య దాదాపు 40 లక్షలు ఉండవచ్చు. ఇది పెద్ద సంఖ్యే కానీ, అసాధ్యమైనదేమీ కాదు. వ్యవస్థితరంగంలో అయిదుకోట్లు, అంతకుమించిన వ్యాపారస్థాయి కలిగిన సంస్థలు 10లక్షలవరకూ ఉన్నాయి. ఇవి ఒక్కొక్కటీ సగటున నలుగురిని శిక్షణకు తీసుకోగలుగుతాయి. ఆయా కంపెనీలు తమ మొత్తం ఉద్యోగుల సంఖ్యలో 2.5నుంచి 15 శాతం వరకూ శిక్షణ సిబ్బందిని నియమించుకోవడాన్ని 1961 నాటి అప్రెంటిసెస్ చట్టం ఇప్పటికే తప్పనిసరి చేస్తోంది. ప్రస్తుతం 45వేల కంపెనీలు మాత్రమే ఈ నిబంధనను అమలు చేస్తున్నాయి. చట్టపరమైన నిర్దేశాల ద్వారా, ప్రభుత్వ నిధులను అందించడం ద్వారా మొత్తం వ్యవస్థితరంగం ఇందులో భాగస్వామి అయ్యేలా చూడవలసి ఉంటుంది. ఆపైన తగిన ప్రోత్సాహకాల ద్వారా క్రమంగా అవ్యవస్థితరంగాన్ని కూడా ఇందులోకి తీసుకురావచ్చు. ఇందుకయ్యే మొత్తం వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తే అది 40వేల కోట్లవరకు ఉంటుంది; సగం వ్యయాన్ని కంపెనీలే భరించేలా చేయగలిగితే అది 20వేల కోట్లు అవుతుంది. నిశితంగా పరిశీలించి నిగ్గు దేల్చాల్సిన వివరాలు ఇంకా చాలా ఉన్నాయి. కాకపోతే ఇది సరైన మార్గంలో రాజకీయంగా వేసే అతి పెద్ద ముందడుగు అవుతుందన్నది నిస్సందేహం.
ఈ తొలి రెండు భారీప్రతిపాదనలకూ ఆచరణరూపమిచ్చి ముందుకు తీసుకెళ్లడంలో మిగతా మూడు ప్రతిపాదనలూ ఎంతో ఉపయుక్తమైన చేయూత నిస్తాయి. ‘పేపర్ లీక్ సే ముక్తి’నే తీసుకుంటే, ప్రశ్నపత్రాల వెల్లడికి బాధ్యులైనవారిని ‘తీవ్రంగా’ శిక్షిస్తామన్న రొడ్డకొట్టుడు వాగ్దానాన్ని దాటి వెళ్ళి చేసిన ఆలోచన అది. శిక్షతీవ్రతను పెంచడమే ఏ నేరాన్ని అరికట్టడానికైనా పరిష్కారమన్న తప్పుడు ఆలోచనపై చేసే వాగ్దానం అది.
యువ న్యాయ్ హామీ ఇంకా మరెన్నింటికో వాగ్దానం చేస్తోంది. ప్రభుత్వరంగ నియామకాలకు సంబంధించి అదొక ప్రవర్తనా నియమావళిని నిర్దేశిస్తోంది; ఒక కాలానుక్రమణికను, పారదర్శకసూత్రాలనూ విధిస్తోంది; ప్రభుత్వోద్యోగాలను కోరుకునే రెండు కోట్లమంది యువత ఆశలను నీరుగార్చే అవినీతి, అక్రమాల నిరోధానికి తగిన విధివిధానాలను కల్పిస్తోంది. మరో ప్రతిపాదన, రాజస్థాన్ లోని ఇంతకుముందటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసినదానినీ; ఇప్పుడు దానికి మరిన్ని మెరుగులు దిద్దుతూ తెలంగాణ ప్రభుత్వం సిద్ధం చేస్తున్న పథకాన్నీ వరవడిగా తీసుకుని తాత్కాలిక ప్రాతిపదికపై పనిచేసే కోటిమంది పనివారిని సాంఘికభద్రతా కవచం కిందికి తేవడాన్ని ప్రతిపాదిస్తోంది.
చివరిగా, యువత కొత్తగా ప్రారంభించే వ్యాపారాలకు రుణసాయం అందించడానికి 5వేల కోట్ల రూపాయలనిధిని “యువ రోష్ని” పథకం ప్రతిపాదిస్తోంది. ప్రస్తుతం యువతకు అమలు చేస్తున్న ముద్రా యోజన పథకానికి ఇది సవరించిన రూపంలా కనిపిస్తోంది. అయితే ముద్రా రుణపథకానికి పట్టిన గతే దీనికీ పట్టకుండా జాగ్రత్తగా సమీక్షించుకోవాల్సి ఉంటుంది.
ప్రచార ప్రాముఖ్యం
ఎన్నికల వాగ్దానం, అదెంత మంచిదైనా, నిరుద్యోగసమస్యకు పరిష్కారం కాదు. ఈ సమస్య సంక్షోభస్థాయికి ముదిరిన సంగతిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు, విధానపరమైన ఇలాంటి ప్రతిపాదన ఏదైనా నిరంతరాయంగానూ, నిలకడగానూ అమలు జరగాలన్న సంగతి అర్థమవుతుంది. పూరించుకోవలసిన ఖాళీలు చాలా ఉన్నాయి; డేటాకు సంబంధించిన అంశాలపై స్పష్టత తెచ్చుకోవాల్సి ఉంటుంది. అలాగే, అదనపు ఆర్థిక వనరుల ఉత్పత్తి ఎలా అన్న అతి పెద్ద ప్రశ్నకు సమాధానాన్ని రాబట్టుకోవాల్సి ఉంటుంది. రాబోయే ఎన్నికల సందర్భంనుంచి చూసినప్పుడు, కాంగ్రెస్ ఆశాభావాన్ని రేకెత్తించే లెక్కలను ముందుకు తేవడాన్ని తప్పుపట్టలేం. అదీగాక, ఈ పథకాలు చాలావరకూ విద్యావంత నిరుద్యోగులను లక్ష్యం చేసుకుంటూ పాఠశాలవిద్య కూడా పూర్తి చేయలేకపోయిన సగం మంది నిరుద్యోగయువతను పక్కన పెడుతున్నాయి. ఏదేమైనా ఇలాంటి ఏ పథకమైనా చాలావరకు ఉపశమనస్వభావంతోనే ఉంటుంది. మనం అనుసరిస్తున్న ఉద్యోగరహిత ఆర్థికవృద్ధి నమూనాలోనూ; విద్యార్థులకు ఉపాధికి తోడ్పడే జ్ఞానాన్ని కానీ, నైపుణ్యాలను కానీ అందించని విద్యావ్యవస్థలోనూ సమూలమైన మార్పులు తేవడంలోనే నిరుద్యోగసమస్యకు నిజమైన పరిష్కారం ఉంటుంది.
వచ్చే రెండు నెలలపాటూ, ఒక విధానపరమైన చర్యగా ఈ ప్రతిపాదనల ప్రభావాన్ని కాక, రాజకీయంగా ఈ ప్రకటన చేకూర్చగల ప్రయోజనాన్ని అంచనా వేయడానికే ఎక్కువ అవకాశముంది. ఆవిధంగా విధానాన్ని, రాజకీయాలను మించి ఇదొక ప్రచారాంశంగా పరిణమిస్తుంది. ‘ఇండియా’లోని భాగస్వామ్యపక్షాలను అన్నింటినీ కలుపుకుంటూ, యువతకు, రైతులకు చెందిన సమస్యలపై తన ఎన్నికల ప్రచారాన్ని కేంద్రీకరిస్తూ కాంగ్రెస్ తన ఉద్యోగహామీ ప్రతిపాదనలను, కనీస మద్దతు ధర హామీని విశేషప్రచారంలో ఉంచి దేశం దృష్టిని ఆకర్షించగలదా అన్నది ప్రశ్న. ఈ ప్రశ్నకు మన దగ్గర ఇంకా సమాధానం లేదు. ఇప్పుడు మనకు తెలుస్తున్నదల్లా కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ ప్రకటన ప్రజాక్షేత్రంలో చర్చను రేపుతున్నదనీ, బీజేపీ సహా ఇతర పార్టీలు ఇంతకన్నా మెరుగైన ప్రతిపాదనలు చేయడానికి మల్లగుల్లాలు పడుతున్నాయని మాత్రమే. ఇది నిరుద్యోగయువతకు, మన ఆర్థికతకూ కూడా అత్యంత శుభవార్త. విద్య, ఆరోగ్యం, పర్యావరణ, ఉద్యోగకల్పనతో ముడిపడిన ఏ రాజకీయమూ అశుభవార్త కాబోదు.