Monday, January 27, 2025

వ్యధాభరిత కథావిశ్వనాధుడు

ఆయన కథలన్నీ గొప్పవి. ఆయన వాటికంటే ఇంకా గొప్పవాడు. ఈ గొప్పతనం సహజ ప్రతిభ వల్ల, సాధన వల్ల, ఆచరణ వల్ల, పరిశీలన వల్ల, మంచితనం వల్ల వచ్చినవి.ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రలో ఎన్నో గొప్ప కథలు ఉన్నాయి, ఎందరో గొప్ప కథకులు ఉన్నారు. వారందరిలో రావిశాస్త్రిది విభిన్నమైన ధోరణి, విలక్షణమైన విధానం, సులక్షణమైన తీరు. కొంతమంది కథకులు తాము ఎంచుకున్న కథావస్తువు చాలా గొప్పది అంటుంటారు, గొప్పగా చెబుతున్నామనీ అనుకుంటారు. కానీ,పాఠకులు అనుకోవాలి కదా? అందుకే వాళ్లెవరూ రావిశాస్త్రి వలె పాఠకలోకంలో నిలబడలేదు, నిలబడలేరు.

Also read: మోదీపై సై అంటున్న దీదీ

వెంటాడే రచనలు

మనసు పొరలను,మెదడు అరలను తొలచివేస్తూ, శరవేగంగా చదివించడమే కాక, చదివేటప్పుడు భావోద్వేగాలకు,రససిద్ధికి గురిచేయడమే కాక, చదవడం ముగిసిన తర్వాత  కూడా వెంటాడే రచనే గొప్పది. ఆ కథలోని పాత్రలు,మాటలు,సన్నివేశాలు  కొన్నాళ్లపాటు మనల్ని అక్కడే ఉండేట్టు చేస్తాయి.అలా సాగినదే గొప్ప కథ,గొప్ప నవల.రావిశాస్త్రి కథలన్నీ అలాంటివే.మనసు,మెదడు ఏకకాలంలో విభిన్న స్పందనలకు గురి అయ్యేట్టు చేసే అనల్ప కథాకథన శిల్పం రావిశాస్త్రి సొంతం. ప్రతి కథలో గొప్ప బిగి ఉంటుంది. మనతో ఎవరో మాట్లాడుతున్నట్లు, మనపై ఎవరో కోప్పడుతున్నట్లు, మన చెవిలో ఎవరో హితబోధ చేస్తునట్లు, మన గుండెను ఎవరో పిండినట్టు, మనల్ని ఎవరో నడిపిస్తున్నట్లు.. ఉంటుంది రావి శాస్త్రి కథాకథన సంవిధానం. “లోకంబు వీడి రసంబు లేదు” అంటాడు విశ్వనాథ సత్యనారాయణ.  ఈ విశ్వనాథుడు లోకం నుంచే కథలు పుట్టించాడు,రసం పండించాడు. రావిశాస్త్రి చేతిలో ఏదో మత్తుమందు ఉంది. అందుకేనేమో ఇన్నేళ్ల నుంచి వెంటాడుతున్నాడు. తను, తండ్రి,తాత అందరూ న్యాయవాదులే. తాత నుంచి వృత్తి మెళుకువలు నేర్చుకున్నాడు. తండ్రి కాడి మధ్యలో పడేసి వ్యవసాయంలోకి వెళ్లిపోయినా, ఈయన మాత్రం న్యాయవాదాన్నే  ఎంచుకున్నాడు. ధర్మాన్నే నమ్ముకున్నాడు. న్యాయవాద వృత్తిని అమ్మకపు వస్తువుగా చూడలేదు. నమ్మిన వాళ్ళవైపు నిలిచాడు. ఆయనను నమ్ముకున్న వాళ్లంతా కటిక పేదవాళ్లే. వారి గుండెల్లో ‘ఇల్లు’కట్టుకున్నాడు. శాస్త్రిబాబు… శాస్త్రిబాబు అంటూ పేదోళ్లు ఆయన చుట్టూ తిరిగారు. ఆయన న్యాయం,ధర్మం చుట్టూ తిరిగాడు. ఈ ప్రయాణంలో ఎవరికీ వెరవలేదు, దేనికీ లొంగలేదు. పోలీస్, న్యాయస్థానాలు,పాలన, రాజకీయాలు మొదలైన వ్యవస్థల్లో వ్యవస్థీకృతమైన లోపాలను ఎత్తి చూపిస్తూ, ఘాటైన చురకలు వేస్తూ కథలు అల్లినా,కథం తొక్కుతూ పోరాటం చేసినా.. వాళ్లందరికీ వ్యక్తిగతంగా రావిశాస్త్రంటే చెప్పలేని గౌరవం,చాలా ఇష్టం.

Also read: కర్ణాటక తెరపై కొత్త ముఖం

ఆయన తిట్టినా ఆనందమే!

ఆయన తిట్టినా చాలా అందంగా ఉంటుందని,ఆ చురకలో ఏదో చమక్కు ఉంటుందని, ఆ పనిలో లోకోపకారం ఉంటుందని వారందరూ భావించేవారు. ఆయనంటే పేదోళ్లకు ఎంత ప్రేమో,పెద్దోళ్లకు అంత హడల్.తను నమ్మిన మార్గంలో ఊచలు లెక్కపెట్టినా, తన పంథా మార్చుకోలేదు. సామాన్యుల జీవితాలే ఎక్కువగా ఆయన కథా వస్తువులు. జీవితంలో ప్రతి క్షణం ఓడిపోతున్న, మోసపోతున్న,కోల్పోతున్న బక్కవాళ్ళందరూ ఆయన కథల్లో పాత్రలు. సమాజాన్ని శాసిస్తున్న వ్యవస్థలను అంత పచ్చిగా,అంత అందంగా ఎవరూ తూర్పారపట్టలేదు. ప్రజల భాష,ఉత్తరాంధ్ర యాస ఎంచుకున్నాడు. అందులో గురజాడ ప్రభావం కూడా ఉంది. చెణుకులో శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి ఉంటాడు. చమత్కారంలో,బలమైన వాక్కులో శ్రీశ్రీ కూడా ఉంటాడు. ఇందరి ప్రభావం ఉన్నా,తన భావప్రకటన కొత్తగా ఉంటుంది, భాష గమ్మత్తుగా ఉంటుంది. గురజాడ ‘కన్యాశుల్కం’లో వలె ఉత్తరాంధ్ర మాండలీకం తొంగి చూసినా, అన్ని సీమల తెలుగువాళ్ళు రావిశాస్త్రిని హాయిగా చదువుకున్నారు.  ప్రతి పలుకునూ,ప్రతి నడకనూ మనసారా తమలో కలుపుకున్నారు. అందుకే కథా రచనలో చాలామందిని దాటి ముందుకు వెళ్లిపోయాడు. విరసంతో కొంతకాలం సావాసం చేసినా,ఆయన సరసం ఆయనదే. కొన్ని సందర్భాల్లో ఆయన అన్న మాటలు స్టేట్ మెంట్లు అయిపోయాయి. ప్రముఖ కథకుడు భరాగో వంటివారిపై ఆయన ప్రభావం చాలా ఎక్కువ. రావిశాస్త్రికి సంబంధించిన ముచ్చట్లు మొదలు పెడితే  కాలమే తెలియకుండా గడిచిపోతుంది. ఆయన కథలు, ఆయన సంభాషణలు, ఆయన చేసిన మేళ్లు ఆన్నీ గొప్పవే. ఆయనను అనుకరించాలని చాలామంది ప్రయత్నించారు, ప్రయత్నిస్తూనే ఉన్నారు. అది కుదిరే పని కాదు.అది ఆయనకే చెల్లింది.

గొప్ప కథకుడే కాదు గొప్పమనిషి కూడా

రావిశాస్త్రి కేవలం గొప్ప కథకుడే కాదు,గొప్ప మనిషి. ఈ అనుకరించడానికి పూనుకునే కథకులు ఆయన మనిషితనాన్ని కూడా అందిపుచ్చుకుంటే అదే చాలు, కొంత సమాజమైనా బాగుపడుతుంది. తను పరిశీలించిన జీవితాలను కథల్లో పెట్టడమే కాదు, ఆ జీవితాలు బాగుపడడానికి,  చెడిపోకుండా ఉండడానికి అహరహం తపించాడు. ఆయనకు గొప్ప పేరు తెచ్చిపెట్టిన నవల ‘అల్పజీవి’. మూడు పదుల వయస్సులో రాశాడు. జేమ్స్ జాయిస్ ప్రభావంతో రాశానని చెప్పుకున్నాడు. రచనలోని నడకలో వేగం పాఠకులను విశేషంగా ఆకట్టుకుంది. ఆ పదాల వెంట పరుగులు తీస్తూ చదువుకున్నారు. ఆయనలో ఆ వేడి,ఆ వేగం చివర వరకూ అలాగే సాగాయి. రావిశాస్త్రిలోని ఆ విశిష్ట విశేష కథాకథన శిల్పమే ఆయనను ఇన్నేళ్ల పాటు ప్రత్యేకంగా నిలపింది. పిరికివాడికి ధైర్యం నూరిపోయాలని, చెడ్డవాడికి బుద్ధిచెప్పాలని, అమాయకుడిలో తెలివిని వికసింపజేయాలని, పేదవాడి జీవితంలో దీపాలను వెలిగించాలన్నది ఆయన తహతహ. విభిన్న అంశాలపై అసంఖ్యాకంగా రచనలు చేశాడు.ఆరు సారా కథలు, ఆరు సారో కథలు, సొమ్ములు పోనాయండి, ఋక్కులు, గోవులొస్తున్నాయి జాగ్రత్త, రత్తాలు-రాంబాబు,రాజు మహిషీ మొదలైనవన్నీ ప్రసిద్ధమే. నిజం,తిరస్కృతి, విషాదం వంటి నాటకాలు, నాటికలు కూడా రాశాడు.ఆయన రచించిన చివరి నవల ‘ఇల్లు’. పురస్కారాలను తిరస్కరించడం, వెనక్కు ఇచ్చేయడం ఇప్పుడు సంచలన వార్తలు అవుతున్నాయి. ఈ పనులన్నీ ఆయన అప్పుడే చేశాడు. ఆంధ్రవిశ్వవిద్యాలయం ప్రకటించిన ‘కళాప్రపూర్ణ’ను తిరస్కరించాడు. కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డును వెనక్కు ఇచ్చేశాడు.

Also read: కవికోకిల జాషువా

మంచికి హాని చేయకుండా, చెడుకు తోడ్పడకుండా…

గుర్తింపు కోసం, భుజకీర్తుల కోసం ఆయన ఏదీ రాయలేదు. ఏవీ చేయలేదు. సగటు మనిషి కోసం,తన ఆత్మతృప్తి కోసమే పనిచేసుకుంటూ వెళ్లిపోయాడు. ఆ క్రమంలో  అంతటి గుర్తింపు వచ్చింది.”తాను వ్రాస్తున్నది ఏ మంచికి హాని కలిగిస్తుందో, ఏ చెడ్డకు ఉపకరిస్తుందో అని అలోచించాల్సిన అవసరం ఉంది.మంచికి హాని,చెడ్డకు సహాయము చెయ్యకూడదని నేను భావిస్తున్నాను”… అని రావిశాస్త్రి అన్న మాటలు చాలా గొప్పవి. గొప్ప న్యాయమూర్తి మాత్రమే అంత గొప్ప మాటలు అనగలడు. అందుకే, ఆయన న్యాయవాదిగా,కథకుడుగా, మనిషిగా అంత గొప్పవాడిగా గొప్పకీర్తి గడించాడు. 30 జులై 1922న శ్రీకాకుళంలో జన్మించి  10 నవంబర్ 1993లో విశాఖపట్నంలో తనువు చలించారు. విశాఖపట్నం అంటే ఆయనకు చెప్పలేనంత ఇష్టం.”ఆ ఏడు కొండల కంటే? మా యారాడ కొండలు గొప్పవి” అన్న ఆయన మాటలు.. ఎప్పటికీ ఆ కొండల గుండెల్లో మ్రోగుతూనే ఉంటాయి. శతవసంత సమయంలో,కొండంత రాచకొండ విశ్వనాథశాస్త్రిని తలచుకుంటూ కొలుచుకుందాం. ఆయన సాహిత్యం,వ్యక్తిత్వం తరతరాలకు చాటిచెప్పే పనిలో ప్రభుత్వాలు, ప్రజలు భాగస్వామ్యం కావాలి.రావిశాస్త్రి ‘వందేళ్ల పండుగ’ ను ఘనంగా జరుపుకోవాలి.

(రావి శాస్త్రి శతజయంతి శుక్రవారం నుంచి ప్రారంభం)

Also read: రామప్ప ఆలయానికి విశ్వవిఖ్యాతి

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles