Thursday, December 26, 2024

మెట్టుదిగని సర్కార్, రాజీపడని రైతు

ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమ తీవ్రత ఇసుమంత కూడా తగ్గలేదు. అదే వాడి, వేడి నడుస్తోంది. కేంద్రంతో జరిగిన చర్చలు మరోమారు అర్ధాంతరంగానే ముగిసాయి. ఈ చర్చలు జరగడం ఇది 7వ సారి. వచ్చే 8వ తేదీనాడు  మళ్ళీ మరోమారు చర్చలు జరిగే అవకాశం ఉందని సమాచారం. సాగు చట్టాలపై ప్రతిష్ఠంభన కొనసాగుతూనే ఉంది. ముగింపు ఎప్పుడో కూడా చెప్పలేని పరిస్థితి నెలకొని వుంది.

ఇరువైపులా సడలని వైఖరి

సాగు చట్టాల రద్దు, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని రైతులు భీష్మించుకుని కూర్చున్నారు. కేంద్రం చట్టాలు రద్దు చేయడానికి ఒప్పుకోవడం లేదు. రెండూ భీష్మ ప్రతిజ్ఞలుగానే ఉన్నాయి. భయంకరమైన చలి, కరోనా వైరస్ వ్యాప్తిని ఏమాత్రం లెక్కచేయకుండా రైతులు ఉద్యమం సాగిస్తూనే ఉన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి నేటి వరకూ ఇంత తీవ్రస్థాయిలో రైతులు ఉద్యమం చేయడం ఇదే మొదటిసారి. ఈ దీక్షకు ఇప్పటికే మండలం పూర్తయింది. చట్టాల రద్దు తప్ప ప్రత్యామ్నాయం ఏమీ లేదా? అని రైతు సంఘాలను కేంద్రమంత్రులు అడిగినట్లుగా రైతు నేతలు చెబుతున్నారు.

‘తటస్థ’ మేధావుల ప్రసంగాలు

సోమవారం నాడు,సుమారు 40 రైతు సంఘాలకు సంబంధించిన ప్రతినిధులతో ముగ్గురు కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, పీయూష్ గోయల్, సోం ప్రకాష్ చర్చలు జరిపారు. రాజకీయ పార్టీలకు అతీతంగా ఉండే, తటస్థులైన కొందరు మేధావులతో కూడా కొత్త  చట్టాల వల్ల ఒనగూరే ప్రయోజనాలపై అధికార పార్టీ  మాట్లాడిస్తోంది. ప్రజల్లో ఈ చట్టాలపై వ్యతిరేకభావం కలగకుండా ఉండడం కోసం బిజెపి ప్రభుత్వం పలు రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. చట్టాలను సంపూర్ణంగా అధ్యయనం చేయకుండా, పూర్వాపరాలు తెలియకుండా ఈ మేధావులు మాట్లాడుతున్నారని కొందరు రైతునేతలు విమర్శిస్తున్నారు.

మీడియాపై ప్రభుత్వ అసంతృప్తి, రైతు నేతల ఆగ్రహం

దేశ వ్యాప్తంగా మీడియా నుండి కూడా ఆశించిన స్థాయిలో వాస్తవ రూపాలు వెల్లడికావడం లేదని కొన్ని రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అంబానీ, అద్వానీ కార్యాలయాల్లో తయారైన డ్రాఫ్ట్ లను పార్లమెంట్ లో బిల్లులగా తీసుకొచ్చారని రైతు నేతలు  తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. వీళ్లంతా అసలైన రైతు సంఘాల ప్రతినిధులు కారని, ప్రతిపక్షాలు ఎగదోసిన మనుషులని బిజెపి నేతలు ఘాటుగా ప్రతి విమర్శలు గుప్పిస్తున్నారు. ఏది ఎలా ఉన్నా, ఉద్యమం ఆగడం లేదు. ఫెడరల్ విధానం మేరకు వ్యవసాయ అంశం రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉందనీ, ఐనప్పటికీ తనకున్న అమేయమైన అధికారంతో కేంద్రం రాష్ట్రాలపై పెత్తనం చేస్తోందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.

Also Read : కొలిక్కిరాని చర్చలు.. మళ్లీ 8న భేటీ

కార్పొరేట్ కంపెనీల పెత్తనమా?

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఈ చట్టాల వల్ల, ప్రస్తుతం అందుబాటులో ఉన్న మార్కెట్ యార్డులు మూతపడతాయని, కార్పొరేట్ కంపెనీలు ఏ ధర నిర్ణయిస్తే ఆ ధరకే అమ్ముకోవాల్సిన దుస్థితి వస్తుందని, వాళ్లు ఎట్టి పరిస్థితుల్లో తక్కువ ధరలకే కొనాలని చూస్తారని, ఈ నేపథ్యంలో, కనీస మద్దతు ధర రైతుకు గగన కుసుమమే అవుతుందని రైతు సంఘాల నేతలు వాదిస్తున్నారు. బిజెపి ప్రభుత్వం 2016లోనే వ్యవసాయ చట్టాల సంస్కరణలపై దృష్టి సారించిందనీ, అందులో భాగంగా 2017లో ఏపిఎంసి  మోడల్ చట్టం ( అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ ) ,2018లో మోడల్ కాంటాక్ట్ ఫార్మింగ్ యాక్ట్ నిర్మించిందనీ రైతు నేతలు అంటున్నారు. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నివేదికలు తెప్పించుకుందని,2020 ఫిబ్రవరిలో ఈ అంశాల కేంద్రంగా ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో మాట్లాడారని, తర్వాత జరిగిన పరిణామాల్లో వీటన్నిటిని బుట్టదాఖాలు చేశారని రైతు సంఘాల నేతలు విమర్శిస్తున్నారు.

ఏకపక్షంగా బిల్లుల ఆమోదం

రైతు సంఘాలతో చర్చలు జరుపకుండా , ప్రతిపక్షాలతో మాట్లాడకుండా,సెలెక్ట్ కమిటీ దృష్టికి తీసుకెళ్లకుండా, ఏకపక్షంగా ఈ చట్టాలు తెచ్చారని రైతు నేతలు అగ్రహిస్తున్నారు. 2017, 2018లో రూపొందించిన మోడల్ చట్టాల ప్రకారం సవరించి సరికొత్త చట్టాలను తేవడమే దీనికి ఏకైక పరిష్కారమని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ సంఘాల సమన్వయ కమిటీ కన్వీనర్,  లోక్ సభ మాజీ సభ్యులు వడ్డే శోభనాద్రీశ్వరరావు  సూచిస్తున్నారు. ప్రస్తుతం ఉద్యమం చేస్తున్న అన్ని రైతు సంఘాల ఏకైక డిమాండ్ ఒకటే. కొత్త చట్టాలను రద్దు చేయడమే వారి నినాదం. కనీస మద్దతు ధర కల్పించడమే వీరి నివేదన.

Also Read : అన్నదాత ఆక్రందన పెడచెవిన పెట్టడం అనర్థం

కొన్ని రాష్ట్రాల ధిక్కారం

కేరళ మొదలు కొన్ని రాష్ట్రాలు కేంద్రం తెచ్చిన కొత్త చట్టాలను  అమలు చేయబోమని, ఈ అంశం రాష్ట్రాల పరిధిలోనిదని తేల్చిచెప్పాయి. రాష్ట్ర శాసనసభల్లో తీర్మానాలు చేసినా, లోక్ సభలో ప్రవేశ పెట్టిన బిల్లుకే అధికారం ఎక్కువ ఉంటుందని మేధావులు చెబుతున్నారు. మార్కెటింగ్, పంపిణీ, అంతర్రాష్ట్రాల అంశాలన్నీ కేంద్ర ప్రభుత్వం పరిధిలోనే ఉన్నాయి. రాష్ట్రాలకు రావాల్సిన ఇన్సెంటివ్ లు, ఇంకా అనేక ఆర్ధిక ప్రయోజనాలు కేంద్రం చేతిలోనే ఉన్న నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలకు పరిమితులు ఉన్నట్టుగానే భావించాలి. ఫెడరల్ వ్యవస్థలో పొందుపరిచిన అంశాలు, విధానాలు ఏమి చెబుతున్నా, రాష్ట్ర ప్రభుత్వాల పరిధి కేంద్రం ముందు తక్కువేనని ఒప్పుకోవాలి. రైతులకు -కేంద్రానికి జరుగుతున్న ఈ యుద్ధం ఎటువంటి మలుపులు తీసుకుంటుందో కాలమే నిర్ణయిస్తుంది.

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles