Thursday, November 21, 2024

మణిపూర్ లో ఆగని జాతివిద్వేషజ్వాల

  • రావణకాష్టంగా ఈశాన్యరాష్ట్రం
  • రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల వైఫల్యం

ఈ మధ్యకాలంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య రగిలిపోతున్న రాష్ట్రం మణిపూర్. కొన్నాళ్ళుగా అక్కడ జరుగుతున్న సంఘటనలు అగ్గిలో ఆజ్యం పోస్తున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఇద్దరు మహిళలపై జరిగిన అమానుష ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ వేడి వార్త ఉడుకుతుండగానే మరో వార్త తాజాగా హల్ చల్ చేస్తోంది. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ప్రాంతానికి 40కిలోమీటర్ల దూరంలో అదే రోజున మరో ఇద్దరు యువతులపై సామూహిక హత్యాచారం జరిగినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. జాతీయ మీడియాలో ఈ కథనాలు వెల్లువెత్తుతున్నాయి. జాతుల మధ్య వైరం, రిజర్వేషన్ల రభస, అమలులో వున్న ప్రత్యేక చట్టాలు, స్వతంత్రత కోసం జరుగుతున్న పోరాటాల నడుమ  మణిపూర్ మరో కశ్మీర్ గా  రూపమెత్తనుందా? అనే భయాలు చుట్టుముడుతున్నాయి. హిందూ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా చీలిపోతున్న ఈ పోరాటాలు రాజకీయ రంగుపులుముకొని ముదిరి పాకాన పడుతున్నాయి. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న ఈ తరుణంలో, ఎన్డీఏ వ్యతిరేకశక్తులన్నీ ఎక్కమయ్యే ఈ కాలంలో, ‘ఇండియా’ పేరుతో విపక్షాలు మణిపూర్ అంశాన్ని పెద్ద ఆయుధంగా మలుచుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మౌనం వీడి సమాధానం చెప్పాలని పట్టుబడుతున్నాయి. ముఖ్యంగా బిజెపి – కాంగ్రెస్ యుద్ధంగా ఇది మారుతోంది.

Also read: సార్వత్రిక ఎన్నికలకు సర్వత్రా కసరత్తు

మైనారిటీలుగా మారుతామని హిందువుల ఆందోళన

ఉద్యమాలు, పోరాటాల పేరుతో మణిపూర్ లో హిందువులను మైనారిటీలుగా మార్చే కుట్ర జరుగుతోందని బిజెపి అనుకూల వర్గాలు -హిందూ యేతరులను అణగదొక్కే పనిలో బిజెపి ప్రభుత్వం పడిపోయిందని బిజెపి వ్యతిరేక వర్గాలు, ముఖ్యంగా కాంగ్రెస్ విమర్శనాస్త్రాలను గురిపెట్టి బలంగా వదులుతున్నాయి. మణిపూర్ లో జరిగే దుర్ఘటనలు, ఉద్రిక్తతలకు చైనా మద్దతు పలుకుతోందని, ఆయుధాలు అందిస్తోందని కూడా విమర్శలు వినపడుతున్నాయి. సరే! బర్మా-మణిపూర్ మధ్య తగాదాలు ఎట్లాగూ వున్నాయి. మణిపూర్ మంటల వెనుక బర్మా హస్తం ఉండవచ్చునని కొందరు అనుమానిస్తున్నారు. ఆ రాష్ట్రంలో ప్రధానంగా కుకీ -మైతేయ్ మధ్య విద్వేషాలు ఎన్నోఏళ్ళ నుంచి రగులుతూనే వున్నాయి. ఈ హింసలో ఇప్పటికే ఎందరో ధనమానప్రాణాలను కోల్పోయారు. మైతేయ్ తెగను ఎస్టీలుగా గుర్తించాలన్న అంశమే అగ్గికి ఆజ్యం పోసింది. ఆదివాసీ తెగలన్నీ దీనిని వ్యతిరేకిస్తూ పోరాటబట్టాయి. ఇందులో మహిళాయోధుల పాత్ర ప్రధానంగా కనిపిస్తోంది. ఈ రాష్ట్రంలో మొదటి నుంచి వీరమహిళలు ఎక్కువగానే వున్నారు. మణిపూర్ లో అతి పెద్ద వర్గం మైతేయులు. వీరిని మణిపురీలనీ అంటారు. జనాభా లెక్కల ప్రకారం చూసినా వీరే అధికసంఖ్యలో ఉంటారు. వీరంతా ఎక్కువ భాగం మైదాన ప్రాంతాలలోనే ఉంటారు. రాజధాని ఇంపాల్ లోనూ వీరిదే పైచేయి. వీరంతా ప్రధానంగా హిందువులు.

Also read: శ్రీరమణ పెన్నుమూశారు

జనాభా ఎక్కువ, భూమి తక్కువ

60అసెంబ్లీ స్థానాలు కలిగిన మణిపూర్ లో 40స్థానాలు ఇంపాల్ లోయ ప్రాంతంలోనే వున్నాయి. వీరికి వ్యతిరేక వర్గంగా పేరుబడిన కుకీలు క్రిస్టియన్లు. కుకీలు, వీరికి తోడు నాగాలను ఎస్టీలుగా ప్రభుత్వం గుర్తిస్తోంది. చట్టాల ప్రకారం ఎక్కువ శాతం భూభాగం వీరి చేతుల్లోనే వుంది. అధిక సంఖ్యాకులైన మైతేయులకు వున్న భూభాగస్వామ్యం చాలా తక్కువ. బయట నుంచి శరణార్థులుగా కొందరు, విభిన్న రూపాల్లో కొందరు మణిపూర్ లోకి వలస వస్తున్నారు. తమ ప్రాంతంలో భూములను కొనుక్కొనే హక్కు మిగిలినవారికి వున్నా, పర్వత ప్రాంతాల భూమిపై తమకు హక్కులేకపోవడం దారుణమని మైతేయుల వాదన. ఈ తీరు ఇట్లాగే కొనసాగితే సొంతభూమిపై మైనారిటీలుగా మారిపోతామనే భయాన్ని మైతేయులు వ్యక్తం చేస్తున్నారు. ఎస్టీలుగా గుర్తించడమే ఏకైక పరిష్కారంగా వీరు భావిస్తున్నారు. 1949లో భారత్ లో కలవక ముందు మైతేయులను ఆదివాసులుగానే గుర్తించారని, ఆ హోదాను పునరుద్ధరించాలని మైతేయుల మణిపూర్ హైకోర్టులో కేసు వేశారు. దీని అనుకూలంగా హైకోర్టు ఏప్రిల్ 14న తీర్పు ఇచ్చింది. నాలుగు వారాల్లో మైతేయులకు ఎస్టీ హోదా కల్పించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని  ఆదేశించింది.

Also read: ఐటీ భవితవ్యం ఏమిటి?

ఆదివాసీల యుద్ధభేరి

అప్పటి నుంచి కుకీలు, నాగాలు యుద్ధభేరి మోగిస్తున్నారు. ఆదివాసీ విద్యార్థి సంఘాలు పెద్దఎత్తున పోరాటంలోకి దుమికాయి. ఈ ఘర్షణల్లో వందమందికి పైగా మరణించారు. వేలమంది నిరాశ్రయులయ్యారు. సుమారు 140 మంది దాకా మరణిస్తే వీరిలో అత్యధికులు కుకీలే. పోరులో ఇటు హిందూ దేవాలయాలు -అటు చర్చిలు బూడిదయ్యాయి. ధ్వంసమైన హిందూ దేవాలయాలకంటే చర్చీలు ఎక్కువ. కేంద్ర ప్రభుత్వం తరపున హోంమంత్రి అమిత్ షా ఇరువర్గాలతో చర్చలు జరిపారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు రెండూ మైటీలను బలపరుస్తున్నాయని జనాభిప్రాయం. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పర్యటించి కుకీలకు మద్దతు పలికారు. ఓటు బ్యాంక్ రాజకీయాల నడుమ హిందూ -క్రిస్టియన్ల పోరుగా మారిందనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. ఈ అంశాన్ని బిజెపి, కాంగ్రెస్ తమకు అనుకూలంగా మలుచుకోవడం కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఓట్లు, రాజకీయ పెత్తనం, అధికార, ఆర్థిక స్వార్ధాలు ఎట్లా వున్నా, మణిపూర్ లో శాంతిని స్థాపించడం జాతీయ అవసరం. మతకల్లోలాలు, వర్గపోరు మిగిలిన రాష్ట్రాలకు పాకకుండా చూడడం చారిత్రక అవసరం. ప్రజాస్వామ్యయుతంగా, హేతుబద్ధంగా చర్చ జరగాలి. అందరికీ సమన్యాయం జరగాలి.

Also read: ఎంత బాగుందో చూడు ‘ఈ-కళ్ళజోడు!’

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles