- డెత్ ఓవర్ లో అపూర్వ సంచలనం
- ఒక్క పరుగూ ఇవ్వకుండా నాలుగు వికెట్లు పడగొట్టిన వైనం
- షాక్ తిన్న పంజాబ్ కింగ్స్
శ్రీనగర్ లో పుట్టి సన్ రైజర్ హైదరాబాద్ జట్టులో బౌలర్ గా రాణించి ఉమ్రాన్ మాలిక్ హైదరాబాద్ కూ, కశ్మీర్ కూ గర్వకారణమైనాడు. పంజాబ్ కింగ్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆదివారం మధ్యాహ్నం తలబడినప్పుడు ముందుగా పంజాబ్ కింగ్స్ బ్యాట్ చేశారు. మొత్తం ఇరవై ఓవర్లలో చివరి ఓవర్ ను డెత్ ఓవర్ అంటారు. డెత్ ఓవర్ ప్రారంభం కావడానికి ముందు పంజాబ్ కింగ్స్ జట్టు మొత్తం పరుగులు 151 చేసి అయిదు వికెట్లు కోల్పోయింది.
డెత్ ఓవర్ చాలా సమర్థుడైన బౌలర్ కి ఇస్తారు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ విలియమ్స్ చివరి ఓవర్ వేయడానికి ఉమ్రాన్ మాలిక్ ను ఎంచుకోవడానికి కారణంగా కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుతో అంతకు ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడినప్పుడు ఉమ్రాన్ బౌలింగ్ చేసిన విధానమే. కెప్టెన్ విలియమ్స్ నమ్మకానికి వమ్ము చేయకపోవడమే కాకుండా క్రికెట్ ప్రపంచం పులకరించే విధంగా ఉమ్రాన్ సరికొత్త రికార్డు సృష్టించాడు. డెత్ ఓవర్ లో మొత్తం ఆరు బంతులు విసిరి, ఒక్క రన్ కూడా ఇవ్వకుండా నాలుగు వికెట్లు తీసుకోవడం ఉమ్రాన్ మాలిక్ సాధించిన ఘనకార్యం. ఈ ఫీట్ ను కళ్ళారా చూసిన భారత జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ చీఫ్ కోచ్ రవిశాస్త్రి యువ బౌలర్ ను ప్రశంసించారు.
డెత్ ఓవర్లో నలుగురు కింగ్స్ ని పెవిలియన్ కు పంపిన విధంబెట్టిదన…
ఉమ్రాన్ మాలిక్ మొదటి బంతిని వెస్టిండియన్ ఆల్ రౌడర్ స్మిత్ కు విసిరాడు. దాని పుల్ చేయబోయి గురి తప్పిన స్మిత్ పొట్టమీదికి బంతి వచ్చి తగిలింది. తర్వాత షార్ట్ పిచ్ బాల్ విసిరి స్మిత్ ను గందరగోళ పడి ఉమ్రాన్ కు రిటర్న్ క్యాచ్ ఇచ్చారు. ఆ తర్వాత బౌలర్ రాహుల్ చహర్ రంగంలోకి దిగాడు బ్యాట్ ఊపుకుంటూ. డెత్ఓవర్ లో సాధ్యమైనన్నిపరుగులు చేయాలని తెగించి ఆడుతారు. బౌలర్, ఫీల్డింగ్ చేసే వారు సాధ్యమైనంత తక్కువ పరుగులతో ప్రత్యర్థుల ఇన్నింగ్స్ ముగిసిపోవాలని బలంగా కోరుకుంటారు. ఈ సంఘర్షణలో చివరి ఓవర్ బౌలింగ్ చేయడం, బ్యాటింగ్ చేయడం కూడా కత్తిమీద సాము వంటిదే. రాహుల్ చహర్ రాగానే డాట్ బాల్ తో ఉమ్రాన్ స్వాగతం చెప్పాడు. అనంతరం పూర్తివేగంతో బంతి విసిరాడు. కంగారు పడిన చహర్ బ్యాట్ ఊపాడు కానీ బంతికి తగలలేదు. బంతి నేరుగా వికెట్లకు తగిలింది. చహర్ పెవిలియన్ దారి పట్టాడు. అనంతరం వైభవ్ అరోరా వచ్చారు. వైభవోపేతంగా సిక్స్ లు కొట్టాలని ఉవ్విళ్ళూరుతూ వచ్చిన వైభవ్ కు చహర్ కు వేసిన బంతిని పోలిన బంతిన వేగంగా విసిరాడు ఉమ్రాన్. బంతి సూటిగా స్టంప్స్ దగ్గరికి పోయి వికెట్లు పడగొట్టింది. ఆ తర్వాత అర్షదీప్ సింగ్ వచ్చాడు. ఉమ్రాన్ వేసిన బంతిని కవర్ లోకి నెట్టాడు బౌలర్ అయిన సింగ్ బ్యాటర్ రూపంలో. లేని సింగిల్ తీసుకోవడానికి సింగ్, రబడ బయలు దేరారు. అంతలో ఫీల్డర్ విసిరిన బంతి వేగంగా వచ్చి వికెట్లను తాకింది. రన్ అవుట్. ఆ విధంగా 151/5 స్కోర్ 19వ ఓవర్ అయిపోయిన తర్వాత ఉండిన స్కోర్ 20వ ఓవర్ అయిన తర్వాత కూడా పరుగులు సంఖ్య అలాగే ఉండి వికెట్ల సంఖ్య మాత్రం తొమ్మిదికి మారి 151/9 అయింది.
22 ఏళ్ళ కిందట శ్రీనగర్ లో జననం
శ్రీనగర్ కుర్రాడు
ఉమ్రాన్ 22 నవంబర్ 1999 నాడు శ్రీనగర్ లో జన్మించాడు. జమ్మూ-కశ్మీర్ క్రికెట్ టీమ్ లో సభ్యుడు. ఆ జట్టుతో ఆడుతూ అందులోని యువకులకు శిక్షణ ఇస్తూ గడిపిన ఇర్ఫాన్ పఠాన్ ఉమ్రాన్ లోని శక్తిని గుర్తించాడు. భవిష్యత్తులో మంచి బౌలర్ గా పేరు తెచ్చుకుంటాడని గుర్తించాడు. 150 కిలో మీటర్ల వేగంతో బంతిని విసురుతున్న ఉమ్రాన్ ప్రస్తుతం ఐపీఎల్ ఆడుతున్న బౌలర్లు అందరిలోకీ వేగంగా బంతిని విసిరే ఫాస్ట్ బౌలర్. ఐపీఎస్ 2022లో ఇంతవరకూ వేసిన అయిదు అత్యంత వేగవంతమైన బంతులన్నీ ఉమ్రాన్ వేసినవే కావడం విశేషం. అంతకు ముందు కోల్ కతా నైట్ రైడర్స్(కేకేఆర్) తో సన్ రైజర్స్ హైదరాబాద్ తలబడినప్పుడు కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ను ఉమ్రాన్ ట్రాప్ చేసి అవుట్ చేసిన విధానం ఐపీఎల్ ఆటగాళ్ళ దృష్టిని విశేషంగా ఆకర్షించింది.
వఖార్ యూనస్ ను తలపిస్తాడు: ఇర్ఫాన్ పఠాన్
ఇర్ఫాన్ పఠాన్ స్టార్ న్యూస్ చానల్ తో మాట్లాడుతూ, ఉమ్రాన్ బౌలింగ్ చూస్తుంటే పాకిస్తాన్ పేస్ రారాజు వఖార్ యూనస్ గుర్తుకొస్తాడని అన్నాడు. తనను మించిపోతున్నాడన్న బెంగ ఉన్నప్పటికీ ఉమ్రాన్ బౌల్ చేసి వికెట్లు తీసుకోవడం చూడముచ్చటగా ఉంటుందని మరో పేస్ బౌలర్ భువనేశ్ కుమార్ సరదాగా నవ్వుతూ వ్యాఖ్యానించాడు.
సంక్షుభిత కశ్మీర్ లో 22 సంవత్సరాల కిందట జన్మించిన ఉమ్రాన్ టీ20 మ్యాచ్ లో జమ్మూ-కశ్మీర్ జట్టులో ఆడాడు.