- అహ్మదాబాద్ టెస్టుకు 18 మంది సభ్యులజట్టు
- ఆఖరి రెండుటెస్టులకూ షమీ, జడేజా దూరం
ఇంగ్లండ్ తో జరుగుతున్న నాలుగుమ్యాచ్ ల సిరీస్ లోని ఆఖరి రెండుటెస్టులకూ 18 మంది సభ్యుల జట్టును బీసీసీఐ ప్రకటించింది. చెన్నైవేదికగా ముగిసిన మొదటి రెండుటెస్టుల్లో పాల్గొన్న జట్టులో చోటు లేని ఫాస్ట్ బౌలర్ ఉమేశ్ యాదవ్ కు తిరిగి అవకాశం కల్పించారు. ఆస్ట్ర్రేలియా సిరీస్ లోని సిడ్నీటెస్టు ఆడుతూ గాయంతో జట్టుకు దూరమైన ఉమేశ్ యాదవ్ పూర్తిగా కోలుకొని తిరిగి జట్టులో చేరాడు. అయితే అహ్మదాబాద్ టెస్ట్ ఆరంభానికి ముందు ఉమేష్ ఫిట్ నెస్ నిరూపించుకొంటేనే తుదిజట్టులో చోటు ఉంటుందని టీమ్ మేనేజ్ మెంట్ ప్రకటించింది.
షాబాజ్, శార్దూల్ ల రిలీజ్:
చెన్నై వేదికగా జరిగిన మొదటి రెండుటెస్టులకు ఎంపికైన ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్, లెఫ్టామ్ స్పిన్నర్ షాబాజ్ నదీమ్, స్టాండ్ బై ఆటగాళ్లు అభిమన్యు ఈశ్వరన్, ప్రియాంక్ పంచోల్ లను దేశవాళీ క్రికెట్ మ్యాచ్ లలో పాల్గొనటానికి వీలుగా జట్టు నుంచి తమతమ రాష్ట్ర జట్లకు విడుదల చేసినట్లు ఎంపిక సంఘం తెలిపింది.
Also Read: అరంగేట్రం టెస్టులోనే అక్షర్ పాంచ్ పటాకా
24 నుంచి అహ్మదాబాద్ అంచెటెస్టులు:
నాలుగుమ్యాచ్ ల సిరీస్ లోని ఆఖరి రెండుటెస్టులు ఫిబ్రవరి 24 నుంచి అహ్మదాబాద్ సర్దార్ పటేల్ స్టేడియం వేదికగా జరుగనున్నాయి. సిరీస్ లోని మూడో టెస్టు మ్యాచ్ ను డే-నైట్ గా నిర్వహించనున్నారు. విరాట్ కొహ్లీ నాయకత్వంలోని 18 మంది సభ్యులజట్టులోని ఇతర ఆటగాళ్ళలో రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, శుభ్ మన్ గిల్, చతేశ్వర్ పూజారా, అజింక్యా రహానే, కెఎల్.రాహుల్, వాషింగ్టన్ సుందర్, ఇశాంత్ శర్మ, జస్ ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, హార్దిక్ పాండ్యా, సాహా, అశ్విన్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ ఉన్నారు. ఆస్ట్ర్రేలియాతో సిరీస్ ఆడుతూ గాయపడిన ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ, స్పిన్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఇంకా పూర్తిగా కోలుకోలేదని బీసీసీఐ ప్రకటించింది. ఇంగ్లండ్ తో ఆఖరి రెండుటెస్టుల్లో భారత్ ఓ మ్యాచ్ నెగ్గినా టెస్ట్ లీగ్ ఫైనల్స్ చేరగలుగుతుంది.
Also Read: టెస్టులీగ్ రెండోస్థానంలో భారత్