Friday, December 27, 2024

ఉడికిపోతున్న ఉక్రెయిన్

  • ఉక్రెయిన్ వెనుక బ్రిటన్, అమెరికా, తదితర దేశాలు
  • ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న రష్యా

ఉక్రెయిన్ -రష్యా యుద్ధం సమసిపోయింది కదా అని కొన్ని రోజుల క్రితం లోకం భావించింది. కానీ గత కొద్దిరోజులుగా మళ్ళీ తీవ్రరూపం దాలుస్తోంది. రష్యాలోని ప్రతీకార జ్వాలలు, ఉక్రెయిన్ లోని ఉద్రేకస్వభావం కలిసి పెనుయుద్ధాన్ని సృష్టిస్తున్నాయి. ఉక్రెయిన్ లోని సైనికులే కాక, సామాన్య మానవులు, అమాయక ప్రాణులు కూడా బలవుతున్నారు. ప్రజల ఆస్తులు ధ్వంసమవుతున్నాయి. ఈ రెండు దేశాల మధ్య ప్రబలిన ఈ పోరు వెనకాల అనేక దేశాలు రగిల్చిన అగ్గి దాగి ఉంది. రష్యాతో పోల్చుకుంటే ఎంతో బలహీనమైన దేశం ఉక్రెయిన్. రష్యా ధాటికి ఇప్పటికే ధ్వంసమైపోయింది. అటు రష్యా కూడా ఎంతో నష్టపోయింది. ఉక్రెయిన్ వెనకాల అమెరికా, యూరప్ దేశాలన్నీ ఉన్నాయన్నది బహిరంగ రహస్యమే. అందివచ్చిన ఈ బలంతో ఆ చిన్న దేశం సైతం అప్రతిహతంగా దూసుకుపోతోంది. ఎన్నో కష్టనష్టాలు ఎదురవుతున్నా ఎదురులేని పోరాటం చేస్తోంది. ఈ దెబ్బకు రష్యా కూడా చాలా నష్టపోయింది, ఇంకా పోతూనే ఉంది. రష్యాపై జరిగిన ప్రతిదాడిలో తాజాగా ఒక్కరోజులోనే 1000 మంది రష్యా సైనికులు మరణించారని వార్తలు వస్తున్నాయి. ఇది ఆ దేశానికి అతి పెద్ద నష్టమే కాక, అతి పెద్ద సవాల్.

Also read: నవ్యాంధ్ర నిండుగా వెలగాలి

రష్యాకు సైతం భారీగా సైనిక నష్టం

ఉక్రెయిన్ పై రష్యా ఇటీవలే వేలమంది సైన్యాన్ని దించింది. అయితే వారి దగ్గర సరిపడా ఆయుధాలు లేవని బ్రిటిష్ రక్షణ శాఖ నిఘా విభాగం వ్యాఖ్యానించినట్లు కథనాలు వచ్చాయి. మొత్తంగా ఇప్పటి వరకూ రష్యా 71వేలమంది సైనికులను పోగొట్టుకున్నట్లు సమాచారం. తాజాగా కెర్చ్ వంతెన పేలుడు సంఘటన ఉక్రెయిన్ -రష్యా మధ్య అగాధాన్ని మరింత పెంచి పోషించింది. ఈ కార్యాన్ని రష్యా ప్రతీకారంగా తీసుకొని మళ్ళీ యుద్ధం మొదలు పెట్టింది.  దీనితో ఇరుదేశాల మధ్య యుధ్ధోన్మాదం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఉక్రెయిన్ పై రష్యా బాంబుదాడులు పెద్దఎత్తున మొదలయ్యాయి. ఈ పరిణామంతో ప్రాణనష్టం, ఆస్తి నష్టంతో పాటు ప్రజలు విద్యుత్, నీటి సరఫరాలు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. చిన్నారులు, వృద్ధులు, రెక్కాడితే కానీ డొక్కాడని పేదలు, బడుగుబలహీన  వర్గాలు నరకం చూస్తున్నాయి. ఈ యుద్ధం వల్ల ఏర్పడిన దుష్ప్రభావాలు ఆ రెండు దేశాలనే కాక ప్రపంచంలోని అనేక దేశాలనూ అల్లాడిస్తున్నాయి. సరుకుల కొరత, ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయిన ధరలు, ఇంధనాల కొరత, ఎగుమతులు, దిగుమతులపై పడిన మోత యూరప్ మొదలు భారతదేశాన్ని కూడా వణికిస్తున్నాయి. మధ్య మధ్యలో రష్యా అధినేత పుతిన్ అణునినాదం చేస్తుంటాడు. అది మరీ భయపెడుతుంది. దీనిపై ఆయన రకరకాలుగా మాట్లాడుతుంటాడు. ఈ యుద్ధం ముగిసే లోపు పుతిన్ పదవిని కూడా కోల్పోతారనే వదంతులు కూడా వినబడుతున్నాయి.

Also read: కాంగ్రెస్ ఖడ్గధారి ఖడ్గే

ప్రపంచ దేశాలు మూల్యం చెల్లించాలి

బ్రిటన్ సహకారం ఉక్రెయిన్ కు ఉందన్నది లోకవిదితం. కరోనా కష్టాలతో పాటు ఉక్రెయిన్ -రష్యా యుద్ధ ప్రభావం బ్రిటన్ ను ఆర్ధిక సంక్షోభంలోకి నెట్టేశాయి. అక్కడి అధినేతల అధికారాల తలరాతలే మారిపోయాయి. మొన్నటి వరకూ ప్రధానిగా ఉన్న లిజ్ ట్రస్ ఫోన్ ను రష్యా ఏజెంట్లు హ్యాక్ చేశారని వార్తలు వచ్చాయి. ఈ నెల చివర్లో ఇండోనేషియాలో జరుగబోయే జీ-20 సమావేశానికి రష్యాను వెలివేయాలని ఉక్రెయిన్ చేస్తున్న డిమాండ్ మరోమారు తెరపైకి వచ్చింది. ఇకనైనా యుద్ధం ముగిసి శాంతి నెలకొనక పోతే వచ్చే ఇబ్బందులకు చాలా దేశాలు మూల్యాన్ని చెల్లిస్తాయి. యుధ్ధోన్మాదానికి త్వరలో తెరపడాలని ఆకాంక్షిద్దాం.

Also read: జాతిని వెలిగించే వేడుక

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles