- భద్రతామండలి తీర్మానంపై భారత్, చైనా తటస్థం
- ఉక్రెయిన్ నుంచి భారతీయుల రాక
రష్యన్ సైనికులు ఉక్రెయిన్ నగరాలపైన వరుసగా మూడవ రోజు శనివారంనాడు శతఘ్నులతో దాడులు చేశారు. ఉక్రేన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్ స్కీ మాత్రం ఉక్రేన్ రాజధాని కీవ్ భద్రంగా ఉక్రేన్ చేతిలోనే ఉన్నదని ప్రకటించారు. ఉక్రేన్ యుద్ధాన్ని అనవసరంగా పొడిగిస్తున్నారంటూ రష్యా చేసిన ఆరోపణను జెలెన్ స్కీ ఖండించారు. అంగీకరించడానికి అసాధ్యమైన షరతులు విధించి చర్చలకు రమ్మంటే ఎట్లా కుదురుతుందని అన్నారు.
కీవ్ లో శనివారం ఉదయం బాంబులు పేలిన శబ్దాలు వినిపించాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ భారత ప్రధాని నరేంద్రమోదీతో మాట్లాడారు. అప్పటికే ఐక్యరాజ్యసమితి భద్రతామండలి తీర్మానంపైన ఓటు వేయకుండా ఇండియా తటస్థంగా ఉంది. చైనా కూడా తటస్థంగానే ఉన్నది. యునైటెడ్ ఎమిరేట్స్ సైతం అదే పద్ధతిని అనుసరించింది. రష్యాకు వీటో పవర్ ఉన్నది కనుక దానిని ఉపయోగించి తీర్మానం ఆమోదం పొందకుండా చేసింది. తటస్థంగా ఉండాలన్న నిర్ణయం తీసుకున్నందుకు ఇండియాను రష్యా ప్రశంసించింది. ఆ తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు పోన్ చేసి రాజకీయంగా మద్దతు ఇవ్వవలసిందిగా మోదీని అభ్యర్థించారు. ఉక్రెయిన్ లో పరిస్థితుల గురించి జెలెన్ స్కీ మోదీకి వివరంగా చెప్పారనీ, ఘర్షణ కారణంగా ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరగడం పట్ల మోదీ ఖేదం వెలిబుచ్చారనీ ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది. ఘర్షణను వెంటనే విరమించి చర్చలు ప్రారంభించాలని ఉభయ దేశాల అధినేతలకూ తన విజ్ఞప్తిని పునరుద్ఘాటించారు. భారత పౌరులనూ, విద్యార్థులనూ సురక్షితంగా స్వదేశానికి పంపే ఏర్పాటు చేయవలసిందిగా ఉక్రేన్ అధ్యక్షుడికి మోదీ విజ్ఞప్తి చేశారు. భధ్రతా మండలిలో ఓటింగ్ కు గైర్ హాజర్ కావడం మూలంగా ఘర్షణకు సంబంధించిన అన్ని పక్షాలనూ కలుసుకొని మధ్యేమార్గం కనుగొనే అవకాశం ఉన్నదని ప్రధాని కార్యాలయం తెలిపింది. ఓటింగ్ లో పాల్గొనకపోయినప్పటికీ దేశాల సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడవలసిందిగా విజ్ఞప్తి చేసింది.
తనను గద్దె దింపడానికి రష్యా చేసిన ప్రయత్నం గాడి తప్పిందని జెలెన్ స్కీ వెల్లడించారు. ‘‘నేను ఇక్కడే ఉన్నాను. మేం ఆయుధాలు వదిలిపెట్టం. మా ఆయుధాలే మా సత్యం కనుక మా ఆయుధాలతో మా దేశాన్ని రక్షించుకుంటాం,’’ అంటూ 44 ఏళ్ళ జెలెన్ స్కీ ప్రకటించారు. 198 మంది పౌరులూ, ముగ్గురు పిల్లలూ రష్యా దాడుల కారణంగా మరణించారనీ, 1,115 మంది గాయపడినారనీ ఉక్రేన్ ఆరోగ్య శాఖ మంత్రి విక్టార్ ల్యాష్కో వెల్లడించారు. కీవ్ మేయర్ నగరంలో కర్ఫ్యూ విధించారు. ఇది శనివారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకూ అమలు లో ఉంటుంది. 35 కోట్ల డాలర్ల విలువైన ఆయుధాలను ఉక్రెయిన్ కు అందించవలసిందిగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశించారు.
ఆపరేషన్ గంగా: భారతీయ విద్యార్థుల రాక
ఎయిర్ ఇండియా విమానంలో ఉక్రేన్ నుంచి 219 మంది భారతీయులు శనివారంనాడు ముంబయ్ చేరుకున్నారు. ఉక్రెయిన్ నుంచి కార్లలో రుమేనియా చేరుకున్నవారిని ఎయిర్ ఇండియా విమానం ఎక్కించుకొని సాయంత్రం 7.50 గంటలకు ముంబయ్ లో దింపింది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ‘మాతృభూమికి స్వాగతం’ అంటూ ట్వీట్ చేశారు. ఎయిర్ ఇండియా సిబ్బంది, యాజమాన్యం పైన ప్రశంసల వర్షం కురిపించారు. విద్యార్థులు ‘జైహింద్’ అంటూ ఆనందంగా నినాదాలు చేశారు. ఈ రవాణా కార్యక్రమానికి ‘ఆపరేషన్ గంగా’ అని పేరుపెట్టి మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్న విదేశాంగమంత్రి జైశంకర్ కూడా విద్యార్థులకు స్వాగతం చెబుతూ ట్వీట్ పెట్టారు. ‘‘వాళ్ళు మన పిల్లలు. స్వదేశానికి తిరిగి వస్తున్నారు. వారికి ఇక్కడ కాగల ఖర్చులు మేమే భరిస్తాం,’ అంటూ ముంబయ్ మేయర్ కిషోరీ పెడ్నేకర్ వ్యాఖ్యానించారు. రుమేనియా రాజదాని బుఖారెస్ట్ నుంచి విమానం బయలు దేరే ముందు అందరూ భారత దౌత్య కార్యాలయం సిబ్బందికి ధన్యవాదాలు చెప్పారు.
రాయబార కార్యాలయ సిబ్బందితో సమన్వయం చేసుకోకుండా ఎక్కడికీ వెళ్ళవద్దని ఉక్రెయిన్ లోని భారతీయులకు భారత రాయబార కార్యాలయం విజ్ఞప్తి చేసింది.