ఉగాదిగా మారిన యుగాది
మన తెలుగు సంవత్సరాది
అనాదిగా సంకురాత్రి చలి తీరిపోగానే
లే ఎండలు చురుక్కు మనే వేళ
మోడువారిన మొక్కలన్నీ మోసులెత్తి
నేల తల్లి, ప్రకృతి మాతలు
నేటికి పచ్చ పచ్చని చీరలు సింగారించి
నవ వధువుల్లా, ముత్తైదువుల్లా
మోమున చిరునవ్వులు చిందులాడ
చిగురాకులు, పూలు, పిందెలు కనేస్తూ
వసంతాగమనాన్ని గుర్తుచేస్తూ
కోయిలలు ఆనంద పారవశ్యంతో
కుహూజితాలతో జగతిని ఉత్తేజ పరుస్తూ నినదించగ
చిలిపి కుర్రలు వాటితో పంతాలకు పోయి
అనుకరణలతో జనావాసాలు మధుర శబ్దాలతో నింపగ
పాత బెంగలు వదలి
పంచాంగ శ్రవణాలు
రేపటిపై సరికొత్త ఆశలు చిగురు తొడగ
ఇష్ట దేవతా ప్రార్ధనల
పూజా పునస్కారాల అనంతరం
షడ్రసోపేతమయిన యుగాది పచ్చడి సేవనం
జీవన పయనంలో అన్ని రుచులకు ఆహ్వానం
తీపినే కాదు, చేదును కూడా
స్వీకరించగల సమదర్శన భావం
జగన్మాయకు అర్దం చెప్పే ప్రధమ పాఠం.
నవ యుగాది
వికారాలు నామ మాత్రమై మిగిలి
సకారాత్మకమై సత్కర్మలతో
సత్యానికి తోడుగా నిలిచేలా
ధర్మాన్ని, వృక్షాన్ని జీవన వ్యాపార భాగ స్వాములుగా
సద్బుధ్ధితో సమృద్ధిగా నడిచేలా ఆశీర్వదించమని
ఆ దేవదేవిని స్మరిస్తూ.
Also read: “మునక”
Also read: ‘ఆ గురువు లెక్కడ’
Also read: “స్కూలీ”
Also read: “జీవితం”
Also read: “సత్యం”