Sunday, December 22, 2024

ప్రగతి భవన్ లో ఘనంగా ‘శ్రీ శుభకృత్’ నామ సంవత్సర ఉగాది వేడుకలు

 ‘శ్రీ శుభకృత్’ నామ సంవత్సర ఉగాది వేడుకలు ప్రగతి భవన్ లోని ‘జనహిత’ లో శనివారం నాడు అత్యంత వైభవంగా జరిగాయి. రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ, సాంస్కృతిక శాఖల సంయుక్తాధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. ఉదయం 10.30 గంటలకు పండితుల వేదమంత్రోచ్ఛారణలతో వేడుక ప్రారంభమైంది. ఈ సందర్భంగా పండితులు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావుకు వేద మంత్రాలతో ఆశీర్వచనాలిచ్చారు. అనంతరం శృంగేరి పీఠం వేద పండితులు శ్రీ బాచంపల్లి సంపత్ కుమార్ సిద్ధాంతి పంచాంగాన్ని పఠించారు. పంచాంగ శ్రవణం అనంతరం సీఎం ప్రసంగించారు. అనంతరం వేదపండితులు అర్చకులను సీఎం సన్మానించారు. పలు పుస్తకావిష్కరణలు చేశారు.

అందరికీ శుభం కలగాలి: సీఎం

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… ‘శుభకృత్’ నామ సంవత్సరంలో అందరికీ శుభం కలగాలని దేవున్ని ప్రార్థిస్తున్నానన్నారు. ఎన్నో అపోహలు, అనుమానాల మధ్య పోరాటంతో తెలంగాణ సాధించినమన్నారు. తెలంగాణ జాతి అంతా ఒక్కటేనని, ఇందులో ఉన్న ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలన్నారు. కరెంటు బాధ, మంచినీళ్ల సమస్య.. ఇలా అనేక సమస్యలను అధిగమిస్తూ వచ్చామన్నారు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఏ రాష్ట్రం సాధించని విజయాలను తెలంగాణ సాధించిందన్నారు. ప్రజల దీవెన, అధికారుల పనితీరు తోనే ఇదంతా సాధ్యమైందన్నారు. ఆర్థికాభివృద్ధిలో తెలంగాణ, గత 23 జిల్లాల సమైక్య రాష్ట్రాన్ని ఎప్పుడో అధిగమించిందన్నారు. రిజర్వ్ బ్యాంకు లెక్కల్లోనూ అనేక రాష్ట్రాలను అధిగమించి ప్రగతిపథంలో తెలంగాణ పరుగెడుతున్నదని సీఎం అన్నారు.

విద్యుత్, విద్య, తలసరి ఆదాయం..ఇలా అనేక విషయాల్లో అద్భుతంగా పురోగతిలో ఉన్నామని, కొన్ని దుష్ట శక్తులు వ్యతిరేకించినా అభివృద్ధిలో ముందుకు పోతున్నామన్నారు. కుల మతాలకు అతీతంగా ముందుకెళ్లాలన్నారు. అనతికాలంలోనే తెలంగాణలో అద్భుతమైన సంపద సృష్టించబడిందని సీఎం తెలిపారు. తెలంగాణలో భూముల ధరలు పెరిగాయని అన్నారు.

దళితబంధు ఎన్నికలకోసం కాదు

అల్లం నారాయణ ‘ప్రాణహిత’ ద్వారా నాటి ఉమ్మడి రాష్ట్రంలోని సమస్యలను వ్యాసాలుగా రాసిన సందర్భాన్ని గుర్తు చేసిన సీఎం నేడు స్వరాష్ట్రంలో నాటి సమస్యలన్నీ పరిష్కరించబడినాయని సీఎం అన్నారు. మేధోమథనం చేసి ఆవిష్కరించిన పథకమే ‘దళిత బంధు’ అని సీఎం స్పష్టం చేశారు. ఎన్నికల కోసమో, ఇంకేదాని కోసమో దళితబంధును తేలేదనీ, మన దళిత రత్నాలు ప్రపంచానికి తమ సత్తా చాటబోతున్నారని సీఎం స్పష్టం చేశారు. దళిత బంధుతో ఈ దేశానికి తెలంగాణ కొత్త మార్గదర్శనం చేయబోతోందన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో రెండున్నర లక్షల కోట్ల బడ్జెట్ పెట్టుకున్నామన్నారు. 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా చేసుకున్నామన్నారు. మన వనరులు, మన ఉద్యోగాలు మనకే వచ్చాయన్నారు. దేశానికి అన్నం పెట్టే విధంగా తెలంగాణ పురోగమించాలని, సామూహిక స్వప్నమైన ‘బంగారు తెలంగాణ’ నిజం కావాలని మనసా వాచా కర్మణా కోరుకుందామని సీఎం ఆకాంక్షించారు.

పాలకులు న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా పాలించాలి

పరిపాలకుడు న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా పాలించినట్లైతే సమాజం సుభిక్షంగా ఉంటుందన్నారు. అన్ని వర్గాల ప్రజలూ ఆనందంగా ఉండేలా చేస్తున్నామన్నారు. వారి వారి మంచి చెడ్డల్ని సంస్కరించి సత్కరించే గొప్ప గుణం తెలంగాణకు ఉన్నదన్నారు. అన్నింటినీ అధిగమించి ప్రగతిపథంలో పయనిస్తున్నామని, రాష్ట్ర ఆదాయం ఏటా పెరుగుతూనే ఉందని, దేశానికి ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణ మారబోతున్నదన్నారు. అన్నివర్గాలు బాగున్నప్పుడే సమాజం శాంతియుతంగా ఉంటుంది. అనేక పోరాటాలు చేసి తెలంగాణ సాధించుకున్నమని, అనేక రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా ఉన్నామని, ఆధ్యాత్మిక రంగంలో మన తెలంగాణ దేనికి తీసిపోదని సీఎం అన్నారు. యాదాద్రి ఆలయాన్ని అద్భుతంగా నిర్మించుకున్నామన్నారు. ప్రజలందరికీ సుఖం, శాంతి, ఐశ్వర్యం కలగాలని సీఎం ఆకాంక్షించారు.

పంచాంగ పఠనం ముఖ్యాంశాలు

తెలంగాణ రాష్ట్రంలో సీఎం మరింత అద్భుతంగా పరిపాలనను కొనసాగించబోతున్నారని, తెలంగాణలో ఈ సంవత్సరం అనేక శుభ ఫలితాలు కలుగుబోతున్నాయని పంచాంగం చదివారు. ‘‘ఈ ఏడాది పరిపాలన అద్భుతంగా ఉండబోతున్నది. గత సంవత్సరం కంటే ఈ ఏడాది సీఎం జాతకం ఇంకా బాగుంటుంది. సీఎం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఈ సంవత్సరం అనేక సంస్కరణలు చూడబోతున్నారు. దేశమంతా కేసీఆర్ చేసే నిర్ణయాలపై ఆసక్తిగా ఎదురుచూడబోతున్నది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా నీళ్లు, పచ్చని పంటలు. రాష్ట్రంలో వేసవిలోనూ సమృద్ధిగా నీళ్లు లభ్యమౌతున్నాయి. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు అద్భుతంగా పండబోతున్నాయి. రైతులందరు మరల రాజులు కాబోతున్నారు. ప్రభుత్వ సలహాలు, సూచనలతో రైతులు పంటలు వేస్తే రైతులు అధిక లాభాలతో ఇంటికి వెళతారు.

మంచిరోజులొచ్చాయి: కేసీఆర్

కరోనా వంటి చీకటి రోజులు తొలగిపోయి మంచిరోజులొచ్చాయి. ప్రజారోగ్యం భేష్. ఆనందంగా ఊపిరిపీల్చుకుందాం. ఇది ఉద్యోగనామ సంవత్సరం. మహిళలకు అనేక అవకాశాలు వస్తాయి.. వాళ్లే శాసిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు అద్బుతమైన అవకాశాలు రాబోతున్నాయి. మహిళా ఐఏఎస్ అధికారులకు అద్భుతంగా ఉంది. యావత్ భారతదేశం దృష్టి హైదరాబాద్ పైనే ఉంటుంది. ప్రపంచంలోనే ముఖ్యమైన నగరంగా ఉండబోతోంది. 75 శాతం మంచి ఫలితాలు ఉండబోతున్నాయి.. 25 శాతం కొంచం గడ్డు ఫలితాలు ఉండవచ్చు. మీడియాకు ఈ సంవత్సరం పుష్కలంగా వార్తలు లభిస్తాయి. వారు వార్తలకోసం వెతుక్కోవాల్సిన అవసరం లేదు..’’ అంటూ చేసిన పంచాంగ పఠనం వేడుకల్లో పాల్గొన్నవారిలో ఉత్సాహాన్ని భవిష్యత్తు పట్ల ఆశాజనక భరోసాను నింపాయి. పంచాంగ పఠనం సందర్భంగా విసిరిన ఛలోక్తులు ప్రకటించిన అంశాలు సభికులను ఆకట్టుకున్నాయి. సీఎం ఆధ్వర్యంలో తెలంగాణ భవిష్యత్తు అత్యద్భుతంగా ఉంటుందని పంచాంగ పఠనంలో పండితులు వివరించారు. ఈ సందర్బంగా ఆహ్వానితులు కరతాళ ధ్వనులతో జై తెలంగాణ జై కేసీఆర్ నినాదాలతో తమ హర్షద్వానాలను ప్రకటించారు.

అనంతరం సీఎం ను దేవాదాయ శాఖ మంత్రి శ్రీ అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సహా వేద పండితులు శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. దేవాదాయ శాఖ మంత్రి వేదికపై ఆసీనులైన మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా భధ్రాచలం సీతారాముల కళ్యాణానికి ఆలయ అర్చకులు దేవదాయ శాఖ మంత్రి సీఎంకు ఆహ్వానాన్ని అందచేశారు.

పుస్తకావిష్కరణలు

సాహిత్య అకాడమీ చైర్మన్ శ్రీ జూలూరి గౌరీశంకర్ సంపాదకీయం లో సీఎం ఒఎస్డీ శ్రీ శ్రీధర్ రావు దేశ్ పాండే ప్రచురించిన సాగునీటి రంగంపై సీఎం శ్రీ కేసీఆర్ అసెంబ్లీ లో చేసిన ప్రసంగాల సంకలనం ‘‘మా తెలంగాణం.. కోటి ఎకరాల మాగాణం’’ అనే పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు. సంపత్ కుమార్ సిద్ధాంతి విరచిత పంచాంగాన్ని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా ఆవిష్కరించారు.

ఆకట్టుకున్న అలంకరణలు

ప్రభుత్వ సాంస్కృతికశాఖ డైరెక్టర్ మామిడి శ్రీ హరికృష్ణ ఆధ్వర్యంలో ఉగాది వేడుకల సందర్భంగా చేసిన ఏర్పాట్లు, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. వేదిక పై ఏర్పాటు చేసిన మామిడి చెట్టు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మామిడి చెట్టుకిందనే పంచాంగ పఠనం జరిగింది. మామిడాకుల తోరణాలు ఒకవైపు, బంతిపూలు అరటి ఆకుల అలంకరణలు మరోవైపు జనహిత పరిసరాల్లో వసంతాన్ని నింపింది. ప్రగతి భవన్ కు ప్రకృతి రమణీయతను అద్దింది. వేడుకల సందర్భంగా చేసిన ఏర్పాట్లతో సాంప్రదాయ పండుగ వాతావరణం సంతరించుకున్నది. ఉగాది పచ్చడి, భక్షాలు తో సహా పలురకాల రుచికరమైన  ప్రత్యేక  వంటకాలను అందించారు.

ఆదివాసీ జానపద ప్రదర్శనలు

ఈ సందర్భంగా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన గిరిజన ఆదీవాసీ జానపద కళాకారులు గుస్సాడీ, లంబాడీ, కొమ్ముకోయ, డప్పులు,ఒగ్గుడోలు బోనాల కోలాటం వంటి తెలంగాణ  సాంస్కృతిక కళారూపాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో అనేకమంది మంతృలు, తెలంగాణ ప్రభుత్వంలోని ముఖ్యులు పాల్గొన్నారు.

.

సాదిక్
సాదిక్
సాదిక్ పన్నెండేళ్ళకు పైగా ఎలక్ట్రానిక్స్ జర్నలిజంలో ఉన్నారు. కమ్యూనికేషన్స్, జర్నలిజంలలోో ఎంఏ, ఎల్ఎల్ బీ చదివిన విద్యాధికుడు. హెచ్ఎంటీవీలో సీనియర్ కరెస్పాండెంట్ గా పని చేశారు. విశ్వసనీయత, కచ్చితత్వం, సామాజిక శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వృత్తి విలువలకు నిబద్ధుడై పని చేసే నిష్ఠ కలిగిన జర్నలిస్టు. Phone: 8179221604

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles