Wednesday, January 22, 2025

ముఖ్యమంత్రికీ, గవర్నర్ కీ మధ్య చిచ్చు

మహారాష్ట్రలో గవర్నర్, ముఖ్యమంత్రి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. రాష్ట్ర ప్రభుత్వ విమానంలో ప్రయాణించడానికి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి రావాల్సిన అనుమతి ఆలస్యం కావడంతో గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ప్రైవేట్ విమానంలో ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఇది గవర్నర్ హోదాకు జరిగిన అవమానంగానే భావించాలి. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇంతవరకూ ఇటువంటి సంఘటన ఎప్పుడూ జరుగలేదు. ఇది చాలా బాధాకరం. పశ్చిమ బెంగాల్ లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, గవర్నర్ జగ్ దీప్ మధ్య కూడా విభేదాలు నడుస్తున్నాయి. పుదుచ్చేరిలోముఖ్యమంత్రి నారాయణస్వామి, లెఫ్ట్ నెంట్ గవర్నర్ కిరణ్ బేడీ మధ్య విభేదాలు తీవ్రస్థాయిలోనే ఉన్నాయి. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి గవర్నర్లు పూర్వాశ్రమంలో బిజెపి నేతలే. ఈ మూడు రాష్ట్రాల్లోనూ బిజెపియేతర పార్టీలే అధికారంలో ఉండడం గమనార్హం.

ఇదేం కొత్త విషయం కాదు

ముఖ్యమంత్రులు- గవర్నర్ల మధ్య విభేదాలు అనే అంశం కొత్తది కాదు. దశాబ్దాలుగా సాగుతున్న తంతే.గవర్నర్ల నియామకాల్లో ఎన్నో సంస్కరణలు రావాలని రాజనీతిశాస్త్ర నిపుణులు, మేధావులు, పెద్దలు సూచిస్తున్నారు. కానీ, అవి కార్యరూపం దాల్చడం లేదు. వ్యక్తిగత, అంతర్గత రాజకీయాలు, ఢిల్లీ పెద్దల ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలను గవర్నర్లు రద్దు చేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అభిప్రాయ భేదాలతో ముఖ్యమంత్రులు, గవర్నర్లు ఒకరినొకరు మాట్లాడుకోకుండా ఉన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

రాజ్ భవన్ లు పార్టీల భవన్లుగా…

 రాజభవన్ లను పార్టీ భవన్ లు గా మార్చారనే విమర్శలు ఎదుర్కొన్న గవర్నర్లు చరిత్రలో కొందరు ఉన్నారు. గవర్నర్ బంగ్లాలకు తలవంపులు తెచ్చిన గవర్నర్లూ ఉన్నారు. వివాదాస్పదమైన గవర్నర్లు, విశేషమైన గౌరవాన్ని తెచ్చుకున్న గవర్నర్లు ఎందరో చరిత్ర పుటల్లోకి ఎక్కారు. రాజ్యాంగం కంటే రాజకీయాలే ఎక్కువ నడిపిన గవర్నర్లు చరిత్రలో ఉన్నారు, ఇప్పటికీ నడిపేవారు ఉన్నారు. ఆ మధ్య, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా పనిచేసిన ఎన్ డి తివారి రాజ్ భవన్ లో రాసలీలలు ఆడారని వార్తలకెక్కి, చెడుముద్ర వేసుకొని వెళ్లిపోయారు. ఇంతవరకూ వివిధ రాష్ట్రాల్లో పనిచేసిన గవర్నర్లను గుర్తుచేసుకుంటే, అపఖ్యాతిని మూటకట్టుకున్నవారిలో రామ్ లాల్ దే అగ్రస్థానం.

Also Read : 5 రాష్ట్రాలలో అన్ని పార్టీలకూ అగ్నిపరీక్ష

బీకే నెహ్రూ ఆదర్శం

సాక్షాత్తు ప్రధానమంత్రి మాటను కూడా లెక్కచేయకుండా, రాజ్యంగ గౌరవానికి, వ్యక్తిగత విలువలకు కట్టుబడి,ఖ్యాతిని గడించినవారిలో బికె నెహ్రు (బ్రజ్ కుమార్ నెహ్రూ) శిఖరాయమానుడు. ఇతను జవహర్ లాల్ నెహ్రూ కుటుంబసభ్యుడే. 1934బ్యాచ్ (ఐ సి ఎస్ ) ఇండియన్ సివిల్ సర్వెంట్. డిప్లమాట్, బ్యూరోక్రాట్. అత్యున్నత విద్యావంతుడు.జమ్మూకశ్మిర్ మొదలు అనేక రాష్ట్రాలకు గవర్నర్ గా చేసి, ఆ పదవికి అలంకారం తెచ్చారు. 1981-84 మధ్య ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ఆయన జమ్మూకశ్మిర్ గవర్నర్ గా ఉన్నారు. అబ్దుల్లా గవర్నమెంట్ ను రద్దు చేసి, అతని బావమరిదిని ఆ కుర్చీలో కూర్చోపెట్టమని ఇందిరాగాంధీ బికె నెహ్రూపై వత్తిడి తెచ్చారు. ఆ వత్తిడికి ఆయన లొంగలేదు. గాంధీ ఆయన్ను రాత్రికి రాత్రి కశ్మిర్ నుంచి గుజరాత్ కు బదిలీచేశారు. ఈ సంఘటనతో బికె నెహ్రు ప్రతిష్ఠ ఎన్నోరెట్లు పెరిగిపోయింది.

అపఖ్యతిపాలైన రాంలాల్

దీనికి పూర్తి వ్యతిరేకమైన ముద్ర వేసుకున్నవాడు రామ్ లాల్.ఎన్టీఆర్ హార్ట్ సర్జరీ కోసం ఆమెరికాకు వెళ్లిన సమయంలో,ముఖ్యమంత్రి స్థానం నుంచి ఆయన్ని దించేసి, ఏ మాత్రం మెజారిటీలేని నాదెండ్ల భాస్కర్ రావును ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోపెట్టిన సంఘటన జాతీయ స్థాయిలో అత్యంత వివాదాస్పద ఘట్టంగా సంచలనం సృష్టించింది దీనితో, రామ్ లాల్ గవర్నర్ గా చాలా చెడ్డపేరు తెచ్చుకున్నారు. కుముద్ బెన్ జోషి రాజ్ భవన్ ను కాంగ్రెస్ భవన్ గా మార్చారనే విమర్శలు ఆ కాలంలో పెద్దఎత్తున వ్యాపించాయి. ఎన్టీఆర్ కు, ఈమెకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణం ఉండేది. ఎన్టీఆర్  ఆమెపై జోకులు వేసేవారనే వార్తలు అప్పుడు వినవచ్చేవి. కృష్ణకాంత్ చంద్రబాబుకు సహకారం అందించారని ఎన్టీఆర్ అనుమానించేవారు. కృష్ణకాంత్ పై ఎన్టీఆర్ పరోక్ష విమర్శలు కూడా చేసేవారని, రాజకీయ రంగాలకు విదితమే.

Also Read : విశాఖ ఉక్కు అమ్మకం మరణ శాసనమే

ప్రకాశం, ద్వివేదీ సంవాదం

ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి గవర్నర్ చందూలాల్ మాధవ్ లాల్ ద్వివేది- అప్పటి ముఖ్యమంత్రి టంగుటూరు ప్రకాశం పంతులు మధ్య కూడా  చాలా విభేదాలు వచ్చాయి. ఒక న్యాయమూర్తి ఎంపిక విషయంలో మొదలైన వివాదం పెరిగి పెద్దదైంది. ద్వివేది ప్రతిరోజూ ప్రకాశంపై అప్పటి ప్రధాని నెహ్రూకు ఫిర్యాదులు పంపేవారు. దీనితో నెహ్రూ -ప్రకాశం పంతులు మధ్య విభేదాలు మరింత పెరిగాయి. రాష్ట్ర మంత్రులతో మంతానలు జరుపుతూ, ద్వివేది సమాంతర ప్రభుత్వాన్ని నడపడానికి ప్రయత్నించేవారు. ప్రకాశంను పక్కన పెట్టి, సంజీవరెడ్డిని ప్రోత్సహించేవారు. నెహ్రుకు, ప్రకాశంకు ఉన్న పూర్వ విభేదాలకు ద్వివేది మరింత ఆజ్యం పోశారు.సింహంవంటి ప్రకాశం పంతులుకు , సింహంగా చెప్పుకునే ఎన్టీఆర్ కు కూడా గవర్నర్లతో తిప్పలు తప్పలేదు.

అధికారపార్టీ అనుయాయులే గవర్నర్లు

ఢిల్లీలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే, వారి అనునూయులనే గవర్నర్లుగా నియమించడం అనే ఆనవాయితీ అప్పటి నుంచే వుంది. క్రమంగా,రాజ్ భవన్ లు రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రాలుగా మారాయనే విమర్శలు వచ్చాయి. గవర్నర్ల నియామక విధానంలో సంస్కరణలు రావాలని, రాజ్యాంగ ప్రతినిధులుగా అత్యుత్తమ సంస్కారంతో, అత్యున్నత గౌరవంగా జీవించేవారిని, నిష్పక్షపాతంగా ప్రవర్తించేవారిని ఎంపికచెయ్యాలని ఎందరో పెద్దలు,మేధావులు ఎన్నోమార్లు సూచించారు.

Also Read : కేటీఆర్ సి.ఎం ఆశలు సజీవమే!

గవర్నర్లకు సమన్వయం అవసరం

రాష్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రులు -దేశాన్ని పాలించే ప్రధానుల మధ్య సమన్వయంతో, రాష్ట్ర పరిపాలనకు ఎటువంటి ఇబ్బంది రాకుండా గవర్నర్లు నడుచుకోవాలి. అదే సమయంలో, ముఖ్యమంత్రులు గవర్నర్లకు అత్యంత గౌరవాన్ని ఇస్తూ, వారి గౌరవాన్ని కూడా కాపాడుకోవాలి.గవర్నర్లు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులే అయినప్పటికీ, సంయమనం పాటించడం కీలకం.ముఖ్యమంత్రులుగా టంగుటూరి ప్రకాశం పంతులు వంటి పరమ దేశభక్తులు , శంకర్ దయాళ్ శర్మ వంటి సాత్విక పాండితీమూర్తులు దేశ ప్రతిష్ఠను, రాజ్యాంగ గౌరవాన్ని కాపాడారు.పీసీ అలెక్జాండర్, వివిరామారావు మొదలైన ఎందరో గవర్నర్లు వివాదరహితులుగా పేరు తెచ్చుకున్నారు.

మంచి పరిణామం కాదు

ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ -ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే మధ్య జరిగిన ఈ ఘటన మంచి పరిణామం కాదు. మిగిలిన రాష్ట్రాల్లోనూ ఇదే తీరు ప్రతిస్పందిస్తే, రాజ్యాంగా వ్యవస్థకు అది గౌరవం కాదు. ముఖ్యమంత్రులు, గవర్నర్ల మధ్య గౌరవనీయమైన వాతావరణం పాదుకునేలా కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ పెద్దలు దృష్టి సారించాలి. ఈ తరహా సంఘటనలు, ఈ స్థాయిలో విభేదాలు చోటు చేసుకోకుండా చూడాలి. ఎవరికివారు ఆత్మపరిశీలన చేసుకుంటే, తప్పులు ఎవరివైపు ఉన్నాయో వారికే అర్ధమవుతుంది.

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles