Sunday, December 22, 2024

మహాభారతం – ఆదిపర్వం – ఉదంకోపాఖ్యానం-4

ప్రల్లదుడైన యొక్క కులపాంసను చేసినదాన తత్కులం

బెల్లను దూషితం బగుట యేమి యపూర్వము? కావునన్ మహీ

వల్లభ! తక్షకాధము నెపంబున సర్పములెల్ల అగ్నిలో

త్రెళ్ళగ సర్పయాగ మతి ధీయుత! చేయుము విప్రసమ్మతిన్!

నన్నయ భట్టారకుడు

ఉదంకుడు జనమేజయునికి సర్పయాగం చేయమని ప్రేరేపించడం:

పైలమహర్షి ఉదంకునితో అంటాడు: “పౌష్యమహాదేవి కర్ణాభరణాలు తెచ్చి ఇచ్చి నా మనస్సుకు మిక్కిలి ప్రీతి కలిగించినావు. నా ప్రయోజనం నెరవేర్చి, ఋణవిముక్తుడ వైనావు. ఇక నీ ఇచ్చ వచ్చినట్టు వుండు!”.

గురువు అనుమతితో ఉదంకుడు దీర్ఘకాలం తపస్సు చేస్తాడు. పిదప, తనకు అపకారం తలపెట్టిన తక్షకునికి ప్రతీకారం చేయాలని నిశ్చయించుకొని, జనమేజయ మహారాజు వద్దకు వెళ్ళి ఇట్లా అంటాడు:

“రాజా! నేను గురుదేవకార్యం తలపెట్టిన విషయం తెలిసి, వంచనోన్మతియై, అకారణంగా, కుటిల స్వభావుడైన తక్షకుడు “పరాత్మ విశేష వివేక శూన్యుడై” నాకు అపకారం గావించినాడు”.

“ఇదే తక్షకుడు, నీ పూజ్యజనకుడు, మహానుభావుడైన పరీక్షిన్మహారాజును “అసహ్య విషోగ్ర ధూమకేతన హతి” చేసి యముని గృహానికి అతిధిగా పంపించినాడు”.

“ఓ మహీవల్లభ! అతి ధీయుత! ఒక కులపాంసను (కులదూషకుడు) చేసిన పనికి సమస్త వంశము నిందింపబడడంలో విడ్డూరం ఏమున్నది? కాబట్టి ఈ తక్షకాధముణ్ణి నెపంగా తీసుకొని, అన్ని సర్పాలు వచ్చి అగ్నిలో పడి నాశనమై పోయేటట్లుగా విప్రసమ్మతితో సర్పయాగం గావించు.”

ఇది నేటి పద్యం యొక్క తాత్పర్యం. ఈ విధంగా ఉదంకమహాముని జనమేజయ మహారాజుకు సర్పయాగ వాంఛ కలిగించినాడు.

Also read: మహాభారతం – ఆదిపర్వం – ప్రథమాశ్వాసం

తక్షకుని పుట్టుపూర్వోత్తరాలు

నాగరాజైన తక్షకుడు కశ్యపునికి, కద్రువకు జన్మించిన వాడు. ఈతని వంశంలో పుచ్చాండకుడు, మండలకుడు, శరభంగుడు వంటి అనేకమంది సర్పకుల శ్రేష్ఠులు జన్మించినారు. ఉదంకమహామునికి తక్షకుడు చేసిన అపకారం తెలిసినదే. ఇతడు చేసిన మరొక ఘనకార్యమున్నది. ఒకసారి పరీక్షిన్మహారాజు వేటకు వెళ్లి దాహార్తియై అడవిలో సంచరిస్తూ తపస్సులో ఉన్న శమీక మహర్షిని నీటికై అర్థిస్తాడు. తపస్సులో ఉన్న శమీకుని మౌనం పరీక్షిత్తులో అసహనాన్ని పెంచుతుంది. కోపంతో పక్కనే చచ్చిపడి వున్న ఒక సర్పాన్ని శమీకుని మెడలో వేసి వెళ్లి పోతాడు. అది చూసిన శమీకుని కొడుకు శృంగి వారం దినాల్లో పరీక్షిత్తు తక్షకుని కాటుకు బలియై మరణించుగాక అని శపిస్తాడు. ఈ విషయం తెలిసిన పరీక్షిన్మహారాజు భీతితో తగిన జాగ్రత్తలు తీసుకుంటాడు.

What is the story of Raja Parikshit and snake Takshak? - Quora
పరీక్షణ్మహారాజు ముని మెడలో చచ్చిన పామును వేయడం

తక్షకుడు పరీక్షిత్తును ఎట్లా కాటు వెయ్యాలా అని పథకాలు వేస్తుంటాడు. ఆరు రోజులు దాటి పోతాయి. పాముకాటుకు మరణించిన వారిని తన మృతసంజీవిని విద్యతో బ్రతికించే నేర్పుగల కశ్యపమహర్షి ఏడవరోజున పరీక్షిత్తు వద్దకు పోతుంటాడు. కశ్యపమహర్షిని మార్గమధ్యంలో తక్షకుడు కలుసుకుంటాడు. తన కాటుచే మరణించినవారిని బ్రతికించడం ఎవరికీ సాధ్యం కాదనీ, ఎవరి మంత్రతంత్రాలు తన విషం ముందు పని చేయవనీ తక్షకుడు కశ్యపునికి నచ్చచెబుతాడు. తన విషప్రభావాన్ని నిరూపించేందుకు దగ్గరే వున్న ఒక పెద్ద వటవృక్షాన్ని తక్షకుడు కాటు వేస్తాడు. ఒక్క నిమిషంలో ఆ వటవృక్షం కాలి బూడిదై పోతుంది. కానీ, కశ్యపమహర్షి తన మంత్రప్రభావంతో బూడిదై పోయిన మఱ్ఱిచెట్టును మళ్ళి బ్రతికింపజేస్తాడు. తక్షకునికి ఆశ్చర్యం కలుగుతుంది. అయినా, పరీక్షిత్తు మరణం దైవనిర్ణయమని, శృంగి శాపానికి తిరుగులేదని తక్షకుడు చెబుతాడు. యోగదృష్టితో కశ్యపుడు జరగబోయేది గ్రహించి, తక్షకుడిచ్చిన బహుమానాలు గ్రహించి తిరిగి వెళ్ళి పోతాడు.

Least Known Characters Of Mahabharata - Takshaka | RoBa's World
పరీక్షణ్మహారాజును కాటువేయడానికి సిద్ధపడుతున్న తక్షకుడు

తక్షకుడు సర్పకుమారులను పిలిచి వారికి బ్రాహ్మణ కుమారుల వేషాలు వేయించి పరీక్షిన్మహారాజు వద్దకు పూలు పండ్లతో పంపుతాడు.  ఆ పండ్లలో ఒక పురుగు రూపంలో దాగి తక్షకుడు పరీక్షిత్తు యొక్క ఒంటిస్తంభం మేడలో ప్రవేశిస్తాడు. ఆరోజు సాయంత్రం కావడంతో పరీక్షిత్తు ఇక శాపకాలం ముగిసిందనే సంతోషంతో విప్ర బాలకుల వద్ద పూలు పండ్లు గ్రహిస్తాడు. నలుగురికీ పంచిపెట్టి, తానూ తినబోతున్న సమయంలో, పురుగు రూపంలో వున్న తక్షకుడు హటాత్తుగా సర్పరూపం పొంది పరీక్షిత్తును కాటు వేస్తాడు. ఆ కాటుకు విషజ్వాలలు వ్యాపించి, ఒంటి స్తంభం మేడతో సహా పరీక్షిత్తు కూడా సమూలంగా కాలిపోతాడు.

Also read: మహాభారతం: ఆదిపర్వం: ఉదంకోపాఖ్యానం-3

సర్పయాగప్రేరణ

ఉదంకుని వద్ద కర్ణాభరణాలు దొంగిలించినవాడు, జనమేజయ మహారాజు తండ్రి పరీక్షిత్తును కాటువేసి చంపినవాడు తక్షకుడే కావటంతో ఉదంకుడు ప్రేరకుడుగా, జనమేజయుడు నిర్వహణ కర్తగా సర్పయాగం నిర్వహింపబడింది. ఇది తక్షకునితో సహా  సమస్త సర్పజాతినీ నాశనం చెయ్యడానికి తలపెట్టిన యజ్ఞం. గతంలో రాజసూయ, అశ్వమేధాది యాగాలను ఇతర రాజులు నిర్వహించినా, సర్పయాగం మాత్రం ఒక్క జనమేజయుడు మాత్రమే నిర్వహిస్తాడు. ఆశ్చర్యకరమైన విషయమేమంటే, ఎవరినైతే ప్రధానంగా చంపాలని ఈ యాగం నిర్దేశింపబడిందో, ఆ తక్షకుడే ఇంద్రుని చొరవతో, యజ్ఞ కీలల్లో ఆహుతి కాకుండా బయట పడతాడు.

ఉదంకుని జీవనగాథ

ఉదంకుని జీవనగాథ చాల రసవత్తరం, ఆసక్తిదాయకం. అత్యంత శక్తివంతుడు ఉదంకుడు. శివుని వద్ద, విష్ణువు వద్ద, పలు వరాలు పొందినవాడు. పైలమహర్షి వద్దనే గాక, గౌతమమహర్షి వద్ద కూడా కడు దీర్ఘకాలం అతని శుశ్రూష సాగింది.  ఉదంకునికి వృద్ధాప్యం దగ్గర పడినా, గౌతముడు శిష్యునికి ఎట్టి సందేశం ఇవ్వడు. నెరసిన జుట్టు చూసుకుంటూ ఉదంకుడు ఏడ్వడం చూసి, గౌతముని ఆజ్ఞ మేరకు ఆయన కూతురు ఉదంకుని కన్నీరు నేలపడకుండా చేతులు అడ్డు పెడుతుంది. కన్నీరు పడి ఆమె చేతులు కాలుతాయి. ఉదంకుని శక్తి సామర్థ్యాలు గ్రహించిన గౌతమమహర్షి అతనికి తన మహత్యంతో యవ్వనం ప్రసాదించి, తన కూతురినిచ్చి పెళ్ళి చేస్తాడు.

ఒకసారి శ్రీకృష్ణుడు హస్తినాపురి నుండి ద్వారకకు పోతూ మార్గమధ్యంలో ఉదంకమహర్షిని అతని  ఆశ్రమంలో దర్శిస్తాడు. ఉదంకుడు సకలమర్యాదలు చేస్తాడు. మాటల సందర్బంలో కౌరవపాండవుల మధ్య సంధి కుదర్చవలసిన శ్రీకృష్ణుడు విఫలుడై వారి నడుమ యుద్దానికి, కౌరవుల సర్వనాశనానికి కారకుడైనాడని నిందిస్తాడు. జవాబుగా శ్రీకృష్ఢుడు తన దైవత్వాన్ని ఉదంకునికి వివరించి, తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తాడు. ఉదంకుని కోరిక మేరకు, తననెప్పుడు తలచుకొన్నా ఉదంకునికి నీరు లభ్యమౌతుందని వరమిస్తాడు. ఒకసారి ఉదంకుడు అడవిలో దప్పిక గొని శ్రీకృష్ణున్ని స్మరిస్తాడు. అతని యెదుట కుక్కలను వెంట పెట్టుకొని పోతున్న ఒక మాలవాడు,  శరీరమంతా స్వేదధార ప్రవహిస్తూ, కనిపిస్తాడు. దప్పిక గొన్న ఉదంకుని ఆర్తిని అర్థం చేసుకొని తన శరీరంపై పారే స్వేదాన్ని త్రాగమంటాడు. ఆ మాలవాని స్వరూపాన్ని అసహ్యించుకోని అతని స్వేదాన్ని గ్రోలడానికి నిరాకరిస్తాడు. మాలవాడు తనదారిన తాను పోయిన పిమ్మట, ఉదంకుని ఎదుట శ్రీకృష్ఢుడు ప్రత్యక్షమై, ఆ మాలవాడు ఇంద్రుడని, ఉదంకునికి అమృతం ఇవ్వడానికి వచ్చినాడని, అతని స్వేదమే అమృతమనీ వివరిస్తాడు.

Also read: మహాభారతము – ఆది పర్వము – ఉదంకుని నాగస్తుతి

ఆదిశంకరాచార్యుడి వృత్తాంతం

వ్యాసభారతం రచింపబడిన దాదాపు వేయి ఏండ్ల పిమ్మట ఆదిశంకరాచార్యునికి ఒక చండాలుడు కాశిలో ఎదురుపడే ఘట్టం మనకు జ్ఞాపకం రాకమానదు. ఆ చండాలునిలో ఆదిశంకరుడు పరమేశ్వరుణ్ణి దర్శించి, అతని పాదాల చెంత మోకరిల్లుతాడు. ఆయన అనుభవం మనీష పంచకంగా ప్రసిద్ధి చెందుతుంది.

మాలవానిలో ఉదంకుడు ఇంద్రుణ్ణి పోల్చుకోలేక, అతని ఘర్మజలాన్ని అసహ్యించుకుంటాడు. ఆ ఘర్మజలం బడుగుజీవుల శ్రమైకజీవనానికి చిహ్నమనీ, ఆ జీవనం నుండే అమృతం జాలువారి భూమిని సస్యశ్యామలం చేస్తుందని  తెలుసుకోలేక పోతాడు. ఇంద్రుడు పర్జన్యుని సహచరుడు. బడుగు స్వేదధారయే పర్జన్యుని వర్షధార. సమస్తభూభారాన్నీ తన “అజస్ర సహస్ర ఫణాళి” పై భరించడమే గాక, సాక్షాత్తు విష్ణుమూర్తికి “శేషశయ్యను” సమకూర్చిన సర్పలోకం యొక్క అచంచల తపస్సమాధి సమస్త మానవకోటికి ఆదర్శప్రాయమైనది.

ఆదిశంకరుడు కాలినడకన చేసే భారతయాత్రలో పడమటి కనుమల గుండా పోతున్నప్పుడు ఒక అసాధారణదృశ్యం అతని కంటబడుతుంది. మిట్టమధ్యాహ్నపు ఎఱ్ఱటి యెండలో ఒక కప్ప ప్రసవిస్తుంటుంది. ఒక పెద్ద విషసర్పం జాలిగొని తన పడగను విప్పి ఆ భేకానికి నీడను ప్రసాదిస్తుంటుంది. ఆ దృశ్యం చూసి ఆదిశంకరుడు కరిగిపోతాడు. ఒక సర్పం నిండు గర్భవతి యైన కప్పకు గొడుగు పట్టే చోటునొక పవిత్రభూమిగా భావించి, అక్కడ తన పీఠాన్ని నెలకొల్పుతాడు. అదే శృంగేరీ పీఠం. అక్కడ గల ఆదిశంకరుని జీవితాన్ని చిత్రాల్లో తెలిపే ప్రదర్శన శాలలో ఈ చిత్రాన్ని చూసినాను. విష్ణుమూర్తికి గొడుగు పట్టే సర్పరాజం యొక్క తపస్సమాధికి, ఎఱ్ఱటి యెండలో ఒక కప్పకు శీతలాచ్ఛాదననిచ్చే తపోనిష్ఠకు తేడా లేదు. సర్వభూతములలో పరమాత్ముడున్నట్లే  ఒక బడుగుజీవిలో, ఒక కప్పలో కూడా, పరమాత్ముడున్నాడన్న సత్యాన్ని యీ ఉదంతం తెలుపుతున్నది.

Also read: మహాభారతం – ఆదిపర్వము : ఉదంకోపాఖ్యానము

వృశ్చికరాశి మహాత్మ్యం

శృంగేరీ పీఠాధిపతులందరు వృశ్చికలగ్న జాతకులే. వృశ్చికం కూడా ఒక విషకీటకం. సెక్స్, సిన్, సాల్వేషన్, వృశ్చికరాశి లక్షణాలని జ్యోతిష్యవేత్తలు తెలుపుతారు. శృంగేరీ పీఠాధిపత్యానికి వృశ్చికరాశి వారినే ఎంపిక చేయడం వెనక ఒక పరమార్థం ఉన్నది. వృశ్చికరాశికి మంత్ర (ద్వితీయ), పూర్వ పుణ్య మనః (పంచమ) స్థానాలు రెంటినీ బృహస్పతి పాలిస్తాడు. ఈ వరం మరియే ఇతర రాశికీ లేదు. అదే సమయంలో వృశ్చికజాతకుల భోగ స్థానాన్ని (ద్వాదశరాశి) రాక్షస గురువైన శుక్రుడు పాలిస్తాడు. విషకీటక రాశుల్లో కామేచ్ఛతో, భోగేచ్ఛతో, పాపపంకిలంలో కూరుకొని పోయే స్వభావం ఉన్నది. అదే సమయంలో తన విషాన్ని అమృతంగా మార్చుకొన గల శక్తి, జీవన్ముక్తని సాధించగల అర్హత, ఆదిశేషుని భారంతో బాటు “బహువన పాదపాబ్ధి కులపర్వత పూర్ణ సరస్వతీ సహిత” మహీభరాన్ని కూడా మోయగల తపస్సంపదా ఒక సర్పానికి ఉన్నవి.

విల్ డ్యూరాంట్ ఏమన్నాడు?

“వైరిత్యాగమే”అహింస అని సనాతన ధర్మం బోధిస్తున్నది. ఆదిశేషునితో బాటు, కప్పకు కూడా  తన పడగతో గొడుగు పట్టిన సర్పరాజమొక అహింసామూర్తిగా సాక్షాత్కరిస్తున్నది. మహామునీ, శక్తిశాలీ ఉదంకుడు, తక్షకుని వంటి సర్పంపై ప్రతీకారవాంఛ పెంచుకోవడం, తక్షకునితో బాటు సమస్త నాగజాతినీ నిర్మూలించాలని కోరుకోవడం, అతనికి తగనిపని. కులంలో ఒక దుష్టుడు ఉన్నప్పుడు, ఆ దుష్టునితో బాటు సమస్త కులము నశించవలసిందే అన్నది ఉదంకుని సిద్ధాంతం. అదెంత ప్రమాదకరమైన సిద్ధాంతమో చెప్పవలసిన పనిలేదు.

విల్ డ్యురాంట్ రచించిన గ్రంధాల్లో అత్యంత ప్రసిద్ది పొందినది “స్టోరి ఆఫ్ ఫిలాసఫీ.” ఆ పుస్తకం ఉపోద్గాతంలో ఒకచోట విల్ డ్యురాంట్ ఇట్లా అంటాడు: “We save lives piecemeal in a surgeon’s operation theatre and destroy lives wholesale in a war”. ఒక శస్త్రకారుడు ఆపరేషన్ థీయెటర్లో పోతున్న ప్రాణాన్ని కాపాడుతాడు. సైనికులు యద్ధరంగంలో లక్షలాది నిండు ప్రాణాలను బలిగొంటారు.

What is the story of Raja Parikshit and snake Takshak? - Quora
పరీక్షణ్మహారాజును శపిస్తున్న ముని

తక్షకుని వంటి విషసర్పాలు సమాజంలో ఉండడం ఎంత ప్రమాదకరమో, ఉదంకుని వంటి మారణహోమ సిద్ధాంత కర్త ఉండడమూ, అంతే ప్రమాదకరం. రెండవ ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీ యూదులపై ‘ఎథ్నిక్ క్లీన్సింగ్’ పేరుతో జరిపిన మానవహింసాకాండ ఎంత గర్హనీయమైనదో, అమెరికా దేశం ప్రపంచయుద్ధం సమాప్తమయ్యే వేళ జపాన్ దేశపు హిరోషిమా, నాగసాకీలపై ఆటంబాంబులు ప్రయోగించి లక్షలాది నిండు ప్రాణాలను బలితీసుకోవడం సైతం అంతే గర్హనీయం. సమకాలీన భారతంలో ‘ఎథ్నిక్ క్లీన్సింగ్,’ ‘ఇస్లామోఫోబియా,’ నినాదాలు కావడం భారత దేశానికి, మానవతకు, కడుంగడు ప్రమాదకరమని నియామ్ ఛోమ్స్కీ వంటి మేధావులు, మానవతావాదులు హెచ్చరిస్తున్నారు.

మహామునియైన ఉదంకుడు మునిసహజమైన జీవకారుణ్యభావనను త్యజించి,  సర్పయాగానికి  జనమేజయుణ్ణి ప్రేరేపిస్తే, అదే సర్పయాగాన్ని అంతమొందించడానికి, మరొక మహామునియైన ఆస్తికుడు కారకుడౌతాడు. ఆ ఘట్టం భారతకథలో ముందుముందు రానున్నది.

Also read: మహాభారత శోభ

-నివర్తి మోహన్ కుమార్

Mohan Kumar Nivarti
Mohan Kumar Nivarti
నివర్తి మోహన్ కుమార్. జననం 26 ఆగస్టు 1950, నంద్యాల. వృత్తి రీత్యా ఛార్టర్డ్ అకౌంటెంట్. హైదరాబాదులో ప్రాక్టీసు. కవిత్వం, చిత్రలేఖనం, సాహిత్య విమర్శ, జ్యోతిష్యం, చరిత్ర, సామాజిక రాజకీయ శాస్త్రాల్లో ఆసక్తి. మొబైల్ : 96038 27827

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles