Sunday, December 22, 2024

ఉపా చట్టం రాజ్యాంగవిరుద్ధం

వినోద్ దువా ప్రముఖ మీడియా వ్యక్తి. ఆయనపైన ప్రభుత్వం దేశద్రోహం కేసు మోపింది. కేసును సుప్రీంకోర్టు పరిశీలించినప్పుడు దేశద్రోహం ఆరోపణపైన అత్యున్నత న్యాయస్థానం 1962లొ కేదార్ నాథ్ కేసులో ఇచ్చిన ఉత్తర్వును పునరుద్ఘాటించింది. ఈ కేసును ఇష్టం వచ్చినట్టు దుర్వినియోగం చేయరాదంటూ ప్రభుత్వాలను ఆదేశించింది. శిక్షాస్మృతి 124ఎ సెక్షన్ కింద ఏ చర్యలను దేశద్రోహంగా పరిగణించవచ్చునో నిర్వచించింది. ఆ నిర్వచనం ప్రకారం అయితే దేశద్రోహం కేసు రాజ్యాంగబద్ధమేనంటూ అప్పుడు సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.  ప్రజలను ప్రభుత్వంపైకి హింసాత్మక చర్యలకు రెచ్చగొట్టే విధంగా రాసిన రాతలూ, చేసిన ప్రసంగాలు మాత్రమే దేశద్రోహం చట్టంకిందికి వస్తాయని అత్యున్నత న్యాయస్థానంలో ధర్మాసనం చదివి న్యాయస్థానంలో వినిపించింది. కనుక ఈ తీర్పు ప్రకారం హింసాత్మక చర్యకు పురిగొలిపే రాతలూ, మాటలూ మాత్రమే దేశద్రోహం నేరం కిందికి వస్తాయి. వినోద్ దువా నిరుడు ప్రధాని నరేంద్రమోదీపైన యూట్యూబ్ లో వ్యాఖ్యాలు చేసినందుకు ఆయనపైన దేశద్రోహం నేరం మోపుతూ కేసు పెట్టారు. ఈ కేసును అత్యున్నత న్యాయస్థానం జూన్ మొదటి వారంలో కొట్టివేయడమే కాకుండా జర్నలిస్టులను ఈ దేశద్రోహం చట్టం దురుపయోగం నుంచి రక్షించవలసి ఉన్నదని వ్యాఖ్యానించింది.

Also read: రాజ్యాంగం నుంచి ఉపా చట్టాన్ని తొలగించడం మేలు

మూడు రకాల నేరాలు

దేశద్రోహం కిందికి వచ్చే చర్యలు మూడు రకాలు. అవి మాటలు, రాతలు, సైగలు. ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్ర చేయడం దేశద్రోహం కిందికే వస్తుంది. ప్రభుత్వం పట్ల ప్రజలలో అసంతృప్తి, ద్వేషం చెలరేగే విధంగా మాట్లాడటం, రాయడం దేశద్రోహం కిందికే వస్తుంది. అయితే, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలనూ, చేపట్టే చర్యలనూ విమర్శించవచ్చు. విద్వేషం రగిలించే విమర్శ చేయరాదు. అంటే ప్రభుత్వాన్ని అదే పనిగా తెగనాడకుండా మంచి చేస్తే మంచి అనీ, తప్పు చేస్తే తప్పు అనీ వస్తునిష్టంగా చెప్పడం దేశద్రోహం కిందికి రాదు. కానీ ప్రభుత్వాన్ని గురించి మంచి అసలే చెప్పకుండా ఎప్పుడూ తప్పులు ఎత్తి చూపడమే లక్ష్యంగా రాసేవారూ, మట్లాడేవారూ దేశద్రోహానికి పాల్బడినట్టే లెక్క అని చెప్పవలసి వస్తుంది.

Also read: మేటి కథకుడైన కథానాయకుడు పీవీ

చట్టాన్ని దురుపయోగం చేస్తున్న ప్రభుత్వాలు

కానీ ఈ చట్టంపైన వివరణ ఇస్తూ అత్యున్నత న్యాయస్థానం ఎవరి చర్య కానీ రాత కానీ ప్రభుత్వంపైన హింసాత్మక చర్యలకు దారితీసే పక్షంలోనే వారి చర్యను దేశద్రోహంగా పరిగణించాలని స్పష్టం చేసింది. ఈ వివరణను విస్మరించిన ప్రభుత్వాలు ప్రభుత్వ విధానాలను విమర్శించే పురుషులనూ, స్త్రీలనూ, పిన్న వయస్కులనూ, వయసు మీరినవారినీ, అనారోగ్యంతో బాధపడుతున్నవారినీ, అంగవైకల్యం ఉన్నవారినీ దేశద్రోహులుగా పరిగణిస్తూ ప్రభుత్వాలు కేసులు పెడుతూ వస్తున్నాయి. అంతకంటే ముఖ్యంగా అరెస్టు చేసి నిర్దయగా జైళ్ళలో పెడుతున్నాయి. సంవత్సరాలపాటు ఆరోపణల పత్రం (చార్జిషీట్) దాఖలు చేయకుండా, కోర్టులో హాజరుపరచకుండా జైళ్ళలో మగ్గపెడుతున్నాయి.

Also read: తెలంగాణ స్వాప్నికుడు జయశంకర్

దీనికంతటీ కారణం ఏమిటంటే కేదార్ నాథ్ కేసు విచారించినప్పుడే సుప్రీంకోర్టు దేశద్రోహం చట్టాన్ని రాజ్యాంగవిరుద్ధమైనదంటూ తీర్పు చెప్పలేదు. ఆ విధంగా చెప్పి ఉంటే సమస్య లేకుండా పోయేది. ప్రభుత్వాల చేతికి పెద్ద ఆయుధం దొరకకుండా పోయేది. ఎందుకంటే 124ఎ సెక్షన్ దేశద్రోహాన్ని నిర్వచించిన తీరు రాజ్యాంగం 19(1)(ఎ) అధికరణ కింద పౌరులకు ప్రసాదించిన ప్రాథమిక హక్కులకు భంగకరం. భావప్రకట స్వేచ్ఛకూ, వాక్ స్వాతంత్ర్యానికీ భంగం కలిగిందే విధంగా దేశద్రోహాన్ని ఉపా (అన్ లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్) చట్టం 124ఎ సెక్షన్ నిర్వచించింది. రాజ్యాంగ నిర్మాణ సమయంలోనే దేశద్రోహం ఆరోపణ గురించి చర్చించి అటువంటి అవకాశం రాజ్యాంగంలో పొందుపరచనక్కరలేదని స్పష్టం చేశారు.

Also read: ఇది ‘రమణ ఎఫెక్ట్’, రిబీరో వ్యాఖ్య

దేశద్రోహ చట్టం వచ్చిన తర్వాత వేలమంది జైళ్ళపాలైనారు. కానీ వీరిలో ఒక్కరి రాత కానీ, మాట కానీ ప్రభుత్వాల పైన హింసాత్మక చర్యలకు దారి తీసిన దాఖలా లేదు. వారు కేవలం ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రభుత్వం చర్యలను తప్పుపట్టారు. వినోద్ దువా చేసిన పని కూడా అదే.  ప్రతిపక్షాలు చేయవలసిన పనీ అదే కదా! ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ప్రతి పౌరుడికీ ఉంది. ఇది ప్రజాతంత్రం. ప్రజలకోసం, ప్రజల చేత, ప్రభుత్వాలు నిర్వహించే పాలనవ్యవస్థ. ప్రజల తరఫున ప్రజాప్రతినిధులుగా పని చేస్తున్నవారిని విమర్శించే హక్కు ప్రజలకు విధిగా ఉంటుంది. లేదంటే ఎట్లా కుదురుతుంది?

Also read: ఉద్యమస్ఫూర్తికి ఊరట

సుప్రీంకోర్టుదే పొరబాటు

ఒక విధంగా చెప్పాలంటే సుప్రీంకోర్టు నిర్వాకం కారణంగానే ఈ చట్టం ఇప్పటికీ రాజ్యాంగంలో ఉంది. మొదట అవకాశం వచ్చినప్పుడే  ఈ చట్టం రాజ్యాంగవిరుద్ధమని ప్రకటించి రద్దు చేయవలసిన సుప్రీంకోర్టు 1962లో ఆ పని చేయలేదు. ఈ చట్టాన్ని అమలు పరచడంలో ఉదారంగా వ్యవహరించాలని ప్రభుత్వాలకు హితవు చెబుతూ అత్యున్నత న్యాయస్థానం ప్రభుత్వాలు దీనిని దురుపయోగం చేయడానికి అవకాశం కల్పించింది. అందుకే వరవరరావు, సాయిబాబా వంటి వృద్ధులూ, దివ్యాంగులూ సంవత్సరాల తరబడి నిష్కారణంగా జైళ్ళలో మగ్గవలసి వస్తున్నది. బ్రిటిష్ వలస ప్రభుత్వం 1870లో రూపొందించిన ఈ చట్టాన్ని పట్టుకొని ఆధునిక యుగంలో కూడా ప్రజాస్వామ్య ప్రభుత్వాలు వేళ్ళాడుతున్నాయీ అంటే అది ఎంత వెనకబాటుతనమో, అమానుషత్వమో అర్థం చేసుకోవచ్చు. ఈ చట్టాన్ని తయారు చేసిన జేమ్స్ స్టీఫెన్ చాలా కఠినంగా, పకడ్బందీగా నియమాలు రచించాడు. ఒక వ్యక్తి రాసింది లేదా చెప్పింది దేశద్రోహం కిందికి వస్తుందో రాదో నిర్ణయించే అధికారం పోలీసు అధికారులకు ఇస్తుంది ఈ చట్టం.

Also read: ఈటల రాజేందర్ అడుగుల ఆంతర్యం ఏమిటి?

స్వాతంత్ర్యానికి ముందు ఈ చట్టాన్ని విరివిగా దుర్వినియోగం చేసింది బ్రిటిష్ సామ్రాజ్యవాద ప్రభుత్వం. న్యాయస్థానాలు సైతం చాలా అన్యాయంగా చట్టాన్ని సమర్థించేవి. 1891లో బంగోబసి కేసులోనూ, 1897లో, 1908లో బాలగంగాధరతిలక్ పైన కేసులు బనాయించేందుకు ఈ చట్టాన్ని దుర్వినియోగించారు. ప్రభుత్వంపైన తిరుగుబాటు, హింసాత్మక ప్రతిఘన వంటి పెద్ద పరిణామాలు అక్కర లేదనీ, ముద్దాయి నోటి మాట కానీ చేతి రాత కానీ ప్రభుత్వం పట్ల వ్యతిరేక భావనను కలిగించే ఆస్కారం ఉన్నట్టు పోలీసులు భావిస్తే కేసు  పెట్టవచ్చునని దేశంలోని హైకోర్టులూ, సుప్రీంకోర్టు వంటి హోదా కలిగిన ప్రైవీ కౌన్సిల్ నిర్ణయించేవి. ప్రభుత్వం పట్ల అసమ్మతినీ, అసంతృప్తినీ కలిగించే అవకాశం ఉన్నప్పటికీ సదరు రచయితనీ, వ్యక్తనీ దేశద్రోహం కింద అరెస్టు చేయడం, జైలులో పెట్టడం ఈ చట్టం ప్రకారం చెల్లుతుందని తిలక్ కేసులో వాదనలు ఆలకించిన జస్టిస్ ఆర్తర్ స్ట్రాచీ వ్యాఖ్యానించారు. ఈ న్యాయమూర్తి సూత్రీకరణను ప్రైవీ కౌన్సిల్ ఆమోదించింది.

Also read: జితిన్ ప్రసాద అవకాశవాద రాజకీయాలకు ప్రతీక

మొత్తం మీద ఈ చట్టాన్ని రాజ్యాంగం నుంచి తొలగించవలసిన సుప్రీంకోర్టు ఎందువల్లనో ఆ పని చేయకుండా పొరపాటు చేసింది. ఆచితూచి వ్యవహరించాలనీ, ప్రభుత్వంపైన హింసాత్మక దాడులకు ప్రోత్సహించిన రాతలు రాసినవారిపైనే, మాటలు మాట్లాడినవారిపైనే కేసులు పెట్టాలనే సుప్రీంకోర్టు అభిప్రాయంతో నిమిత్తం లేకుండా అందుబాటులో ఉన్న దేశద్రోహం చట్టాన్ని దేశ పాలకులు శతవిధాలా, చీటికీమాటికీ దుర్వినియోగం చేస్తున్నారు. తమ మాటకు ఎదురు మాట్లాడినా, తమను వీసమెత్తు విమర్శించినా, ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ప్రదర్శించినా చెప్పా చెయ్యకుండా పోలీసులు వచ్చి అరెస్టు చేసి జైలులో పెడుతున్నారు. విచారణ లేకుండా సంవత్సరాల తరబడి జైళ్ళలో ఉంచుతున్నారు. ఎవరైనా, ఎంతటి దేశభక్తులైనా, దేశం కోసం ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నవారైనా, దేశంకోసం పోరాడినవారైనా తెలిసో, తెలియకో పాలకులకు  ఇబ్బంది కలిగిస్తే జైలుకు పోతున్నారు. ఇటువంటి నిర్దోషులు వేల సంఖ్యలో ఈ రోజు దేశంలోని జైళ్ళలో ఊచలు లెక్కపెడుతున్నారు.

Also read: పెరుగుట విరుగుటకొరకే

ప్రతిపక్షం వాణి వినిపించవద్దా?

ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉంటుంది. ప్రతిపక్షానికి చెందిన శాసనసభ్యులనూ, లోక్ సభ సభ్యులనూ కూడా ప్రజలే ఎన్నుకుంటారు. వారికి కూడా ప్రభుత్వాన్ని విమర్శించే హక్కులేదా? ప్రజలే ప్రజాస్వామ్యంలో సార్వభౌములని అంటాం. అటువంటి ప్రజలను పోలీసు అధికారుల అభిప్రాయంపైన ఆధారపడి అరెస్టు చేయడం, జైలులో నిరవధికంగా ఉంచడం ఏమి న్యాయం? వాగ్దానాలు అమలు చేయని ప్రభుత్వం పట్లా, తమకు రక్షణ కల్పించని ప్రభుత్వం పట్లా, ప్రాథమిక హక్కులను గౌరవించని ప్రభుత్వం పట్లా ప్రజలు అసంతృప్తిని వ్యక్తం చేస్తారు. అసమ్మతిని వెలిబుచ్చుతారు. ఇటువంటి హక్కులను పరిరక్షించలేని చట్టం రాజ్యాంగంలో ఉండటానికి అర్హమైనది కాదు.  

Also read: సమాఖ్యస్ఫూర్తికి విరుద్ధంగా బెంగాల్ పరిణామాలు  

వినోద్ దువా కేసులో సుప్రీంకోర్టు నిర్ణయం పట్ల హర్షం వెలిబుచ్చుతూ ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఈ క్రూరమైన చట్టాన్ని రద్దు చేయాలని విజ్ఞప్తి చేసింది. ప్రజాస్వామ్యవాదులందరూ కోరుకునేది అదే. ప్రజల అభిప్రాయాలను గౌరవించి, చట్టంలోని అమానుషత్వాన్ని గుర్తించి సుప్రీంకోర్టు ఇప్పటికైనా సూమోటో పద్ధతిలో ఈ విషయాన్ని పరిశీలించి ఈ చట్టం చెల్లనేరదు అని ప్రకటిస్తే ప్రజాస్వామ్యానికి కొత్త ఊపిరిలూదినట్టు అవుతుంది. ప్రజాస్వామ్యం పరిపుష్టం అవుతుంది. ప్రజలు ధైర్యంగా, అభద్రతాభావానికి దూరంగా స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటారు. తమ దేశంలో తాము భయపడుతూ, బిక్కుబిక్కుమంటూ బతకాల్సిన అగత్యం ఉండదు. పాలకులు ఒళ్ళు దగ్గరపెట్టుకొని పరిపాలన చేస్తారు. విమర్శలను సహించడం ప్రజాస్వామ్యంలో కనీస లక్షణం. విమర్శలను ఆహ్వానించడం ప్రజాస్వామ్యంలో ఆరోగ్యలక్షణం.

Also read: తెలుగువారి ఆత్మగౌరవ పతాక

Previous article
Next article

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles