జమ్మూ: ఆదివారం రాత్రి జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదులకు ,జవాన్లకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. ఉగ్రవాదులు భారత భూభాగంలోకి ప్రవేశించే సమయంలో కాల్పులు జరిగినట్లు తెలుస్తుంది. ఈ కాల్పుల్లో తెలంగాణకు చెందిన జవాన్ ఒకరు, అలానే ఆంద్ర ప్రదేశ్ కు చెందిన జవాన్ ఒకరు వీర మరణం పొందారు. తెలంగాణాలోని నిజామాబాద్ జిల్లా కోమన్ పల్లికి చెందిన ర్యాడ మహేష్ మృతి చెందినట్లు ఆర్మీ అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
మరో సైనికుడిని ఏపీలోని చిత్తూరు జిల్లా ఐరాల మండలం రెడ్డివారిపల్లెకు చెందిన చీకల ప్రవీణ్‌కుమార్ రెడ్డి (37) గా గుర్తించారు. ప్రవీణ్‌కుమార్ రెడ్డి 18 సంవత్సరాల క్రితం మద్రాసు రెజిమెంట్, 18 మద్రాస్ ఆర్మీలో చేరారు. ఆయనకు భార్య రజిత, కుమార్తె, కుమారుడు ఉన్నారు. హవల్దారుగా పనిచేస్తూ కమాండో ట్రైనింగ్ తీసుకుంటున్నారు అయన. మరో పక్క కాశ్మీర్ లోకి భారీగా ఉగ్రవాదులను పంపి శాంతిభద్రతలకు భంగం కలిగించేందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తోందని, దాదాపు 50 మంది ఉగ్రవాదులు మాచిల్ సెక్టార్ లోకి వచ్చేందుకు రెడీగా ఉన్నారని నిఘా వర్గాలు వెల్లడించాయి.