Tuesday, January 21, 2025

ప్రతిభాభూషణులు- పద్మవిభూషణులు

  • మధ్యతరగతి కుటుంబాలలో పుట్టిన మధ్యందిన మార్తాండులు
  • వెంకయ్యనాయుడు, చిరంజీవి శ్రమను నమ్ముకున్న విజయులు

రెండు తెలుగు తేజాలను ‘పద్మవిభూషణ్’ వరించింది. అదీ ఒకే సంవత్సరంలో. ఇది అత్యంత అరుదైన అంశం. భారత ప్రభుత్వం అందించే అత్యున్నత పురస్కారాలలో దీని స్థానం ద్వితీయం. ఈ ఘన గౌరవాన్ని అందుకున్న ఈ ఇద్దరూ సాధించిన విజయం అద్వితీయం. ఇద్దరూ కృషిని నమ్ముకున్నవారు. దైవాన్ని నమ్ముకున్నవారు. పనిలో దైవాన్ని దర్శించుకున్నవారు. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి, మధ్యందిన మార్తాండుల వలె వెలిగినవారు. ఆ వెలుగులు పదిమందికి పంచినవారు. జీవితంలో వెలుగునీడలు చూసినవారు. నిన్నటిని మరువనివారు. రేపటి కోసం అలోచించేవారు. ఆ ఇద్దరూ జగమెరిగినవారు, జనం మెచ్చినవారు. ఎవరయ్యవారు? ఇంకెవరయ్య? మన తెలుగువారు. ఒకరు వెంకయ్యనాయుడు – ఇంకొకరు చిరంజీవి. వెంకయ్యనాయుడు అభిమానదైవం శ్రీ వేంకటేశ్వరుడు. చిరంజీవి ఉపాస్యదైవం ఆంజనేయుడు. ఇద్దరూ రాజ్యసభ సభ్యులుగా ప్రాతినిధ్యం వహించినవారే. ఇద్దరూ కేంద్ర మంత్రిపదవులు అలంకరించినవారే. వీరికి చిన్నప్పటి నుంచీ తమేంటో చూపించుకోవాలనే పట్టుదల ఎక్కువ. అనుకున్నది సాధించేంత వరకూ సాధన చేసే స్థిరచిత్తం ఇద్దరిదీ. చిరంజీవి జీవనగమనంలో రాజకీయ ప్రయాణం చిన్న మజిలీ మాత్రమే. వెంకయ్యనాయుడి రాజకీయ జీవనం సుదీర్ఘమైన పయనం.

Also read: అయోధ్య రామ ‘ప్రతిష్ఠ’

ఇద్దరి ప్రస్థానం 1978లోనే

1978లో చిరంజీవి సినిమా యాత్ర ప్రారంభమైంది. అదే సంవత్సరం శాసనసభ సభ్యుడిగా ఎం.వెంకయ్యనాయుడి రాజకీయ యాత్ర శుభారంభమైంది. అది మొదలు ఆ ఇద్దరూ ఎన్నడూ వెనక్కుచూసుకోలేదు. ప్రభంజనంలా ముందుకు సాగారు. ఇద్దరూ జనం మనుషులే. జనావళితో జేజేలు కొట్టించుకున్నవారే. ఇద్దరిదీ అలుపెరుగని పోరాటం. అవమానాలను దిగమింగుకున్న ధృడచిత్తం. అమేయ, అజేయ ధీరోదాత్త జీవనం. మేరునగధీరులైన నాయకుల మధ్య సంచరిస్తూ, పాఠాలు,గుణపాఠాలు నేర్చుకుంటూ, తమ భావి ప్రయాణాన్ని అద్భుతంగా మలుచుకున్నారు. అగ్రనాయక స్థాయిని ఆక్రమించుకున్నారు. ఎక్కడో చిన్న పల్లెలో పుట్టి, దిల్లీలో మెట్టి, ఉపరాష్ట్రపతి స్థాయికి ఎదగడం సామాన్యమైన విషయం కాదు. నాటి అగ్రనాయకులు వాజ్ పెయ్, అడ్వాణీల  వాల్ పోస్టర్లు అంటించి, మైకుల్లో ప్రచారం చేసే అతి సామాన్యమైన స్థాయి నుంచి, అదే పార్టీకి జాతీయ అధ్యక్షుడి హోదాకు ఎదిగి, వారి సరసనే కూర్చోగలగడం అసాధారణమైన అంశం.అది వెంకయ్య విజయపతాకం.

Also read: మహిళామణులు

అకుంఠిత దీక్షతో అగ్రస్థానానికి…

నాటి అగ్ర కథానాయకులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ సినిమాల టిక్కెట్ల కోసం చొక్కాలు చించుకున్న దశ నుంచి, అగ్రనాయకుడి స్థానానికి ఎగసి, వారి ప్రక్కనే కూర్చొని, ఆ ఇరువురి ఘన వారసత్వానికి ప్రతీకగా ప్రజ్వలిస్తున్న ప్రతిభామారుతం చిరంజీవి. ఈ పద్మవిభూషణ విశేషులిద్దరికీ నెల్లూరుతో అనుబంధం ఉండడం మరో విశేషం. ఇద్దరూ తమ రంగాల్లో అత్యున్నత స్థాయిని చేరుకొని, వైభవప్రాభవాల రుచిచూసినా, ఆ మత్తులో ముణగలేదు. మట్టిని, మనుషులను మరువలేదు. స్వర్ణభారతి ట్రస్టు ద్వారా వెంకయ్యనాయుడు, బ్లడ్ బ్యాంక్ మొదలైన వేదికల ద్వారా చిరంజీవి సామాజిక సేవలో నిత్యం అంకితమవుతూ, పునీతులవుతున్నారు. క్రమశిక్షణ,కృషి,పట్టుదల, పట్టువిడుపు వంటి పదాలు వీరిద్దరి జీవితపటానికి పడికట్టు పదాలు కాదు,మడికట్టుపదాలు. అక్షర సత్యాలు,జీవన నిత్యాలు. వీరిద్దరి జీవితం తెరచిన పుస్తకం. ఆ బతుకుపుటల్లో ఎన్నో విజయసూత్రాలు, మరెన్నో దివ్య ఔషధాలు దాగివున్నాయి. అదొక అనంతపయనం, నవరస కావ్యం.

Also read: సంకురాతిరి

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles