మంచిర్యాల: తాము టీవీ9 ఉద్యోగులమనీ, ఆ న్యూస్ చానల్ లో ఒక కార్యక్రమం నిర్వహించేందుకు యాంకర్ నీ, ఇతర సాంకేతిక సిబ్బందినీ నియమించేందకు తమ సంస్థ ప్రతినిధులుగా వచ్చామనీ చెప్పి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్న ఇద్దరు కుర్రవాళ్ళను పోలీసులు అరెస్టు చేశారు. మంచీర్యాలలో ఇంటర్వ్యూలు చేస్తూ, జీతాలు లక్షలలో ఉంటాయనీ మాయమాటలు చెబుతూ నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదు వచ్చింది. టీవీ9 స్థానిక విలేఖరి గొల్లన నరేశ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలో దిగిన పోలీసులు ఆరా తీయగా వారు దొంగ ఉద్యోగులనీ, దొంగ గుర్తింపు కార్డులనూ, ప్రశ్నపత్రాలనూ సంపాదించి ఉపయోగిస్తున్నారనీ తేలింది. హైదరాబాద్ లోని ఎల్ బి నగర్ కు చెందిన ఆముదాల సంపత్ రెడ్డినీ, అదే నగరానికి చెందిన లోతుగుంట నివాసి పులి వెంకటరావునీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరూ విద్యార్థులు.