Sunday, November 24, 2024

ఇరు పక్షాల మధ్య భీకర సమరం

రామాయణమ్185

ఆక్రమణ మొదలయ్యింది. లోతైన అగడ్తలను పెద్దపెద్ద మట్టిపెళ్ళలతో కూడిన గిరిశిఖరాలను, పెనువృక్షాలను, శిలలనుతీసుకొని వచ్చి క్షణకాలములో పూడ్చి వేసింది వానర సైన్యం.

వానరుల ముష్టి ఘాతాలకు ముఖద్వారాలు కూలుతున్నాయి. ప్రాకారశిఖరాలు పగుళ్ళిచ్చి ,బీటలువారి నేలకూలిపోతున్నాయి.

Also read: అంగద రాయబారము

‘‘రామునకు జయముజయము, లక్ష్మణునకు జయముజయము, రాజైన సుగ్రీవునకు జయముజయము’’ అనుచూ పెద్దపెట్టున గర్జిస్తూ అడ్డువచ్చిన వారిని నిర్జిస్తూ ఆక్రమణ సాగుతోంది..

వానరసైన్యపు ఉధృతిని చూసి యుద్ధమునకు రావణుడు ఆజ్ఞ ఇచ్చాడు. వెంటనే అన్నివైపులనుండీ చీమలదండువలే అసురసైన్యము వానరులను ముట్టడించింది.

రాక్షసుల శంఖనాదాలు, దుందుభి మ్రోతలు వానరుల సింహనాదాలతో భూమ్యాకాశాలు బద్దలయిపోతున్నాయి.

గజఘీంకారాలు,హయహేషలు, రధచక్రఘోషలు, సైనికుల పదఘట్టనల ప్రకంపనలు గగనమండల‌మంతా వ్యాపించాయి.

Also read: లంకను చుట్టుముట్టిన రామసైన్యం

గిరగిరతిరిగే గదలు, సర్రున గాలిలో దూసుకుపోయే శూలాలు, విసురుగా గాలిలోకి లేచే గండ్రగొడ్డళ్ళు రకరకాల ఆయుధాల తళత్తళలు సమరరంగాన్ని వింతకాంతులతో నింపివేశాయి.

ఇక వానరుల చేతిలోనుండి గిరిశిఖరాలు, తరుశాఖలు, పెనుశిలలు సర్రుసర్రున దూసుకుంటూ వెళ్ళి రక్కసి మూకలపైబడుతున్నాయి.

కోటగోడల మీదకు రయ్యిన ఎగిరి సైఅంటూ కలబడే వానరులు కొందరు, పెద్దపెద్ద చెట్లను చేతిలో పట్టుకొని గిరగిరా మండలాకారములో త్రిప్పుతూ రాకాసిమూకలను చెల్లాచెదురు చేసేవారు కొందరు.

తెగిన తలలు, దొర్లే మొండెములు జివ్వున పైకెగసే రుధిరధారలు, ప్రవహించే రక్తపుటేరులతో, మాంసపు ముద్దలతో బురదగామారిన భూమి ఎక్కడచూసినా ఇదే దృశ్యము. ఎటు చూసినా ఇదే పరిస్థితి…

Also read: రావణుడితో సుగ్రీవుడి మల్లయుద్ధం

అంగద – ఇంద్రజిత్

హనుమ-జంబుమాలి

విభీషణ–శత్రుఘ్నులు(రాక్షసుడు)

గజుడు– తపసుడు

సుగ్రీవ–ప్రఘస

లక్ష్మణ–విరూపాక్షులు..

మైంద–వజ్రముష్టి

ద్వివిద-అశనిప్రభ

నల –ప్రతపస

సుషేణ– విద్యున్మాలి

ఒకరొకరితో భీకర యుద్ధము సలుపుచుండిరి.

అంగదుడు మహా వేగముగా ఎగిరి దూకి ఇంద్రజిత్తు రధమును నుగ్గుచేసి సారధిని ఘోరముగా నలిపి చంపి ఆ రాకుమారుని నేలపై నిలబెట్టెను. ఇంద్రజిత్తు కోపించి తన గదతో అంగదుని మోదగా ఆయన ఏ మాత్రము చలించక తిరిగి ఒక పెనుశిల ఇంద్రజిత్తు పైకి విసరెను.

Also read: రావణుడి యుద్ధసన్నాహాలు, రాముడి రణవ్యూహం

హనుమ పిడికిలి పోటుకు జంబుమాలి రక్తముకక్కుకొని దిక్కుమాలిన చావు చచ్చెను.

అత్యంత సునాయాసముగా విభీషణుడు శత్రుఘ్నుని నుగ్గునుగ్గు గావించెను.

గజుడు తపసుని బట్టి కసపిస నలిపి వాని ఉసురు తీసెను.

సుగ్రీవుడు  తీవ్రవేగముతో కొట్టిన దెబ్బకు  తట్టుకొనలేక ప్రఘసుని  కళ్ళు బైర్లుకమ్మి నోటివెంట చెవుల వెంట రక్తముకారి భూమినిపడి మృత్యుదేవతను ఆప్యాయముగా కౌగలించుకొనెను.

రామలక్ష్మణ శరములు ఒక్కొక్కటి పదులకొద్ది రక్కసుల తలలను తెగగొట్టి గాలిలో బంతులాటలు ఆడించినవి.

అచటనుండి ఒక ఎర్రటి ప్రవాహము బయలుదేరినది.

 ఒక మహాప్రవాహమది ఒక మహానది లాగా కదలుచున్నది

 అందులో అవి ఏమి? నల్లని గడ్డిమోపులు? అదుగో కట్టెమోపులు కూడా ప్రవాహములో తేలుతూ మునుగుతూ కొట్టుకు పోవుచున్నవి?..అవి ఏమి?

అది రుధిరప్రవాహము.

అవి గడ్డిమోపులు కావు నల్లని కేశపాశములు.

 అవి కట్టెలు కావు మృతవీరుల కళేబరములు.

 ఇచ్చట స్వర్ణలంకలో మరియొక  వైతరిణీ నది!

Also read: సీతమ్మను రామునికి అప్పగించమని రావణుడికి తల్లి కైకసి హితబోధ

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles