డాక్టర్ శోభారాణి వేమూరి
కళ్ళు
చూశాయి
మాతృత్వంలో మమతను
బాల్యంలో తియ్యదనాన్ని
స్నేహంలో సొగసును
ప్రేమలో మాధుర్యాన్ని
వృద్ధాప్యంలో విశ్రాంతిని
కళ్ళు
చూశాయి
పరిభ్రమిస్తున్న భూగోళాన్ని
జీన్స్ లోని డీఎన్ఏ పార్టికల్స్ ని
చంద్రుడిలోని శిలాకాంతులను
కళ్ళు
చూశాయి
చిత్రమైన గడ్డిపూల మనోహరత్వాన్ని
సీతాకోక చిలుకల ఱెక్కల పుప్పొడి అందాన్ని
తుషారబిందు స్నాతపత్ర సౌందర్యాన్ని
అలల్లో విరిగిపడే ఇంద్రధనుసుల కాంతుల్ని
కానీ
దుమ్ములో పుట్టి
ధూళిలో పెరిగిన
ఆ కళ్ళు
వెన్నెల్ని చూశాయి
పువ్వుల అందాలు చూడలేదు.
ఉదయాన్ని చూశాయి
అరుణకాంతుల్ని చూడలేదు
సాయంకాలాల్ని చూశాయి
సంధ్యారాగాన్ని చూడలేదు.
మనుషుల్ని చూశాయి
మానవత్వాన్ని చూడలేదు.
కళ్ళు చూసినవేవీ
ఆ కళ్ళు చూడలేదు
కష్టం చేయకపోతే
బిచ్చమెత్తక తప్పదనీ
నలుగురి జాలే బతుకనీ
కళ్ళుండీ కడుపు మాడ్చుకునే కంటే
కబోదై కడుపు నింపుకోవడమే మేలనీ
ఆ కళ్ళు గ్రహించాయి.
కడుపు నిండినప్పుడు
కడుపు పండినప్పుడు
కళకళలాడాల్సిన కళ్ళలో
వెన్నెల కాంతులు వెలిసిపోయాయి.
కండలు కరుగుతున్నా
కడుపు నిండనప్పుడు
కణకణ మండాల్సిన కళ్ళు
చల్లారిన కొలిమిలా ఉన్నాయి.
ఱొమ్ముల్లో పాలెండినప్పుడు
మాతృహృదయం మరుగుతున్నప్పుడు
క్రోధాన్ని చిమ్మాల్సిన కళ్ళు
చీకటి గుహల్లా ఉన్నాయి.
తోటిమనిషిని బ్రతకనివ్వని తెలివితేటల్ని
సమాజంలోని స్వార్థాన్ని
చూసి తిరగబడాల్సిన కళ్ళు
నిస్సుత్తువగా ఉన్నాయి.
ఆరిపోని మంటల పేగుల్తో
భవిష్యత్తుమీది ఆశను కోల్పోయిన
ఆ కళ్ళు నిర్జీవంగా ఉన్నాయి.
విశ్వరూప సందర్శనం
ధృతరాష్ట్రుడి కన్నుల కాంతిపథమైనదట.
సమసమాజ సందర్శనం
ఆ కళ్ళకు వెన్నెల వెలుగు కురిపిస్తుందేమో!