———————————
( From “The Wanderer”, by KAHLIL GIBRAN)
(తెలుగు సేత : Dr.C.B.Chandra Mohan)
———————————-
పూర్వం షావాకిస్ నగరంలో ఒక రాజ కుమారుడు ఉండేవాడు. పిన్నలు, పెద్దలూ– అందరికీ అతనంటే చాలా ఇష్టం. చివరకు ఆ పొలాల్లో ఉన్న జంతువులు కూడా ఆప్యాయంగా అతని చుట్టూ చేరేవి.
‘అతని భార్య ఐన రాకుమార్తెకు మాత్రం అతని పై ప్రేమ లేదు’ అని ప్రజలందరూ చెప్పుకునే వారు. అంతే కాదు ఆమె రాకుమారుణ్ణి అసహ్యించు కునేది కూడా!
ఒక రోజు పక్క నగరపు రాకుమార్తె , ఈ షావాకిస్ రాకుమార్తెను కలవడానికి వచ్చింది. వారిరువురూ కూర్చొని మాటల్లో పడ్డారు. మాటల మధ్యలో వారి వారి భర్తల గురించి ప్రస్తావన వచ్చింది.
షావాకిస్ రాకుమార్తె ఎంతో భావావేశంతో అంది కదా !” నీ వివాహమయ్యి ఇన్ని ఏళ్లయినా, నువ్వు నీ రాజ కుమారుడితో ఇంత ఆనందంగా ఉండడం చూస్తే నాకు నిజంగా ఈర్ష్యగా ఉంది ! నా భర్త అంటే నాకు అసహ్యం. అతను నా ఒక్కతికే చెందినవాడు కాదు. నేను నిజంగా చాలా విచారంగా ఉన్నాను.”
అప్పుడు ఆ వచ్చిన రాజ కుమార్తె ఈమెను తదేకంగా చూసి ఇట్లా అంది ” మిత్రమా! నీవు నీ భర్తను ప్రేమిస్తున్నావనేది నిజం. ఔను. నీకు అతనిపై వ్యామోహం పోలేదు. స్త్రీ జీవితం ఉద్యానవనంలో వసంతంలా ఉంటుంది. నువ్వు మా సంసారం గురించి నిజంగా జాలి పడాలి. మేము ఒకరినొకరం నిశ్శబ్దం గానూ, ఓర్పు గాను భరిస్తూ ఉంటాం. మీరందరూ ఇదే ఆనందం అనుకుంటూ ఉంటారు.”