————————-
(‘THE TWO POEMS’ FROM ‘ THE WANDERER’ BY KAHLIL GIBRAN)
తెలుగు అనువాదం: డా. సి. బి. చంద్ర మోహన్
30. సంచారి తత్త్వాలు
—————————
కొన్ని శతాబ్దాల క్రితం ఏథెన్స్ నగరానికి వెళ్లే మార్గంలో ఇద్దరు కవులు కలిశారు. ఒకరినొకరు కలవటం వారికి సంతోషం కలిగించింది.
వారిలో ఒక కవి రెండో కవిని ఇలా అడిగాడు.” ఈ మధ్య మీరు వ్రాసిన పాటలేమైనా ఉన్నాయా? మీ లైర్ (ఒక సంగీత సాధనము) తో వాయించితే ఆ పాట ఎట్లా ఉంది?”
రెండో కవి గర్వంగా ఇలా సమాధానమిచ్చాడు ” నేను ఇప్పుడే నా కవితల్లోనే శ్రేష్ఠమైన ఒక కవితను పూర్తి చేసాను. బహుశా గ్రీకు భాషలో ఇప్పటి వరకు రాయబడిన అతి గొప్ప కవిత ఇదే కావచ్చు. ఈ గీతం ఆ దేవ దేవునికి వేడికోలు! “
అప్పుడా కవి, తన లూజు కోటు జేబు నుండి ఒక దళసరి కాగితం తీసి, ” ఇదిగో చూడు! కవిత నా దగ్గరనే ఉంది. నీకు సంతోషంగా వినిపిస్తాను. ఆ తెల్ల సైప్రస్ చెట్టు నీడలో కూర్చుందాము రా!” అన్నాడు.
ఆ కవి తన కవితను చదివాడు. అది ఒక దీర్ఘ కవిత.
మొదటి కవి మృదువుగా ఇట్లా అన్నాడు. “ఇది చాలా గొప్ప కవిత. ఇది చిరకాలం ఉంటుంది. దీనితో మీరు కీర్తించబడతారు.”
రెండో కవి ప్రశాంతంగా “ఇటీవల మీరు ఏమి వ్రాస్తున్నారు?” అని అడిగాడు.
మొదటి కవి ఇట్లా జవాబిచ్చాడు. ” నేను చాలా తక్కువ వ్రాసాను. ఒక తోటలో ఓ బాలుని ఆటకు గుర్తుగా ఒక ఎనిమిది పంక్తులు వ్రాసాను.” అని ఆ కవి తన కవితను చదివి వినిపించాడు.
రెండో కవి” ఫరవాలేదు; అంత చెడుగా లేదు.” అన్నాడు.
అప్పుడు వారిద్దరూ విడిపోయారు.
ఇప్పుడు రెండు వేల సంవత్సరాల తరువాత ఆ ఎనిమిది పంక్తుల కవితయే అందరి నాలుకల మీద మిగిలింది. ఆ కవితను అందరూ ప్రేమించి, ఆదరించారు.
ఆ దీర్ఘ కవిత శతాబ్దాల తరువాత — గ్రంధాలయాల్లో, పండితుల మెదళ్లలో ఉంది. అది జ్ఞాపకాల్లో ఉన్నా కాని, దానినెవరూ ప్రేమించలేదు. ఆదరించలేదు.
Also read: పాత ద్రాక్ష సారా
Also read: ‘మరణానంతర జీవితం’ నవల – ఒక పరిశీలన
Also read: భోజనం, పానీయం
Also read: సన్యాసి ప్రవక్త
Also read: బంగారు బెల్టు