————————
(‘ THE QUEST ‘ FROM ‘THE WANDERER ‘ BY KAHLIL GIBRAN)
తెలుగు సేత:డా. సి. బి.చంద్ర మోహన్
37. సంచారి తత్త్వాలు
——————
వెయ్యేళ్ళ క్రితం ఇద్దరు తత్త్వవేత్తలు లెబనాన్ నగరం కొండల వాలులో కలుసుకున్నారు. వారిలో ఒకరు రెండోవానిని ఇలా అడిగాడు. ” ఎక్కడికి వెళ్తున్నారు? “
రెండో తత్త్వ వేత్త ఇలా జవాబిచ్చాడు.”నేనిక్కడ యౌవనాన్నిచ్చే జల కోసం అన్వేషిస్తున్నాను. అది ఈ కొండల్లో ఊరుతుందని నాకు తెలుసు. ఆ జల సూర్యుని దిక్కుగా ఎగిసిపడుతుందని నేను చదివాను. మరి, మీరు దేని కోసం వెతుకుతున్నారు?”
మొదటి తత్త్వ వేత్త “నేను మరణం యెక్క రహస్యాన్ని గురించి అన్వేషిస్తున్నాను” అన్నాడు.
అప్పుడా ఇద్దరు తత్త్వ వేత్తలు — రెండో వారికి శాస్త్ర విజ్ఞానం బొత్తిగా లేదని మనసులో భావించారు. ఇద్దరూ గొడవ పడసాగారు. ఒకరినొకరు రెండో వారికి ఆధ్యాత్మిక దృష్టి లోపం ఉందని తిట్టుకున్నారు.
ఆ ఇద్దరు తత్త్వ వేత్తలు బిగ్గరగా అరుచుకుంటుండగా, ఒక కొత్త మనిషి (అతని ఊరులోనే సీదా, సాదా మనిషి) ఆ పక్కగా వెళుతూ కాసేపు నిలబడి, వారి పోట్లాటను, వాదులాటను విన్నాడు.
అతను వారి వద్దకు వచ్చి ఇలా అన్నాడు. “మంచి పండితులారా! మీ ఇద్దరూ నిజానికి ఒకే తత్త్వానికి చెందిన వారు. ఇద్దరూ చెప్పేదొకటే. కాకపోతే వేరే మాటల్లో చెబుతున్నారు. ఒకరు యవ్వనం పొందే జల కోసం అన్వేషిస్తున్నారు. రెండో వారు మరణ రహస్యాన్ని తెలుసుకుందామనుకుంటున్నారు. ఆ రెండు నిజానికి ఒకటే. మీ ఇద్దరి ఆలోచనల్లో ఆ రెండు ఒకటిగానే ఉంటాయి.”
ఆ కొత్త వ్యక్తి వెళుతూ ” మీకు వీడ్కోలు మునులారా!” అన్నాడు. ఆ వ్యక్తి వారి వద్ద నుంచీ వెళ్లుతూ హాయిగా నవ్వుకున్నాడు.
ఆ ఇద్దరు తత్త్వ వేత్తలు కూడా, ఒక్క క్షణం ఒకరినొకరు చూసుకొని , హాయిగా నవ్వుకున్నారు.
వారిలో ఒకతను “మంచిది. మనిద్దరం కలిసి అన్వేషణ సాగించ వచ్చు కదా?” అన్నాడు.
Also read: నేరమూ, శిక్షా
Also read: చెెవిటి భార్య
Also read: ఒక దేవుడు మరియు చాలా మంది దేవుళ్ళు
Also read: ఆవాసాలు
Also read: దానిమ్మ పళ్ళు