- ఒకేరోజున రెండు సరికొత్త రికార్డులు
- బిస్త్ సిక్సర్ల హోరు… అజార్ పరుగుల జోరు
దేశవాళీ టీ-20 క్రికెట్ చాంపియన్లకు ఇచ్చే సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో…ఒకేరోజున రెండు సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. కేరళ ఓపెనర్ మహ్మద్ అజారుద్దీన్, మేఘాలయ ఆటగాడు పునీత్ బిస్త్ చెలరేగిపోయారు. తమతమ పేర్లతో అరుదైన రికార్డులు సాధించారు.
బిస్త్ సిక్సర్ల మస్త్ మస్త్
చెన్నై వేదికగా మిజోరంతో ముగిసిన గ్రూపులీగ్ పోటీలో మేఘాలయ కెప్టెన్ పునీత్ బిస్త్ కేవలం 51 బంతుల్లోనే 6 ఫోర్లు, 17 సిక్సర్లతో 146 పరుగుల స్కోరుతో విశ్వరూపం ప్రదర్శించాడు.సిక్సర్లబాదుడులో సరికొత్త జాతీయ రికార్డు నెలకొల్పాడు.
గ్రౌండ్ నలుమూలలకూ భారీషాట్లు కొడుతూ విధ్వంసం సృష్టించాడు. టీ-20 ల్లో ఒక ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సర్లు బాదిన దేశవాళీ క్రికెటర్‌గా రికార్డుల్లో చేరాడు.
Also Read : మహిళా టీ-20లో సరికొత్త ప్రపంచ రికార్డు
ఇప్పటి వరకూ ముంబై ఆటగాడు శ్రేయస్ అయ్యర్ పేరుతో ఉన్న 15 సిక్సర్ల రికార్డును పునీత్ అధిగమించాడు. టీ-20 క్రికెట్ చరిత్రలోనే.. ఓవరాల్‌గా ఎక్కువ సిక్సర్లు బాదిన రికార్డు కరీబియన్ సునామీ ఓపెనర్ క్రిస్ గేల్ పేరుతో ఉంది. గేల్ ఓ ఇన్నింగ్స్ లో 18 సిక్సర్లు సాధించడం విశేషం.
ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన మేఘాలయ 230 పరుగులు భారీస్కోరు నమోదు చేసింది. బదులుగా మిజోరం 100 పరుగులు మాత్రమే చేయగలిగింది. మిజోరాం 130 పరుగుల భారీ తేడాతో చిత్తయింది.
ముంబైకి అజార్ దెబ్బ
ముంబై వేదికగా పవర్ ఫుల్ ముంబైతో జరిగిన మరో పోటీలో కేరళ సంచలన విజయం సాధించింది. కేరళ ఓపెనర్ మహ్మద్ అజారుద్దీన్ సుడిగాలి సెంచరీతో వీరవిహారం చేశాడు. కేవలం 54 బంతుల్లోనే 137 పరుగుల నాటౌట్ స్కోరుతో మ్యాచ్ విన్నర్ గా నిలిచాడు. అజార్ మొత్తం 9 ఫోర్లు, 11 సిక్సర్లతో ఈ సూపర్ సెంచరీ నమోదు చేశాడు. అజార్ జోరుతో కేరళ జట్టు 8 వికెట్లతో ముంబై పై అనూహ్యవిజయం సాధించగలిగింది. ముంబై 20 ఓవర్లలో 7 వికెట్లకు 196 పరుగులు చేయగా… కేరళ 15.5 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి 201 పరుగులు లక్ష్యాన్ని చేరగలిగింది.
Also Read : కంగారూల కోటలో భారత్ పాగా ?
37 బాల్స్ లోనే అజార్ శతకం
మహ్మద్ అజారుద్దీన్ పేరు వినగానే హైదరాబాద్ గ్రేట్ మాత్రమే గుర్తుకు వస్తాడు. అయితే…కేరళ జట్టు తరపున దేశవాళీ క్రికెట్ ఆడుతున్న యువ ఓపెనర్ పేరు కూడా అజారుద్దీనే కావడం విశేషం. 26 ఏళ్ల అజార్ కు అతని సోదరుడు తన ఫేవరెట్ ఆటగాడు అజారుద్దీన్ కు గుర్తుగా పేరుపెట్టాడు. భారత మాజీ కెప్టెన్,నిన్నటితరం మహ్మద్ అజారుద్దీన్ పేరు నిలబెట్టే విధంగా నేటితరం అజార్ అందుకు తగినట్లే ఆ స్టైలిష్ బ్యాట్స్‌మన్ పేరు నిలబెట్టాడు.
సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడాడు . కేవలం 37 బాల్స్ లోనే సెంచరీ బాదాడు… చివరికి 54 బంతుల్లో 137 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అజార్ సెంచరీలో మొత్తం 11 సిక్సర్లు, 9 బౌండ్రీలు ఉన్నాయి. అజార్ జోరుతో ముంబై విధించిన 197 పరుగుల భారీ లక్ష్యాలన్నికేరళ 15.5 ఓవర్లలోనే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి సాధించగలిగింది. కేరళ తరఫున టీ-20ల్లో సెంచరీ బాదిన తొలి బ్యాట్స్‌మన్‌గా ఘనతను అజారుద్దీన్ సొంతం చేసుకోగలిగాడు. అంతేకాదు. ముస్తాక్ అలీ టోర్నీలో సైతం ఇదే అత్యంత వేగవంతమైన సెంచరీ కావడం విశేషం.