————————————————————–
(‘TWO GUARDIAN ANGELS’ FROM ‘THE WANDERER’ BY KAHLIL GIBRAN)
అనువాదం: డా.సి.బి. చంద్ర మోహన్
17: సంచారి తత్వాలు
————– ———- ——————
ఒక రోజు సాయంత్రం ఇద్దరు సంరక్షక దేవ దూతలు నగర ద్వారం వద్ద కలుసుకొని, పరస్పరం అభివాదం తెలుపుకొని మాట్లాడుకోసాగారు.
ఒక దేవ దూత ఇట్లా అన్నాడు. ” ప్రస్తుతం నువ్వేమి చేస్తున్నావు? నీకేపని అప్పగించబడింది ?”
రెండో దేవ దూత ఇట్లా జవాబిచ్చాడు. ” ఒక పతనమైన మనిషికి సంరక్షకుడిగా ఉండే పని నాకు అప్పగించ బడింది. అతను ఆ క్రింద లోయలో ఉంటాడు. అతడు పాపాత్ముడు మరియు దిగజారిన మనిషి. ఇది చాలా కఠినమైన మరియు పెద్ద పని. “
మొదటి దేవ దూత ఇట్లా అన్నాడు. “అది చాలా తేలికైన పని. నాకు చాలా మంది పాపాత్ములు తెలుసు. నేను వారికి సంరక్షకుడిగా చాలా సార్లు ఉన్నాను. ఇప్పుడు నేను ఒక మునికి సంరక్షకుడిగా ఉంటున్నాను. అతను దూరంగా ఒక చక్కని గృహంలో నివసిస్తున్నాడు. నేను చెప్పేదేమిటంటే అది చాలా కఠిన మైన పని. అంత తేలిక పని కాదు.”
రెండో దేవ దూత ,” ఇది కేవలం ఊహ మాత్రమే. ఒక పాపిని సంరక్షించడం కన్నా , ఒక మునికి రక్షకుడవటం ఏమంత కష్టమైన పని? “అన్నాడు.
మొదటి దేవ దూత ” నేను ఊహించుకుంటున్నానని అనటం కేవలం నీ అసమర్థత. నేను నిజం మాత్రమే చెప్పాను. నువ్వే అనవసరంగా ఊహించుకుంటున్నావు. ” అన్నాడు.
అప్పుడు ఆ దేవ దూతలు గొడవ పడుతూ పోట్లాడుకోవడం మొదలెట్టారు. ముందు మాటకు మాటా అనుకున్నారు. నెమ్మదిగా పిడికిళ్ల తోనూ , రెక్కలతోనూ పోట్లాట కొనసాగించారు.
వారు పోట్లాడుకుంటుండగానే ఒక ప్రధాన దేవ దూత అటుగా వచ్చాడు. అతడు వారి పోట్లాటను ఆపి ఇట్లా అన్నాడు ” మీరు ఎందుకు కొట్లాడు కుంటున్నారు? దేని గురించి ఇదంతా? నగర వీధిలో పోట్లాడుకోవడం సంరక్షక దేవ దూతలకు ఏమాత్రం తగదని మీకు తెలియదా ? మీ అసమ్మతి ఏమిటి? చెప్పండి !”
ఇద్దరు సంరక్షక దేవతలు ఒకేసారి మాట్లాడ సాగారు. ఇద్దరూ కూడా ” నాకు అప్పగించిన పని చాలా కఠినమైనది. అందుకు నాకే ఎక్కువ గుర్తింపు రావాలి ! ” అని అన్నారు.
అప్పుడు ప్రధాన దేవ దూత తల ఊపుతూ ఆలోచించాడు తరువాత ఇట్లా అన్నాడు” మిత్రులారా, మీ ఇద్దరిలో ఎవరు గౌరవానికి, బహుమానానికి అర్హులో నేనిప్పుడే చెప్పలేను! కానీ ఆ అధికారం నాకు ప్రసాదించబడింది కనుక శాంతి కోసం, మంచి సంరక్షణ కోసం మీ పనులు — ఒకరి పని మరొకరికి అప్పజెబుతున్నాను. ఎందుకంటే, ఎవరికి వారు ఎదుటి వారి పని తేలిక అంటున్నారు కదా! ఇప్పుడు వెళ్లి మీకు అప్పగించిన పనితో సంతోషంగా ఉండండి.”
సంరక్షక దేవ దూతలు ప్రధాన దేవ దూత ఆదేశాలు తీసుకొని వెళ్లారు. వెళ్తూ, వెనక్కి, ప్రధాన దేవ దూత వైపు కోపంగా చూస్తూ వెళ్లారు. వారి మనసుల్లో ఇలా అనుకున్నారు ” ఈ ప్రధాన దేవ దూతలు మన జీవితాలని రోజూ కఠిన తరం చేస్తున్నారు!”
ప్రధాన దేవ దూత కాసేపు అలాగే నిలుచుని ఆలోచించాడు. మనసులో ఇట్లా అనుకున్నాడు ” మనం ఈ సంరక్షక దేవదూతల పై నిఘా ఉంచి , వారి సంరక్షకులుగా ఉండాలి.”
Also read: యుద్ధమంటే ఏమిటో…..అడుగు
Also read: దేశాన్ని చూసి జాలిపడు
Also read: పరిపూర్ణ జీవనం
Also read: నర్తకి
Also read: శాంతి – యుద్ధము