వోలేటి దివాకర్
రాజమహేంద్రవరం: సాధారణంగా ఢిల్లీ స్థాయిలో కేంద్ర ప్రభుత్వశాఖలకు సంబంధించిన పనుల కోసం ఎమ్మెల్యేలు తమ ఎంపిని వెంటబెట్టుకుని , కేంద్ర అధికారులు , కేంద్రమంత్రులను కలుస్తుంటారు . అయితే ఇటీవల రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఢిల్లీకి వెళ్లారు. ఒక మార్వాడీ కుర్రాడ్ని వెంట తీసుకుని, వివిధ కేంద్ర ప్రభుత్వశాఖల అధికారులను కలిసి, నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించి, వినతిపత్రాలు సమర్పించారు .
ఆ సమయంలో పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి . రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యుడు మార్గాని భరత్ రామ్ ఢిల్లీలోనే ఉండటం గమనార్హం . గోదావరి తీరంలోని రాజకీయంగా చైతన్యవంతమైన రాజమహేంద్రవరంలో అధికార వైఎస్సార్ సిపిలో ఆధిపత్యపోరుకు ఈపరిణామాలు అద్దం పడుతున్నాయి . పార్టీ అధికారంలోకి వచ్చిన కొన్ని నాళ్లలోనే అధికార వైసిపి రెండు శిబిరాలుగా చీలిపోయింది . రాజమహేంద్రవరంలో రాజకీయంగా ఆధిపత్యం కోసం ఇరువర్గాలు పార్టీ ప్రతిష్టను బజారుకీడుస్తున్నాయి .
వేర్వేరుగా జగన్ జన్మదిన వేడుకలు
తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. అయితే, ఈకార్యక్రమాలు వేరువేరుగా చేయడం గమనార్హం . జక్కంపూడి రాజా సోదరుడు గణేష్ ఆధ్వర్యంలో దివంగత జక్కంపూడి రామ్మోహనరావు ఫౌండేషన్ తరుపున భారీ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు . గత మూడేళ్లుగా ప్రతీ ఏటా గణేష్ రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నారు. అలాగే ఎంపి మార్గాని భరత్ రామ్ శిబిరంలో 3 వేల మంది పేదలకు చీరలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, రాష్ట్ర మంత్రులు పినిపి విశ్వరూప్, వెల్లుబోయిన వేణుగోపాల్, తానేటి వనిత ఎవర్ని నొప్పించకుండా ఇరువర్గాలు ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు హాజరయ్యారు .
సుబ్బారెడ్డి చెప్పినా ససేమిరా..ఎప్పటికీ కలుసుకోరా?
జక్కంపూడి రాజా , మార్గాని భరత్ వర్గాలు విమర్శలకు దిగి , ఒకదశలో ఇరువర్గాల కార్యకర్తలు బాహాబాహీకి దిగే పరిస్థితులు నెలకొనడంతో ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని , వివాదాన్ని పరిష్కరించాలని జిల్లా ఇన్చార్జి , టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి సూచించారు. ఇరువర్గాల మధ్య సయోధ్య చేసేందుకు ప్రయత్నించారు. ఈ బాధ్యతను రాజమహేంద్రవరం పార్లమెంటరీ ఇన్చార్జి , ప్రస్తుత శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజుకు అప్పగించారు. అయితే ఇరువురు నాయకులు కనీసం పరస్పరం మాట్లాడుకునేందుకు కూడా ఇష్టపడలేదు. రాజా, భరత్ ఇక ఎప్పటికి కలుసుకోరా అన్న అనుమానాలు పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నారు.
నాలుగు స్తంభాలాట!
అధికార వై ఎస్సార్సిపి రాష్ట్రంలో అధికారంలో ఉన్నా …. రాజమహేంద్రవరంలో మాత్రం అధికారం ఏ నేత చేతుల్లో అధికారంలో ఉందో అర్థం కాక పార్టీ శ్రేణులు గందరగోళంలో ఉన్నాయి. మరోవైపు అధికారులు కూడా ఎవరి మాటకు తలొగ్గాలో తేల్చుకోలేకపోతున్నారు. గత ఎన్నికల్లో రాజమహేంద్రవరం మార్గాని భరత్ రామ్ ఎంపిగా ఎన్నికయ్యారు. రాజానగరం ఎమ్మెల్యేగా దివంగత మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు వారసుడు జక్కంపూడి రాజా ఎన్నికయ్యారు. రాజమహేంద్రవరం నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన రౌతు సూర్యప్రకారావు ఓటమిపాలయ్యారు. చివరి నిమిషంలో పార్టీలో చేరిన రాజమహేంద్రవరం అసెంబ్లీ టిక్కెట్టును ఆశించిన మాజీ కోఆర్డినేటర్ శ్రీఘాకోళపు శివరామసుబ్రహ్మణ్యం ప్రస్తుతం రాజకీయాలను పక్కన పెట్టి, వ్యాపార వ్యవహారాల్లో బిజీగా మారిపోయారు. ఎవరి వర్గాన్ని వారు పోషిస్తున్నారు. ఒక నాయకుడి కార్యక్రమానికి మరొకరు వెళ్లే సహృద్భావం పార్టీలో లోపించింది. రాజమహేంద్రవరం ఎంపిగా గెలిచినప్పటి నుంచి మార్గాని భరత్ రామ్ రాజమహేంద్రవరంపై పట్టు సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కావడానికి రాజానగరం ఎమ్మెల్యే అయినా జక్కంపూడి రాజా, ఆయన సోదరుడు గణేష్, తల్లి విజయలక్ష్మి రాజమహేంద్రవరం కేంద్రంగానే రాజకీయాలు చేస్తున్నారు .. జక్కంపూడి రామ్మోహనరావుకు నగరంలో ప్రత్యేక వర్గం, కార్యకర్తల బలం ఉంది. దాన్ని కాపాడుకునేందుకు రాజా, ఆయన కుటుంబం కృషిచేస్తోంది. ఇక కాంగ్రెస్ అధికారంలో ఉండగా రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు ఒక వర్గాన్ని పోషిస్తున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏర్పడిన సమైక్యాంధ్రపార్టీ (చె ప్పులపార్టీ తరుపున 2014 లో అసెంబ్లీకి పోటీ చేసి ఓటమిపాలైన శ్రీఘాకోళపు శివరామసుబ్రహ్మణ్యం కూడా రాజకీయంగా ఉనికి కోసం ఒక వర్గాన్ని ప్రోత్సహిస్తున్నారు. దీంతో రాజమహేంద్రవరం నగరంలో పార్టీ పరిస్థితి నాలుగు స్తంభాలాటగా తయారైంది. స్తంభాలు నాలుగైనా …. మూల స్తంభాలు భరత్ , జక్కంపూడి రాజాలే . శ్రీమాకోళపు శివ రామసుబ్రహ్మణ్యం రాజా వర్గానికి అనుకూలంగా ఉంటారు. మొన్నటి వరకు రౌతు సూర్యప్రకాశరావు ఎంపి వర్గంలో ఉండేవారు. ఇటీవల పదవుల పంపకాల్లో రౌతుకు నిరాశ ఎదురవడంతో ఆయన ఎంపి వర్గానికి దూరంగా జరిగారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ గా పనిచేసి, ప్రస్తుతం డిసిసిబి ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న ఆకుల వీర్రాజు జక్కంపూడి వర్గంలోనూ, మాజీ ఎమ్మెల్వే చందన రమేష్ తనయుడు, భరత్ చొరవ తో రాజమహేంద్రవరం రూరల్ కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్న చందన నాగేశ్వర్ ఎంపి వర్గంలోనూ కొనసాగుతున్నారు.
ఆధిపత్య పోరులో భాగంగా ఎంపిగా ఎన్నికైన కొద్దిరోజులకే ఎంపికి, రాజాకు మధ్య వ్యక్తిగత విభేదాలు తలెత్తాయి. ఆవ భూముల కుంభకోణంలో ఎంపి వ్యవహారశైలిని రాజా బహిరంగంగానే వ్యతిరేకించారు. ప్రస్తుతం ఈ ఇద్దరు నాయకులు ఎడమొహం పెడమొహంగానే ఉంటున్నారు. ఒకరు పాల్గొన్న కార్యక్రమంలో మరొకరు పాల్గొనడంలేదు.
కోఆర్డినేటర్ ఎవరు?
పార్టీ ఎమ్మెల్యే లేని నియోజకవర్గంలో అధికార పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ అంటే దాదాపు ఎమ్మెల్యే హోదాతో సమానం. మొన్నటి వరకు శ్రీఘాకోళపు శివరామసుబ్రహ్మణ్యం, ఆయన తరువాత నియమితులైన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ ఇదే హోదాను అనుభవించారు. కోఆర్డినేటర్ గా కొద్దిరోజుల పాటు నానా హడావుడి చేసిన ఆకుల సత్యనారాయణ హఠాత్తుగా రాజకీయాల నుంచి మాయమయ్యారు. ఆయన ఏం చేస్తున్నారు … ఎక్కడున్నారన్నది కార్యకర్తలకు అంతుబట్టడం లేదు. దీంతో కీలకమైన రాజమహేంద్రవరంలో పార్టీని నడిపించే నాధుడు కరవయ్యాడు. అధికార పార్టీకి కోఆర్డినేటర్ ను సైతం నియమించే సమర్థత కూడా లేదా అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే, సకాలంలో దిద్దుబాటు చర్యలు తీసుకోనట్లయితే రానున్న ఎన్నికల్లో కూడా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఎన్నికల్లో చుక్కెదురు అయ్యే ప్రమాదం ఉంది. అసెంబ్లీ స్థానాన్ని మళ్లీ చేజార్చుకోవచ్చు … అదే రీతిలో ఎంపి స్థానం కూడా సందేహాస్పదం కావచ్చు. రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు.
(రచయిత వోలేటి దివాకర్ సీనియర్ జర్నలిస్టు. రెండు దశాబ్దాలపాటు ఆంధ్రభూమి విలేఖరిగా పని చేశారు. పుష్కరాలూ, రాజకీయ పరిణామాల గురించి విస్తృతంగా వార్తలూ, వార్తావ్యాఖ్యలూ రాశారు.)